[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[టియోనీ మాయ గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది. కల కూడా ఆమెకు మాయ గురించే వస్తుంది. మెలకువ వచ్చి, లేచి వర్క్ స్టేషన్ దగ్గర కూర్చుని, మాయని తలచుకుని తనతో మాట్లాడమని కోరుకుంటుంది. ఆమె ఆశించినట్టుగా మాయ గొంతు వినిపిస్తుంది. సీని గురించి అడుగుతుంది. క్రియేషన్ గురించి, ఇంకా ఇతర విషయాలెన్నో మాయని అడగాలనుకుంటుంది టియోనీ. తన గురించి తెలుసుకోవాలంటే తన కథ వినాలని మాయ అంటుంది. అది చెప్పే ముందుగా సీని తమకు పంపిన మ్యూజిక్ ఫైల్ లోని సంగీతాన్ని సృజించినది నువ్వేనా అని మాయని అడిగితే అవునని చెప్పి, మళ్ళీ కలుద్దామని వెళ్ళిపోతుంది. ఆ సాయంత్రం ఈవీ టియోనీ ఇంటికి వస్తుంది. కాసేపయ్యాకా, మాయ గొంతు వినిపిస్తుంది. నీ కథని పురుషులకి కూడా చెప్పావా అని అడుగుతుంది ఈవీ. పురుషులంటే ఫెన్స్‌కి అవతలి వైపు జాతి కదా అంటుంది మాయ. తన కథ మీరు అనుకునే వాళ్ళది కాదు, ఇది మనది స్త్రీపురుషులది అని అంటుంది. సీని గురించి చెప్పమని అడిగితే, మీకు ఏం కావాలో దాని గురించి ప్రశ్నలు వేయాలని చెబుతుంది మాయ. మాయ అనేది ఓ ప్రోగ్రామ్ అనే ఇంకా భావిస్తున్న ఈవీ నువ్వు క్లాష్-i కాలానికి చెందినదానివా అని అడుగుతుంది. తాను భూమికి చెందినదాన్నని మాయ చెబుతుంది. నీ అభిరుచి ఏమిటి అని టియోనీ అడిగితే, తన అభిరుచి ఆర్యన్ అని అంటుంది మాయ. వాళ్ళిద్దరూ అడుగుతుంటారు, మాయ జవాబులు చెబుతుంది. ప్రామ్‍లీ తనకి సీని పంపిన మ్యూజిక్ ఫైల్‌ని పదే పదే వింటుంది. అందులో ఏ సమాచారమూ దొరకదు. ఎనోడస్ సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తుంది. అక్కడ టియోనీ, ఈవీ, మాయల సంభాషణ కొనసాగుతుంది. ఎందుకైనా మంచిదని ఆ సంభాషణని రికార్డ్ చేస్తుంది ఈవీ. మాయ తన కథ చెప్పడం మొదలుపెడుతుంది. – ఇక చదవండి.]
అధ్యాయం-4 – మాయ కథ – 1వ భాగం
ఆర్కెస్ట్రా సంగీతం ఉప్పొంగి పతాక స్థాయికి చేరి, తీరం నుండి వెనక్కి తగ్గుతున్న అలలాగా, నెమ్మదిగా తగ్గిపోయింది. చివరి స్వరాలు కిక్కిరిసిన ప్రేక్షకులపై నుంచి ప్రవహించి ఆడిటోరియంలో తేలియాడుతుండగా, కరతాళ ధ్వనులు దూసుకొచ్చే అలలాగా పెరగసాగాయి. అలసిపోయినా, మాయ ఉత్సాహంతో ప్రేక్షకులకు అభివాదం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వివిధ పరికరాలలో, ఆ ప్రదర్శన చూస్తున్న వారికి, ఎన్నో భావాలు పలికించే మెరిసే కళ్ళతోనూ, సంతోషంతో విడివడుతున్న పెదవులతోనూ, ఆమె ఎంతో అందంగా కనబడింది. ఆమె కనుబొమపై చెమటచుక్క ముత్యంలా మెరిసింది. మాయ చీకటిగా ఉన్న ఆడిటోరియం వైపు చూస్తూ, ఈ కార్యక్రమానికి రావడానికి అతనికి సమయం దొరికిందో లేదో అనుకుంది. తన మనస్సు నుండి ఆ ఆలోచనను తొలగించుకుని, ఆ క్షణాలని ఆస్వాదించింది.
