Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరోహణ-8

[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[పొరుగు గెలాక్సీలో తాను గుర్తించిన రెండు గ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తాడు ఇమే. వాటి గురించి వల్హన్‍తో చర్చించాల్సి ఉంది. నక్షత్ర వీక్షణం పట్ల తన ఆసక్తి, వల్హన్‍తో పరిచయానికి, ‘అయోనా అబ్జర్వేటరీ’లో చేరడానికీ దారితీసిన వైనాన్ని గుర్తుచేసుకుంటాడు. వల్హన్ చేసిన సూచన ప్రకాశం అంతరిక్షాన్ని శోధించిన ఇమేకి, కొంత సమాచారం తెలుస్తుంది, దాన్ని వల్హన్‍తో పంచుకోడానికి ఎదురు చూస్తుంటాడు. ఈలోపు అతనికి పాటిక్స్ నుంచి రాదుల్ అక్కడికి వస్తున్నాడనే సందేశం వస్తుంది. రాదుల్ గురించి లెక్స్‌లో వివరాలు సేకరిస్తాడు. అతడిలాంటి వ్యక్తికి సైనెడ్‍లో సభ్యత్వం ఎలా దొరికిందా అని అనుకుంటాడు. వల్హన్ ఒడెప్ ఇంటికి వెళ్తాడు. వస్తున్నట్టు ముందు చెప్పి ఉండాల్సింది అని ఒడెప్ అంటే, తాను లెక్స్ ద్వారా సమాచారమిచ్చానని వల్హన్ అంటాడు. తాను లెక్స్ ఉపయోగించటం లేదని చెప్తాడు ఒడెప్. ఆ గదిలో స్క్రీన్ గాని వర్క్ స్టేషన్ గాని లేకపోవడం గమనిస్తాడు వల్హన్. ఒడెప్ విషయంలో ఏదో తేడా ఉంది కానీ, అదేంటో పట్టుకోలేకపోతున్నాడు వల్హన్. ఒడెప్ భవన నిర్మాణంలో నిష్ణాతుడు. చాలాకాలం పాటు సైనెడ్ సభ్యుడు. కానీ పదేళ్ళ క్రితం నుంచి తన వృత్తి నుంచి, సాధారణ జీవితం నుంచి తప్పుకుని, కొండ ప్రాంతాలలో అడవిలో నివసిస్తున్నాడు ఒడెప్. ఎనాబ్ తాగుతూ, క్షీణిస్తున్న నెపో నిల్వల గురించి చెప్తాడు వల్హన్. అన్ని చోట్లా, సముద్రాలలోనూ, కొండల్లోనూ చూశావా అని అడుగుతాడు ఒడెప్. అన్ని చోట్ల ఉన్న నిల్వలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్తాడు వల్హన్. ఇక్కడ కాదు, అడవిలో నడుస్తూ మాట్లాడుకుందామని బయల్దేరదీస్తాడు ఒడెప్. రాదుల్ అయోనాకి వచ్చేందుకు ట్రావెలర్ ఎక్కుతాడు. చాలా రోజుల తరువాత ఆకాశంలోని మూడు చందమామలను చూస్తాడు రాదుల్. అయోనా భవనం చేసి, తనకి దారి చూపిస్తున్న టోబాట్‍ని అనుసరించి వచ్చి, ఇమేని కలుస్తాడు. ఇమే అతనికి స్వాగతం పలికి, ఒక గదిలోని కూర్చోబెట్టి, తన అన్వేషణ కొనసాగించమని చెప్పి, తన పనిలో లీనమవుతాడు. కాసేపయ్యాకా, రాదుల్ వచ్చి టెలిస్కోప్ నుంచి ఆకాశాన్ని చూడవచ్చా అని అడుగితే, ఇమే తీసుకువెళ్ళి చూపిస్తాడు. రాదుల్ తొందరగా వెళ్ళిపోతే, తన పనులు ప్రశాంతంగా చేసుకోవచ్చని అనుకుంటాడు ఇమే. కానీ రాదుల్‍ అంత త్వరగా వెళ్ళడు. అయోనాకి సంబంధించి, అతని పనుల గురించి ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. ఇమే పొడిపొడిగా జవాబులు చెప్తాడు. నీకు పాటిక్స్ ఎలా తెలుసని అడుగుతాడు రాదుల్. చాలా కాలం క్రితం ఓ పరిశోధనలో పాటిక్స్‌కి సహకరించానని చెప్తాడు ఇమే. చాలాకాలంగా మన వద్ద ఒక్క క్రియేషన్ కూడా జరగకపోవడం నీకు బాధ కలిగిస్తోందా అని అడుగుతాడు రాదుల్. క్రియేషన్ ప్రస్తావన విని విస్తుపోతాడు ఇమే. దానిపై సైనెడ్ తాత్కాలిక నిషేధం విధిచిందని అంటాడు. బదులుగా, అక్కడ గైనేక్ (స్త్రీలు) క్రియేషన్ కొనసాగిస్తున్నారనీ వారి సంఖ్య పెరిగుతోందనీ, మనమేమో ఎన్నో ఏళ్ళుగా ఒకే స్థాయిలో ఉండిపోయామని అంటాడు రాదుల్. తాను రాబోయే సైనెడ్ సమావేశంలో ఈ తాత్కాలిక నిషేధం గురించి మాట్లాడుతానని అంటాడు. నిషేధం తొలిగించాల్సిన అవసరం ఏముందంటూ రాదుల్‌ని ప్రశ్నిస్తాడు. నువ్వే క్రియేషన్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అవన్నీ తనకు తెలియవని, గైనేక్స్ కొద్ది రోజుల్లో మన సంఖ్యని మించిపోతారన్న విషయంలో ఎవరికీ ఏ ఆందోళన ఎందుకు లేదో తనకి అర్థం కావడం లేదని అంటాడు. బాగా మత్తులో ఉన్న రాదుల్‌ని ఇంటికి చేర్చే ఏర్పాటు చేస్తాడు ఇమే. అతని ప్రశ్నలకు కలవరపడిన ఇమే, విశ్వంలో నివాస యోగ్యమైన గ్రహాల కోసం తన పరిశోధనని జ్ఞాపకం చేసుకుంటాడు. – ఇక చదవండి.]

