[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[రెంప్లాజోలో తిరిగి పనిలో చేరడం టియోనికి ఓ కఠినమైన మార్పు అవుతుంది. విపరీతమైన పని, తారని చూసుకోవడంతో ఒత్తిడికి గురువుతుంది. తార కోసం ఒక టోబాట్‌ని నియమించాల్సిన సమయం ఆసన్నమైందని అనుకుని ఒక టోబాక్‌ని కొంటుంది. దానికి హాప్ అని పేరు పెడుతుంది. పాప బాధ్యత హాప్ తీసుకున్నాక, కాస్త వెసులుబాటు దొరుకుతుంది టియోనికి. తన ట్యాగ్‍ని చెక్ చేస్తే, ఈవీ నుంచి వచ్చిన సందేశం కనిపిస్తుంది. సీని మరణానికి కారణాలకు సంబంధించిన వార్తల కోసం ఎదురుచూస్తుంటుంది. నిద్రపోదామని అనుకుంటుండగా, ఆమెకు అభిరుచి అనే పదానికి సీని ఇచ్చిన నిర్వచనం గుర్తొస్తుంది. సుదూరంలోని భూగ్రహానికి చెందిన విషయాల పట్ల మక్కువ పెంచుకునేందుకు సీనిని ఏం పురికొల్పిందా అని ఆలోచిందింది. కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. సీని మరణం నిజంగానే విష్ వల్ల సంభవించిందనీ, పైగా అది ఫెన్స్‌కి అవతలి వైపు నుంచి వచ్చిందని క్రేటీ చెప్తుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరని ఉల్తూరు అడుగుతుంది. సీని మరణానికి కారణం విషమేననీ, కానీ తమ వైపు విషం అమ్మే కొట్లు లేనందువల్ల, అది, ఫెన్స్‌కి ఆ వైపు నుంచి వచ్చినట్టే అని అంటుంది క్రేటీ. ప్రస్తుతానికి సీనిది ప్రమాదమరణమని అందరికీ చెప్దామని అంటుంది ఉల్తూర్. కొంత చర్చ తరువాత కౌన్సిల్ సభ్యులందరూ అంగీకరిస్తారు. ఉల్తూర్ తన ఇంటికి వచ్చేస్తుంది. ఆ మ్యూజిక్ ఫైల్‍ని గుర్తు చేసుకుంటుంది. సీని బ్రెయిన్ మ్యాపింగ్ కావాలని ప్రయోగశాలని అడుగుతుంది. ప్రామ్‍లీ ఎంతకీ ప్రతిస్పందించకపోవడం ఉల్తూర్‍కి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతలో సీని మెదడులోని డాటా అంతా చెరిగిపోయినందున బ్రెయిన్ మ్యాపింగ్ ఫలితం శూన్యమని సందేశం వస్తుంది. అది చూసి విస్తుపోతుంది ఉల్తూర్. కాసేపటికి ప్రామ్‍లీ ఎన్‍క్రిప్టెడ్ ఛానెల్ లోకి వచ్చినా, ఉల్తూర్ చెప్పిన విషయాలు విని ఊర్కుంటుంది, ఏమీ స్పందించదు. ఆమె ప్రవర్తన అసహజంగా అనిపించి, ఛానెల్ స్విచ్ ఆపేస్తుంది ఉల్తూర్. తనని కలవమని ఈవీకి సందేశం పంపుతుంది ఉల్తూర్. మొదట వద్దనుకున్నా, ఆమె కౌన్సిల్ సభ్యురాలు కాబట్టి వస్తుంది ఈవీ. ఆ మ్యూజిక్ ఫైల్ గురించి, ‘మాయ’ అనే వ్యక్తి ఎవరో కనుగొనడంలో తాను చేసిన విఫల ప్రయత్నం గురించి గబగబా ఉల్తూర్‍కి చెప్పి, అక్కడ్నించి వెళ్ళిపోవాలనుకుంటుంది ఈవీ. కాసేపు ఉండమంటుందు ఉల్తూర్. తనకి ప్రామ్‍లీ తెలుసననీ, ఈ ‘మాయ’ ఎవరని అడుగుతుంది. కానీ ఈవీ వెళ్ళిపోవడానికి సిద్ధమవడంతో, ఈ ‘మాయ’ గురించి ఇంకెవరికి తెలుసని అడుగుతుంది. రెంప్లాజోలో పనిచేసే టియోనికి తెలుసనని అంటుంది ఈవీ. ఆమె వెళ్ళబోతుంటే, కూర్చోమని ఆదేశిస్తుంది ఉల్తూర్. ఇది తనకి సంబంధించని విషయమని అంటుంది ఈవీ. నీకు సంబంధించినదే, కూర్చో అని ఆదేశిస్తుంది ఉల్తూర్. చేసేదేం లేక కూర్చుంటుంది ఈవీ. విష్ అవతలి వైపు నుండి వస్తే, వారితో విరోధం లేదా సంఘర్షణ ఆసన్నమైందని అర్థమనీ; ఆ గొడవలు, వాటి పర్యవసానాల గురించి వినే ఉంటావని ఈవీతో అంటుంది ఉల్తూర్. మళ్లీ గొడవ జరిగితే జరగబోయే విధ్వంసం, నష్టాలు ఊహాతీతమని చెప్పి, ‘మాయ’ని వెతికి పట్టుకోవడంలో తనకు ఈవీ సాయం కావాలని అంటుంది ఉల్తూర్. అయితే ఫెన్స్‌కి అటువైపు ఉన్నది ఎవరని అడుగుతుంది ఈవీ. అదేంటి నీకు తెలియదా, మీ విద్యాసంస్థలో ఎవరూ చెప్పలేదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఉల్తూర్. వాళ్ళు వేరే జాతి వారనీ, వారు కూడా భూమి నుండే వచ్చారనీ, వారిని ‘పురుషులు’ అంటారని చెబుతుంది ఉల్తూర్. ఇక చదవండి.]