కార్యక్రమం ముగిసి, వేదికకి తెర వేయగానే, ఆమె ఎవరినీ పలకరించడానికి ఆగకుండా, ఎప్పటిలాగే డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచింది. ప్రదర్శన తర్వాత, కాసేపు ఆమెకు కాస్త ఏకాంతం అవసరం. ఇంతలో, రియా తనతో మాట్లాడాలనుకుంటున్నట్లు ఆమె చేతికి ఉన్న ట్రిన్ బ్యాండ్ (1) సంకేతాలను ఇచ్చింది. మాయ కళ్ళు మూసుకుంది. తనని ఆవరించిన అలసటని, ఉత్సాహాన్ని, కచేరీ విజయవంతం అవడంలో కలిగే సాధారణ ఆనందాన్ని మెల్లగా బయటకు పోనిచ్చింది. చివరికి, సాధారణ స్థితికి వచ్చి, మాయ డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి, ఆ ప్రదేశం నిర్మానుష్యంగా కనిపించింది. వచ్చినవారంతా వెళ్లిపోయారు; వాయిద్యాలను ప్యాక్ చేసి తదుపరి ప్రదర్శన కోసం భద్రంగా చాచిపెట్టారు. మాయ వేదికపైకి వెళ్ళి, తెరను కాస్త పక్కకు జరిపి, ఖాళీ ఆడిటోరియంను పరిశీలించింది. చీకటి, మౌనం ఆడిటోరియంను ఆవరించుకున్నప్పటికీ, తదుపరి ప్రదర్శన కోసం ఒక ఉత్కంఠ ఆ హాలు అంతటా వ్యాపించినట్లు అనిపించింది; ఆ అనుభూతి ఆమెకు నచ్చింది. తర్వాత, ఆమె వేదిక దిగి ఖాళీగా ఉన్న నడవల గుండా బయటి గేట్ వైపు నడిచింది.
మాయ బయటకు అడుగు పెట్టగానే, వాతావరణంలోని వేడిమికి ఉక్కిరిబిక్కిరి అయింది. శరదృతువు నెల అని పిలవబడే అక్టోబరులో రాత్రి 11 గంటలకు, అలాంటి ఉష్ణోగ్రత అక్కడ మామూలే. ఆమె ట్రిన్ బ్యాండ్ నుంచి తన కారుకు సందేశం పంపగా, వెంటనే కారు ఆడిటోరియం మెట్ల వరకు వచ్చింది. మాయ కారులోకి వెళ్లి కూర్చుని ‘హోమ్’ అనే బటన్ నొక్కింది. కారు ఆమె ఇంటి వైపు ప్రయాణం ప్రారంభించింది. మాయ తన సీటులో వెనక్కి వాలి, వెనక్కిపోతున్న నగరాన్ని చూడసాగింది. భరించలేని వేడి కారణంగా పాదచారులు లేని రోడ్లపై చిన్న, డ్రెవర్‍లెస్ కార్లు వేగంగా దూసుకుపోతున్నాయి. వాతావరణం మారిపోయింది, ఇంకా చెప్పాలంటే విపరీతమైన వేడితో, నిప్పుల కొలిమిలా ఉంది. కొద్దిరోజులలోనే ‘ద ఫ్రీజ్’ అని మీడియా ద్వారా ప్రసిద్ధి చెందిన శీతాకాలం రానున్నది. శీతాకాలం సుదీర్ఘంగా కొనసాగుతుంది, చాలా చల్లగా ఉంటుంది; ఉష్ణోగ్రత మరింత క్షీణిస్తుంది. వసంతకాలపు ప్రకాశం, శరదృతువులోని విచారం కనిపించకుండా పోయాయి, జనాలు వాటిని మరచిపోయారు.
