Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరోహణ-12

[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[నిద్రిస్తున్న ఈవీ కలలోకి సీని వస్తుంది. తను పంపిన మ్యూజిక్ ఫైల్ గురించి అడుగుతుంది. మాయని కనుక్కునారా అని అడుగుతుంది. ఇంతలో ఈవీకి మెలకువ వచ్చేస్తుంది. మాయని వెతకమంటూ ఉల్తూర్ తనపై మోపిన బాధ్యత ఆమెను వెంటాడుతోంది. కానీ మాయ జాడలు లభించడం లేదు. ఇక ఆ అన్వేషణ కొనసాగించటం తనవల్ల కాదని ఉల్తూర్‍కి చెప్పేయాలని నిర్ణయించుకుని మళ్ళీ నిద్రపోతుంది. ఈవీతో పాటుగా ఉల్తూర్ కూడా తనదైన పద్ధతిలో మాయ గురించి వెతుకుతూ ఉంటుంది. ఆమె ప్రస్తావన ఉన్న అన్ని చోట్ల నుండి సీని జాడలు పూర్తిగా చెరిపివేయబడడం ఉల్తూర్‌కి నచ్చదు. ఇంతలో ట్యాగ్‌ చప్పుడు చేస్తూ ఈవీ పంపిన సందేశాన్ని మోసుకొస్తుంది. దాన్ని చదువుకుని ఓ పక్కన పడేస్తుంది ఉల్తూర్. మాయ గురించి ఏమైనా తెలిసిందేమో కనుక్కునేందుకు టియోనీని ట్యాగ్ చేస్తుంది. స్క్రీన్ మీద టియోనీతో పాటు తారా కనబడేసరికి ఆశ్చర్యపోతుంది. ఇరానా హబ్‌లో మాయ కోసం వెతకమని సీని చెప్పిందనీ, కానీ ఆ పేరుతో ఎవరూ అక్కడ లేరని చెప్తుంది టియోనీ. ఉల్తూర్ అలసిపోయినట్లు కనిపిస్తున్నదనీ, రెంప్లాజోకి వచ్చి, కొన్ని అవయవాల మార్పిడులు, చికిత్స చేయించుకోమని చెప్తుంది టియోనీ. టియోనీ చెప్పిన దాని గురించి ఆలోచిస్తుందిఉల్తూర్. బహుశా మాయ ద్వారా, సీని తన పనికి సంబంధించినదేదో చూపిస్తుండవచ్చని భావించి సీనీ సిస్టమ్‌ని ఆన్ చేస్తుంది. కాసేపు ఏమీ అడగకుండా ఉండిపోడంతో, సిస్టమ్ ఆమెను సీని ఎప్పుడూ వెళ్ళే పాటర్న్స్ విభాగానికి తీసుకువెళ్తుంది. మరోవైపున పురుషులని ట్రాప్ చేయడానికి క్లెపో, ప్రామ్‌లీ వేసిన పథకం విజయవంతం అవుతుంది. వచ్చి తనని నివిడమ్‌లో కలవమని క్లెపో ప్రామ్‍లీకి మెసేజ్ పంపుతుంది. తనని తాను ఉత్తేజపరుచుకోడానికి ఈవీ వాటర్ గ్లైడింగ్ స్పోర్ట్ సెంటర్‌కి వెళ్తుంది. తన అపార్టుమెంట్‍లో పనిలో ఉన్న టియోనీ, తార తనంతట తానుగా లేచి తొలి అడుగులు వేయడానికి ప్రయత్నించడం చూసి, దాన్ని రికార్డు చేస్తుంది, ఫోటోలు తీస్తుంది. – ఇక చదవండి.]

అధ్యాయం-3 – అన్వేషణ – 2వ భాగం

ప్రామ్‍లీ చాలా కాలం తర్వాత నగరంలోకి వచ్చింది. నగరపు గాలి చల్లగా ఉన్నప్పటికీ, దానిలో పల్లెటూరి పొలం సువాసన లేకపోవడం ఆమె గమనించింది. ఎత్తైన భవనాలు సూర్యరశ్మిని అడ్డుకుంటున్నాయి, షటిల్ వాహనాలలో జన సమ్మర్ధం చాలా ఎక్కువగా ఉంది. ఇరానా హబ్‌లోని ఎత్తైన కిటికీ నుండి చూస్తూ, నగరం పరుగెత్తుతుండటం గమనించింది. కిటికీ నుండి తల తిప్పి, ప్రామ్లీ తన దృష్టిని స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న సమాచారం వైపు మళ్లించింది. ఎనోడస్ నుండి వచ్చిన వివిధ నివేదికలు మెరుస్తున్నాయి, కానీ వాటిల్లో అసాధారణమైనది ఏమీ కనిపించలేదు.