అధ్యాయం-2 – క్షీణత – మూడవ భాగం

ల్హన్, ఒడెప్ దగ్గరలో ఒక కొండ పైకి ఎక్కారు. అలా ఎక్కుతూంటే, బరువుగా, వేగంగా బయటకి వస్తున్న ఒడెప్ నిశ్వాసాన్ని విన్నాడు వల్హన్.

“మనం ఆ గట్టు మీద కాసేపు కూర్చుని సూర్యాస్తమయాన్ని ఆస్వాదిద్దాం” అంటూ ఒడెప్ కూర్చున్నాడు.

వారు మౌనంగా కూర్చున్నారు. ఒడెప్ శ్వాస మళ్ళీ సాధారణంగా మారింది. అస్తమించే సూర్యుడు, క్షితిజంలోకి జారిపోతూ, పరిసరాలపై ప్రకాశవంతమైన నారింజ రంగు కాంతిని ప్రసరిస్తున్నాడు. ఎదురుగా, మూడు చందమామలు తాము కనబడాల్సిన సమయం ఆసన్నమైందా అని అడుగుతున్నట్లుగా కొద్దిగా తొంగి చూడటం ప్రారంభించాయి.

“ఓకే, నెపో (1) నిల్వలు ఎంతకాలం ఉంటాయని అనుకుంటున్నారు?” అడిగాడు ఒడెప్.

“కనీసం ఇంకో పదిహేను వందల జాక్‌ (2) లకు సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయి, కానీ అవి వేగంగా క్షీణిస్తున్నాయి. ఒడెప్, మనం మనుగడ సాగించాలంటే ఇప్పుడే పరిష్కారాల కోసం వెతకడం ప్రారంభించాలి. పరిస్థితి ఆందోళనకరంగా మారే వరకు వేచి ఉండకూడదు. నీకు తెలిసి ఏవైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా?” అడిగాడు వల్హన్.

“మంచి భవిష్యత్తు కోసం చురుకుగా వెతకడం, దానిపై పెట్టుబడి పెట్టడం పురుషుల స్వభావం, వల్హన్. మనం నెపోకు ప్రత్యామ్నాయాల కోసం ఎలోన్ (3) భూగర్భంలోనూ, ఉపరితలంపైనా వెతుకుతున్నాము. అయితే, మన ప్రయత్నాలింకా ఫలించలేదు, ఉపయుక్తమైనదేదీ లభించలేదు. మనం నెపోను అద్భుతంగా మెరుగుపరిచాం. మన ప్రయత్నాలను మనం కొనసాగించాలని నేను భావిస్తున్నాను,” సూచించాడు ఒడెప్.

“నిల్వలు తగ్గిపోతున్నాయని మనం అంగీకరిస్తే, మన శోధన ఊపందుకుంటుందని నా ఉద్దేశం” అంటూ వల్హన్ అస్తమించే సూర్యుని కాంతిలో ఒడెప్ నీడ వైపు చూశాడు. తరువాత, “నెపో నిల్వలు పెద్ద మొత్తంలో ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసా?” అని అడిగాడు.

సూర్యుడు అకస్మాత్తుగా దిగంతం క్రిందకు జారి, అస్తమించాడు, బంగారు కాంతి అదృశ్యమైంది, మూడు చందమామలు ప్రకాశవంతంగా కాంతులీనసాగాయి. దూరంగా, నగరపు దీపాలు ఆ ప్రాంతమంతటా చుక్కల్లా వెలగసాగాయి. చల్లని, మృదుమైన గాలి చెట్ల గుండా గుసగుసలాడుతోంది.

“గైనేక్ (4) దగ్గర ఈ నిల్వలు ఉన్నాయని నాకు తెలుసు. వారికి ఆ ఖనిజం అవసరం లేదు, కానీ మనం ఇప్పుడు లేదా ఎప్పటికీ ఆ నిల్వలను పొందలేము,” అని ప్రశాంతంగా జవాబిచ్చాడు ఒడెప్.

వల్హన్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఒడెప్‌కి పలు విషయాల గురించి ఇంత సమాచారం ఎలా తెలుసు అని ఎప్పుడూ అబ్బురపడుతూంటాడు వల్హన్. అతనికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒడెప్ ఈ అడవుల్లోకి ఎందుకు వచ్చి దాక్కున్నాడు?, భవనాలను ఎందుకు డిజైన్ చేయడంలేదు?, లెక్స్‌ (5) ని ఎందుకు తీసేశాడో అడగాలనుకున్నాడు – కానీ అడగలేకపోయాడు. గట్టు మీద తన పక్కనే కూర్చుని ఉన్న ఒడెప్‍ని చూశాడు. దయ నిండిన ఒడెప్ కళ్ళు దూరతీరాల వైపు చూస్తున్నాయి. ఒడెప్ విషయంలో దాటలేని ఒక గీత ఉందని వల్హన్‌కు తెలుసు. ఒడెప్ తనదైన గతితో విషయాలను పంచుకున్నాడు.

అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్నను అడగాలని నిర్ణయించుకున్నాడు వల్హన్. “వాళ్ళు నెపోను ఎందుకు ఉపయోగించడం లేదు? నిజానికి, గ్రహం మీద వారి వైపు ఉన్న నిల్వల నివేదిక చూసినప్పుడు, వారు దానిని అస్సలు ఉపయోగించడం లేదని నాకు అర్థమైంది. కానీ ఎందుకో నాకు ఊహించలేకపోయాను!” అన్నాడు.