ట్రిన్ బ్యాండ్ మీద రియా నుంచి మళ్ళీ బీప్ మోగింది. ఈసారి మాయ ఆ కాల్‌ని తీసుకుంది.
“నువ్వు ఇంటికి వస్తున్నావా? నేను బయటకు వెళ్తున్నాను అమ్మా, రేపు సాయంత్రానికి వస్తాను. ఈసారి తన ప్రయాణం ముగించుకుని నాన్న ఎప్పుడు ఇంటికి వస్తున్నాడు?”
రియా గొంతులోని అసనహం, కారు స్పీకర్లలో మరింత స్పష్టంగా వినిపించి, కచేరీ విజయవంతమైందన్న మాయ ఆనందపు ప్రభావాన్ని తగ్గించేసింది. రియాకు ముప్పై ఏళ్లు దగ్గర పడ్డాయి, టీనేజ్‌లో ఉంది! 2185 సంవత్సరంలో, ముప్పైల వయసు కొత్త టీనేజ్!
హైవే వెంబడి ఉన్న నియాన్ బోర్డులు ‘తొంభై కొత్త యాభై’ అనే కొత్త మంత్రాన్ని ప్రసరింపజేస్తున్నాయి. ప్రకాశవంతమైన బిల్‌బోర్డ్‌లు వయస్సు పొడిగింపు సూత్రాలను, పద్ధతులను ప్రకటిస్తున్నాయి. సంఖ్యల నిరంకుశత్వాన్ని ఓడించడం అనేది నిరంతర కొనసాగే క్రోధం. అతి త్వరలో వయస్సును భిన్నంగా లెక్కించడం ప్రారంభించాల్సి ఉంటుంది, అలాగే సంఖ్యలతో చాలా కాలంగా ఉన్న అనుబంధాలు వేరే అర్థాన్ని పొందుతాయి.
“అవును, నేను ఇంటికి వస్తున్నాను. సరే, మనం రేపు సాయంత్రం తర్వాత కలుద్దాం. నాన్న బహుశా వచ్చే వారం వస్తారు. రియా, నువ్వు వెళ్ళే ముందు ఏదైనా తిని వెళ్ళు,” అని చెప్పి, మాయ ఫోన్ ఆపేసింది.
కారు మెయిన్ అవెన్యూ నుండి మరలి, ఆమె నివాస ప్రాంతపు పక్క వీధుల్లోకి వెళ్ళగానే, ప్రకాశవంతమైన వీధి దీపాలు బాగా తగ్గాయి, ఆకాశంలో నక్షత్రాలు స్పష్టంగా కనిపించసాగాయి. ఆకాశాన్ని తాకేలా దూసుకుపోయే ఎలివేటెడ్ సూపర్-స్పీడ్ రైళ్ల వల్ల, కొన్ని చోట్ల నక్షత్రాలు కనబడవు, కానీ అయితే, ఆ రైళ్ళు వెళ్ళిపోయాక, నక్షత్రాలు ప్రకాశవంతంగా గోచరిస్తాయి.
ఈ సమయంలో అతను ఏం చేస్తూ ఉంటాడో అని తలచుకుంది మాయ. అతను నక్షత్రాలను పరిశీలిస్తూ ఉంటాడా లేదా నిద్రపోతుంటాడా? ఆమె అతనికి కాల్ చేయాలనుకుంది, కానీ ఎప్పటిలాగే సంకోచించింది.