ప్రామ్‌లీ తనకు, ఉల్తూర్‌కు మధ్య ఉన్న ఎన్‌క్రిప్టెడ్ ఛానెల్‌ను యాక్టివేట్ చేసింది. పురుషులకి సంబంధించి తాము తీసుకున్న చర్య గురించి ప్రామ్‌లీ ఆమెకు తెలియజేసినప్పటికీ, వారింకా మాట్లాడుకోలేదు. ప్రామ్‌లీ మళ్ళీ స్క్రీన్‌పై దృష్టి పెట్టింది. ఎన్‌క్రిప్టెడ్ ఛానెల్ లైవ్ అయింది, తెరపై ఆమె ఎదురుగా ఉల్తూర్ కూర్చుని ఉంది. ఆమె అలసిపోయినట్లు కనిపించింది, ఆమె జుట్టు ముఖానికి పక్కనే సన్నగా వేలాడుతోంది. ఉల్తూర్ ధరించిన ముదురు రంగు దుస్తులు ఆమె అపార్ట్‌మెంట్‌‌లో అలముకున్న చీకటిని ప్రతిబింబిస్తున్నాయి. అన్ని రంగులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి, కానీ అవి తమ మెరుపును కోల్పోయాయి.

“ప్రామ్‌లీ, నువ్వు నగరానికి ఎప్పుడు వచ్చావు? ఎనోడస్ తీసుకున్న చర్యలపై కౌన్సిల్‌కు వివరణాత్మక నివేదికను సమర్పించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మీటింగ్ ఏర్పాటు చేయమని అడగనా?” ఉల్తూర్ ప్రశ్నలు – నిరుత్సాహంగా భావోద్వేగం లేని స్వరంలో వెలువడ్డాయి.

“ఇంకొన్ని రోజులు ఆగండి. అంతా సిద్ధమైన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. మీరు ఇరానా హబ్‌కి రావచ్చుగా? సీని పోయిన తర్వాత మనం కలవలేదు.”

ప్రామ్‍లీ చెప్తున్నదాన్ని పట్టించుకోకుండా, “ప్రామ్‍లీ, నీకు మాయ అనే స్వరకర్త తెలుసా? సీని ఆమె గురించి నీకు చెప్పిందా?” అంటూ అడిగింది ఉల్తూర్.

ఆ ప్రశ్న వినగానే, ప్రామ్‌లీకి సీని పంపిన మ్యూజిక్ ఫైల్ గుర్తొచ్చింది. అయితే ‘మాయ’ అనే ఆ పేరు ఆమెలో ఏమీ సంచనలం కలిగించలేదు. వివరాలు కనుక్కోమని క్లెపోకి చెప్పాలని ఆమె మనసులో అనుకుంది.

“లేదు, ఉల్తూర్, నాకు మాయ ఎవరో తెలియదు. సీనీకి సంగీతంపై ఆసక్తి ఉందా? నాకు దాని గురించి ఎప్పుడూ చెప్పలేదు,” అంది. ఉల్తూర్ అలా మాట్లాడుతూనే ఉండాలని కోరుకుంది ప్రామ్‌లీ. ఉల్తూర్‌ని ఆవరించుకున్న ఆ నిశ్శబ్ద దుఃఖాన్ని చెదరగొట్టాలి.

“సరేగానీ, ప్రామ్‍లీ, వ్యవసాయం అంటే నీకింత ఇష్టమని నేనెప్పుడూ అనుకోలేదు.”

ఈ మాటలతో, ఆ ఛానెల్ కనెక్షన్ అకస్మాత్తుగా కట్ అయిపోయింది. తనకీ ఉల్తూర్‌కి మధ్య అగాధం మరింత లోతుగా మారుతోందని ప్రామ్‍లీ గ్రహించింది.