అధ్యాయం-2 – క్షీణత – మొదటి భాగం
రాత్రి ఆకాశంలో నక్షత్రాలు విరబూశాయి. కాలంటే (1) లోని ఈ సమయంలో ఎలోన్ గ్రహపు మూడు చందమామలు కేవలం సన్నని చీలికల్లా ఉంటాయి. టెలిస్కోప్ నుంచి ఆకాశంలో్ని రిక్కలను చూస్తున్నాడు ఇమే. చేయి చాస్తే, నక్షత్రాలు అందేలా ఉన్నాయని అనుకున్నాడు. ఒక్కోసారి వెలుగుతూ, ఒక్కోసారి ఆరుతూ – మినుకు మినుకుమంటున్న తారకలు – అందమైన కాన్వాసులా అనిపించాయతనికి. వాటినే చూస్తూ, చాలాసేపు మైమరపు స్థితిలో ఉండిపోయాడు. ఒంటరిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే ఆ ‘అయోనా అబ్జర్వేటరీ’లో రాత్రి ఆకాశం, నక్షత్రాలు తప్ప – మరేమీ ఉన్నట్టు అతనికి అనిపించదు.
ఉద్యోగ బాధ్యతలకు సంబంధించి క్రితం కాలంటే (1) లో ఇమే సాధించినవన్నీ అక్కడి పెద్ద తెరపై ప్రదర్శితమవుతున్నాయి. అతను దానికి దూరంగా కదిలి, చిన్న కారిడార్ గుండా, పైకప్పు వైపు నడిచాడు. పైకి చేరాడు. ‘అయోనా అబ్జర్వేటరీ’ అతని పాదాల కింద నల్లటి ముద్దలా ఉంది. అది ఒక కొండ శిఖరాగ్రంలో ఉంది, కొండ వాలులో రిఫ్లెక్టర్లు, అద్దాలు ఉన్నాయి. చల్లటి గాలి వీస్తోంది. దూరంగా నగర దీపాలు తళుక్కుమంటున్నాయి. టెలిస్కోప్ లేకుండా చూస్తుంటే, మబ్బుల్లేని ఆకాశంలో నక్షత్రాలు ఎంతో దూరంగా ఉన్నట్టు అనిపించింది.
తమని చుట్టుముట్టిన నిశిలో, ఎక్కడో సుదూరంగా, ఖగోళంలో తమకు కాబోయే కొత్త ఆవాస గ్రహం ఉండి ఉంటుందని గట్టిగా భావించాడు ఇమే. తల పైకెత్తి ఆకాశం కేసి చూశాడు. టెలిస్కోప్ అవసరం లేకుండానే ఎన్నో నక్షత్ర మండలాలు కనబడతాయి. తన ఉద్యోగ బాధ్యతల కొన్ని ఫలితాలకి సంబంధించి, వల్హన్‍ని సంప్రదించాలనుకున్నాడు ఇమే, కానీ కొంత కాలం ఎదురుచూడక తప్పదు. తాను ప్రయాణంలో ఉన్నాననీ వచ్చే కాలంటే (1) లో తిరిగొస్తాననీ, వల్హన్ ‘లెక్స్’ ద్వారా సందేశం పంపాడు.
తన అపార్ట్‌మెంట్‌కి వెళ్ళి నిద్రపోవాలనుకున్నాడు ఇమే.
‘ట్రావెలర్’ (వాహనం) కోసం సందేశం పంపి, ‘అయోనా అబ్జర్వేటరీ’ లోపలికి నడిచాడు ఇమే. అన్ని స్విచ్‍లు ఆపేసి, ఎలివేటర్ వైపు నడిచాడు. పవర్ ఆగిపోవటంతో, అక్కడ పని చేస్తున్న టోబాక్‍లన్నీ (2) తమ తమ స్థానాల్లోకి వెళ్ళి నిశ్శబ్దమైపోయాయి. ‘లెక్స్’ (3) అనేది ప్రతి పురుషుడి చేతిలో, ఏదో ఒక చోట జొప్పించబడే ఒక నానో చిప్. దాన్ని, మొదడుకి పొడిగింపుగా పరిగణించవచ్చు. అది వాళ్ళని తమ మెయిన్ ఫ్రేమ్ వ్యవస్థని అనుసంధానిస్తుంది, ఒకరితో ఒకరిని కలిపి ఉంచుతుంది.
అబ్జర్వేటరీ దిగువ అంతస్తుకి చేరేసరికి, ‘ట్రావెలర్’ వచ్చి ఉంది. అవి తేలికపాటి లోహాలతో నిర్మించబడినవి, ప్రకాశవంతమైన రంగులలో ఉంటాయి. వాటి తలుపులో నావిగేషన్ పానెల్స్ ఉంటాయి. లోపల కూర్చోడానికి కొన్ని సీట్లు ఉంటాయి. నగరమంతా విస్తరించి ఉన్న ఎనర్జీ స్టేషన్స్ నుంచి ఇంధనాన్ని తీసుకుంటూ, అవి నగరమంతా తిరుగుతాయి. ఇమే వాహనంలోకి ప్రవేశించి, ‘లెక్స్’ జొప్పించిన తన మోచేతిని స్వైప్ చేశాడు. ‘ట్రావెలర్’ అతని ఇంటి దిశగా దూసుకుపోయింది.
