[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[పాటిక్స్‌ని కలుసుకునేందుకు అతను రమ్మన్న ‘ది పాయింట్’ అనే చోటకి బయల్దేరుతాడు రాదుల్. ట్రావెలర్‍లో కూర్చుని ఉండగా, సైనెడ్ సమావేశంలో క్రియేషన్స్ గురించి తాను మాట్లాడదలచుకున్న అంశాలను పునశ్చరణం చేసుకుంటాడు. గమ్యం చేరాకా, ట్రావెలర్ దిగి కొంచెం ముందుకు నడిచాకా, పెద్ద తెల్లటి గోళాకారపు భవంతి కనబడుతుంది. అక్కడ నిల్చుని రాదుల్‍ని గమనిస్తున్న పాటిక్స్, అతన్ని పిలిచి, తన వైపుకి రమ్మని సంజ్ఞ చేస్తాడు. ఆ భవనం గురించి, దాని వెనుక ఉన్న చరిత్ర గురించి రాదుల్‍కి చెప్తాడు పాటిక్స్. ఎలోన్ గ్రహం మీద, ఫెన్స్‌కి అవతలి వైపు ఉంటున్న స్త్రీ జాతి గురించి ఏమనుకుంటున్నావని పాటిక్స్ అడిగితే, వాళ్ళ గురించి తనకి తెలిసినది చెప్పి, ఈ గ్రహం పురుషులకి మాత్రమే పరిమితం కావాలన్నది తన కోరిక అని చెప్తాడు రాదుల్. స్త్రీజాతి దెబ్బతీసేందుకు తన ఆలోచనలను వివరిస్తాడు. ఇదే అదనుగా భావించిన పాటిక్స్ తన దీర్ఘకాలిక లక్ష్యం కోసం రాదుల్‌ని వాడుకోదలచి, ఎలోన్‍పై క్షీణిస్తున్న నెపో నిల్వల గురించి రాదుల్‍కి చెప్తాడు. ఫెన్స్‌కి అవతలవారిలో సంభవించిన ఓ మరణానికి పురుషులు కారణమని ఎలా అనుమానిస్తున్నారో చెప్తాడు. – ఇక చదవండి.]
అధ్యాయం-3 – అన్వేషణ – 1వ భాగం
సీని ఆ గదిలోకి వచ్చి, ఈవీ వర్క్ స్టేషన్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. సాధారణంగా తనెప్పుడూ అలా చేయదు. మామూలుగా, సీని సుడిగాలిలా దూసుకొస్తుంది. లోపలికి, బయటికి తిరుగుతూ, ప్రశ్నలు వేస్తుంది, లేదా సమాచారం ఇస్తూ ఉంటుంది. సీని ఎప్పటిలాగే అందంగా, ఆకర్షణీయంగా కనిపించింది. ఆమె పొడవాటి జుట్టు వదులుగా ముడివేసి ఉంది; ఆమె ట్యూనిక్ అనేక రంగులలో పొడవుగా ఉన్న గులాబీ రంగు స్కర్ట్‌కు సరిపోతుంది. అయినప్పటికీ, ఆమె ప్రవర్తనలో ఏదో తేడా ఉంది.
“క్రానికల్ ప్రాసెసింగ్ ఎలా జరుగుతోంది? మీకు ఆసక్తికరంగా అనిపిస్తోందా?’ అడిగింది సీని.
ఈవీ తన కుర్చీలో వెనక్కి వాలి, “నేను దానిని ప్రాసెస్ చేస్తున్నాను. నేను క్రానికల్-ii తో ప్రారంభించానని నీకు తెలుసు కదా. కొన్ని విషయాలు కొత్తవి, కానీ చాలా వరకు, నాకు ఇప్పటికే తెలుసు. మొత్తం మీద, ఇది ఆసక్తికరంగా ఉంది” అని సమాధానం ఇచ్చింది.
ఈవీ ముందున్న స్క్రీన్ మొత్తం చేయాల్సిన పనితో నిండిపోయింది, పని మొదలెడదామని అనుకుంటూ, “ఈరోజు వాల్ట్‌లో ఏదైనా ప్రత్యేకంగా వెతుకుతున్నావా?” అని సీనిని అడిగింది
గాజు పలకల బయట, సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యుడి బంగారు కిరణాలు సీని ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఆమెపై ఒక కాంతిని ప్రసరింపజేశాయి. ఆమె ఈవీ వైపు చూస్తూ నిగూఢమైన రీతిలో నవ్వింది.
“ఈవీ, నేను పంపిన మ్యూజిక్ ఫైల్ మీకు నచ్చిందా?”
“అవును, నాకు అది బాగా నచ్చింది. చాలా శ్రావ్యంగా, హాయిగొలిపేలా ఉంది. అది ఎక్కడి నుండి వచ్చింది, సీనీ? ఆ సంగీతాన్ని ఎవరు కూర్చారు?”