నిట్టూర్చి తన వర్క్ స్టేషన్‌కి తిరిగి వచ్చింది. ఆమె దృష్టిని ఆకర్షించే మరిన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇంతకీ మాయ ఎవరు? తన తెరపై మెరుస్తూ కనబడిన కొత్త నివేదికని చూడగానే, ప్రామ్‍లీ క్లెపోకి సందేశం పంపింది. ఆ నివేదికని చివరి వరకు ప్రాసెస్ చేసింది, తర్వాత ఆమె కిటికీ దగ్గరకు నడిచి దూరంగా ఉన్న ఫెన్స్ (1) వైపు చూసింది. ఫెన్స్‌కి అవతలి వైపున పరిస్థితులు మారసాగాయి. ఇది ఒక ముఖ్యమైన పరిణామం. వారి నెపో (2) నిల్వలు తగ్గిపోతున్నాయి. పురుషులు సంక్షోభంలో ఉన్నారు. విషయాలు తమకు అనుకూలమైన రీతిలో మారుతున్నాయి. పురుషులు తన అంచనాల ప్రకారం స్పందిస్తారని ప్రామ్‌లీకి ఖచ్చితంగా తెలుసు. దీని అర్థం ప్రాజెక్ట్ – అనుకున్న ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి. ఎటువంటి తప్పులు ఉండకూడదు, ఆలస్యం ఉండకూడదు. ఆమె వర్క్ స్టేషన్‌కి తిరిగి వచ్చి క్లెపో నుండి రావాల్సిన సమాధానం కోసం ఎదురుచూడసాగింది.

ఎన్‌క్రిప్టెడ్ ఛానెల్‌ను ఆపివేసిన తర్వాత, ఉల్తూర్ ఫెన్స్ దగ్గరకి బయలుదేరింది. అది ఆమెను నగరంలోని విశాలమైన మార్గాల గుండా, విశాలమైన పుష్పించే తోటలు – ఆకాశంలోని పొగమంచులో తప్పిపోయినట్లు కనిపించే ఎత్తైన భవనాల గుండా తీసుకెళ్లే అసంకల్పిత నడకగా మారింది. సీనీ ఏ పాటర్న్స్‌ని కనుక్కుందో అని ఆలోచిస్తూ వాక్‌వే మీద నడవసాగింది ఉల్తూర్. ఆ విషయంలో కూడా ఎటువంటి పురోగతి లేదు.

ఫెన్స్ చేరుకోగానే వాక్‌వే మీద నుంచి దిగి, సీని శవం లభించిన ప్రదేశం వైపు నడిచింది ఉల్తూర్. రంగురంగుల పువ్వులు వికసిస్తున్నాయి, గాలికి ఊగుతున్న ఆకులు ఆమెను పలకరిస్తున్నట్లు అనిపించింది. అక్కడి ప్రశాంతతలో ఏదో వంచన, నిశ్శబ్దం ఉన్నాయి. ఫెన్స్‌కి మరోవైపు సీనిని హంతకులని భావిస్తున్న పురుషులు నివసిస్తున్నారు. ఉల్తూర్ ఆ ప్రదేశానికి సమీపంలో నిలబడి ఫెన్స్‌ను సూచించే అపారదర్శక ప్రాంతాన్ని చూస్తూ ఉండిపోయింది. ఫెన్స్ దాని ప్రయోజనాన్ని బాగా నెరవేర్చింది. అది వారిని పురుషుల గురించి మరచిపోయేలా చేసింది. ప్రతిదీ సజావుగా నడుస్తోంది. అయితే, మరి ఇదెందుకు జరిగింది? తన సీనికే ఎందుకు?

కొన్ని పరిష్కారాలను కనుగొనడానికి ఫెన్స్ వద్దకు రావడం మొదలుపెట్టింది ఉల్తూర్, ఐతే ప్రతి సందర్శన తర్వాత, ఆమె మరిన్ని ప్రశ్నలతో తిరిగి వెళ్ళేది. స్త్రీలు తమ ప్రపంచాన్ని పురుషులతో ఎందుకు పంచుకోవలసి వచ్చింది? వారు అంతకు ముందు ఎన్నో జాక్‌ల (3) క్రితం అంతరిక్ష నౌకలో కలిసి వచ్చినందుకా? అసలు తొలుత భూమిని ఎందుకు పంచుకోవలసి వచ్చింది? తాము – ఒకే వనరుల కోసం పోటీ పడుతున్న రెండు విభిన్న జాతులు, అయితే, తమని కలిపింది ఏది? క్రితం సారి మొదలై, ఆగిన ఘర్షణను ఇమ ఒకేసారి ముగించబోతున్నారా? అలా జరిగితే ఎవరు గెలుస్తారు?