తెల్లవారుజామున నగరం నిర్మానుష్యంగా ఉంది. విశాలమైన మార్గాలలో ఘనమైన భవంతులు, వాటి మధ్య చిన్న, సాదా నిర్మాణాలు! కాసేపటిలో జనాల సందడి మొదలవుతుంది, కొత్త రోజు ఆరంభమవుతుంది. ఇమే తన బ్లాక్‍కి చేరాడు. గేటు దాటి ఎలివేటర్ వైపు నడిచాడు. ఆ బ్లాక్‍లో 14 ఇళ్ళున్నాయి. ఒకే ప్రాంగణంలోని సమూహ నివాసాల్లా కాకుండా, ఎవరి ఇల్లు వారిదే. ఒక్కో ఇల్లూ విశాలంగా ఉండి, ఉదయం పూట సూర్యరశ్మిని బాగా గ్రహిస్తుంది. మంచం మీద వాలబోతూ, గోడకి తగిలించి ఉన్న అద్దంలో తనని తాను చూసుకున్నాడు ఇమే. అలసిపోయినట్లుగా ఉన్నాడు. నీలం రంగు, చొక్కా, నల్ల ప్యాంట్ కాస్త మాసినట్టున్నాయి. అయితే, తాను వాటిని విప్పి, కప్‍బోర్డ్‌లో ఉంచగానే, అవి శుభ్రమై, తాజాగా తయారవుతాయని అతనికి తెలుసు.
ఇమే వదనం చదరంలా ఉంటుంది, కళ్ళు డార్క్ బ్రౌన్ రంగు. ఎరుపు రంగు జుట్టు బాగా పెరిగిపోయింది. కత్తిరించాలి. చాలామందిలా కాకుండా, జుట్టుని కురచగా ఉంచుకోడానికే ఇష్టపడతాడు ఇమే. చాలా కాలం క్రితం తాము నివసించిన ఆ గ్రహంలోని తమ పూర్వీకులు జుట్టుని కురచగానే ఉంచుకునేవారట, అందుకే వాళ్ళలాగా, ఇమే కూడా ఆ అలవాటుని పాటించాడు. రాత్రి దుస్తుల్లోకి మారి, మంచం మీద వాలి, ఆ గ్రహం పేరేమిటో గుర్తు చేసుకోడానికి ప్రయత్నించాడు. టెలిస్కోప్ ద్వారా తాను చూసిన ఎన్నో గ్రహాల మధ్య, అదెక్కడో చిక్కుకుపోయింది
‘భూమి!’
అవును. సుదూరంలోని ఆ గ్రహం పేరు భూమి. ఇదంతా అక్కడే మొదలైంది.
🚀
తెల్లారింది. ఆకాశం నిర్మలంగా, కాంతిమంతంగా ఉంది. తమ తమ పనులకు వెళ్ళే పురుషులతో ‘ట్రావెలర్’లు నిండిపోయాయి. అప్పుడే నిద్రలేచిన రాదుల్ మంచం మీద కూర్చున్నాడు. భుజాల దాకా పెరిగిన కేశాలను చేత్తో స్పృశించాడు. ఆకలేస్తుంది. వేగంగా తయారు చేసుకోడానికి ఏమున్నాయా అని ఆలోచించాడు. పురుషుల బృందాల కోసం ఉద్దేశించిన ‘గ్రూప్ హౌసెస్’ (సమూహ నివాసాలు) అనబడే పెద్ద భవంతిలో ఓ గదిలో అతను ఉంటాడు. ఈ ఇళ్ళ నిర్వహణ బాధ్యత టోబాక్‍లదే (2). అవే వండుతాయి, అవే శుభ్రం చేస్తాయి.
ఒకే కిటికీ ఉన్న ఆ గది చిందరవందరగా ఉంది. కాసేపట్లో వచ్చి, గదిని శుభ్రం చేసే టోబాక్ (2) కోసం ఎదురుచూస్తున్నాడు. అతని బట్టలు నేల మీద పడి ఉన్నాయి, వాటి పక్కనే ఖాళీ ఎనాబ్ (4) టిన్లు పడున్నాయి. కొన్ని బట్టల్ని కాలితో పక్కకి తోస్తూ, బయటకు వచ్చాడు రాదుల్. తాము ఆహారం తీసుకునే గదికి వెళ్ళాడు. బ్లమ్, సాకా అప్పటికే అక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళతో పాటు ఈ భవనంలో ఉండే మరో ముగ్గురు పురుషులు తినేసి, పనులకి వెళ్ళిపోయారు. రాదుల్ ఒక బౌల్ తీసుకుని, సాధారణంగా ఉదయం పూట వండే ‘పరీనా’ (5) మిక్స్ దానిలో పోసుకున్నాడు. స్థానికంగా దొరికే బ్రెడ్ ‘క్రా’ (5) అందుకున్నాడు. అక్కడున్న ఓ చిన్న కుర్చీలో కూర్చుని తినడానికి సిద్ధమయ్యాడు.
“రాదుల్, ఎట్టకేలకు నువ్వు ‘సైనెడ్’లో సభ్యుడవయ్యావు కదా?” అడిగాడు బ్లమ్.