ఒడెప్ ఫెన్స్ (6) వైపు చూశాడు. వారు కూర్చున్న చోటు నుండి అది కనబడదు, కానీ దాని గంభీరమైన ఉనికిని అనుభూతి చెందవచ్చు. ఎక్కడో, దూరంలో మైదానాల అవతల, నెమ్మదిగా ప్రవహించే నదిని దాటి, నగరం వెనుక, ఫెన్స్ నిలబడి ఉంది. అది – నిరంతర సంఘర్షణ నుండి ఉపశమనం, శాంతికి నాంది, సహజీవనాన్ని అనుమతించే సాధనం.

“వల్హాన్, అసలు ఫెన్స్ ఆలోచన గైనేక్‌దేనని నీకు తెలుసా?” అని అడిగి, ప్రతిస్పందన కోసం వేచి ఉండకుండా, ఒడెప్ కొనసాగించాడు, “గైనేక్‌ బలమైన ప్రత్యర్థి. మనలాగే, వారు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వారు పురోగమనం దిశగా ఆలోచించడంలో నిష్ణాతులు. ప్రత్యామ్నాయ ప్రతిస్థాపన పదార్థాలను కనుగొనే ఈ అన్వేషణలో, వారు మనకంటే చాలా ముందున్నారని అనుకుంటున్నాను. వారు ప్రత్యామ్నాయాల కోసం పునరుత్పాదక పదార్థాన్ని అభివృద్ధి చేశారనేది స్పష్టమవుతోంది, అందుకే వారు నెపోను ఉపయోగించడం మానేశారు, లేదూ, ఆ అవసరమే వాళ్ళకి రావడం లేదు.”

“అది ఏమై ఉంటుంది, ఒడెప్? ఈ పదార్థం? మనం  ఎలాగైనా ఆ టెక్నాలజీని ఉపయోగించుకోలేమా? గైనేక్ వైపు ఏమి జరుగుతుందో ‘ఉనుమో’ గమనిస్తూంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ రహస్య సంస్థ ఎల్లప్పుడూ ఆ పనిలో ఉంటుంది. ఉనుమోకి అధిపతిగా ఉన్న వ్యక్తి నాకు తెలుసు, నేను అతనిని అడగనా? కానీ, అప్పుడు నేను అతనికి తరిగిపోతున్న నిల్వల గురించి చెప్పాల్సి ఉంటుంది” అన్నాడు వల్హన్. తాము ఎదుర్కొంటున్న సవాలుకు త్వరిత పరిష్కారాన్ని కనుగొనడానికి తొందరపడుతున్నాడు వల్హన్.

“ఆ పదార్థం యొక్క స్వభావం గురించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. మనలాగే, వారి నెపో నిల్వలు స్థిరీకరించబడ్డాయని నేను గమనించాను. దీనికి ఏకైక కారణం వారు పునరుత్పాదక వనరును కనుగొని ఉండచ్చు. మీరు అధిపతితో మాట్లాడవచ్చు కానీ క్షీణిస్తున్న నెపో నిల్వల విషయాన్ని మీ సంభాషణలో తేవద్దని నా సూచన. మొదట, అవతలి వైపు ఏమి ఉపయోగించబడుతుందో వారికి నిజంగా తెలుసో లేదో అంచనా వేయ్”, అని చెప్పాడు ఒడెప్ గట్టు మీద నుండి లేస్తూ.

వాళ్ళు – ఒడెప్ ఇంటి వైపు అడుగులు వేయడం మొదలుపెట్టారు. అప్పటికే చీకటి పడుతోంది, అడవిదారి గుండా నడవడం కష్టం.

వాళ్ళు కాసేపు మౌనంగా నడిచారు.

అప్పుడు, వల్హన్ ఒడెప్‌ను “నువ్వు లెక్స్‌ను ఎందుకు తీసేశావు?” అని అడగడానికి సాహసించాడు.

“నువ్వు మళ్ళీసారి వచ్చినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తాను. నేను ఏదైనా దాచుకోకపోతే, నువ్వు మరో మూడు జాక్‌ల వరకు రావు” అని నవ్వుతూ జవాబిచ్చాడు ఒడెప్.

ముసురుతున్న ఆ చీకటిలో వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. వల్హన్ ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు లేదా అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు తిరిగి తన వద్దకు వస్తాడని ఇద్దరికీ తెలుసు. ఒడెప్ కొండలలో నివాసం ఏర్పర్చుకునే ముందు కూడా ఇలాగే జరిగేది. వాళ్ళు తన వద్దకు మళ్ళీ మళ్ళీ వచ్చే నావిగేషన్ సాధనం లాంటివాడు ఒడెప్. ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. ముసురుకుంటున్న నిశిలో, కొండవాలులో ఉన్న ఆ ఇంట్లో, ఓ దీపం వెలుగుతూ, ఒంటరిగా కనిపించింది.

“వల్హన్, గైనేక్‌తో వ్యవహరిస్తున్నప్పుడల్లా, మనం ఈ గ్రహాన్ని వారితో పంచుకుంటున్నామని గుర్తుంచుకో. మన మధ్య ఘర్షణలు ఉన్నప్పటికీ, మనం భూమిపై నివసించిన కాలం నుండి మనకి ఉమ్మడి గతం ఉంది. ఒకప్పుడు, వారిని ‘ఉమెన్’ అని పిలిచేవారని నాకు తెలిసింది. వాళ్ళ ఇప్పటికీ తమను తాము అలానే ప్రస్తావిస్తారట. ‘మెన్’ అనేది ఆ పదంలో ఒక భాగమని గమనించావా? ఆ పూర్వ కాలాల గురించి మనకు ఇప్పుడు పెద్దగా తెలియదు. మనం భూమిపై జీవితాన్ని ఎలా లేదా ఎందుకు పంచుకున్నాము? కానీ నేను తరచుగా ఆశ్చర్యపోతుంటాను. మనం ఎప్పుడైనా కలిసి జీవించామా? మనం ఎందుకు విభేదించాము? ప్రస్తుతం వారు వేరే జాతి కావచ్చు కానీ మనకు తెలిసిన విశ్వంలో మనలాంటివి మన రెండు జాతులు మాత్రమే. మనం ఈ వాస్తవాన్ని గ్రహించి ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.”