సీని కుర్చీలోంచి లేచి, అస్తమించే సూర్యుని కాంతిని కుర్చీపై వదిలేసి, బయటకు వెళ్ళే మార్గం వైపు కదిలింది.
“మీరు ఆ కంపోజర్ కోసం వెతుకుతున్నారని అనుకుంటున్నాను, అవునా? మాయ గురించే కదూ. ఆమెను కనుగొన్నారా?” అంది. ఈవీ ఏమీ మాట్లాడకపోయేసరికి, సీని మెల్లగా గుసగుసలాడుతూ, “రండి, నేను మిమ్మల్ని ఆమె దగ్గరికి తీసుకెళ్తాను” అంటూ తలుపు వైపు తిరిగింది.
ఈవీ తన సీటులోంచి లేచి ఆమె వెంట పరుగెత్తింది కానీ అప్పటికే సీనీ కారిడార్‌లోని ఒక మలుపు తిరిగి అదృశ్యమైపోయింది. ఈవీ ఆ మలుపు వద్దకు చేరుకున్నప్పుడు, అక్కడ ఎవరూ లేరు. ఖాళీ కారిడార్ అంచున నిలబడి, ఓడిపోయినట్లు, దారి తప్పినట్లు భావించింది ఈవీ.
ఈవీకి మెలకువ వచ్చింది! ఆశ్చర్యమనిపించింది. ఎక్కడో తప్పిపోయిన భావన ఆమెని వాస్తవంలోకి తెచ్చింది. ఆమె చీకటిలోనే పడుకుని ఆ కల గురించి ఆలోచించసాగింది. అది చాలా స్పష్టంగా ఉంది, వాస్తవంలా అనిపించింది. ఉల్తూర్ తనపై మోపిన బాధ్యత – మాయ కోసం అన్వేషణ – ప్రతి కోణంలోనూ ఆమెను వెంటాడుతోంది.
పడక మీదే ఒళ్ళు విరుచుకుంది. మాయ కోసం వెతకడం అర్థరహితమైన పనిలా అనిపించింది. ఇరానా హబ్ సిస్టమ్ లోకి ప్రవేశించి, మాయ కోసం లేదా ఆమె సంగీతం కోసం రోజుల తరబడి వెతికింది ఈవీ, కానీ ఏమీ దొరకలేదు. ఓసారి ఆమెకి ఖాళీ గోడ ఎదురైంది, ఎటూ వెళ్ళడానికి లేదు. ఇక వదిలేయాలనుకుంది, కానీ పురుషులు సీనిపై ఎందుకు దాడి చేశారో తెలుసుకోవడానికి మాయ కీలకమని ఉల్తూర్ దృఢంగా నమ్మడం – అన్వేషణని కొనసాగించేలా చేసింది.
ఈవీ మళ్ళీ నిద్రలోకి జారుకుంది. అదృశ్యమైన మాయ కోసం ఇకపై ఎక్కడ వెతకాలో తనకు తెలియదని ఆమె ఉల్తూర్‌కి చెప్పేయాలని నిర్ణయించుకుంది.
🚀
భారీ వర్షం పడుతోంది. మబ్బులు కమ్మి రోజంతా చీకటిగా ఉంది, దాంతో అప్పటికే నిర్మానుష్యంగా ఉన్న వీధుల నిండా ఏదో విషాదం నిండినట్టుంది. దూరంగా ఉన్న ఒక కారిడార్‌లో ఒక షటిల్ మలుపులు తిరుగుతూ, పూర్తి శక్తితో కురుస్తున్న వర్షంతో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. విజయం సాధించిన సైన్యం తన ఆధిపత్యాన్ని ప్రకటించుకున్నట్లుగా, ఆ ప్రాంతమంతటా గాలివాన కురిసింది.
బయట గాలి ఊళలు పెడుతోంది, మందపాటి షీట్లలోకి నీరు చేరింది. కానీ లోపల, ఉల్తూర్ రంగురంగుల అపార్ట్‌మెంట్ నిశ్శబ్దంతో నిండి ఉంది. ఉల్తూర్ కూర్చున్న చోటు నుండి, బయట కదలిక -ప్రకృతి లోని మూలకాల నృత్యంలా అనిపించింది. గోడపై ఉన్న స్క్రీన్ ఎడతెగని సందేశాలతో సందడి చేస్తుండగా, ఆమె నిశ్శబ్దంగా, బయట కనిపిస్తున్న ప్రదర్శనను చూస్తోంది. ఆమె ట్యాగ్ సందేశాలతో నిండిపోయింది, కానీ ఆమె ఈవీ పంపిన వాటిని మాత్రమే చూసింది. ఇప్పటివరకు, మాయ కోసం జరుపుతున్న అన్వేషణలో ఎటువంటి పురోగతి లేదు.