“అవును. చాలా కష్టపడాల్సొచ్చింది. ‘సైనెడ్’ బృందంలోని ‘వృద్ధులు’ – తమలాంటి వాళ్ళకే అందులో చోటివ్వాలని అనుకున్నారు. కానీ నేను చాలా ఒత్తిడి చేసి, దాన్ని జరగనివ్వలేదు” తింటూ చెప్పాడు రాదుల్. తన నీలి రంగు కళ్లతో ఆ గదిని పరిశీలించాడు. ఫర్నిచర్ అంతా పాతదే, కాకపోతే, మిగతా గ్రూప్ హౌస్‍ల వలే కాకుండా, ఈ మధ్యనే వెల్లవేయడంతో, తాజాగా కనబడుతోంది. రాదుల్ చదువు పూర్తి చేయలేదు. స్థానిక టోబాక్ మెయిన్‍టెనెన్స్ యూనిట్‍లో మెకానిక్‍గా పనిచేస్తున్నాడు. అయితే, తనకి ఏం కావాలన్న విషయంలో అతనికి స్పష్టత ఉంది. ‘గ్రూప్ హౌసెస్’ నుంచి బయటపడి, తనకొక్కడికే ఉండే ఇంట్లోకి మారాలనుకుంటున్నాడు. అయితే తన ఉద్యోగ హోదాకి, తనకి విడిగా ఇల్లు ఇవ్వరని తెలుసు. అందుకే ‘సైనెడ్’లో సభ్యత్వం పొందాలనుకున్నాడు. ‘సైనెడ్’లో సభ్యులకి విడిగా ఇళ్ళు ఇస్తారు. అందుకే అది అతని లక్ష్యమయింది.
“నువ్వు ‘సైనెడ్’లో ఏం చేస్తావు, రాదుల్?” అడిగాడు బ్లమ్. “వాళ్ళు మనకి మార్గదర్శనం చేయాలి, కానీ చేయరు. చేస్తున్నారా? చర్చలు మాత్రం నిరంతరాయంగా సాగిస్తారు, పరిష్కారం మాత్రం రాదు. ఈ ‘గ్రూప్ హౌస్’ల స్థానంలో విడిగా చిన్న ఇళ్ళు ఇవ్వచ్చుగా! ఇతర నగరాలకి వెళ్ళే ‘ట్రావెలర్’ల ట్రిప్పుల సంఖ్య పెంచచ్చుగా! కానీ ఇవేవీ వాళ్ళకు పట్టవు.. పట్టించుకోరు..” నిర్లిప్తంగా అన్నాడు బ్లమ్.
“వాటినే నేను మార్చాలనుకుంటున్నాను. ఇప్పుడు కావలసినవి చేతలు, మాటలు కాదు!” స్థిరంగా చెప్పాడు రాదుల్.
అతనికి ‘సైనెడ్’లో సభ్యత్వం అంత సులువుగా రాలేదు. దాంట్లో ‘వృద్ధుల’ ప్రాబల్యం ఎక్కువ. ప్రతి పది జాక్ (6)లకీ, ముప్పై మంది సభ్యులలోని పది మంది రొటేషన్ పద్ధతిలో అధికారం పంచుకుంటారు. ‘సైనెడ్’లో సభ్యత్వం సాధించటం కాస్త జటిలమే. మన పేరు ఎవరు ప్రతిపాదిస్తున్నారనేది చాలా ముఖ్యం. గత రొటేషన్ ప్రక్రియని చాలా జాగ్రత్తగా గమనించాడు రాదుల్. గడచిన జాక్ (6)లలో, పాటిక్స్‌ని గుర్తించి, అతనికి సన్నిహితుడయ్యాడు రాదుల్. పాటిక్స్ ‘సైనెడ్’లో కీలక సభ్యుడు. టోబాక్ మెయిన్‍టెనెన్స్ పనులలో రాదుల్‍కి పరిచయమయ్యాడు పాటిక్స్. ఈసారి రొటేషన్ వచ్చేసరికి రాదుల్ తన ప్రయత్నాలన్నీ పూర్తిచేశాడు. అయితే, చాలామంది రాదుల్ చేరికని వ్యతిరేకించారు, ‘సైనెడ్’కి అతను చేయగలిగేదీ లేదని భావించారు. చదువు లేదు, పైగా ‘గ్రూప్ హౌస్’లలో ఉంటాడు, ఎప్పుడూ ఎనాబ్ (4) మత్తులో ఉంటాడు, లెక్స్ ఫోల్డర్ లన్నీ చెత్తతో నింపుతాడు – ఇవీ ప్రధానంగా అతనికి వ్యతిరేకంగా ఉన్న అభ్యంతరాలు! ఇలాంటివి ఎన్నో ఉన్నా, ‘యువకుడు’ కావటం అతనికి అనుకూలమైంది. అతని ఈడువాళ్ళు, సహచరులలో ఎవరూ ‘సైనెడ్’ సభ్యత్వానికి ప్రయత్నించలేదు. పైగా పాటిక్స్ మద్దతు ఉండడంతో, అతనికి ‘సైనెడ్’లో సభ్యత్వం లభించటం సులువయింది.
‘సైనెడ్’లో సభ్యత్వం లభించాకా, రాదుల్ ఆశలు పెరిగాయి. తనకంటూ విడిగా ఇల్లు కావాలనుకోకుండా, ‘సైనెడ్’ పనిచేసే పద్ధతినే మార్చాలని తలచాడు. కొత్త సభ్యుడిగా, ‘వృద్ధుల’ దృష్టిలో పడాలనుకున్నాడు. ఏదైనా ముఖ్యమైన దాన్ని ‘సైనెడ్’ ముందుకు తేవాలనుకున్నాడు, వాళ్ళ ఉదాసీనతని తరిమేసేది, తనని గుర్తించేలా చేసేదాన్ని వాళ్ళ దృష్టికి తేవాలనుకున్నాడు రాదుల్. అది ‘గ్రూప్ హౌస్’ల విషయమో, ‘ట్రావెలర్’ల విషయమో కాదు – ఇంకా పెద్దది, మరింత ముఖ్యమైనది అయ్యుండాలి. ఎలోన్ (7) ఎదిగేలా, మారేలా, విస్తరించేలా – చేసేదాన్ని ప్రతిపాదించాలనుకున్నాడు రాదుల్.