వల్హన్ లోపలికి ప్రవేశించడానికి వీలుగా ఒడెప్ తలుపుని పట్టుకుని నిలబడ్డాడు.

🚀

గేమింగ్ లౌంజ్ మసక వెలుతురుతో నిండి ఉంది. అక్కడున్న క్యూబికల్స్‌లో పూర్తి నిశ్శబ్దం అలుముకుంది. కొన్ని క్యూబికల్స్‌లో, పురుషులు ఆటల్లో బిజీగా ఉన్నారు. గేమింగ్ వారికి ఇష్టమైన కాలక్షేపం! అదొక వ్యసనంలా మారడం సాధారణ సమస్య. గేమింగ్ ప్రపంచంతో అనుసంధానించబడిన లెక్స్‌తో, సౌకర్యవంతమైన కుర్చీల్లో కూర్చుని, వారు ప్రయాణించవచ్చు, ఆటలు ఆడవచ్చు, తెరమీద కదిలే కథలను చూడవచ్చు, ఇంకా సంగీతాన్ని కూడా పలికించవచ్చు.

లెక్స్ హైవేల పని పూర్తయ్యాక, ఎనాబ్ (7) తాగాకా, సమయం ఉంటే, ఒక్కోసారి ఆడడానికి ఇక్కడికి వస్తూంటాడు రాదుల్. అతనెప్పుడూ ‘పాత్‌వే’ అనే గేమ్ ఆడేవాడు. ఇది ఆటగాడిని నదులు, పర్వతాలు, మహాసముద్రాలు, రోడ్ల గుండా అంతులేని ప్రయాణంలోకి తీసుకెళ్లే గేమ్. సమయం గడిచేకొద్దీ అడ్డంకుల కఠినత్వపు స్థాయి పెరుగుతూనే ఉంది. లౌంజ్‌లో కూర్చుని, రాదుల్ అనంతంగా ప్రయాణించాడు. అతనికి లౌంజ్‌కి రావడం ఇష్టం. అది అందించే నిశ్శబ్దం, క్యూబికల్‌లో దొరికే ఒంటరితనం – అతనికి తన సొంత అపార్ట్‌మెంట్‌లో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి.

మలుపులు తిరుగుతున్న ఒక పర్వత రహదారిపై ప్రయాణంలో ఒక భాగం పూర్తి చేసి, తదుపరి భాగంలోని ప్రకృతి దృశ్యానికి సంబంధించిన సూచనలను ప్రాసెస్ చేస్తున్నప్పుడు ‘క్రియేషన్’ (8) అనే పదాన్ని గుర్తించాడు. అంతే, ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. గేమ్ ఆగిపోయింది. ఎవరైనా ఏమైనా అన్నారా అని గమనించడానికి అతను ఆసక్తిగా చుట్టూ చూశాడు. పురుషులు గేమింగ్ ప్రపంచంలో మునిగిపోవడంతో, అక్కడంతా నిశ్శబ్దం అలుముకుంది.

తన మనసు ఆ పదాన్ని ఎందుకు హైలైట్ చేసిందా అని అతను ఆశ్చర్యపోయాడు. అతను కుర్చీలో వెనక్కి వాలి కూర్చుని, అస్పష్టమైన కాంతిలో మసకగా కనిపించే క్లిష్టమైన డిజైన్ ఉన్న పైకప్పు వైపు చూశాడు.

పైకప్పు వైపు చూస్తుండగా రాదుల్ బుర్రలో, “నువ్వు ‘క్రియేషన్’ కోరుకుంటున్నావా?” అని ఇమే అడిగిన ప్రశ్న ప్రతిధ్వనించింది.

తనకు తానుగా ‘క్రియేషన్’ కోరుకున్నాడా? ఈ ‘క్రియేషన్’ తమ జీవితాలకు ఎలా తోడ్పడుతుంది? తాను చాలా జాగ్రత్తగా సిద్ధం చేసిన చర్చతో ఏమి సాధించాలని ఆశించాడు? తను కొంత పరిశోధన చేసిప్పటికీ, ‘క్రియేషన్’ గురించి, ప్రస్తుత జీవనశైలిపై దాని ప్రభావం గురించి తనకు చాలా తక్కువ తెలుసని రాదుల్ గ్రహించాడు. మొదట్లో, అందరి దృష్టి తనపై పడేలా చేయడానికి అదొక ఆసక్తికరమైన ఆలోచనగా అనిపించింది, కానీ ఇప్పుడు, తను అనుకున్నట్లుగా దాని గురించి, సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి.

తెరపై సముద్రం అల్లకల్లోలంగా మారుతుండగా, ‘అయోనా’లో ఉండగా, గైనేక్ గురించి తనకు కలిగిన చింతని గుర్తుచేసుకున్నాడు రాదుల్. ‘క్రియేషన్’ గురించి మరింత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించాడు. అతను గేమ్‍ని విస్మరించాడు, బదులుగా ‘క్రియేషన్’ గురించి సమాచారం కోసం లెక్స్‌లో వెతకడం ప్రారంభించాడు. ప్రతి లింక్, అతన్ని ‘కోషుమ్’ వైపు నడిపించింది. లెక్స్ ద్వారా డేటాను ఇంకా యాక్సెస్ చేయలేనందున తాను కోషుమ్‌ను సందర్శించాల్సి ఉంటుందని గ్రహించాడు రాదుల్.