ఉల్తూర్ కూడా వెతుకుతోంది. ఓపెన్ ఛానెల్స్‌ని, ఎన్‍క్రిప్టెడ్ ఛానెల్స్‌ని చూసింది, పాత కొత్త ఛానెల్స్ ద్వారా వెతికింది, కానీ మాయ అనే వ్యక్తిని పట్టుకోలేకపోయింది ఉల్తూర్. ఆమె వాల్ట్‌లోకి లాగిన్ అయి మాయ కోసం విస్తృతంగా వెతికింది. ‘మాయ’ అనే పదానికి సంబంధించిన ఏకైక ప్రస్తావన లెక్సికాన్‌లో వచ్చింది, అది ‘మాయ’ అనే పదాన్ని ‘భ్రమ’గా నిర్వచించింది. మాయను ప్రస్తావిస్తూ సీని మరెక్కడైనా సూచించిదా అని ఉల్తూర్ ఆశ్చర్యపోయింది.
రోజులు గడిచేకొద్దీ, సీని లేని లోటుని ఆమోదించడం కొంతవరకు నేర్చుకుంది ఉల్తూర్. కానీ ఆమె అంగీకరించలేకపోయిన విషయం ఏమిటంటే, ఆమె ప్రస్తావన ఉన్న అన్ని చోట్ల నుండి సీని జాడలు పూర్తిగా చెరిపివేయబడడం. ఇంట్లోనూ, ఆఫీసులోనూ సీని వర్క్ స్టేషన్‌ని పూర్తిగా శుభ్రం చేసేశారు. అసలు ఎలోన్ (1) చరిత్రలోనే, సీని ఎన్నడూ లేనట్లుగా ఉంది.
వర్షం దాదాపు ఆగిపోయింది. ఉల్తూర్ కిటికీ దగ్గరకు నడిచి, ఉదాసీనంగా అనిపిస్తున్న మబ్బులు నిండిన ఆకాశం వైపు చూసింది. ఆమెకు తీవ్ర అలసట అనిపించింది; బహుశా ఆమెకు కొన్ని అవయవాల మార్పిడి, చికిత్స అవసరం కావచ్చు. ఆమె అపార్ట్‌మెంట్ భవనం ముందు ఉన్న రహదారి పొడవుగా, అంతులేనిదిగా అనిపించింది. ఎందుకంటే అది నగర సరిహద్దుల చుట్టూ తిరుగుతుంది. అదిప్పుడు ఖాళీగా, చీకటిగా ఉంది. ఇదంతా ఎక్కడోక్కడ ముగిసిపోతుందని తెలుసుకోవడం ఎలా ఉంటుంది? ఆ ఉనికి నిరంతరాయం కాదని, అంతులేనిది కాదని తెలుసుకుంటే ఎలా ఉంటుంది? ఆమెకు – ఏవైనా ప్రత్యామ్నాయ అవయవాలు లభించడం ఆగిపోతే, ఇదంతా ఎప్పుడు ముగుస్తుంది?
టేబుల్ మీద పడి ఉన్న ఆమె ట్యాగ్ బీప్ శబ్దం చేస్తూండంతో, వింతైన వరుస ఆలోచనల నుండి ఉల్తూర్ బయటపడింది.
అది ఈవీ పంపిన సందేశం. గత కొన్ని విహాన్ (2) లుగా తనకు చెబుతున్నదే మళ్ళీ చెప్పింది.
‘మాయ అనే పేరు ఎవరి జాడ లేదు. నాకు అనిపించిన అన్ని చోట్లా వెతికాను’.
ఉల్టర్ ఆ ట్యాగ్‌ని తిరిగి టేబుల్ మీదకు విసిరేసింది. ఆమె మనసులో ఇటీవల మొలకెత్తిన ఆలోచనలను వదిలించుకోవాలనుకుంది. తను తన ఉనికిని అంతం చేసుకోవాలని ఎందుకు ఆలోచిస్తోంది? ఈ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? సీని లేకపోవడం వల్లనేనా?
ఈ ఆలోచన – స్త్రీల ఉనికికే అసహ్యంగా అనిపించిది. ఉల్తూర్ మనసులో ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి ఆలోచన రాలేదు. చేతిలో ఉన్న పనిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించింది ఉల్తూర్, అది మాయను కనుగొనడం.
మాయ గురించి, ఆమె సంగీతం గురించి కూడా టియోనికి తెలుసు కాబట్టి ఆమె టియోనికి ట్యాగ్ చేసింది. క్షణంలో, టియోని ఆమె ముందు స్క్రీన్ మీద కనిపించింది. టియోని అపార్ట్‌మెంట్ అంతా ఆమె వెనుక అపరిశుభ్రంగా, చిందరవందరగా ఉన్నట్లు అనిపించింది.