మాయ ఇంటికి చేరుకునేసరికి అక్కడంతా చీకటిగా, నిశ్శబ్దంగా ఉంది. ఆమె వరండా వద్ద కారు దిగింది, కారు గ్యారేజ్ వైపు వెళ్ళింది. ఆమె తన రాక గురించి హౌస్ ప్యానెల్‌కు తెలియజేయడం మర్చిపోయింది; ఆమె అలా చేసి ఉంటే, లైట్లు ఆన్ అయ్యేవి, ఆహారం వెచ్చచేయబడేది, ఇంటి ఉష్ణోగ్రత సమశీతలంగా అయ్యేది. మాయ ఇంట్లోకి ప్రవేశించగానే, లైట్లు, టెంపరేచర్ ఆమె స్పెసిఫికేషన్ల ప్రకారం ఆటోమేటిక్‌గా సర్దుకున్నాయి. హెల్ప్ (2) కూడా యాక్టివేట్ అయి ఆమె భోజనం సిద్ధం చేయడం ప్రారంభించింది. ఆమెకు ఆకలిగా లేనందున ఆమె హెల్ప్‌ను డీ-యాక్టివేట్ చేసింది.
సాధారణంగా కచేరీ జరిగిన రోజున, రాత్రి పూట సంగీత సాధన చేయదామె. బదులుగా, ఆమె తన మంచం మీద పడుకుని గాజు కిటికీల గుండా రాత్రి ఆకాశాన్ని చూసింది. నక్షత్రాలతో నిండిన ఆకాశం తన మెరుపును కోల్పోతోంది. గ్రేట్ బేర్, ఓరియన్‌లను ఆమె స్పష్టంగా చూడగలిగింది. అయితే, ఆకాశంలో క్రమంగా తారలు తక్కువగా, మరింత తక్కువగా కనిపించాయి. నక్షత్రాలు, నక్షత్రరాశులు స్థిరంగానే ఉన్నాయి; కానీ భూమిపై మాత్రమే విషయాలు వేగంగా మారిపోతున్నాయి.
కొన్నిసార్లు, వారి జీవితాల్లో మార్పు వేగం చాలా తీవ్రంగా ఉండి అలసటకి గురి చేస్తోంది. ఏడు దశాబ్దాల క్రితం, యాభై సంవత్సరాలలో సాధిస్తామని వారు భావించిన మార్పులు పది సంవత్సరాలలో సంభవించాయి. మాయ యుక్తవయస్సులో ఉన్నప్పుడు, ఆయుర్దాయం దాదాపు వంద సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువగా ఉండేది. ఇప్పుడు ప్రజలు దాని కంటే రెండింతలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. జీవితాన్ని పొడిగించడం ప్రారంభించినప్పుడు, దాని చుట్టూ ఉండే నీతి గురించి, మానవాళిపై, రాబోయే భవిష్యత్తుపై దాని ప్రభావం గురించి అంతులేని చర్చలు జరిగాయి. అయితే, ప్రపంచం దానిని త్వరగానే స్వీకరించింది, ఒకరి జీవితాన్ని పొడిగించడం వారి ఉనికిలో ఒక సాధారణ భాగంగా మారింది. మరణం అయితే అలాగే ఉంది, కానీ అది ఆలస్యం కావచ్చు, భూమిపై మనుషుల కాలం పొడిగించబడింది.
కాలం వారికి మరింతగా నేర్చుకోవడానికి, మరింతగా అన్వేషించడానికి, అభిరుచులను కొనసాగించడానికి, ఇంకా మరింత ప్రేమించడానికి అవకాశం ఇచ్చింది. దాని గురించి ఆలోచిస్తూ, మాయ, ఆ చీకటిలోనే నవ్వుకుంది. అవును, సుదీర్ఘ జీవితం ఇవన్నీ చేయడానికి ఆమెకి సమయం ఇచ్చింది. అయినప్పటికీ, ఆమె ఇంకా ఎక్కువ కోరుకుంటుంది – ఎల్లప్పుడూ.
🚀
ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. చెట్లు మోడులవుతుతున్నాయి. నగరంలో కొన్ని పక్షులే మిగిలాయి, అవి కూడా తమ గూళ్ళకి తొందరగా చేరుకుంటున్నాయి. త్వరలో ‘ద ఫ్రీజ్’ అనే శీతాకాలం కమ్ముకోనుంది.