గేమింగ్ లౌంజ్ నుండి బయటకు వచ్చి కోషుమ్ వైపు వెళ్ళే ట్రావెలర్‌ ఎక్కాడు. సాయంత్రం అవడంతో, ట్రావెలర్ రద్దీగా ఉంది. రాదుల్ ఒక మూలలో నిలబడి, ట్రావెలర్ వీధుల్లోకి జారుకుంటుండగా, వ్యతిరేక దిశలో పరుగెత్తుతున్నట్లున్న మసకబారుతున్న నగర దీపాల వైపు చూస్తూ ఉన్నాడు.

కొంత సమయం తరువాత, రాదుల్ కోషుమ్ దగ్గర దిగాడు. ఆ భవనం పూర్తి ఎత్తును చూడటానికి అతను తలెత్తి నిటారుగా చూడాల్సి వచ్చింది. దాని ముందు నిలబడి దాని భారీ తలుపులను గమనించాడు రాదుల్. ముదురు గోధుమ రంగు భవనం ఆకాశంలోకి పాకి దాదాపు రెండు బ్లాకుల మీదుగా వ్యాపించింది. ఇంకా పూర్తిగా చీకటి పడకపోవడంతో, అన్ని అంతస్తులలో దీపాలు వెలగడం లేదు. ఒక వింతైన వణుకుని అనుభూతి చెందాడు రాదుల్. అతను ఇంతకు ముందు ఎప్పుడూ ఇక్కడకి రాలేదు. చుట్టూ చూసి, కొంత దూరంలో, ఒక సాధారణ భవనంపై ‘జింట్’ అనే సైన్‌బోర్డ్‌ను గమనించాడు. అతనికి సంతోషం కలిగింది. జింట్ అనేది ఎలోన్ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించే సంస్థ, కానీ అది ఒక సాధారణ భవనంలో ఉంది. వినయపూర్వకమైన జింట్‌కు ఎదురుగా, ‘ఎటుయిస్’ నిర్మాణం ఎత్తుగా కనిపించింది. ఇది నిజంగా, ఆశ్చర్యం ఒక దృశ్యం. ఈ భవనంలో ఎలోన్‍కి సంబంధించిన అన్ని ప్రధాన సంస్థలు ఉన్నాయి. ట్రావెలర్స్ నిర్వహణ, వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, మాత్సు అనే ఉత్పత్తిని మార్కెటింగ్ చేయడం, నోటుసెస్‍ని నిర్వహించడం – వీటన్నిటికీ కేంద్రం ‘ఎటుయిస్’. గుమ్మటాలు, స్తంభాలతో ఆ భవనం – మసకగా, కాలిపోయిన ఎరుపు రంగులో ఉంది. సాయంత్రం వెలుగుల్లో, అది ఓ రాజభవనంలా, అందంగా కనిపించింది. పాటిక్స్ అక్కడ పనిచేశాడని గుర్తుచేసుకున్నాడు రాదుల్. పాటిక్స్‌ని, తనకి కొత్తగా సభ్యత్వం లభించిన సైనెడ్‌ని తలచుకోగానే, అతనిలోని భయం ఒక్క క్షణంలో తొలగిపోయింది. విశ్వాసంతో అడుగులు వేస్తూ, కోషుమ్‌లోకి ప్రవేశించాడు రాదుల్.

తన గుర్తింపును చూపించి లోపలికి వెళ్ళాడు. ఒక లిఫ్ట్ అతన్ని రిసెప్షన్ వద్దకు తీసుకెళ్లింది. ఒక పెద్ద తెర మీద కోషుమ్‌లోని వివిధ విభాగాలు కనబడుతున్నాయి. క్లిష్టమైన డిస్‌ప్లేను, తెరపై కనిపిస్తూ అదృశ్యమయ్యే వివిధ అంశాలను చూశాడు రాదుల్. టోపోగ్రఫీ, జ్యాగ్రఫీ, అంతరిక్షం, సాంకేతిక పరిణామాలు – ప్రపంచంలో చాలా విజ్ఞానం ఉంది! అయోనాలో టెలిస్కోప్ నుండి చూసిన అనేక నక్షత్రాలన్నీ, ఇక్కడ డిస్‌ప్లేపై మెరుస్తున్నట్లు అనిపించింది. ప్రారంభించడానికి ఒక పాయింట్ కోసం అతను డిస్‌ప్లేను స్కాన్ చేశాడు. తరువాత అతను దానిని చూశాడు. ఒక మూలలో, అది ‘Us’ అని చూపించింది. అతను ఆ పదాన్ని నొక్కినప్పుడు, ఆ విభాగం ఇరవయ్యవ అంతస్తులో ఉందని సమాచారం వచ్చింది. రాదుల్ లిఫ్ట్‌ ఎక్కాడు, అది కన్సోల్‌లు, స్క్రీన్‌లు, వర్క్‌స్టేషన్‌లు, మరిన్ని డిస్‌ప్లేలతో ఉన్న పెద్ద గదికి దారితీసింది. ఆ గది పురుషులు లేరు, టోబోట్‌ (9) లు లేవు, ఖాళీగా ఉంది.

రాదుల్ ఒక వర్క్‌స్టేషన్‌లో కూర్చుని ‘క్రియేషన్’ అనే అంతుచిక్కని దృగ్విషయానికి చెందిన సమాచారం కోసం వెతకసాగాడు. సమాచారపు చిక్కుముడి గుండా తిరుగుతూ, కొంత సేపు గడిచాకా, ఆ అంశం గురించి కొంత సంబంధిత డేటాను కనుగొన్నాడు. ఇది ఎన్నో జాక్‌ల క్రితం జోడించబడింది. రాదుల్ దానిని స్కాన్ చేసి, ఆపై దానిని ప్రాసెస్ చేయడానికి కనెక్ట్ అయ్యాడు. రాత్రి గడుస్తూన్నా, రాదుల్ ప్రాసెస్ చేస్తూనే ఉన్నాడు.

