[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[మాయ తన కథ చెబుతూంటుంది. ఓ పెద్ద ఆడిటోరియంలో గొప్ప కచేరీ చేసి ప్రేక్షకుల అభినందనలు స్వీకరించి డ్రెస్సింగ్ రూమ్‌కి వస్తుంది మాయ. కాసేపు అక్కడ కూర్చుని స్వల్ప విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో, ఆమె ట్రిన్ బ్యాండ్ మీద ఆమె కూతురు రియా నుంచి ఫోన్ వస్తుంది. కానీ మాయాకి మాట్లాడాలనిపించలేదు. బయటకు వచ్చి ఖాళీ ఆడిటోరియంను చూసి, మెల్లగా హాల్ బయటకి వస్తుంది. తన ట్రిన్ బ్యాండ్ నుంచి తన కారుకి సందేశం పంపగా, ఆ డ్రైవర్‍లెస్ కారు వచ్చి ఆమె ముందు ఆగుతుంది. ఆమె కారెక్కి వెనక సీటులో కూర్చుని ‘హోమ్’ అనే బటన్ నొక్కగా, కారు ఆమె ఇంటి వైపు ప్రయాణం మొదలుపెడుతుంది. ఇంతలో ట్రిన్ బ్యాండ్‌మీద రియా నుంచి మళ్ళీ బీప్ మోగగా, ఈసారి మాట్లాడుతుంది మాయా. తాను బయటకి వెళ్తున్నానని, మర్నాడు సాయంత్రం వస్తానని చెప్పి, ఊర్నుంచి నాన్న ఎప్పుడు వస్తాడని అడుగుతుంది. రియాకు ముప్పై ఏళ్లు దగ్గర పడ్డాయి, టీనేజ్‌లో ఉంది! 2185 సంవత్సరంలో, ముప్పైల వయసు కొత్త టీనేజ్. ఆలోచనల్నుంచి తేరుకున్న మాయా కూతురడిగిన ప్రశ్నలకు జవాబిచ్చి ఫోన్ ఆపేస్తుంది. కొంత దూరం వెళ్ళాకా, ఆకాశంలోని నక్షత్రాలు బాగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. దాంతో ఆమెకి ఆర్యన్ గుర్తొస్తాడు. ఫోన్ చేద్దామనుకుని కూడా ఆగిపోతుంది. ఇల్లు చేరుతుంది. ఆకలి లేకపోవడంతో మంచం మీదా వాలి, అద్దాల కిటికీ గుండా ఆకాశాన్ని, నక్షత్రాలని చూస్తుంది. నక్షత్రాలు, నక్షత్రరాశులు స్థిరంగానే ఉన్నాయి; కానీ భూమిపై మాత్రమే విషయాలు వేగంగా మారిపోతున్నాయని అనుకుంటుంది. గత పదేళ్ళలో ఎన్నో మార్పులొచ్చాయి. మనుషుల జీవిత కాలం పొడిగించబడింది. మరణం తప్పదు కానీ, దాన్ని ఆలస్యం చేయవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడుతుంది. త్వరలో ‘ద ఫ్రీజ్’ అనే శీతాకాలం కమ్ముకొస్తుందని ఆమెకు తెలుసు. వేవ్స్ పై జరుగుతున్న చర్చని వింటుంది మాయ. ఆర్యన్ మళ్ళీ గుర్తు రావడంతో, అతనికి ఓ చిన్న సందేశం పంపుతుంది. – ఇక చదవండి.]
అధ్యాయం-4 – మాయ కథ – 2వ భాగం
ఆర్యన్ తన వర్క్ స్టేషన్ బిజీగా ఉండగా అతని ఫోన్‌లో మాయ మెసేజ్ బీప్ అయింది. అతను దాన్ని చదివాడు: ‘ఎలా ఉన్నావు?’ అని ఉందా మెసేజ్.