ఉల్తూర్ కళ్ళు మూసుకుంది. ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది.

ఆమె మళ్ళీ కళ్ళు తెరిచినప్పుడు, ఫెన్స్ యొక్క అపారదర్శక స్థలం తన మౌనం, ప్రశాంతతతో తనని ఎగతాళి చేస్తున్నట్లు ఉల్తూర్‍కి అనిపించింది. వెనక్కి తిరిగి తన అపార్ట్‌మెంట్ వైపు సుదీర్ఘ నడకను ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళాకా, అలసిపోయినట్లు అనిపించింది. బహుశా టియోని అంచనా సరైనదే కావచ్చు, తాను కొన్ని అవయవాలు మార్చుకోవాలి, చికిత్స కోసం వెళ్లాల్సి ఉందని అనుకుంది ఉల్తూర్. నెమ్మదిగా షటిల్ స్టాప్ వైపు నడిచి షటిల్‌ను ట్యాగ్ చేసింది.

అవయవాల భర్తీకి ప్రత్యామ్నాయాలు తీసుకోవడం మానేస్తే ఏం జరుగుతుంది? ఆ ఆలోచన మళ్ళీ ఆమె మనసులోకి దొంగచాటుగా ప్రవేశించింది.

షటిల్ దానిలోకి ఎక్కింది ఉల్తూర్. ఆమె తన సహ ప్రయాణీకుల వైపు చూసింది, షటిల్‌లో కూర్చున్న ఎవరైనా తమ ఉనికిని ముగించాలని ఎప్పుడైనా అనుకున్నారా అని ఆలోచిస్తూ. బహుశా, కొన్నిసార్లు?

🚀

మేము జాక్ 01 లో భూమి నుండి ఎలోన్ (4) చేరుకున్నాము. ఈ ప్రయాణం గురించి లేదా మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చిన గ్రేట్ ఎస్కేప్ గురించి పెద్దగా తెలియదు. భూమి నశించిపోతున్న గ్రహంగా మారింది, చల్లగా అయిపోయింది, విపరీతమైన వరదలు – కాలం గడిచేకొద్దీ నివాసయోగ్యత కోల్పోయింది. మమ్మల్ని తీసుకొచ్చిన అంతరిక్ష నౌక సరిగ్గా ఎక్కడ దిగిందో ఎవరికీ గుర్తులేదు. మేము విస్తరించి, గ్రహంలో పెద్ద భాగాన్ని ఆక్రమించాము. ప్రారంభంలో మా దృష్టి ప్రధానంగా నగరాలను నిర్మించడం, ఎనర్జీని నియంత్రించడం, ఎదగడం, అలాగే ఆహారాన్ని తయారు చేయడం, ఇంకా క్రియేషన్ (5) పై నిలిపాము. మేము కొంతమందే ఉన్నాము, ఈ కొత్త చోటు లోని సవాళ్లు అనేక నష్టాలకు దారితీశాయి. ప్రత్యామ్నాయాలు ఇప్పటికీ అభివృద్ధి చేయబడుతున్నాయి, కాబట్టి క్రియేషన్‍కి ప్రాధాన్యత ఇవ్వబడింది..

క్రానికల్-i ప్రారంభాన్ని ప్రాసెస్ చేస్తుండగా, తనకి ఒక ట్యాగ్ వస్తున్నట్లు గ్రహించింది ఈవీ. టియోని ఆమెకు తారా తనంతట తాను నడుస్తున్న క్లిప్‌ను పంపింది. తారా మొదటిసారిగా ఆగుతూ, నడుస్తూ అడుగులు వేయడాన్ని ఆసక్తిగా చూసింది ఈవీ. కొద్దిసేపటికి, తారా తడబడకుండా అపార్ట్‌మెంట్‌లో తిరుగడం కనబడింది. ఈవీ క్రానికల్ ప్రాసెసింగ్‌ను ఆపి టియోనికి ట్యాగ్ చేసింది. ఆమె రెంప్లాజో వద్ద ఉంది, అలసిపోయినట్లు కనిపించింది, రీప్లేస్‌మెంట్ టేబుల్ వద్ద చాలా సేపు పనిచేసిన తర్వాత ఆమె గోధుమ రంగు యూనిఫాం ట్యూనిక్ కొంతమేర చిరిగిపోయింది. తారా, టోబాట్ (6) హాప్ ఆమెతో ఉన్నారు, ఇంటికి వెళ్లడానికి వేచి ఉన్నారు.