🚀
కిటికీ నుంచి అలలను చూస్తున్నాడు వల్హన్. మధ్యస్థంగా ఉన్న ఆ గదికి ఉల్లాసకరంలా ఉండేలా గోడలకి గులాబీ రంగు వేశారు. పెద్ద పెద్ద కిటికీల నుండి సముద్రం కనిపిస్తుంది. మధ్యాహ్నం పూట సముద్రం మరింత నీలంగా కనిపిస్తోంది. దూరంగా లేచిన అలలు త్వరితగతిన తీరాన్ని తాకి నురుగుని తెస్తున్నాయి. మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. వల్హన్ దాదాపు 20 జాక్ (6)ల తర్వాత, మళ్ళీ ‘నోటస్’కి.. అవయవ మార్పిడి కేంద్రానికి వచ్చాడు. అతని శరీరంలో కొన్ని అవయవాలకి మార్పిడి అవసరం. ఈ ప్రక్రియ అవసరమైనప్పుడల్లా, వల్హన్ ఈ ‘నోటస్’కే వస్తాడు. సముద్రానికి సమీపంగా ఉండడం అతనికి ఇష్టం. అతని అవయవ మార్పిడి మర్నాడు. మార్పిడికి కావలసిన సమాచారమంతా అతని ‘లెక్స్’ (3) లో నిక్షిప్తమయ్యాయి. అతను కళ్లు మూసుకుని ఆ సమాచారాన్ని చదువుకున్నాడు:
అవయవాల మార్పిడి కోసం ఉపయోగించే మెటిరీయల్ – మీరు క్రితం సారి వచ్చినప్పటికంటే – మరింత శుద్ధి చేయబడింది. అవయవాల తయారీ కోసం ఉపయోగించే నెపో (8) ఇప్పటికీ మౌలిక వనరే అయినప్పటికీ, ఇతర ఖనిజాలను జోడించడం జరుగుతోంది, వీటి గడువు సుమారు 25 జాక్‌లు (6). గతంలో ఈ గడువు 15 జాక్‌లు మాత్రమే. అవయవాల మార్పిడి తర్వాత, రెండు రోజుల విశ్రాంతి తీసుకుని, మీ సాధారణ పనులు చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలుంటే..
వల్హన్ కళ్ళు తెరిచాడు. తన దృష్టిని ఆకర్షించే కొత్త విషయమేదీ లేదు ఆ సమాచారంలో. అతను ఎలోన్ (7)లో ఖనిజాలను, సహజ వనరులను, ఇతర వనరుల నిర్వహణను చూసే ‘మస్తు’ అనే సంస్థలో పనిచేస్తాడు. తన ‘లెక్స్’ (3) నుంచే ఆఫీస్ సిస్టమ్‍కి ప్రవేశించాడు. అతను చూడాల్సిన డాక్యుమెంట్స్ చాలానే ఉన్నాయి, కానీ అయితే దేన్నీ వెంటనే చూడాల్సిన అవసరం లేదు. సిస్టమ్‍లోని హైవేస్ (ఫోల్డర్స్) మారుస్తుండగా, నెపో (8) కి సంబంధంచిన తాజా నివేదిక వచ్చింది. నెపో (8) నిల్వల క్షీణతని అది ధ్రువీకరించింది. ప్రతి గని లోనూ ఆ ఖనిజం నిల్వలు తగ్గాయి. ఆ ఖనిజం రాబోయే వెయ్యి – పదిహేను వందల జాక్ (6)ల వరకే సరిపోతుంది.
ఈ సరళిని మొదటగా 20 జాక్ (6)ల క్రితం గమనించాడు వల్హన్. దాని గురించి విస్తృతంగా పరిశోధించి, అధ్యయనం చేశాడు. రాబోయే రోజుల్లో నెపో (8) నిల్వల క్షీణత అతి పెద్ద సవాలుగా పరిణమించనుంది.
వారి ఉనికికి నెపో (8) ఎంతో కీలకం. వారు ఉండేలా చేసింది అదే. ఎలోన్ (7)లో భూగర్భంలో పుష్కలంగా లభించే ఖనిజం, ఇది సులభంగా, సున్నితంగా తగిన ప్రాసెసింగ్‌తో ఉంటుంది. శరీర అవయవాలను పునఃసృష్టికి అనువైన పదార్ధంగా ఉపకరిస్తుంది. సరళంగా చెప్పాలంటే, వారికి తెలిసినట్లుగా, ఇది జీవితానికి పునాది. నెపోను శుద్ధి చేయడానికి, దాని సరళతనీ, వినియోగాన్ని మెరుగుపరచడానికి నిరంతర పరిశోధనలు, అధ్యయనాలు నిర్వహించబడ్డాయి.
వల్హాన్ లెక్స్ నుండి బయటకు వచ్చేశాడు. అవయవ మార్పిడి ప్రక్రియ పూర్తయ్యాకా, ఒడెప్‌ని నెపో నిల్వల క్షీణత గురించి అతనితో చర్చించాలని అనుకున్నాడు.
తలుపు తెరుచుకుంది. నోటస్ స్పెషలిస్ట్ లేత గులాబీ రంగు యూనిఫారంలో శుభ్రమైన దుస్తులు ధరించి, తన టోబాట్ అసిస్టెంట్‌తో కలిసి లోపలికి వచ్చాడు. మనిషి ఆకారంలో ఉన్న ఆ టోబాట్‌కి పొడవాటి చేతులు, పొట్టి కాళ్ళు ఉన్నాయి.