చాలా కాలం తర్వాత ఆమె అతనికి మెసేజ్ చేసింది. గత కొన్ని నెలలు తీరిక లేకుండా గడిచాయి. తానో గొప్ప పురోగతిని సాధించానని ఆర్యన్‌కి ఖచ్చితంగా తెలుసు, కానీ దానిని ప్రకటించే ముందు కొన్ని చిన్న ధృవీకరణలు అవసరం. అతను తన కుర్చీలో కాళ్ళు జాపి కూర్చుని, కుర్చీని గది అద్దాల వైపు తిప్పాడు. అబ్జర్వేటరీ గాజు పలకల ద్వారా, అతను, తన వైపు చూస్తున్న నక్షత్రాలను చూడగలిగాడు. అవి అతని నిజమైన స్నేహితులు, దూరం నుండి మెరుస్తూ, నిరంతరం, ఎల్లప్పుడూ అన్వేషణకీ, ఆవిష్కరణకీ సిద్ధంగా ఉంటాయి.
సగం తెల్లబడ్డ తన జుట్టుని చేత్తో సవరించుకున్నాడు. అనేక ఇతర వస్తువులతో నడుచుకున్నట్లుగానే తన మందపాటి అణగని జుట్టును సహజంగానే వదిలేసాడు. ప్రకృతితో అనవసరంగా జోక్యం చేసుకోవడం అనే అలవాటు చాలా మంది మనుషులలో ఓ జాడ్యంలా ప్రబలడం అతన్ని అంతులేని బాధకు గురిచేస్తోంది.
మాయ; ఆమెకి తన జుట్టులో వేళ్లను జొనపడం ఎంత ఇష్టమో. ఆమె గురించి ఆలోచిస్తూంటే, ఆర్యన్‌కి ప్రశాంతమైన ఆనందం కలుగుతోంది. లేచి నిలబడి టెలిస్కోప్ వైపు కదిలాడు. కాసేపటిలో, చాలా దగ్గరగా, స్పష్టంగా కనిపించే నక్షత్రాల లోకంలో తప్పిపోయాడు ఆర్యన్. మరుసటి సంవత్సరం, జూలై 16, 2186న అతి సుదీర్ఘమైన సూర్యగ్రహణం ఏర్పడనున్నందున, అతను చేయవలసినవి చాలా ఉన్నాయి. నక్షత్రాలు అతనికి దగ్గరగా వచ్చేసరికి, భూమిపై ఉన్న ప్రతిదీ నేపథ్యంలోకి జారుకుంది.
🚀
శీతాకాలం లేదా ‘ద ఫ్రీజ్’ మొత్తం నగరాన్ని చుట్టుముట్టేంత తీవ్రతతో వచ్చింది. ఆకాశంలో సూర్యుడు ‘ఆరిపోతున్న నిప్పుకణిక’లా మారుతున్నాడు. ఏడాదికేడాది, చలికాలం మరింత తీవ్రంగా మారుతోంది. గత రెండు శతాబ్దాలలో, అనంతంగా చర్చించబడిన వాతావరణ మార్పు గురించి అన్ని అంచనాలు గత యాభై సంవత్సరాలలో నిజమవడం ప్రారంభించాయి. మునుపటి శీతాకాలంలో, ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఒకే రాత్రిలో గడ్డకట్టుకుపోయారు. తీవ్రమైన శీతాకాలంలో అన్ని పనులు ఇంటి నుండే చేయాలని, బయటకి వెళ్ళడాన్ని పరిమితం చేసుకోవాలని ఆదేశించాల్సి వచ్చింది. ‘ది ఫ్రీజ్’ సమయంలో సామాగ్రిని నిల్వ చేసుకున్నారు, ప్రతి సంవత్సరం – తప్పకుండా కమ్ముకొచ్చే, అన్నింటిని మంచుతో గడ్డకట్టించేసే ఆ కాలం ఎప్పుడు ముగుస్తుందా అని అందరూ ఊపిరి బిగపట్టుకుని వేచి ఉంటారు.
చీకటినిండిన శీతాకాలపు బలవంతపు ఏకాంతాన్ని, మాయ సంగీతం స్వరపరచడానికి ఎక్కువగా ఉపయోగించుకుంది. ఆమె ఇతర సంగీతకారులతో కలిసి పనిచేసి దానిని వేవ్స్ (1) పై విడుదల చేసింది. మాయ, ఆమె భర్త, కూతురు రియా – ఈ ముగ్గురు ఒకే ఇంట్లో వారి వారి గదుల్లో భద్రంగా ఉండి, ఒక విధంగా నిద్రాణస్థితిలో ఉన్న ప్రపంచంతో అనుసంధానమై పనిచేస్తారు.