“తారా నడవడాన్ని చూడటం చాలా బాగుంది. ఆమె చాలా బాగా పెరుగుతోంది” అని చెప్పి, కాస్తా విరామం తర్వాత, “టియోనీ, మనం మొదట ఎలోన్‌కు వచ్చినప్పటి సంగతుల గురించి ఆలోచిస్తున్నాను. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత, క్రియేషన్స్‌పై దృష్టి పెట్టాము, కానీ జాక్స్ గడిచేకొద్దీ ఆ దృష్టి మసకబారింది. లెక్కలేనన్ని జాక్స్ తర్వాత తారా వచ్చింది. అదే సమయంలో, వందలాది జాక్స్‌గా – సీని చనిపోయేంత వరకు, ఎవరూ మృత్యువు బారిన పడలేదు. ఈ రెండు అద్భుతమైన సంఘటనలు కలిసి జరగడం అద్భుతంగా లేదూ?” అంది ఈవీ.

“అవును, ఈవీ, అవి కలిసే జరిగాయి, ఫలితంగా సీనీ తారాను ఎన్నడూ కలవలేకపోయింది” అంది టియోని.  తన వర్క్‌స్టేషన్‌ను క్లియర్ చేస్తూ, “ఈవీ, నువ్వు ఎందుకు గతంలోకి వెళ్ళి వెతుకుతున్నావు? మన ఉనికి మూలాలను కనుగొనడం తన ‘అభిరుచి’ అని సీనీ ప్రకటించింది, కానీ ఇప్పుడు తనే ఉనికిలో లేదు!” అంటూ – సీనీ లేకపోవడమనే వాస్తవాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పింది టియోనీ.

“నువ్వు క్రానికల్ చదివావా?” అని అడిగింది ఈవీ, ఛానల్‌లో ఆవరించిన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ. “లేదు, నేను చదవలేదు. అయినా ఎందుకు అడుగుతున్నావు?” అంది టియోనీ.

“సీని గతం గురించి తెలుసుకోవాలని పట్టుబట్టడంతో నేను వాటిని ప్రాసెస్ చేయడం ప్రారంభించానని ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు, నాకు అవి ఆసక్తిగా అనిపిస్తున్నాయి. ఘర్షణల గురించి ప్రస్తావించేటప్పుడు క్రానికల్ పురుషుల గురించి చాలా తక్కువగా చెప్తుంది తెలుసా? వారి గురించి ఎటువంటి వివరాలు లేవు. వారు లేరని నమ్మే కళలో మనం ప్రావీణ్యం సంపాదించినట్లుగా ఉంది. కానీ వాస్తవం ఏమిటంటే వారు ఉన్నారు, పైగా నా అభిప్రాయం ప్రకారం, ఈ ఉద్దేశపూర్వకంగా విస్మరించడం మంచి ఆలోచన కాదు” చెప్పింది ఈవీ. ఆమె క్రానికల్‌ను ప్రాసెస్ చేస్తున్నప్పటి నుండి దీని గురించి ఆలోచిస్తోంది.

టియోనీ నిట్టూర్పు విడిచి కూర్చుంది. ఆమె అలసిపోయింది, ఈ విషయాల గురించి చర్చించే మూడ్‌లో లేదు.

“ఈవీ, తార సృష్టించబడిన కణ నిర్మాణం నా దగ్గర ఉంది. ఆమె పెరిగేకొద్దీ ఆమెలో అభివృద్ధి చెందే లక్షణాలను విశ్లేషించడానికి నేను దానిని ప్రాసెస్ చేయాలనుకుంటున్నాను. సీని, నేను కలిసి ఆ నిర్మాణాన్ని పరిశీలిద్దామని అనుకున్నాం. ఇప్పుడు, సీని లేదు కదా, నువ్వు నాతో చేర్తావా అని అడగాలని అనుకుంటున్నాను.’

పురుషుల గురించి తన గమనింపు పట్ల టియోనీ నుంచి ప్రతిస్పందన లేకపోవడంతో ఈవీ తన నిరాశను దాచుకుంది, “తప్పకుండా, అది ఆసక్తికరంగా అనిపిస్తోంది’ అని స్పష్టంగా చెప్పింది.

