[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[పాటిక్స్‌తో మాట్లాడేందుకు అతని ఆపీస్‌కి వస్తాడు వల్హన్. పాటిక్స్ తన పనిలో లీనమై ఉండగా, అతనితో తానేం చెప్పాలనుకున్నాడో వాటి గురించి ఆలోచిస్తాడు వల్హన్. తన పనిని ఆపి వల్హన్‍కి పలకరిస్తాడు పాటిక్స్. సైనెడ్ గత సమావేశానికి హాజరవలేదు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. వల్హన్ నేరుగా అసలు విషయానికి వస్తాడు. రాదుల్‌ని ఉనుమో పని కోసమే తెచ్చావు కదా అని అంటాడు. అతన్ని ఎంపిక చేసిన ఉద్దేశాలలో అది కూడా ఒకటి కావచ్చని అంటాడు పాటిక్స్. ప్రస్తుతం ఉనుమో ఏం చేస్తోందని అడుగుతాడు వల్హన్. అది కనుక్కుందామనే వచ్చావా లేక నాకేదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతాడు పాటిక్స్. క్షీణిస్తున్న నెపో నిల్వల గురించి, ఫెన్స్‌కి అటువైపు గైనేక్ నెపోని ఉపయోగించడం లేదని, వారు సొంతంగా ఏదైనా రెన్యూవబుల్ మెటీరియల్‍ని అభివృద్ధి చేసుకున్నట్టు అనుమానం ఉందని అంటాడు వల్హన్. అదేదో మనమూ తెలుసుకుంటే, మన శ్రమ తగ్గుతుందని చెప్తాడు. ఈ విషయంలో నీకెందుకు ఆసక్తి కలిగింది, ఇది నీ స్పెషలైజేషన్ కాదు కదా అని అడుగుతాడు పాటిక్స్. ప్రత్యామ్నాయ పదార్థాన్ని కనుక్కోడంలో ఇటీవల తాము చేసిన ప్రయత్నాలు విఫలమైనట్టు తనకు లెక్స్ ద్వారా తెలిసిందని చెప్తాడు వల్హన్. తనకి సమాచారం లేదని, ఏదైనా తెలిస్తే చెప్తానని చెప్పి తన వర్క్ స్టేషన్ లోకి వెళ్ళిపోతాడు పాటిక్స్. రాదుల్ బాధ్యతలను నిర్ణయించే ముందు కొంచెం అతన్ని గమనించమని, గైనేక్ పట్ల అతనికి తీవ్ర ఆగ్రహం ఉన్నట్లు అనిపిస్తోందని చెప్తాడు వల్హన్. వల్హన్ వెళ్ళిపోయాక తన సిస్టమ్స్, ఇంకా తనకి యాక్సెస్ ఉన్న అన్ని స్టిస్టమ్స్ లోనూ పిచ్చిగా వెతుకుతాడు పాటిక్స్. చివరికి నెపో వినియోగం, నిల్వల స్థాయి గురించి అతనికి కావల్సిన సమాచారం ఉనుమో యూనిట్‍లో దొరుకుతుంది. దాంతో పాటు మరో కీలకమైన సమాచారం.. ఫెన్స్‌కి సమీపంలో ఉండి అటువైపు మాటలని, శబ్దాలని రికార్డు చేసిం అందించే బబుల్స్ నుంచి అందిన సమాచారం.. అతనికి ఉత్సాహాన్నిస్తుంది. ‘సీని’ అనే పదం గైనేక్‍ల సంభాషణలో మళ్లీ మళ్లీ వినిపిస్తోందని అతను గ్రహించాడు. అది గైనేక్‍లో ఏదో ముఖ్యమైన విషయంగా అనిపించి, నివేదికలను మళ్ళీ ప్రాసెస్ చేస్తాడు. – ఇక చదవండి.]
అధ్యాయం-2 – క్షీణత – 5వ భాగం
తాను ప్రయాణిస్తున్న ట్రావెలర్ కిటికీ నుంచి బయటకు చూస్తున్నాడు రాదుల్. వెలుపల ఉన్న దృశ్యం అస్పష్టంగా ఉంది. నగరం వెనుకబడిపోయింది, చెట్లు, తోటలు, ప్రవాహాలు.. ఇవన్నీ కలగలిసిన దృశ్యం పలు రంగుల కలయిడోస్కోప్‌లా అనిపిస్తోంది.