“టియోని, మాయ ఎవరో నీకు తెలుసా?” ఎటువంటి పలకరింపు లేకుండా నేరుగా అడిగింది ఉల్తూర్.
“మాయా? ఓహ్, మీరు చెప్పేది ఆ స్వరకర్త గురించే కదా. లేదు, ఉల్తూర్. ఆమెని వెతకడానికి ఈవీ ప్రయత్నించింది, కానీ దొరకలేదు. మీరు కూడా ఆమెను కనుక్కోలేకపోయారా? నాకు తెలిసినదల్లా ఆమె శ్రావ్యమైన సంగీతం కంపోజ్ చేస్తుందని మాత్రమే.” అంది టియోని.
ఆమె జవాబులను బట్టి, తమ సంభాషణను ఈవీ టియోనితో పంచుకోలేదని స్పష్టమైంది.
ఉల్తూర్ ఏదో చెప్పబోతుంటే, తారా పాకుతూ వచ్చి టియోని పాదాల వద్ద అరవడం ప్రారంభించింది. టియోని ఆమెను ఎత్తుకుని క్షమాపణ కోరుతూ ఉల్తూర్ వైపు చూసింది. ఐతే ఉల్తూర్ విస్తుపోయింది. చివరిసారిగా ఒక క్రియేషన్ (3) ని ఎప్పుడు చూసిందో ఆమెకు గుర్తులేదు. మాయను, సంగీతాన్ని వెతుకుతూ తన చుట్టూ జరుగుతున్నదంతా మర్చిపోయింది ఉల్తూర్. టియోని తార వైపు మొగ్గు చూపుతుండగా – మంత్రముగ్ధురాలిగా చూసింది ఉల్తూర్.
ఆడుకోడానికి బొమ్మలు ఇచ్చి తారాను కింద పడుకోబెట్టిన తర్వాత, టియోని మళ్ళీ మాట్లాడసాగింది. తారా ఆడుకుంటూండగా, టియోనీ స్క్రీన్ గుండా తేలియాడే అరుపులు, కిలకిలలు నిశ్శబ్దంగా ఉండే ఉల్తూర్ ఇంట్లోకి జొరబడ్డాయి.
“ఇరానా హబ్‌లో మాయ కోసం వెతకమని సీని చెప్పింది. ఆ పేరుతో ఎవరూ అక్కడ లేరు, లేదా ఎప్పుడూ అక్కడ ఉండలేదు కాబట్టి, మాయకు సీని పనితో సంబంధం ఉండవచ్చు” అంది టియోని. ఆమెకి సీని గురించి ఉల్తూర్‌తో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. ఆమె చేయగలిగినది ఇదే.
“పాప పేరేంటి? ఆమె ఎప్పుడు వచ్చింది? క్రియేషన్ ఇంకా జరుగుతోందని నాకు తెలియదు. పాపని చూస్తుంటే నేను సీనిని మా ఇంటికి తీసుకువచ్చిన కాలం గుర్తొస్తోంది. చాలా పని ఉంటుంది కదా” అంటూ ఇప్పటికీ తార వైపు చూస్తోంది ఉల్తూర్. ఆ చిన్న జీవి నుండి అద్భుతమైన శక్తి వెలువడుతోంది; వారి ఉనికిలో లేనిది ఏదో.
“తారా? అవును, ఆమెకు చాలా శ్రద్ధ అవసరం. ఇన్‍స్ట్రక్షన్ మాన్యువల్ దానికి సరిగ్గా సిద్ధం చేయదు,” అని టియోని తార వైపు చూస్తూ బదులిచ్చింది.
తర్వాత, ఉల్తూర్ వైపు తిరిగి, ఆమె ఇలా కొనసాగించింది, “మీరు అలసిపోయినట్లు కనిపిస్తున్నారు, ఉల్తూర్. రెంప్లాజోకి రావచ్చుగా! కొన్ని అవయవాల మార్పిడులు, కొద్దిగా చికిత్స చేస్తే, మీరు బాగానే ఉంటారు,” అని టియోని సూచించింది.
ఈ వ్యాఖ్య ఉల్తూర్‌ను – రంగురంగులుగా, ప్రకాశవంతంగా కనిపించడానికి ధైర్యంగా ప్రయత్నిస్తున్న ఆమె నిశ్శబ్దపు అపార్ట్‌మెంట్‌కు తిరిగి తీసుకువచ్చింది.
“టియోని, మనం అవయవాల మార్పిడికి ప్రత్యామ్నాయాల గురించి ఎప్పుడూ ఎందుకు ఆలోచించం?” అని అడిగి, నిట్టూర్చింది ఉల్తూర్.