టియోనీ తన ట్యాగ్ ద్వారా ఆ నిర్మాణాన్ని ప్రాసెస్ చేయడం ప్రారంభించింది. ఈవీ ముందు ఉన్న స్క్రీన్ ఒక క్షణం చీకటిగా మారింది, తరువాత తార కణ నిర్మాణం దాని వ్యక్తిగత తంతువులుగా విడిపోవడం ప్రారంభమైంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి, టియోనీ ఈవీ ఆసక్తిగా చూస్తున్నారు. అకస్మాత్తుగా, ప్రాసెసింగ్ ఆగిపోయింది, స్క్రీన్ బ్లాంక్‍గా మారింది.

“ఏదో సమస్య ఉన్నట్లుంది, ఈవీ. చివరిసారి నేను తార సెల్ స్ట్రక్చర్‌ను ప్రాసెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఇలాగే జరిగింది” – చెప్పింది టియోనీ. స్క్రీన్ ఇంకా బ్లాంక్ గానే ఉంది, కానీ ఈవీకి వినబడిన టియోనీ మాటలు ఇవే.

హలో, సీనీ, ఎక్కడ ఉన్నావు? నీ కోసం నేను ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. అంటే, నీ జాక్స్ లో కొంత భాగం. ఆ మాటలు తెరపై హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాయి.

“ఈమె ఎవరు? సీనితో ఎందుకు మాట్లాడుతోంది, టియోనీ?” అంది ఈవీ.

“ఈవీ, మీ వైపు నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారా?” అంది టియోనీ.

ఇలా ఇద్దరూ ఒకేసారి అడిగారు.

సీనీ, టియోనీ పాప కణ నిర్మాణాన్ని విశ్లేషిస్తానని నువ్వు చెప్పావు. నేను చాలా కాలంగా నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాను. నువ్వు ఆడియోలా మార్తావా? అంటే, నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా? మాటలు తెరపైన వేగంగా దొర్లుతున్నాయి.

ఈవీ, టియోనీ ఆ పదాలను చదివి ఆశ్చర్యపోయారు, తికమక పడ్డారు. ఎలోన్‌లో ఉన్న ఒక వ్యక్తికి సీని గురించి తెలియదని భావించడం వింతగా ఉంది! భిన్నమైన భాష కూడా వారిని అయోమయంలో పడేసింది.

సీనీ, ఉన్నావా? ఎందుకు సమాధానం చెప్పడం లేదు? అని సిస్టమ్ నుంచి లోహ స్వరం వినిపించింది.

వాయిస్ గుర్తింపు కోసం లేదా ఆ సందేశాలు వస్తున్న మూలం కోసం ఈవీ సిస్టమ్‌లో వెతికింది. అది ఎవరి వాయిసో గుర్తించ లేకపోయింది. వాయిస్ ఇమేజ్‌ను రూపొందించడానికి ఈవీ ప్రయత్నించింది, కానీ సాధ్యం కాలేదు.

చివరికి, “సీని లేదు. మీరెవరు?” అని సమాధానం చెప్పాలని ఈవీ నిర్ణయించుకుంది, అదే చెప్పింది.

కొంత సేపు ఆ గొంతు స్పందించలేదు. ఆ వ్యక్తి సిస్టమ్ నుండి బయటకు వెళ్ళిపోయినట్టు అనిపించింది.

“నువ్వెవరు?” ఉన్నట్టుండి అడిగింది ఆ గొంతు. అది బిగ్గరగా, ఆజ్ఞాపించే విధంగా ఉంది. ఆ శబ్దం యొక్క ప్రతిధ్వనితో ఈవీ ఉలిక్కిపడింది. టియోనీ వైపున తార చిన్నగా ఏడవడం మొదలుపెట్టింది.

“ఏడుస్తున్నది టియోనీ కూతురేనా? ఓహ్, అలాంటి ధ్వని విని చాలా రోజులైంది. టియోనీ, ఇది నువ్వేనా? సీని ఎక్కడ ఉంది?” మళ్ళీ అడిగిందా గొంతు.

తార కణ నిర్మాణాన్ని విశ్లేషించే కార్యక్రమం ఆగిపోయింది, టియోనీ మళ్ళీ తెరపై కనిపించింది. ఆమె తారను పట్టుకుని ఉంది. ఈవీ, టియోనీలు ఒకరినొకరు పూర్తిగా గందరగోళంగా చూసుకున్నారు. ఈ గుర్తు తెలియని వ్యక్తి – సిస్టమ్ నుంచి తమని ఎందుకు గుర్తించలేకపోతోంది?