ఇంటి వెనుక భాగంలో కిటికీలు ఉన్న ఒక చిన్న గదిలో కూర్చుని, మాయ తన సంగీతంలో లీనమైంది. ‘వేవ్స్’ (3) లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోందని ఆమె ట్రిన్ బ్యాండ్ సంకేతాలను ఇచ్చింది. మాయ తన సాధనని ఆపేసి, వేవ్స్ ఆన్ చేసింది. ఈ చర్చలు ఆమెను ఆకర్షించాయి. కొన్ని విషయాల గురించి ఎడతెగకుండా, అనంతంగా; అన్ని దృక్కోణాల నుండి మాట్లాడటంలోని జనాల వ్యామోహం – చెప్పాలంటే ఆసక్తికరంగానే ఉంది. తుది ఫలితం దాదాపు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది – వారు మార్కెట్‍లోని లేటెస్ట్ అప్‌గ్రేడ్‌ను స్వీకరించారు. తాజా విషయం అయిన ‘స్ట్రక్చర్డ్ బేబీస్’ పై చర్చకి ట్యూన్ చేసింది మాయ.
“తమకు కావలసిన విధంగా, కావలసిన సంఖ్యలో సంతానాన్ని పొందడం మానవుల హక్కు. కొన్ని ప్రత్యేక లక్షణాలు, స్వభావాలు, సామర్థ్యాలు ఉన్న బిడ్డను కోరుకోవడం తప్పు అని ఎవరూ నాకు చెప్పలేరు” అని ఎవరో అంటున్నారు.
“నాకు ఎలాంటి ప్రత్యేకతలు లేని బిడ్డ కావాలి అని అనుకుందాం. పాత రోజుల్లో లాగా, నాకు కావాలి. నాకు సర్‌ప్రైజ్ ప్యాకేజీ కావాలి. నాకు ఆ హక్కు ఉంటుందా?” అని ఒక మగ గొంతు అడుగుతోంది.
ఆ ప్రశ్న విని మాయ నవ్వుకుంది. చాలా సంవత్సరాల క్రితం తనూ, తన భర్త బిడ్డను కనాలని నిర్ణయించుకున్నప్పుడు, తనకి కూడా తన బిడ్డను ఎలా రూపొందిచుకోవాలో అనే అంశంలో కొన్ని ఎంపికల అవకాశం ఉండేది. ఇప్పుడు అందుబాటులో ఉన్న వివరాలు అప్పట్లో అందుబాటులో లేనప్పటికీ, వారికి ఒక మెనూ ఇవ్వబడింది. అయితే, వారు ‘సర్‌ప్రైజ్ ప్యాకేజీ’ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు – అంటే ప్రకృతిని తన దారిలో తాను వెళ్లనివ్వాలని, పాత పద్ధతిలో బిడ్డకు జన్మనివ్వాలని.
“ఎందుకలా అనుకుంటున్నారు? నీ బిడ్డ ఎలా ఉంటుందో తెలియకపోవడాన్ని నువ్వు ఊహించగలవా?” ఎవరో భయంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు.
రియా పుట్టి, ఎదగడం లోని ఆనందాన్ని గుర్తుచేసుకుంది మాయ. రియాకి తన తల్లిలాగా సంగీతం పట్ల ఆసక్తి రాలేదు, తండ్రిలాగా క్రీడల పట్ల ప్రేమ రాలేదు. రియాకి అసహనం, కోపం, సోమరితనం వంటి గుణాలు వచ్చాయి, కానీ ఆమె పెరిగి తాను ఎంచుకున్న బయో-ఇన్ఫోటెక్ రంగంలో నిపుణురాలైంది, తన పని పట్ల చాలా మక్కువ చూపిస్తుంది.
“తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే అది ఆనందించదగిన ప్రయాణం. ముందుగానే అన్నీ తెలియని బిడ్డను పెంచడంలో థ్రిల్ ఉంటుంది,” అని తాను తరచుగా చెప్పే మాటలతో ఆ చర్చలో చేరింది మాయ.
“అది అర్థంలేనిది. శరీర నిర్మాణపరంగా చిన్నపిల్లలకు కూడా వారి స్వంత ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. మనం వారి రూపాన్ని, వారి ఆరోగ్యాన్ని, వారి సామర్థ్యాలను, అభిరుచులను, ఇంకా ఇతర చిన్న వివరాలను సరిచేయగలం, అప్పుడే వారికి స్వంత వ్యక్తిత్వం అలవడుతుంది.”
“సరే, అయితే, ఇదంతా వ్యక్తిగత ఎంపికపై ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను” అని మాయ అంగీకరించింది.
“కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ‘సర్‌ప్రైజ్ ప్యాకేజీ’ ప్రకారం బిడ్డను కనడానికి అనుమతిస్తారా? ఈ రోజుల్లో బిడ్డను పొందాలంటే ఒత్తిడి చాలా ఉంది,” అంది ఓ మగ గొంతు. అతని స్వరంలో నిజమైన ఆందోళన ధ్వనించింది.
“మీరంతా ఒక పాత విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఇప్పుడు, మానవ క్లోనింగ్ ప్రారంభమైంది కాబట్టి, సంపూర్ణ ప్రతిరూపమైన బిడ్డను కలిగి ఉండటం ఎంత ఉత్సాహంగా ఉంటుందో మనం చర్చించుకోవాలి. నాలాగే ఉండే, నాలాగే కనిపించే, నా సామర్థ్యాలు ఉండే బిడ్డ! దీనినే నేను శాశ్వతంగా జీవించడం అని అంటాను. ఇదే నిజమైన అమరత్వం, అంతే కాను అందరూ అనుకునే తెలివితక్కువ జీవిత పొడిగింపులు కాదు!” ఇంకెవరో అంటున్నారు.
ఈ చర్చ మీద ఆసక్తి పోయింది మాయకి. జీవిత పొడిగింపు, క్లోనింగ్, అమరత్వం – ఇవన్నీ వారి జీవితాల్లో తరచుగా పునరావృతమయ్యే ఇతివృత్తాలు. వాటి గురించి ఎడతెగకుండా మాట్లాడటం ఇక ఏ మాత్రం ఆకర్షణీయంగా లేదు. ఆమె ‘వేవ్స్’ని ఆపేసింది. కిటికీ దగ్గర నిలబడి, మసకబారిన సూర్యకాంతిలో, నగరాన్ని ఆలింగనం చేసుకుంటున్న ‘ద ఫ్రీజ్’ వైపు చూసింది. గోధుమరంగు ఆకులపై గడ్డకట్టిన మంచు బిందువులు, చీకటిలో వెలిగించటానికి వేచి ఉన్న చిన్న షాండిలియర్‍ల వలె కనిపించాయి. కాలిబాట మీద గడ్డి వాడిపోయి దానిపై మంచుగడ్డలు ఏర్పడుతున్నాయి. చలిగా ఉంది, నిజంగానే బాగా చలిగా ఉంటోంది. అకస్మాత్తుగా, ఆమెను కూడా ఆశ్చర్యపరిచేంత తీవ్రతతో, అతడి మిస్ అవుతున్న భావన మాయకి కలిగింది. వెంటనే అతనికి ఒక చిన్న సందేశం పంపింది.
(సశేషం)
—-
ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:
(1) Trin Band ట్రిన్ బ్యాండ్ = చేతికి ధరించే, ఫోన్‍లా ఉపకరించే ఓ పరికరం,
(2) Help, హెల్ప్ = ఇంటి పనుల్లో సాయపడే యంత్రం
(3) Waves, వేవ్స్ = ఆన్‍లైన్ రేడియో లాంటిది
రచయిత్రి పరిచయం:
రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.