గత రెండు రోజులుగా మంచు కురుస్తోంది. బయటంతా నిర్మానుష్యంగా, చలిగా, నిరుత్సాహంగా ఉంది. రియా తలుపు తట్టి, తన గదిలోకి అడుగుపెడుతున్నప్పుడు మాయ ఓ కొత్త పాటని స్వరపరుస్తోంది. మాయ కంపోజ్ చేయడం ఆపి అక్కడున్న సోఫాలో కూర్చుని, తన పక్కన కూర్చోమన్నట్టు సైగ చేసింది. రియా వచ్చి మాయ ఒడిలో తల పెట్టుకుని సోఫాలో వాలింది. సహజంగానే, మాయ ఆమె తల నిమురుతూ ఉండిపోయింది. బయట మంచుతో కప్పబడిన చీకటి ప్రకృతి దృశ్యాన్ని ఇద్దరూ చూస్తున్నారు, వదులుగా ఉన్న రియా పొడవాటి మృదువైన కాషాయ రంగు కేశాలు సోఫా పక్కకు జారిపోయాయి.
“అమ్మా, నీకు తెలుసా, బయో-ఇన్ఫోటెక్ ప్రాంతంలో, ఈ రోజుల్లో ‘మెర్జర్’ (2) గురించి చాలా చర్చ జరుగుతోంది. మన గ్రహంలో ఇలా ప్రతీ ఏడాది వచ్చే తీవ్రమైన ‘శీతాకాలం’ నుండి మానవులు బయటపడలేరని వాళ్ళు అంటున్నారు, కాబట్టి, వాళ్ళు ‘మెర్జర్’ గురించి ఆలోచిస్తున్నారు.” చెప్పింది రియా.
“మెర్జరా? అది ఏంటి? నేను వినలేదే?’ అని స్పందించింది మాయ.
ఆమె బుర్రలో, ఆమె కొత్తగా స్వరపరిచిన పాట మోగుతోంది. రియా తరచుగా మాయ గదిలోకి వచ్చి తన పని ప్రాంతంలో పుట్టుకొస్తున్న వింత ఆలోచనల గురించి చర్చించేది.
“ఇరవై ఒకటవ శతాబ్దంలో, ‘సింగ్యులారిటీ’ సాధించడానికి జనాలుఎలా కష్టపడ్డారో గుర్తుందా? వారు యంత్రాలకి చైతన్యం కలిగించేందుకు ప్రయత్నించారు. అప్పట్లో ఆ ప్రయత్నాలు సఫలం కాకపోయినా, ఆ ఆలోచన చాలా ఇతర భావనల మాదిరిగానే నిలిచి ఉంది. అమ్మా, ఒకసారి ఉద్భవించిన ఆలోచనలు ఎప్పటికీ అదృశ్యం కావు లేదా నశించిపోవు అనే దాని గురించి ఏమంటావు? ఆ ఆలోచనలు ఎప్పటికీ తిరుగుతూనే ఉంటాయి, ఎవరో ఒకరు వాటిని అందుకుంటారు, మళ్ళీ తోసిపుచ్చుతారు, మళ్ళీ చర్యలు తీసుకుంటారు – ఈ ప్రక్రియ కొనసాగుతుంది కదా.”
“సరే, ఈ ‘మెర్జర్’ విషయం ఏమిటి, రియా?” మాయ అకస్మాత్తుగా సంభాషణలో చాలా ఆసక్తిని కనబరిచింది. జీవితాన్ని దాని వాస్తవ, ఇంకా ఊహాత్మక సరిహద్దులకు మించి అన్వేషించే ఏ ఆలోచనైనా ఆమెను ఎల్లప్పుడూ ఉత్తేజపరుస్తుంది.
“ముందు, ఆలోచనలు ఎందుకు నశించిపోవో చెప్పు? నువ్వు నా జుట్టును నిమరడం మానేసి, నీ కళ్ళు పెద్దవి చేశావు.. ఉత్సాహంగా ఉన్నావు.. ఇప్పుడు నువ్వు నిజంగా నా మాటలు వింటున్నావని నాకు తెలుసు” అని రియా నవ్వింది. ఆమె చిరునవ్వు తియ్యని సంగీతంలా వినిపించింది మాయకి. గది అంతా హాయి భావన వ్యాపించింది.