ఈవీ మళ్ళీ మాట్లాడింది, “నేను ఈవీని. వాల్ట్‌లో మేనేజర్‌ని. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, సీని లేదు, చనిపోయింది. మీరెవరు? ఎందుకో సిస్టమ్ మిమ్మల్ని గుర్తించడం లేదు.”

“నువ్వు నాకు తెలుసు. నువ్వు సీని స్నేహితురాలివి. తను చనిపోయిందా? అలా జరగకూడదు. ఇక్కడ అలా జరగదు. ఆమె ఎక్కడికైనా వెళ్ళిందా? ఆమె ఎప్పుడు తిరిగి వస్తుంది? నేను ఆమె కోసం ఎదురు చూస్తున్నాను.”

“ఆమె తిరిగి రాదు. ఆమెను చంపేశారు. అది ఒక ప్రమాదం అని అంటున్నారు.” టియోనీ గొంతులో కోపం, బాధ రెండూ కలిసిపోయాయి. ఈవీ కొంచెం ఆశ్చర్యపోయింది. సీని మరణం టియోనీపై చూపిన ప్రభావాన్ని ఈవీ అర్థం చేసుకోలేదు. కాలం గడిచేకొద్దీ, దాన్ని పట్టించుకోడం మానేసింది ఈవీ. ఇప్పుడు ఆమె దృష్టి, ఫెన్స్‌కి అవతలి వైపు ఉన్న పురుషులపై ఉంది.

‘సీని చచ్చిపోయిందా! ఏమంటున్నావు? ఇప్పుడు ఇక్కడ అలా జరగదు కదా? మరణాలు లేవు. ఆమెకు ఏమైంది?” అని ఆ గొంతు మూగబోయింది. ఈవీ గదిలో వినిపిస్తున్న ఏకైక శబ్దం తార చేస్తున్న చిన్న చిన్న చప్పుళ్ళే.

టియోనీ యాంత్రికంగా తారాను భుజం మీద వేసుకుని ఊపడం చూసింది ఈవీ. తర్వాత ఆమె తారాను కుర్చీలో కూర్చోబెట్టి, తన టోబాట్ హాప్ కలిసి వెతకసాగింది. ఆ గొంతు ఇంకా ఏదైనా చెప్తుందేమోనని వారిద్దరూ ఎదురు చూస్తున్నారు. ఆ గొంతు పలికిన కొన్ని పదాలు అర్థం కాలేదు. తర్వాత చూసుకునేందుకు ఈవీ వాటిని ఫైల్ చేస్తోంది.

“ఈవీ, ఆ పాప ఇంకా ఉందా? చిన్న చిన్న చప్పుళ్ళు వినపడుతున్నాయని అనిపిస్తోంది,” ఆ గొంతు మళ్ళీ నిశ్శబ్దాన్ని ఛేదించింది.

“నేను టియోనీ, మీరు విన్న వ్యక్తి చప్పుళ్ళు తారా చేసినవే. ఇప్పుడు, మీరు ఎవరో, సీని మీకు ఎలా తెలుసో మేం తెలుసుకోవాలనుకుంటున్నాము! తారా మూల కణాన్ని పరిశీలించాలనే మా ప్రణాళికను తాను ఎవరితోనూ పంచుకున్నట్లు సీని ఎప్పుడూ ప్రస్తావించలేదు. అలాగే, సిస్టమ్ నుండి మీరు నన్నూ, ఈవీని ఎందుకు గుర్తించలేరు?” టియోనీ తన అసహనాన్ని ఇక ఆపుకోలేకపోయింది. ఈ మిస్టరీ గేమ్ చాలా దూరం వెళ్ళింది.

“మీ ఇద్దరికీ నేను తెలుసు. నా సంగీతాన్ని మీరు ఇష్టపడుతున్నారని సీని చెప్పింది. నేను మాయను. సీని మరణం గురించి విని నాకు చాలా బాధగా ఉంది. ఇది మీకు సాధారణం కానందున, మీరిద్దరూ దీన్ని ఎలా ఎదుర్కొంటున్నారోనని నాకు ఆశ్చర్యంగా ఉంది. సీనీ వాళ్ళమ్మ ఎలా ఉంది? ఉల్తూర్ – అదే కదా ఆవిడ పేరు?” ఆ గొంతు నెమ్మదిగా మాట్లాడింది.