‘ది పాయింట్’ అనే చోట పాటిక్స్‌ని కలవడానికి రాదుల్ అంగీకరించినప్పుడు, అది నగరం నుండి చాలా దూరంలో ఉందని అతనికి తెలియదు. లెక్స్ (1) ద్వారా ఆ చోటు ఎంత దూరంలో ఉందో, అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలిసింది. కానీ, అసలైన ప్రయాణం అంతులేనిదిగా అనిపిస్తోంది.
ప్రస్తుతం, రాదుల్ – పాటిక్స్ ఆదేశాలను ఎటువంటి సందేహం లేకుండా పాటిస్తున్నాడు, కానీ తదుపరి సైనెడ్ సమావేశం జరిగే సమయానికి, ఈ దశ ముగిసిపోతుంది.
ట్రావెలర్‍లో వెనుక వైపున ఉన్న కిటికీ దగ్గర కూర్చుని, రాదుల్ కళ్ళు మూసుకుని, తదుపరి సైనెడ్ సమావేశంలో తాను ఇవ్వాలనుకున్న ప్రసంగాన్ని రిహార్సల్ చేశాడు.
‘వాళ్ళు ప్రాణం పోసుకున్నప్పుడు, చాలా చిన్నగా ఉంటారు, అయితే, ఆ సూక్ష్మ రూపంలో కూడా, వాళ్ళు మీరు కోరుకున్నట్లుగా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు పొడవుగా, పొట్టిగా, తెల్లగా, ముదురు రంగులో, నీలి కళ్ళు లేదా గోధుమ కళ్ళు కలిగి ఉండవచ్చు. వాళ్ళు ఖగోళ శాస్త్రం లేదా గణితంలో అత్యుత్తమం కావచ్చు లేదా వంటలో కూడా ప్రావీణ్యం కలిగి ఉండవచ్చు. ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమందికి వాళ్ళు ఉన్నారని గుర్తుంది? అవును, నేను ‘క్రియేషన్స్’ (2) గురించి మాట్లాడుతున్నాను. కానీ నేను ఎప్పుడూ చూడలేదు. పైగా ఈ సైనెడ్ భవనం వెలుపల నాలాంటి వారు చాలామంది ఉన్నారని నాకు తెలుసు. కోషుమ్‌లో ఒక క్రియేషన్ ప్రతిరూపాన్ని చూసినప్పుడు, చాలా మౌలికమైనదేదో తిరస్కరించబడినట్లుగా, నాకేదో ఊహించని వింత నష్టం జరిగినట్లుగా అనిపించింది. ఎందుకు? ఎందుకంటే కొంతకాలం క్రితం, ఈ సైనెడ్‌లోని మేధావులు క్రియేషన్‌కి ఇన్‌పుట్‌గా దేనిని ఆమోదించాలనే అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చే వరకు, మనం వాటిని అనుమతించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ సమస్య గురించి మనం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు, ఎందుకంటే ఎవరూ దాని గురించి మాట్లాడరు. అందువల్ల, మారటోరియం కొనసాగుతుంది. కాబట్టి, నేను ఈ చర్చను తిరిగి అజెండా లోకి తీసుకురావాలనుకుంటున్నాను. క్రియేషన్‌పై మారటోరియం గురించి చర్చించాల్సిన సమయం ఆసన్నమైనట్టేనా?’
రాదుల్ కళ్ళు తెరిచాడు. అతను తన ప్రసంగాన్ని పరిపూర్ణంగా కంఠస్థం చేసుకున్నాడు. అది సైనెడ్ దృష్టిని ఆకర్షించడం ఖాయం. అయితే, అతను మొదటిసారి ఒక క్రియేషన్‌ని చూసినప్పుడు తన స్వీయ ప్రతిచర్య గురించి చెప్పాలనుకున్నది పూర్తిగా సరైనది కాదు. అతను ఆ చిత్రాన్ని చాలాసేపు, తీక్షణంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ చిత్రంతో తనకెటువంటి సంబంధం ఉన్నట్టనిపించలేదు, అలాగే తనకంటూ సంతానాన్ని సృష్టించాలనే కోరిక కూడా అతనికి లేదు.