“ఆలోచనలు హేతువు, పరిశీలన, ఊహ, ఇంకా అన్వేషణల కలయిక నుండి పుడతాయి. ఈ అంశాల ఆధారం మారవచ్చు, కానీ ఈ భావనలు ఎప్పటికీ అంతం కావు కాబట్టి, ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి.”
“ఆసక్తికరమైన అవగాహన. సరే, ‘మెర్జర్’ కూడా అదే విషయం అమ్మా. అది ఆ నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. మీరు మీ చైతన్యాన్ని ఒక యంత్రానికి బదిలీ చేసి శాశ్వతంగా జీవించగలుగుతారు. నన్నడిగితే ఈ ఊహే చాలా భయంకరమైనది. అసలంటూ భౌతిక శరీరం లేకపోతే మీరు చైతన్యంతో ఏం చేస్తారు? వాళ్ళు త్వరలోనే స్వచ్ఛంద సేవకుల కోసం వెతకడం ప్రారంభిస్తారని, దానిని వాణిజ్య వెంచర్‌గా మారుస్తారని చెబుతున్నారు.’
“ప్రతి ఒక్కరూ తమ చైతన్యాన్ని యంత్రాలకు బదిలీ చేస్తే, మరి ఆ యంత్రాలను ఎవరు చూసుకుంటారు రియా?” అడిగింది మాయ.
రియా లేచి కూర్చుంది. ఆమె కిటికీ దగ్గరకు నడిచి బయటి మసక వెలుతురును చూసింది.
“ఈ శీతాకాలాలు సుదీర్ఘమై, వాటి తీవ్రత పెరుగుతూ ఉంటే, యంత్రాలు మాత్రమే మనుగడ సాగిస్తాయి, అమ్మా. ఇప్పుడు మనకు కావలసింది మరొక గ్రహం. కొంతకాలం క్రితం అంచనా వేసినట్లుగా, భూగ్రహానికి రోజులు దగ్గర పడ్డాయి. నన్ను అడిగితే, పరిష్కారం ‘మెర్జర్’ కాదు, మరొక గ్రహానికి వెళ్లడమంటాను” చెప్పింది రియా.
‘మరొక గ్రహమా?’ మరొక గ్రహాన్ని కనుగొనడం గత చాలా సంవత్సరాలుగా ఆర్యన్ కల, అన్వేషణ అని మాయకు తెలుసు. మానవులు జీవించగలిగే గ్రహాన్ని కనుగొనడం కంటే అతనికి మరేమీ ముఖ్యం కాదు. అదే అతని అభిరుచి, అతని ఏకైక నిజమైన కోరిక.
“అమ్మా? నువ్వు ఏ ఆలోచనల్లోకి జారుకున్నావ్? నాన్న భోంచేశాడా?”
“ఆఁ, తిన్నారు. ‘మెర్జర్’ గురించి జరుగుతున్న పరిణామాల గురించి నాకు చెబుతూ ఉండు. ఏమో, దానిని పరీక్షించడానికి నేనే స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు!”
“పిచ్చిగా మాట్లాడకమ్మా! ఇది తెలివితక్కువ పని, పైగా భయానకంగా ఉంటుంది. అసలు నువ్వు ఎప్పటికీ యంత్రంలోనే జీవించాలని ఎందుకు అనుకుంటున్నావు?”
“రియా, జీవితం అందమైనది, కానీ చాలా చిన్నది. అందుకే దీర్ఘాయువు కోసం అంత తపన పడతారు. అమరత్వం అనేది శాశ్వతంగా పొందలేని జీవన ఫలంలా అనిపిస్తుంది.”
“దీన్ని తత్వశాస్త్రం చర్చలా మార్చద్దు అమ్మా. ‘మెర్జర్’ అంటే నువ్వు సృష్టించే సంగీతం కాదు, అది వేవ్స్ పై శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఇది నువ్వే, నీ మనసు, నీ చైతన్యం. ఊహించుకో! మా అమ్మ తన అందమైన సంగీతం, ఉత్సాహభరితమైన మనస్సుతో ఒక యంత్రంగా మారితే, నేను దానితో ఏ సంబంధం కలిగి ఉంటాను? ఇది ఆమోదయోగ్యం కాదు. దాని గురించి ఆలోచించకు” అని గట్టిగా చెప్పింది రియా.