“ప్రత్యామ్నాయాలా? సరే, ఉల్తూర్, నిజానికి, ప్రత్యామ్నాయాల కోసం చేస్తున పరిశోధన పురోగతిలో ఉంది. శరీరంలోనే అవయవాలు తమంతట తాము పునరుత్పత్తి చెందగల దశ కోసం మేము పని చేస్తున్నాం. దాంతో బయట నుంచి చేసే మార్పిడుల అవసరం ఉండదు. కానీ, దీనికి ఇంకా చాలా జాక్స్ (4) పడుతుంది. ఏమైనా, మీరు త్వరలో అవయవాల మార్పిడి కోసం రావాలి” అంది టియోని.
“అవును, నేను వస్తాను. తారను బాగా చూసుకో” అంది ఉల్తూర్. దాంతో, స్క్రీన్ పై నుంచి టియోని అదృశ్యమైపోయింది.
క్రియేషన్స్, రీప్లేస్‍మెంట్స్, ఆల్టర్నేటివ్స్, మాయ, సీని – ఇవన్నీ ఉల్తూర్ ఆలోచనా సరళిని అడ్డుకుంటున్నాయి. ‘ప్రత్యామ్నాయ వాస్తవికత లేదు’ అని ఉల్తూర్ తనకి తాను గుర్తు చేసుకుంది. రీప్లేస్‍మెంట్‍లకు ముగింపు పలకడమన్న ఆమె ఆలోచనలకు ఎలోన్‍లో స్థానం లేదు. శాశ్వతంగా ఉండటం, అజరామరంగా నిలవడం – అదే వారిని నడిపించింది. పైగా, అదే లక్ష్యం అయితే, పురుషులు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవడం తప్పనిసరి.
టియోని చెప్పిన దాని గురించి ఆలోచించింది ఉల్తూర్. బహుశా మాయ ద్వారా, సీని తన పనికి సంబంధించిన ఏదో చూపిస్తుండవచ్చు. అంతా చాలా అస్పష్టంగా, సందిగ్ధంగా ఉంది. ఉల్తూర్ వెళ్లి సీని వర్క్‌స్టేషన్‌లో కూర్చుంది. ఆమె ఇలా తరచుగా చేసేది. ఖాళీ స్క్రీన్ ఆమెను ఎగతాళి చేస్తున్నట్లు అనిపించింది. క్లీన్ చేసి, ఇన్-యాక్టివేట్ చేయబడిన సీనీ ట్యాగ్ పక్కనే పడి ఉంది.
ఉల్తూర్ ఎంప్టీ స్క్రీన్ ముందు తన చేతిని ఊపింది. అది ప్రాణం పోసుకుంది. “ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు?” అని అడిగింది.
ఉల్తూర్ అక్కడే కూర్చుంది. సీని ఇంట్లో ఉన్నప్పుడల్లా ఎప్పుడూ కూర్చునే స్థలంలో కూర్చోవడంలో ఒక వింతైన సౌకర్యం ఉంది. కొంత విరామం తర్వాత, మెషీన్ మళ్ళీ అడిగింది, “ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు?” అని.
ఉల్తూర్ నిశ్శబ్దంగా కూర్చుని కిటికీ బయట వర్షపు నృత్యాన్ని గమనిస్తూనే ఉండిపోయింది. వర్షం ఎడతెరిపి లేకుండా, భారీగా కురుస్తోంది, గాలి ఉధృతంగా వీస్తోంది. మెషీన్ అదే ప్రశ్నను రెండుసార్లు మళ్ళీ అడిగింది. కానీ ఉల్తూర్ బయట వర్షాన్ని, గాలిని గమనించడంలో లీనమైంది. అప్పుడు, అకస్మాత్తుగా మెషీన్ “మీరు ఎప్పుడూ వెళ్ళే చోటికి తీసుకెళ్తాను” అని చెప్పడం వింది ఉల్తూర్.
స్క్రీన్‌లో ‘పాటర్న్స్’ అనే పదం మెరుస్తుండటం చూసి ఉల్తూర్ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత, పాటర్న్స్‌కి సంబంధించిన అన్ని ఛానెల్స్ తెరపై కనిపించాయి. ఎలోన్‌పై పాటర్న్స్ విభాగం లోకి వచ్చే ప్రతిదాన్ని ఆ మెషీన్ కుమ్మరిస్తుండగా క్రిందికి స్క్రోల్ చేసింది ఉల్తూర్. సీని పనికి సంబంధించిన డేటా అంతా తొలగించబడినప్పటికీ, మెషీన్ కేపబిలిటీని లోని ఓ చిన్న భాగం – గుర్తుచేసుకునే సామర్థ్యం – మిగిలిపోయినట్టుంది. చివరికి, సీని దృష్టిని ఆకర్షించిన దాన్ని అనుకోకుండా, కనుక్కుంది ఉల్తూర్.