రాదుల్ కళ్ళు తెరిచినప్పుడు వర్క్‌స్టేషన్ ముందు ఉన్న కిటికీ గుండా సూర్యకాంతి ప్రసరిస్తోంది. ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలతో నిండిన ఒక సుదీర్ఘమైన రాత్రి అది. అతను లిఫ్ట్‌లో కిందకి దిగి, కొత్త సమాచారంతో తన మనసులో సందడి చేస్తూ, ప్రభాత సూర్యుని దిశగా అడుగులు వేస్తూ ఇంటికి బయలుదేరాడు, తన తదుపరి చర్యలకు ప్రణాళిక రూపొందించుకున్నాడు.

🚀

సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నాడు. ప్రతి వీచికకూ మారుతున్నట్లుగా అనిపించే సువాసనలతో నిండిన చల్లని గాలి వీస్తోంది. ఆకుపచ్చని ఆ ప్రదేశం వికసించే పువ్వుల విలక్షణ వర్ణాలతో ఉన్న ప్రత్యేక భాగాలను (పాచ్‌లు) కలిగి ఉంది. ఫురావా గార్డెన్ ఇంక్యుబేటర్ ఎల్లప్పుడూ వర్ణశోభితంగా ఉంటుంది. దాని వ్యవస్థలపై వివిధ నమూనాలను, పూల సువాసనలను రూపొందించి, ఆపై సంబంధిత విత్తనాలను ఉత్పత్తి చేయవచ్చు. చాలాసార్లు, పువ్వులు డిజైన్‌ను ఖచ్చితంగా అనుసరించాయి, కానీ కొన్నిసార్లు, నమూనాలు కూడా తడబడ్డాయి. ఫురావాలో రూపొందించిన పువ్వులు ప్రజా స్థలాలు, భవనాలు, ఇతర సుదూర ప్రాంతాలను అలంకరించడానికి ఉపయోగించబడ్డాయి.

తన తాజా డిజైన్ వికసించబోతున్న ప్రదేశం దగ్గర ఇమే కూర్చుని ఉన్నాడు. ప్రతి విహాన్ (10) కు వెళ్లి అక్కడ జరుగుతున్న పురోగతిని చూస్తుంటాడు. టెలిస్కోపుల నుండి మెరిసే నక్షత్రాలను చూడడం మాత్రమే కాకుండా, తన డిజైన్లు నేల నుండి మొలకెత్తడం చూసే అద్భుతం అతనికి మరో ఆసక్తి.

సమీపంలోని ఒక ప్రదేశంలో, ముదురు ఎరుపు రంగు త్రిభుజాకార పువ్వులు ముదురు పసుపు చారలతో గాలికి ఊగుతున్నాయి. ఐమే వాటిని దగ్గరగా నడిచి సమీపం నుంచి గమనించాడు. ఆ ప్రాంతంలో కొంచెం ఘాటైన వాసన వ్యాపించింది. అతను మోకాళ్ళపై కూర్చున్నప్పుడు ఫురావాలోని పెద్ద ప్రాంతాన్ని ఆక్రమించిన విశాలమైన చెట్టు నీడ ఇమేను కమ్మేసింది. పువ్వులు అందంగా ఉన్నాయని, వాటి సువాసన సున్నితమైనదని ఇమే గ్రహించాడు. వాటిని అయోనాలో నాటడానికి వాటి విత్తనాలు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

తన సొంత పాచ్‌లో పెరుగుతున్న పూలమొక్కలను పరిశీలించడానికి వెళ్ళాడు ఇమే. విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి. అవి వికసించడానికి మరికొన్ని విహాన్‍ల సమయం పడుతుంది. పురోగతితో సంతృప్తి చెందిన ఇమే, ప్రతి మలుపులోనూ మారుతున్న ప్రకాశవంతమైన రంగులు, డిజైన్లు, మత్తెక్కించే వాసనల గుండా ఫురావా ద్వారం వైపు నెమ్మదిగా నడిచాడు. ఫురావా లోని శోభాయామానపు వర్ణాలు – అతని నిరంతర సహచరులైన రాత్రి ఆకాశపు నలుపు, వెండి రంగుల కంటే చాలా భిన్నంగా ఉన్నాయి. ఇంతలో అతని లెక్స్‌లో, వల్హన్ నుండి సందేశం వచ్చింది.

నేను తిరిగి వచ్చాను. ఈ రోజు సాయంత్రం వచ్చి అయోనాలో కలుస్తాను”.

ఇమే సంతోషించాడు. అతను వల్హన్ రాక కోసం ఎదురు చూస్తున్నాడు, తన ప్రయత్నాల ఫలితాలను వల్హన్‍తో పంచుకోవాలని అనుకుంటున్నాడు. ఆ సమాచారాన్ని ఇమే విల్హన్‌కి లెక్స్ ద్వారా పంపలేదు. ఇమే వేగంగా నడవసాగాడు. వీలైనంత త్వరగా వెళ్ళి వల్హన్‌కి చూపించాలనుకున్న అంత డేటాను సిద్ధం చేయాలనుకున్నాడు.

ఇమే అయోనా చేరేసరికి అక్కడ, కొంత గందరగోళంగా ఉందని గ్రహించాడు. ప్రధాన టెలిస్కోప్ పనిచేయటం లేదు. దానిని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి రెండు టోబోట్‌లతో కలిసి రోజంతా గడిపాడు ఇమే. సాయంత్రం పొడవైన నీడలు, భవనం బయట విస్తరించి, అదృశ్యమయ్యేందుకు – చీకటి పడడానికి ఎదురుచూస్తుండగా, ఆ సమస్యను పరిష్కరించగలిగాడు ఇమే. తర్వాత తన వర్క్‌స్టేషన్‌కు తిరిగి వచ్చాడు. తన ఆవిష్కరణల గురించి సంబంధిత డేటా అంతా స్క్రీన్‌పై ప్రదర్శించుకుని, దానిని క్రమబద్ధమైన పద్ధతిలో అమర్చడం ప్రారంభించాడు.