క్రియేషన్ పద్ధతిని, పిండం ఎదిగి మనిషి రూపం సంతరించుకోడానికి పట్టే సమయాన్ని అతను ప్రాసెస్ చేస్తున్నప్పుడు, నిస్సహాయ జీవి రూపం అతని మనసులో మెదిలింది. సంతానం సొంతంగా, ఎవరి సహాయమూ లేకుండా జీవించడానికి దాదాపు పదిహేను జాక్‌లు (3) అవసరమని అతను తెలుసుకున్నాడు. పూర్వపు రోజుల్లో, సంతానాన్ని పోషించి, విద్యావంతులను చేసి, పెంచిన కేంద్రాలు ఉన్నాయని కూడా అతను తెలుసుకున్నాడు. తాను పెరిగిన కేంద్రం రాదుల్‌కి అస్పష్టంగా గుర్తుంది. అయితే, ఆ కేంద్రాలు ఇప్పుడు మూసివేయబడ్డాయి. క్రియేషన్‌ని ప్రారంభించడానికి ఏర్పర్చిన క్రమాన్ని తిరిగి రూపొందించాల్సిన అవసరం ఉందని అతను గ్రహించాడు.
అయితే, తానింకా క్రియేషన్‌కి సిద్ధంగా లేడని ఇమేతో రాదుల్ చెప్పడానికి అదొక్కటే కారణం కాదు. వాస్తవానికి, క్రియేషన్‌లో ఏది ఇన్‌పుట్ చేయాలో అతనికి తెలియదా? సంతానం లక్షణాలు ఎంచుకోవడం కూడా ఇంకా మొదలుపెట్టలేకపోయాడు. దాని గురించి తొలుత అస్థిరంగా, తరువాత లోతుగా ఆలోచించాడు. ఇది కీలకమైన, కఠినమైన నిర్ణయం. వ్యక్తిగతంగా అతనికి, క్రియేషన్ భారమనీ, అనవసరమనీ అనిపించింది, కానీ సైనెడ్‍లో జరిగే చర్చల్లో గైనేక్ (4) ప్రస్తావన తీసుకురావడానికి ఒక మార్గం, క్రియేషన్స్ పై మాట్లాడడం.
ట్రావెలర్ ఆగింది, మిగిలిన ఇద్దరు ప్రయాణికులు దిగిపోయారు. ఆ కొద్ది క్షణాల నిశ్శబ్దంలో, రాదుల్ ఒక సరస్సు చుట్టూ గుంపులుగా ఉన్న ఒక చిన్న ఆవాస ప్రాంతాన్ని చూశాడు. దూరంగా మాన్యుఫాక్చరింగ్ బిల్డింగ్స్ ఆకారాలు కనబడ్డాయి.
ట్రావెలర్ మళ్ళీ బయలుదేరింది, బయటి దృశ్యం మరోసారి అస్పష్టంగా మారింది.
ట్రావెలర్ వేగం పెంచుకునే కొద్దీ, బయటి ప్రకృతి దృశ్యం మారిపోతోంది. ఉన్నట్టుంది ఆకాశం కూడా మారిపోయింది. మధ్యాహ్నం సూర్యుడు తప్పుకుని దట్టమైన మేఘాలకు దారి ఇచ్చాడు. ఖాళీగా ఉన్న ట్రావెలర్‌ను వాన చినుకులు తడిపేసాయి. వర్షం ధారలుగా కురుస్తుండగా రాదుల్ తన ముఖాన్ని కిటికీకి నొక్కి ఉంచాడు. వాన ఎంత అకస్మాత్తుగా మొదలైందో, అంతే హఠాత్తుగా ఆగిపోయి మళ్ళీ సూర్యుడు కనబడ్డాడు. రాదుల్ ఇప్పటికే ట్రావెలర్‌లో చాలా సేపు గడిపాడు, అయినప్పటికీ, ప్రయాణం ముగిసినట్లు అనిపించలేదు. ఒక మెలితిరిగిన వంపు తర్వాత, ట్రావెలర్ వేగాన్ని తగ్గించసాగింది.