🚀
అమర్ (5) తదుపరి పంటకై విత్తడానికి భూమిని సిద్ధం చేసే పనిలో ఉండగా, ప్రామ్‍లీ పొలం మధ్యలో ఎత్తైన మంచెపై ఉన్న ఒక చిన్న గదిలో కూర్చుంది. ఆ గది నుంచి మొత్తం పొలం కనబడుతుంది. ఆమె చుట్టూ ఉన్న పొలాల్లో టోబోక్‌లు (6) బిజీగా ఉన్నాయి. వ్యవస్థ సజావుగా పనిచేస్తోంది. ఆ గదిలో బ్యాక్‍గ్రౌండ్‍లో మ్యూజిక్ ప్లే అవుతోంది. సాయంత్రం, ప్రామ్‍లీ తన చిన్న షటిల్‌లో పొలం చుట్టూ తిరుగుతుంది.
ఎన్‌క్రిప్టెడ్ ఛానెల్‌లో క్లెపో నుండి ఒక సందేశం వచ్చింది.
సమాచారం సేకరించబడింది. వారు వినగలిగేంత బిగ్గరగా శబ్దం ఉండేలా మనం నిర్ధారించాం. మిగిలిన వివరాల కోసం, బహుశా మీరు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మీ రాకని షెడ్యూల్ చేయాలి.
క్లెపో నివిడమ్‌ను విడిచిపెట్టి, ప్రధాన నిఘా మరియు పరిశోధన సంస్థ ఎనోడస్‌కు అధిపతిగా మారినప్పుడు, ప్రామ్‍లీ తాత్కాలికంగా, ఉద్యోగం మానేసి, సేద్యానికి మారింది. ఎనోడస్‌తో రిమోట్‌గా కూడా అనుసంధానించలేని వృత్తి తనకి అవసరమని అనుకుంది ప్లామ్‍లీ. దాంతో వ్యవసాయం ఉత్తమ ఎంపికగా అనిపించింది.
ఆమె తన ట్యాగ్, ఛానెల్స్ మరియు అన్ని కోఆర్డినేట్‌లను మార్చుకుంది. ఒక విధంగా, ఆమె రాడార్ నుండి విడిపోయింది. అయితే, ఓ తాత్కాలిక చర్యగా భావించిన ఈ పని – ఆస్వాదించే కార్యకలాపంగా మారింది. ప్రత్యేకమైన శబ్దాలు, విలక్షణమైన వాసనలతో గ్రామీణ ప్రాంతం ఆమెను ఆకర్షించింది. అమర్ పంట కోసం విత్తనాలు నాటడం, అవి మొలకెత్తడం, మొక్కలని పెంచడం, పైరుని కోయడం వంటి నిరంతర ప్రక్రియలు ఆమెకు తీరిక లేకుండా చేశాయి. ప్రామ్‍లీ నగరంలోకి వెళ్ళాల్సిన సందర్భాలు చాలా అరుదుగా మారాయి.
క్లెపో పంపిన సందేశాన్ని ప్రామ్‍లీ – ఉల్తూర్‌తో పంచుకుంది. కాబట్టి, ఇప్పుడు, సీని మరణంలో తాము అనుమానించబడ్డామని పురుషులకు తెలుసు. ఆమె చివరిసారిగా చాలా విహాన్‍ల క్రితం ఉల్తూర్‌తో మాట్లాడినప్పుడు, ఆమె ఒక చర్య గురించి పరోక్షంగా సూచించింది. అయితే, ఆ దురదృష్ట సంభాషణ తర్వాత ఆమె అకస్మాత్తుగా ఛానెల్‌ను ఆపివేసినప్పటి నుండి ఉల్తూర్ నుండి ఎటువంటి సమాచారం రాలేదు. బహుశా ఈ వార్త ఆమెను తిరిగి రప్పిస్తుంది.
చాలా కాలం తర్వాత, ఎనోడస్ పురుషులకు సందేశం పంపడానికి ప్రయత్నించింది. వారు అటువైపు ఉన్న వ్యక్తులతో ద్వేషం లేకుండా, పూర్తి ఉదాసీనతతో జీవించడం నేర్చుకున్నారు. కానీ ఈ లెక్కలేనన్ని గత జాక్‌ల నిశ్శబ్దం, శాంతి ప్రమాదంలో ఉన్నట్లు అనిపించింది. ఈ ఆరోపణను పురుషులు శత్రుత్వానికి చిహ్నంగా భావిస్తారని ప్రామ్‍లీకి తెలుసు. ఎదురుదాడి తప్పదు. ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా, పురుషులను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. క్లెపో చెప్పినది సరైనదే. ప్రామ్‍లీ త్వరలోనే నగరానికి వెళ్లి తమ ఆపరేషన్‌ను వేగవంతం చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్.. ప్రామ్‍లీ దాని గురించి ఆలోచించినప్పుడల్లా, ఆమెకు ఆసక్తీ, భయం రెండూ కలిగేవి.