రెండు గ్రహాలను  భవిష్యత్తులో మానవులకు నివాసాలుగా యోగ్యమైనవిగా గుర్తించాడు ఇమే. అతను వాటికి జీటా, తాయ్ అని పేర్లు పెట్టాడు. అతను వాటిని మొదటిసారి విశ్వంలో చూసినప్పుడు, అవి పసుపు రంగు కాంతిని విడుదల చేశాయి. పొరుగు గెలాక్సీలో ఉన్న అవి, తమ జీవితానికి స్థిరత్వం ఉంటుందని హామీ ఇచ్చాయి. అయోనాను మూసివేసిన ప్రతిసారీ, ఇమే విశ్వంలోని ఆ రెండు గ్రహాలను చూడటానికి ప్రయత్నించేవాడు. అవి ఆశని, సామర్థ్యాన్ని సూచిస్తాయని భావిస్తాడు ఇమే. ఎలోన్‌ను మొదటిసారి కనుగొన్నప్పుడు తమ పూర్వీకులు కూడా ఇలాగే భావించారా అని అతను తరచుగా అనుకుంటాడు.

వల్హాన్ వచ్చేసరికి చీకటి పడింది. అతను చాలా రిలాక్స్‌‌డ్‌గా ఉన్నాడని ఇమే గమనించాడు. సెలవు తీసుకోడం అతనికి చాలా మేలు చేసినట్లు అనిపించింది. వల్హన్ కుర్చీలో హాయిగా కూర్చున్న తర్వాత, ఇమే తన ఆవిష్కరణ వివరాలను పంచుకున్నాడు.

వల్హన్, ఇమే లెక్కలను పరిశీలించి, టెలిస్కోపుల మధ్య కదిలి, కొత్త గ్రహాల గురించి సుదీర్ఘంగా చర్చించారు, వారి చర్చలానే రాత్రి కూడా సుదీర్ఘమయింది. తాము మాట్లాడుకుంటున్నప్పటికీ, వల్హన్ దృష్టి పూర్తిగా ఇక్కడ లేదని గ్రహించాడు ఇమే. శ్రమతో కూడిన తన పరిశోధన అందించబోయే అపారమైన అవకాశాలపై విల్హన్ దృష్టి నిలవనట్లు అనిపించింది.

“ఈ రెండు గ్రహాలలో దేనిలోనైనా నెపో నిల్వలు ఉన్నాయని అనుకుంటున్నావా? లేదా మనం నెపోను తవ్వి తీయగలమా? లేదా నెపోకు ప్రత్యామ్నాయంగా ఉండే ఏదైనా పదార్థాన్ని?” అని వల్హన్ అకస్మాత్తుగా అడిగాడు.

వల్హన్ ప్రశ్న వినగనే ఇమే వెన్నులో వణుకు పుట్టింది.

అందుకే వల్హాన్ తనని ఈ అన్వేషణలో పెట్టాడా? ఎలోన్‌లో నెపో నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయా?

జీవాన్ని నిలబెట్టడానికి అనుకూలమైన వాతావరణం, నీరు, తగిన ఉష్ణోగ్రత ఉన్న గ్రహాల కోసం ఇమే విశ్వంలో శోధించాడు. అతను వాటి ఖనిజ వనరులను అన్వేషించలేదు. ఒక విశ్వంలో జీవాన్ని నిలబెట్టడానికి అవసరమైన అన్ని పదార్థాలను కనుగొనడం అత్యంత అరుదుగా లభించే ఒక అవకాశం.

“నేను ఇంకా ఆ అంశాన్ని పరిశీలించలేదు, వల్హన్. నా పరిశోధన ప్రధానంగా తగిన వాతావరణం వంటి ప్రాథమిక అవసరాలను కనుగొనడం గురించి మాత్రమే. నువ్వు కోరుకుంటే, నేను వెంటనే నెపో కోసం అన్వేషణ ప్రారంభిస్తాను” అని చెప్పి,  వల్హన్‍ని సూటిగా అడిగాడు, “మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? నిల్వలు ఆందోళన కల్గించే స్థాయిలో తగ్గాయా?”

“మనం ఇతర నిల్వల కోసం వెతకడం ప్రారంభించాలి. నెపోకు ప్రత్యామ్నాయాలను కనుగొనడానికి మన ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. నా అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతానికి ఆందోళన చెందడానికి ఏమీ లేదు, కానీ మనకు ఫలితాలు అవసరం. నేను దానిని సైనెడ్ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను, కానీ సమస్యగా మాత్రమే కాదు, పరిష్కారంగా కూడా. నాకు ఓ గ్లాసులో కొంచెం ఎనాబ్ పోసి, మనం తినడానికి ఏదైనా తీసుకురా,” అని వల్హాన్ కుర్చీలో వాలుతూ అన్నాడు.

ఇమే ఓ గ్లాసులో ఎనాబ్ పోసి, ఓ పళ్ళెంలో ‘క్రా’ (11) ముక్కలు, టిబ్లి సాస్, కొన్ని ఉడికించిన కూరగాయలు వేస్తుండగా, అతనికి రాదుల్ నుండి సందేశం వచ్చింది.

సరే, నేను ఇంకా క్రియేషన్కి సిద్ధంగా లేనని నాకు అర్థమైంది. నువ్వు సిద్ధమా?”.

ఇమే కాసేపు ఆ మెసేజ్ వైపు చూసాడు. రాదుల్ ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాడు?

అతను ట్రేని వల్హన్ దగ్గరికి తీసుకెళ్లి రాదుల్ వచ్చి వెళ్ళిన సంగతి చెప్పాడు.