టోబాట్ తన చేతిలో ఉన్న ప్రాసెసర్‍ని వల్హన్‍కు తగిలించి, పారామీటర్స్ కొలుస్తుండగా, “ఎలా ఉన్నారు?” అని అడిగాడు స్పెషలిస్ట్.
“బావున్నాను.”, అని చెప్పి, “ఈసారి నావి చాలా అవయవాలు మారుస్తారా?” అడిగాడు వల్హన్.
“అదేం లేదు. ఏవి అవసరమో, అవే మారుస్తాను. బహుశా మూడు మార్చాల్సి రావచ్చు. ప్రస్తుతం కొత్త మెటీరియల్‌తో చేసిన కొత్త అవయవాలని శరీరం చక్కగా తీసుకుంటోంది, వాటి ఉపయోగం కూడా ఎక్కువ కాలం ఉంటోంది” అంటూ తన చేతిలో ఉన్న స్క్రీన్‌ని చూస్తూ చెప్పాడు స్పెషలిస్ట్.
మళ్ళీ తనే మాట్లాడుతూ, “ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా?” అని అడిగాడు.
“ఇక్కడ ఆఖరి మరణం ఎప్పుడు సంభవించింది?”
ఆ స్పెషలిస్ట్ తికమకి గురయ్యాడు. “ఇక్కడ అంటే, నోటస్ లో అనా మీ ఉద్దేశం?”
వల్హన్ తల ఊపాడు.
“లేదు. ఒక్క మరణం కూడా లేదు. అయినా, అసలు ఎలోన్‌లో గత వంద జాక్‍లలో, గత యుద్ధం తరువాతి నుంచి, చావన్నదే లేదని అనుకుంటున్నాను. నూతన అవయవాలు సురక్షితం, వాటి వల్ల మరణ భయం లేదు.”
ఈ ప్రశ్న అతనికి గందరగోళానికి గురిచేసింది. వెంటనే వెళ్ళిపోయాడు. టోబాట్ అతన్ని అనుసరించింది. వాళ్ళు వెళ్ళిపోయాకా, వల్హన్ నిశ్శబ్దంగా పడుకుని ఉండిపోయాడు. అతనికే, అర్థం కాలేదు తాను అసలు మరణం గురించి ఎందుకడిగాడో! చావు గురించి అస్సలు ఆలోచించడం లేదు. కొత్తగా అవయవాలు అమర్చుకోవాలనుకోవడం వల్ల ఈ ప్రశ్న తలెత్తిందా? లేదా నెపో వనరులు క్షీణిస్తున్నాయన్న వార్త అతని మనసుని ప్రభావితం చేసిందా? సముద్రం వైపు తిరిగి, తీరానికి తాకి వెనక్కి వెళ్తున్న అలలపై దృష్టి సారించాడు వల్హన్.
🚀
రాదుల్ ‘ట్రావెలర్’ నుంచి దిగాడు, ఠీవిగా నిలిచిన ‘సైనెడ్’ భవంతి ముందు కాసేపు నిల్చున్నాడు. దాని ముందు ఓ భారీ ఆర్చ్ ఉంది, దాని వెనుక టవర్స్, ఫ్లాట్స్ ఉన్నాయి. లోపలికి ప్రవేశించి ఒక్కో ద్వారాన్ని దాటుతూ భవనం లోపలి కళాత్మకతకు అబ్బురపడుతూ ముందుకు నడిచాడు. ‘సైనెడ్’ సభ్యులను రాదుల్ కలవడం ఇదే మొదటిసారి. మొదటి సమావేశంలోనే వారికి తానంటే ఓ మంచి అభిప్రాయాన్ని కలిగించాలని తలచాడు రాదుల్. గత విహాన్‍లో (9) – ఈ సమావేశాంలో తానేం చెప్పాలా అనే అంశాలపై తన లెక్స్‌లో సన్నద్ధమయ్యాడు.
అతను సమావేశ మందిరంలోకి ప్రవేశించాడు. అది పొడవాటి గది, సుందరంగా అలంకృతమై ఉంది. మధ్యలో ఒక దీర్ఘచతురస్రాకారపు బల్ల ఉంది. ప్రతి సభ్యుడికి నిర్ధారిత ఆసనం ఉంది. ఫర్నిచర్, సంబంధిత వస్తువులు ఖరీదైన ముఖ్‍మల్ వస్త్రంతో అలంకరించబడ్డాయి. అవి రాయల్ బ్లూ రంగులో ఉన్నాయి. అప్పటికే చాలామంది సభ్యులు వచ్చేసి, గడబిడగా మాట్లాడుకుంటున్నారు. లెక్స్ (3) ఉన్నప్పటికీ, ‘సైనెడ్’ సభ్యులంతా – ప్రతి నాలుగు కాలంటే (1) లకు ఒకసారి భౌతికంగా కలవటానికే ఇష్టపడతారు. తలుపులు మూసివేసి చర్చించుకుంటారు, సమావేశం ముగిసాకా, తన నిర్ణయాల సారాన్ని లెక్స్ (3) ఫోల్డర్స్‌లో చేరుస్తారు.
చుట్టూ చూశాడు రాదుల్. సభ్యులు ధరించిన దుస్తులను గమనిస్తే, వారి సమావేశాలకు ఫార్మాలిటీ పాటించాలని అర్థమయింది. ప్రతి ఒక్కరి జుట్టు కుదురుగా ఉంది, దుస్తులు హుందాగా ఉన్నాయి, ప్రతి ఒక్కరు, రాదుల్ తప్ప, తమకంటూ ప్రాముఖ్యతని కలిగి ఉన్నారు. వాళ్ళ ఆమోదం పొందడానికి, తన వేషభాషలని మెరుగుపరుచుకుని, నియమాల ప్రకారం నడచుకోవాలని అనుకున్నాడు రాదుల్.