స్త్రీలు విజయం సాధిస్తే, పురుషులు, వారి హాస్యాస్పదమైన బబుల్స్, విష్ (7) దుకాణాలు, ఫెన్స్ (8) – ప్రతిదీ అర్థరహితంగా మారిపోతుంది.
🚀
సరస్సు అలలతో వణుకుతున్నట్లు అనిపించింది. ఎదురుగా ఉన్న ఒడ్డున ఉన్న చెట్ల ప్రతిబింబాలు సరస్సులో ఊగుతున్నాయి. ఈవీ వాటర్ గ్లైడర్‌లను పాదాలకు కట్టుకుని నీటిపైకి అడుగుపెట్టింది. క్షణకాలంలో, ఆమె సరస్సు మీదుగా జారుతోంది, ఆమె రాగిరంగు జుట్టు గాలికి ఎగురుతోంది. ఒడ్డును వదిలి, ఆమె సరస్సు మధ్యలోకి వచ్చేసింది. ఆమె వేగంగా గ్లయిడ్ చేస్తున్నప్పుడు, ఆమె ముఖం మీద చల్లటి నీటి తుంపరలను చిమ్ముతున్నాయి. ఈ క్రీడలో – వేగం, గాలిల జోడీ ఈవీకి నచ్చింది. ఆమె తరచుగా పెద్ద సరస్సు వద్దకు వచ్చేది ఎందుకంటే అది వాటర్ గ్లైడింగ్‌కు అనువైనది, పైగా ఆమెకు ఇష్టమైన వాటర్ స్పోర్టింగ్ హబ్.
ఈవీ వేగం పుంజుకుంది. చెట్లు, ఇతర గ్లైడర్లు, ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం కూడా నీరు, ఇంకా గాలి సృష్టించిన పొగమంచులో కరిగిపోయినట్లు అనిపించింది. సరస్సులో రెండు రౌండ్లు తిరిగిన తర్వాత, ఈవీ వేగాన్ని తగ్గించి మధ్యలోకి వెళ్ళింది. సరస్సు ఒడ్డున ఉన్న ఇతర గ్లైడర్లు కేవలం చుక్కల వలె మెరుస్తున్నారు. ఆమెలాగే కొందరు గ్లైడర్లు మాత్రమే సరస్సు మధ్యలో తడిస్తూ, గాలి వీచడంతో వేగంగా దూసుకుపోతున్నారు. నీటిలోని అలలు ఆమె పాదాల దగ్గర చిన్న అలలుగా మారాయి, సరస్సు అంతటా విస్తరించి, విభిన్న నమూనాలను సృష్టించాయి.
ఈవీ తల అడ్డంగా ఊపుతూ మళ్ళీ వేగం పెంచింది. ఉల్తూర్ తనకు అప్పగించిన పాటర్న్స్ శోధన నుండి తప్పించుకోవడానికి ఈవీ సరస్సు వద్దకు వచ్చింది. ఆమె మ్యూజిక్ పాటర్న్స్, ఫాబ్రిక్ పాటర్న్స్, డిజైన్ పాటర్న్స్, రీప్లేస్‍మెంట్ పాటర్న్స్, క్రియేషన్ పాటర్న్స్ పై పెద్ద మొత్తంలో డేటాను పరిశీలించింది – ఆ జాబితా అంతులేనిది. ఇది వదిలేయాల్సిన, ఫలితం దక్కని శోధన. మాయ, సంగీతం, సీని, ఆమె మరణం, ఉల్తూర్ పట్టుదల – ఈవీకి ఇకపై పట్టవు. ఆమె వాల్ట్‌లో తన పని, తాను ఇష్టపడే వాటర్ గ్లైడింగ్ వంటి కార్యకలాపాల గురించి మాత్రమే ఆలోచించాలని అనుకుంది. క్రానికల్‌ను కూడా పూర్తి చేయాలని, అంతుచిక్కని పురుషుల గురించి మరింత తెలుసుకోవాలని అనుకుంది, కానీ మాయ చేసే కోసం ఈ శోధన ఆమెకు విశ్రాంతి ఇవ్వలేదు.
ఆమె ఒడ్డుకు చేరి, కొన్ని చెట్ల నీడలో ఉన్న బెంచ్ మీద కూర్చుంది. ఆమె తడిసిపోయింది, అటుగా వీస్తున్న గాలి చల్లగా అనిపించింది. ఈవీ కనుచూపు మేరలో, మిరుమిట్లు గొలిపే పసుపురంగు పువ్వుల ప్యాచ్ ఒకటి వికసించింది. ఆ పువ్వుల నుండి వస్తున్న పలచని సువాసనని మోసుకొచ్చిన సున్నితమైన గాలి ఈవీకి ప్రశాంతత కల్పించింది.