రియా చెప్పే దానిలో కొంత లాజిక్ ఉంది. తాను దాని గురించి ఆలోచించలేదని మాయ గ్రహించింది. ఈసారి ఆర్యన్‌ని కలిసినప్పుడు దీని గురించి చర్చించాలని అనుకుంది మాయ. వారిద్దరూ ఒకరినొకరు చూసుకుని చాలా కాలం అయింది. అతని వైపు మౌనమే ఉంటే, అదొక విషయాన్ని సూచిస్తుంది – అతను తన అన్వేషణలో పూర్తిగా లీనమైపోయాడని.
“ఇవి ఉత్తేజకరమైన సమయాలు, రియా. ప్రతిచోటా చాలా జరుగుతున్నాయి. మనం జీవిత ప్రక్రియలో ఏదో ఒక పెద్ద ముందడుగు వేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. మనుషులు ఇప్పుడు క్లోన్ చేయబడుతున్నారు, యంత్రాలతో కలిసిపోతున్నారు, కొత్త గ్రహానికి వెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నారు.. ఇవన్నీ చూడటానికి మనం లేనట్లు ఊహించుకో!” అంది మాయ.
🚀
మంచుకరిగే కాలం నెమ్మదిగా మొదలైంది. నెలల తరబడి కప్పి ఉంచిన మంచు నుండి ఆకులు లేకుండా ఉన్న గోధుమరంగు చెట్ల కొనలు పైకి రావడం ప్రారంభించాయి. కొన్ని వారాల్లో, చెట్లు చిన్న రెమ్మలతో నిండిపోతాయి, తరువాత పుష్పించడం ప్రారంభమవుతుంది.
ప్రకృతి కూడా పరిస్థితులకు అనుగుణంగా మారింది. తన గమనంలో తొందరపడాలని దానికి తెలుసు.
ఆర్యన్ మాయ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమెను ఆస్ట్రోనమీ టవర్ వద్దకు రమ్మన్నాడు, ఎందుకంటే తాను కనుగొన్న దానిని మొదట ఆమే చూడాలని కోరుకున్నాడు. ఉత్తేజం కలిగించేలా చాలాసేపు స్నానం చేసి, తయారై, చేతుల్లో పొగలు కక్కుతున్న కాఫీ కప్పుతో టవర్ చుట్టూ ఉన్న గ్యాలరీ బయటకు నడిచాడు ఆర్యన్. ఆస్ట్రోనమీ టవర్ పై నుండి చూస్తే, క్రింద ఉన్న ప్రతిదీ ఒక చిన్న మోడల్ లాగా కనిపించింది. ఆకాశంలో తేలియాడే మేఘాలను చేరుకుని తాకగలనని అతనికి అనిపించింది. నారింజ రంగును వెదజల్లి సూర్యుడు అస్తమిస్తున్నాడు. మాయ వచ్చే సమయానికి, ఆకాశంలో ఆ కాంతి చూడటానికి బావుంటుంది.
మాయ – ఆమె అతని జీవితంలోకి సంగీతాన్ని తీసుకువచ్చింది, ఆమె అతని మనస్సులోని ఖాళీలను ఎప్పటికీ వదిలి వెళ్ళలేదు. ఆమె జీవితాన్ని ప్రేమిస్తుంది, అతనిని ఇష్టపడుతుంది.
ఆర్యన్ వర్క్‌స్టేషన్‌కు తిరిగి వచ్చి మాయ స్వరపరిచిన మ్యూజిక్‌ని ప్లే చేసాడు. అందమైన విశ్వంలో నిశ్శబ్దంగా ప్రతిధ్వనించే దివ్య సంగీతం అతనికి సర్వవ్యాప్తంగా అనిపించింది. విశ్వం యొక్క లయ, స్వరమేళనం అతనికి అవగతమయ్యాయి.
తన చుట్టూ ఉన్న ప్రపంచంలో మాయ సంగీతం మాత్రమే అతనితో కనెక్ట్ అయ్యింది. మ్యూజిక్ ప్లే అవుతోంది, ఆర్యన్ తన వర్క్‌స్టేషన్‌ను ఆన్ చేశాడు. అతను చాలా కాలంగా వినని పలు న్యూస్ ఛానెల్స్ ట్యూన్ చేశాడు. పట్టణంలో క్లోనింగ్ తాజా ఆసక్తి అని గ్రహించాడు. అనేక అవాంతరాల తర్వాత, ఎట్టకేలకు మానవ క్లోనింగ్ ప్రారంభమైంది. అది ప్రారంభమైన తర్వాత, క్లోన్‌లు తమ ప్రపంచాన్ని తమకు తెలిసినట్లుగా మార్చుకుంటాయి.