అందరూ వచ్చేసాకా, ప్రతి ఒక్కరూ బల్ల చుట్టూ వారి వారి సీట్లలో కూర్చున్నారు. పాటిక్స్ వస్తూనే, రాదుల్ వైపు చూశాడు. అతని ఆహార్యం నచ్చినట్టు లేదు, వెంటనే తల తిప్పేసుకున్నాడు.
‘సైనెడ్’ బృందానికి అధ్యక్షుడు అంటూ ఎవరూ ఉండరు. పదేళ్ళ పాటు ఒకే వ్యక్తి సమావేశాలను నిర్వహిస్తాడు. ప్రస్తుతం డర్క్ ఆ స్థానంలో ఉన్నాడు. కొత్త సభ్యులకు ఆహ్వానం పలుకుతూ, ఆయన తన ప్రసంగం మొదలుపెట్టాడు.
“సైనెడ్ బృందంలోకి కొత్త సభ్యులు రావడం ఎప్పుడూ బాగుంటుంది. మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే ఆలోచనను వారు తమతో తీసుకొస్తారు. నేను మన కొత్త సభ్యులకు నియమాలను తెలియచేయాలనుకుంటున్నాను. ముందుగా, మీరు భౌతికంగా హాజరైనప్పుడే సమస్యలపై మాట్లాడవచ్చు, ఓటు వేయవచ్చు. లెక్స్ ద్వారా హాజరు కుదరదు. రెండవది, ఈ గదిలో జరిగే అన్ని చర్చలు ఇక్కడే ఉండాలి. చర్చలను బహిర్గతం చేసే స్వేచ్ఛ మీకు లేదు; మీరు నిర్ణయాలను మాత్రమే పంచుకోగలరు. మూడవది, సభ్యులు ఆహార్యంలో చక్కగా ఉండాలి. వారు మత్తు పానీయాలకి దూరంగా ఉండాలి. హెచ్చు స్వరంతో మాట్లాడకూడదు. చివరగా, ఈ గదిలో లెక్స్ (3) పనిచేయదు. మీరు బయటకు అడుగుపెట్టగానే అవి తిరిగి పని చేస్తాయి.”
ఆఖరి నియమం గట్టి దెబ్బలా తాకింది రాదుల్‍ని. తన లెక్స్ (3)ని వాడాలని ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. అతని లెక్స్ అతని మెదడుకు కొనసాగింపు లాంటిది, ఇప్పుడు అది అందుబాటులో లేకపోయేసరికి, వింతగా ఉంది. తనలోని ఏదో భాగం మూతబడినట్టు రాదుల్‍కి అనిపించింది. ఈ సమావేశంలో తాను మాట్లాడాలనుకున్న అంశాన్ని గుర్తు చేసుకోడానికి ప్రయత్నించాడు, కానీ గుర్తు రాలేదు. అతని ప్రసంగం లెక్స్ (3) లో ఉండిపోయింది. లెక్స్ (3) నిశ్శబ్దమై పోవడంతో, ‘సైనెడ్’ని ఒక కుదుపు కుదపాలన్న అతని ప్రణాళిక భగ్నమయింది.
“సరే, మనం వ్యక్తిగత ‘ట్రావెలర్’ లను కలిగి ఉండటం ప్రారంభిస్తే, దారులు రద్దీ అయిపోతాయి. కొన్ని నిబంధనలు ఉండాలి..”
ఇలా ఓ చర్చ జరుగుతోంది. తాను ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని గుర్తు చేసుకునేందుకు తంటాలు పడుతున్నాడు రాదుల్. లెక్స్ (3) పై అధికంగా ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని అనుకున్నాడు. తన జ్ఞాపకాల భాండాగారంగా ఇకపై లెక్స్ (3) ని మాత్రమే ఉంచుకునే వీలు లేదని గ్రహించాడు. దీన్ని పునరావృత్తం కానివ్వనని తనకి తాను చెప్పుకున్నాడు.
“ఒక కుర్చీ ఖాళీగా ఉంది. ఎవరు రాలేదు?” అడిగాడు డర్క్.
“వల్హన్ రాలేదు” చెప్పాడు పాటిక్స్. పాటిక్స్ పొట్టిగా, బొద్దుగా ఉంటాడు. నల్లటి జుట్టు కురచగా కత్తిరించబడి ఉంది. అతని చూపులు ఎదుటివారిని గుచ్చుతున్నట్లుగా ఉంటాయి, దేనికోసమో తీక్షణంగా చూస్తున్నట్లు ఉంటాయి. ఎక్కువగా బీజ్ రంగు దుస్తులు ధరిస్తాడు. పాటిక్స్ రాదుల్ వైపు తిరిగి, “రాదుల్, ఓ కొత్త సభ్యుడిగా నువ్వు ఏమైనా చెప్పదలచుకున్నావా?” అని అడిగాడు.
“ఈసారి కాదు, వచ్చే సమావేశంలో తప్పకుండా మాట్లాడుతాను. నేను చెప్పాల్సినవి ఉన్నాయి” అన్నాడు రాదుల్.
మరికొన్ని చర్చల తరువాత సమావేశం ముగిసింది. సభ్యులంతా, బృందాలుగా విడిపోయి బయటకు నడిచారు. చివరిగా, రాదుల్ బయటకు వచ్చాడు. అతను మెయిన్ ఎంట్రన్స్ వైపు నడుస్తుండగా, మెట్ల దగ్గర పాటిక్స్ కలిసాడు.
“ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగాడు.
“టోబాట్ మెయిన్‍టెనన్స్ యూనిట్‌కి” చెప్పాడు రాదుల్.