ఇక్కడ ఈవీ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా, అక్కడ టియోని తన అపార్ట్‌మెంట్‌లో తారను చూసుకుంటూ ఉంది. తారా పాకడం ప్రారంభించింది. ఫలితంగా, ఒకప్పుడు ఎంతో పరిశుభ్రంగా, ఎక్కడి వస్తువు అక్కడ ఉండే టియోని అపార్ట్‌మెంట్ ఇప్పుడు అస్తవ్యస్తంగా, గందరగోళంగా మారింది. ఆమె వస్తువులు చాలా వరకు ఎత్తైన అల్మారాల్లో పేర్చబడి ఉన్నాయి, కాబట్టి జిజ్ఞాసగల తారా చేతులు వాటిని చేరుకోలేకపోయాయి. హాప్ (టోబోట్) ను అపార్ట్‌మెంట్‌ను సర్దమని ఆదేశించింది టియోని. తారా తన చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న చిన్న వస్తువులతో ఆడుకుంటుండగా, టియోని కిటికీ దగ్గర వాలుకుర్చీలో కూర్చుంది. ఆమె దృష్టి తారాపై ఉంది, తారా అవయవాలు పెరగడం, ఆమె ఏకాగ్రత మెరుగుపడటం గమనించడం ఆసక్తికరంగా ఉంది. తారా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె అసంపూర్ణమైన మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడాన్ని టియోని ఆస్వాదించింది. తారా గిరజాల జుట్టు పెరిగి, కేశాలు ఆమె ముఖం చుట్టూ జీనోమ్ సీక్వెన్స్ లోని స్పైరల్స్ లాగా వేలాడుతున్నాయి. ఆమె నీలి కళ్ళు ప్రకాశవంతంగా ఉన్నాయి.
టియోని పాపని వాలుకుర్చీ నుండి చూస్తూ, తారా కణ నిర్మాణాన్ని తాను ఇంకా ప్రాసెస్ చేయలేదని గుర్తుచేసుకుంది. ఆమె పరిణతి చెందుతున్న కొద్దీ టియోని తారా లక్షణాలను బాగా అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. తారా బిజీగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత, టియోని తన ట్యాగ్ ద్వారా తారా కణ నిర్మాణాన్ని ప్రాసెస్ చేయడం ప్రారంభించింది. ఈ పని మొదలుపెట్టగానే, టియోని కళ్ళు మూసుకుంది, ప్రోగ్రామ్ తారా జన్యువులలోని ప్రతి పోగును విడదీయడం ప్రారంభించింది. కొద్దిసేపటి తర్వాత, టియోనికి ఏదో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యాయి. ఒక క్షణం, ప్రాసెసర్ ఖాళీగా ఉన్నట్లు అనిపించింది. వెంటనే, తారాను చూడడానికి టియోని అప్రయత్నపూర్వకంగా కళ్ళు తెరిచింది.
తారా లేచి అనిశ్చితంగా నిలబడి, టియోని కూర్చున్న కిటికీ వైపు తన మొదటి అడుగులు వేస్తోంది. ఆమె పాదాలు నెమ్మదిగా కదిలాయి, కానీ, వెంటనే దబ్బుమని నేలపై పడింది. కానీ తారా మళ్ళీ లేచి, తన పాదాలపై ఊగుతూ, ఒక అడుగు ముందు మరొక అడుగు వేసి, వాలుకుర్చీ వద్దకి చేరుకుంది. కుర్చీ అంచుని పట్టుకుని, టియోని వైపు చూసి నవ్వింది తారా. ఆమె నడవడం ప్రారంభించినప్పుడు ఆమె అవయవాలలో జరుగుతున్న అన్ని మార్పులను గమనించడం ఆసక్తికరంగా ఉంది. టియోని తన ట్యాగ్‌తో ఫోటోలను తీయడం ప్రారంభించి, మిగతావన్నీ మర్చిపోయింది.
—-
ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:
(1) Elone, ఎలోన్ = ఒక గ్రహం
(2) Vihan, Vihaan విహాన్ =ఎలోన్ గ్రహంలో ఒక వారం
(3) Creation, క్రియేషన్ = సృష్టి, సంతానం
(4) Zacs, జాక్స్ = సంవత్సరాలు
(5) Amar = శరీర అవయవాల రీప్లేస్‍మెంట్‍లో ఉపయోగపడే ఒక మొక్క
(6) Tobok, టోబాక్, Tobot, టోబాట్ = యంత్ర సహకారి
(7) Vish, విష్ = విషమయమైన పదార్థం
(8) Fence ఫెన్స్= సరిహద్దు
(మళ్ళీ కలుద్దాం)
రచయిత్రి పరిచయం:
రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.