ఆర్యన్ వాటిని ఆపేశాడు. తెలియని భవిష్యత్తులోకి ఈ దూకుళ్ళు అతన్ని కలవరపెట్టాయి. మాయ ఈ మార్పులలో ఎందుకు ఆనందిస్తుందో అతనికి ఎప్పుడూ అర్థం కాదు. ఆమె వాటి కోసం, అవి అందించే అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఆమెకు భర్త, కూతురు ఉన్నారు, అయినప్పటికీ, ఆమె చాలా ఆనందంతో మార్పును స్వీకరిస్తోంది. మరోవైపు, తాను ఒంటరి. ఎందరో సన్నిహితమవ్వాలనుకున్నారు, కాలేకపోయారు. పిల్లలు లేరు, ఎటువంటి ముఖ్యమైన బంధాలు లేవు, అయినప్పటికీ, ఆ మార్పులు అతనికి భయానకంగా అనిపించాయి. ఆర్యన్ తెలియని విశ్వంలో చాలా దూరం వెళ్ళాడు, చేరుకోలేని నక్షత్రాల సహవాసంలో ఎన్నో రాత్రులు, పగళ్ళు గడిపాడు కానీ స్థిరంగా ఉన్నాడు. మార్పుని, అనిశ్చితిని అతను కష్టమైనవిగా భావిస్తాడు. ఈ విషయంలో మాయ అతన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు.
లిఫ్ట్ తెరుచుకుంది, మాయ టవర్ లోకి వచ్చింది. ఆర్యన్ గుండె ఒక్కసారిగా కొట్టుకుంది. చాలా రోజుల తర్వాత ఆమెను చూసినప్పుడల్లా, మాయలో ఏదో ఒకటి అతనికి అలా విశేషంగా అనిపించి, ఇలాగే అయ్యేది. చాలా సంవత్సరాల క్రితం వారు ఒకరి జీవితాల్లోకి ఒకరు ప్రవేశించినప్పటి నుండి ఇది మారలేదు. వారు తొలుత యూనివర్సిటీ కారిడార్లలో కలుసుకున్నారు, అప్పుడప్పుడు శుభాకాంక్షలు చెప్పుకునేవారు. అప్పట్లో, ఒక రోజు, ఆర్యన్ ఆమెను కాఫీకి ఆహ్వానించాడు. అంతే, అప్పట్నించి ఆమె అతని మనసులో ఒక నిర్దిష్ట స్థలాన్ని ఆక్రమించుకుంది, ఇప్పటికీ..
మాయ ఆకర్షణీయమైన దుస్తులు ధరించి ఉంది. ఆమె జుట్టు వెనక్కి ముడివేసింది. ఆమె కళ్ళు ప్రకాశవంతంగా ఉన్నాయి. హాయిగా నవ్వుతూ ఉంది. ఆమె ముఖం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది, జీవితం ఆమె కోసం తెరలు తెరుస్తున్నట్లుగా.
మాయ టెలిస్కోప్ పక్కన నిలబడి ఉన్న ఆర్యన్‍ని చూసింది. అతని సగం నెరిసిన, అణగని జుట్టు కురచగా ఉంది. ఆమెకు అది నచ్చింది. ఆ కాలంలో జుట్టు నెరవడాన్ని సహజంగా తీసుకున్న అతి కొద్దిమందిలో అతనొకడు. మార్పు అనేది ఒక ఎండమావి అని నమ్మే ఆర్యన్ కొన్ని విషయాలలో చాలా మొండిగా ఉంటాడు. నక్షత్రాలు, గ్రహాలే లోకంగా ఉండే అతన్ని – చుట్టూ మారుతున్న ప్రపంచం – బాగా కలవరపెట్టింది.
(సశేషం)
—-
ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:
(1) Waves, వేవ్స్ = ఆన్‍లైన్ రేడియో లాంటిది
(2) Merger, మెర్జర్ = మనుషులు తన చైతన్యాన్ని యంత్రాలకు బదిలీ చేసి శరీర రహితంగా సజీవంగా ఉండిపోయే ప్రక్రియ
రచయిత్రి పరిచయం:
రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