ఆ సమయంలో, టియోని క్యూబికల్‌లోకి ఎవరో వచ్చారు. ఆమె వెంటనే ఛానెల్ ఆఫ్ చేసింది. ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఈవీ ఖాళీ స్క్రీన్ వైపు చూస్తూనే ఉండిపోయింది. టియోనీ క్యూబికల్‌లోకి ఎవరో ప్రవేశించడం ఆమె చూసింది, ఆమె తక్షణ ప్రతిచర్యను అర్థం చేసుకుంది.

“ఉన్నారా?” అని ఖాళీ తెరను అడిగింది ఈవీ. అయితే చీకటి మాత్రమే ఆమె వైపు చూసింది, ఆమె గది నిశ్శబ్దమైపోయింది.

మాయ.

ఆ సిస్టమ్ ద్వారా మాయ తమతో సంభాషించడాన్ని ఈవీ నమ్మలేకపోయింది. ఆమె ఈవీకి తెలియని భాష మాట్లాడింది. ఆమె ఆ సిస్టమ్ లోనే ఉన్నట్లు అనిపిస్తోంది, అయినప్పటికీ ఆ సిస్టమ్ ఆమెను గుర్తించలేదు. మాయ ఎక్కడ నివసిస్తోంది? ఆమె గురించి ఎందుకు ఎవరికీ ఏమీ తెలియదు?

ఈ ప్రశ్నలన్నీ ఈవీ బుర్రలో తిరుగుతున్నాయి. ఈవీకి ఒక రకమైన ఉత్సాహం కూడా కలిగింది. మిస్టరీ కంపోజర్ దొరికింది. ఈ విషయం ఉల్తూర్‌కి చెప్పాలా వద్దా? కానీ ఆమెకు ఏం చెప్పాలి? ముందుగా మాయ గురించి మరింత తెలుసుకోవాలి అనుకుంది ఈవీ.

చాలా సేపు తన వర్క్ స్టేషన్‌లో కూర్చుని, సిస్టమ్ నుండి ఏదైనా శబ్దం వచ్చే వరకు వేచి చూసింది ఈవీ. అయితే, అక్కడ సన్నని ఝంకారం లాంటి ధ్వని మాత్రమే వినిపించింది. ఆ గొంతును యాక్సెస్ చేయడానికి, దానిని గుర్తించడానికి, ఎక్కడ నుండి వస్తోందో తెలుసుకోడానికి కూడా ప్రయత్నించింది ఈవీ, అయితే ఆమె ప్రయత్నాలన్నీ ఫలించలేదు.

సాయంత్రం గడిచి, చీకటి నగరాన్ని కమ్ముతోంది. చల్లని గాలి వీస్తోంది,  ఆకాశంలో మూడు చందమామలు మెరుస్తున్నాయి. ఓ మూలగా ఉన్న వాయునం (7) భవనం లైట్లు నెమ్మదిగా వెలుగుతున్నాయి. మాయ – అంతుచిక్కని స్వరకర్త – ఉనికిలో ఉన్నదని నమ్మలేకపోయింది ఈవీ. ఇక ఇప్పుడు దాని గురించి ఎటువంటి సందేహం లేదు. ఆమె వారి వ్యవస్థను యాక్సెస్ చేసింది. ఆమెకు తారా, ఉల్తూర్ తెలుసు.

ఉల్తూర్.. బహుశా ఉల్తూర్ చెప్పింది నిజమే కావచ్చు. సీని మృతి విషయంలో మాయ కీలకం కావచ్చు. బహుశా, మాయ, తమకి పురుషుల గురించి మరింత చెప్పగలదు. మనసులోని గజిబిజి సర్దుకోడంతో, ఈవీలో ప్రశాంతత నిండినట్లు అనిపించింది. కనీసం అంతులేని ఒక అన్వేషణ ముగిసింది.

—-

ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:

(1) Fence ఫెన్స్= సరిహద్దు

(2) Nepo, నెపో = అవయవాల భర్తీకి ఉపకరించే ఒక ఖనిజం

(3) Zacs, జాక్స్ = సంవత్సరాలు

(4) Elone, ఎలోన్ = ఒక గ్రహం

(5) Creation, క్రియేషన్ = సృష్టి, సంతానం

(6) Tobok, టోబాక్, Tobot, టోబాట్ = యంత్ర సహకారి

(7) Vayunum, వాయునం = విద్యాకేంద్రం

(మళ్ళీ కలుద్దాం)


రచయిత్రి పరిచయం:

రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.

https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.

Exit mobile version