“రాదుల్ లాంటి వ్యక్తికి సైనెడ్‍లో సభ్యత్వం ఎలా దొరికింది, వల్హన్? నాకు అర్థం కాలేదు. పాటిక్స్, అలాంటి వ్యక్తిని ప్రోత్సహించడం అర్థం కావడం లేదు!” అన్నాడు ఇమే.

వల్హన్ నిశ్శబ్దంగా తినసాగాడు.

రాడుల్ లాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వమని పాటిక్స్ అడిగినప్పుడు, ఎందుకనేది అతనికి అర్థం కాలేదు. ‘ఉనుమో’ ఎప్పుడూ బయటి నుండి ఒక వ్యక్తిని తీసుకొని తమ పనిలో శిక్షణ ఇస్తుంది. చాలా కాలం క్రితం తనను ఆ సంస్థలో చేరమని అడిగారు, కానీ తాను నిరాకరించాడు. వల్హన్ కూడా తానొకసారి రాదుల్‌ను కలిసిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. అతనికి ఆశ్చర్యకరమైన నీలి కళ్ళు ఉన్నాయని గుర్తొచ్చింది; కాకపోతే అతనో సాధారణ ‘గ్రూప్ హౌస్’ వ్యక్తి.

“రాదుల్ ఇక్కడ ఉన్నప్పుడు దేని గురించి మాట్లాడాడు?” వల్హన్ అడిగాడు.

“అతను క్రియేషన్ గురించి మాట్లాడాడు, గైనేక్‍లు ఎందుకు క్రియేషన్ కొనసాగాస్తున్నారు, మనం ఎందుకు కొనసాగించటం లేదని అడిగాడు. వల్హన్, గైనేక్ ఉనికిని ఇప్పటికీ భుజాలపై భారంలా మోసే వ్యక్తులలో అతను ఒకడని నాకు అనిపించింది”, అని జవాబిచ్చాడు ఇమే, సాస్‌లో ముంచిన ‘క్రా’ ముక్కలను నోటిలో కుక్కుకుంటూ. తనెంత ఆకలితో ఉన్నాడో అతనికి అర్థం కాలేదు. వల్హన్ అతన్ని జాగ్రత్తగా గమనించాడు. ఇమే ఎర్రటి జుట్టు చెదిరిపోయింది, అతను అలసిపోయినట్లు కనిపించాడు, అయినప్పటికీ అతని ప్రవర్తనను పట్టి చూపే – గంభీరమైన చూపు చెక్కుచెదరకుండా ఉంది.

“వాళ్ళ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఇమే?” అడిగాడు వల్హన్.

“వాళ్ళా? గైనేక్‍లా?” అన్నాడు ఇమే. వల్హన్ తల ఊపాడు.

“ఊఁ, నేను వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించను. నేను నాలెడ్జ్ యూనిట్‌లో ఉండగా, మనం భూమిపై ఉన్నప్పుడు వారితో ఎలా జీవించామో తెలుసుకోవడానికి ప్రయత్నించాను, కానీ ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. మనం ఎల్లప్పుడూ ఫెన్స్‌కు వ్యతిరేక వైపులా ఉన్నట్లు అనిపిస్తుంది. మనం ప్రశాంతంగా ఉన్నందున, వాటి ఉనికి నన్ను బాధించదు”, అని చెప్పి, ఇమే తన కుర్చీలో వాలాడు.

“నెపోకి ప్రత్యామ్నాయం వాళ్ళు కనుగొన్నారని నీకు తెలుసా? ఇది పునరుత్పాదక వనరుగా అనిపిస్తోంది, ఇమే. మనం కూడా ఇలాంటిదేదో త్వరగా కనుగొనాలి” అన్నాడు వల్హన్.

ఇమే ఆ సమాచారాన్ని పరిశీలించాడు. అది భవిష్యత్తులో మరిన్ని సంఘర్షణకు దారితీసే బీజాలను కలిగిన ఒక ఆవిష్కరణ. నెపో వలన ఈ రెండు జాతులు మరోసారి ఘర్షణ పడవచ్చు. జీటా, తాయ్ సామర్థ్యం పూర్తిగా కొత్త కోణాన్ని సంతరించుకుంది.

“మనం వాళ్ళని అడగకూడదా? లేదా వాళ్ళతో వ్యాపారం చేయవచ్చా? చర్చలకి ఇంకా ఏదైనా అవకాశం ఉందా? అన్నింటికంటే, ముఖ్యం మనం ఈ గ్రహాన్ని వారితో పంచుకుంటున్నాం!’ అన్నాడు ఇమే.

ఈ మాటలు అంటుండగానే, విపత్తుని సూచించే చెడు శకునమేదో తనను ఆవరించినట్లు అతనికి అనిపించింది.

—-

ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:

(1) Nepo, నెపో = అవయవాల భర్తీకి ఉపకరించే ఒక ఖనిజం

(2) Zacs, జాక్స్ = సంవత్సరాలు

(3) Elone, ఎలోన్ = ఒక గ్రహం

(4) Gynake, గైనేక్ = ఎలోన్ గ్రహంలో స్త్రీలను సూచించేందుకు పురుషులు వాడే పదం

(5) Lex, లెక్స్ = సమాచార పరికరం

(6) Fence ఫెన్స్= సరిహద్దు

(7) Enab, ఎనాబ్ = ఒక రకమైన మత్తు పానీయం

(8) Creation, క్రియేషన్ = సృష్టి, సంతానం

(9) Tobok, టోబాక్, Tobot, టోబాట్ = యంత్ర సహకారి

(10) Vihan, Vihaan విహాన్ =ఎలోన్ గ్రహంలో ఒక వారం

(11) Parina, Craw – పరీనా, క్రా = వంటకాలు/ఆహార పదార్థాలు

(మళ్ళీ కలుద్దాం)


రచయిత్రి పరిచయం:

రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.

https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.

Exit mobile version