“కాసేపాగి వెళ్ళచ్చులే, ముందు నాతో రా, ఈ ప్రాంగణమంతా తిరుగుదాం” స్థిరంగా చెప్పాడు పాటిక్స్.
ఆ ప్రాంగణంలో నడుస్తూండగా, “రాదుల్, సైనెడ్ విషయాలలో ఆసక్తి చూపిన యువకుడికి నువ్వొక్కడివే అని నేను నీ సభ్యత్వం విషయంలో మద్దతు ఇచ్చాను. నువ్వు బాగా సన్నద్ధమవ్వాలి, చక్కగా కనబడాలి, తోటివాళ్ళతో సంభాషించడం నేర్చుకోవాలి” చెప్పాడు పాటిక్స్.
రాదుల్ మౌనంగా వింటూ ఉన్నాడు. పాటిక్స్ మందలింపుతో, సైనెడ్ సభ్యుల దృష్టిని ఆకర్షించి, వారి ఆమోదాన్ని పొందాలన్న రాదుల్ కోరిక మరింత గట్టిపడింది.
“నాకు తెలుసు పాటిక్స్. నేను కాస్త సన్నద్ధమయ్యాను. కానీ అదంతా లెక్స్ (3)లో ఉండిపోయింది. సమావేశంలో దాన్ని ఉపయోగించవద్దన్నారు. నాకు గుర్తు రాలేదు. నాకు గుర్తున్నంత వరకూ, నేనెప్పుడు లెక్స్ (3)ని ఇంతసేపు స్విచ్ ఆఫ్ చేసి ఉంచలేదు. కాస్త వింతగా, కాస్త అసౌకర్యంగా అనిపించింది.” చెప్పాడు రాదుల్.
ఇద్దరూ కాసేపు మౌనంగా ఉంటూ, నడవసాగారు.
“నీ సమయం ఎలా గడుస్తుంది? ఎనాబ్ (4) మత్తులో పడి ఉండడం, లెక్స్ ఫోల్డర్ లన్నీ చెత్తతో నింపడం కాకుండా, ఇంకేం చేస్తావు?” అడిగాడు పాటిక్స్ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ.
దురుసుగా సమాధానం చెప్పాలనుకున్నాడు, కానీ తనని తను నియంత్రించుకుని “పని తప్ప, మరేం చేయను” అన్నాడు రాదుల్.
రాదుల్‍కి అసహనంగా ఉంది. అతనికి ఇన్ని ప్రశ్నలు అలవాటు లేదు. పైగా పాటిక్స్ ఈ ప్రశ్నలు అడిగే తీరు అతనికి నచ్చలేదు.
“పని లేని సమయాల సంగతేంటి?” మళ్ళీ అడిగాడు పాటిక్స్.
“రాత్రుళ్ళు మా గ్రూప్ హౌస్ టెర్రస్ పైకి వెళ్ళి, నక్షత్రాలనీ, మన మూడు చందమామలని చూస్తూంటాను” చెప్పాడు రాదుల్. అతని గొంతులో చిరాకు. దాన్ని పాటిక్స్ గ్రహించాలని భావిస్తున్నాడు. మొత్తం భవనం ప్రాంగణమంతా తిరిగారు, చివరికి సైనెడ్ భవనం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చారు.
“ఒకవేళ ఈ పని నీ సమయంలో ఎక్కువ భాగం తీసుకుంటే, అయోనా అబర్జ్వేటరీకి వెళ్ళి కొంతకాలం అక్కడ గడపవచ్చు కదా? దాన్ని ఇమే నిర్వహిస్తున్నాడు. వెళ్ళి అతన్ని కలువు. నీ గురించి అతనికి చెప్తాను, త్వరలో వచ్చి కలుస్తావని చెప్తాను. గెలాక్సీల గురించి ఎంతో కొంత తెలుసుకో” ఆదేశించాడు పాటిక్స్. రాదుల్ మనసులో సంకోచించాడు. నోటికొచ్చినదే వాగి, ఇరుక్కుపోయానని అనుకున్నాడు. ఇప్పుడో కొత్త బాధ్యత తలకెత్తుకోవాల్సి వస్తోంది. పాటిక్స్ చేయమని చెప్పినది చేయక తప్పదని రాదుల్‍కి తెలుసు.
“సరే, త్వరలోనే వెళ్తాను. మళ్ళీ కలుద్దాం..” అని చెప్పి, హడావిడిగా బయటకు కదిలి, ‘ట్రావెలర్’ స్టాప్ వైపు నడిచాడు రాదుల్.
సైనెడ్‌లో చేరడం వల్ల తన ఉనికిలో కొంత మార్పు వస్తుందని రాదుల్‌కు తెలుసు, అయితే అతను ఇతరుల ఆదేశాలు పాటించడం అనేది అతను ఊహించని విషయం.
—-
ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:
(1) Calante, కాలంటే = ఎలోన్ గ్రహంలో ఒక నెల
(2) Tobok, టోబాక్, Tobot, టోబాట్ = యంత్ర సహకారి
(3) Lex, లెక్స్ = సమాచార పరికరం
(4) Enab, ఎనాబ్ = ఒక రకమైన మత్తు పానీయం
(5) Parina, Craw – పరీనా, క్రా = వంటకాలు/ఆహార పదార్థాలు
(6) Zacs, జాక్స్ = సంవత్సరాలు
(7) Elone, ఎలోన్ = ఒక గ్రహం
(8) Nepo, నెపో = అవయవాల భర్తీకి ఉపకరించే ఒక ఖనిజం
(9) Vihan, Vihaan విహాన్ =ఎలోన్ గ్రహంలో ఒక వారం
—
(మళ్ళీ కలుద్దాం)
రచయిత్రి పరిచయం:
https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.