అతను దిగాల్సిన ‘ది పాయింట్’ వచ్చింది. రాదుల్ ట్రావెలర్ నుండి దిగి చుట్టూ చూడసాగాడు. అది సందర్శకులకు ఆసక్తికరమైన ప్రదేశంగా అనిపించింది. అక్కడున్న అన్ని చిహ్నాలు, నిర్మాణాలను చూశాకా అతనికా విషయం అర్థమైంది. అయితే, ఆ సమయంలో, అది నిర్మానుష్యంగా ఉంది. నిజానికి, జాగ్రత్తగా గమనించినట్లయితే, చాలా కాలంగా ఎవరూ ఆ ప్రదేశాన్ని సందర్శించలేదని తెలుస్తుంది. రాదుల్ ఒక ప్రవేశ ద్వారాన్ని దాటాడు. నిరాశానిస్పృహలని పెంచుతున్నట్లుగా గాలి నెమ్మదిగా వీస్తోంది. నేరుగా ముందుకు వెళ్ళిన రాదుల్ ఒక పెద్ద తెల్లటి భవనాన్ని చూశాడు. అతను నిలబడి ఉన్న ప్రదేశం నుండి, అది సాదాగా, గుండ్రంగా అనిపించింది. స్పష్టమైన పరిసరాలలో ప్రత్యేకంగా కనిపించే ఈ తెల్లటి భవనం తప్ప చుట్టుప్రక్కలంతా ఖాళీగా ఉంది. ఈ పెద్ద తెల్లటి గోళాకారపు భవంతి తప్ప అక్కడ చెట్లు, పొదలు లేదా మరే ఇతర భవనం లేవు – ఉండి ఉంటే అక్కడి నేపథ్యానికి కాస్త ఉపశమనం లభించేదేమో. దానిని పూర్తిగా చూడటానికి రాదుల్ తన తలను వెనక్కి తిప్పాల్సి వచ్చింది.
రాదుల్ ప్రవేశ మార్గంలో నడుస్తుండగా పాటిక్స్ అతడిని గమనిస్తున్నాడు. రాదుల్ తన జుట్టును కత్తిరించుకోడం గమనించి పాటిక్స్ సంతోషించాడు; ఇదివరకులా కాకుండా, ఇప్పుడతని జుట్టు మెడ పై భాగం నుంచి ఉంది. రాదుల్ వేసుకున్న లేత ఆకుపచ్చ చొక్కా, ముదురు నీలం ప్యాంటు అతనికి బాగా నప్పాయాని అనుకున్నాడు పాటిక్స్. రాదుల్ రూపురేఖలు బాగా మారిపోయాయి. అతని రూపం ఇకపై సైనెడ్‌లోని ఇతర సభ్యులను నిరాశపరచదు. రాదుల్ దగ్గరాకు రాగానే, ఆ తెల్లటి భవంతి వెనుక నుంచి పాటిక్స్ అతన్ని పిలిచాడు, “రాదుల్, ఇటు వైపు రా. ఇది పాయింట్ ముందు భాగం.”
రాదుల్ అవతలి వైపుకు నడిచాడు, అప్పుడు అర్థమైంది ఆ నిర్మాణం – నిజానికి అర్ధగోళాకారంలో ఉందని. గుండ్రని ఉపరితలంపై ఒక తలుపుకు దారితీసేలా ఐదు మెట్లని అమర్చారు. ఆ తలుపు మీద ఎలోన్ టోపోగ్రఫీ చెక్కబడి ఉంది – పర్వతాలు, నదులు మరియు సముద్రాలు, అన్నీ స్వచ్ఛమైన తెల్లటి రంగులో చెక్కబడ్డాయి. మధ్యాహ్నం సూర్యకాంతిలో ఆ భవనం వెలుగు కళ్ళను కట్టిపడేస్తోంది.
“నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావా? ఇది దేనిని సూచిస్తుందో నీకు తెలుసా?” అని పాటిక్స్ అడిగాడు.
“లేదు, నేను రాలేదు. నిర్మానుష్యంగా ఉన్న పరిసరాలను చూస్తుంటే, చాలా కాలంగా ఇక్కడికి ఎవరూ రాలేదని తెలుస్తోంది. అవునా?”
“రా, చెట్టు కింద ఉన్న ఆ స్టూల్స్ మీద కూర్చుందాం, అక్కడ నుండి ఈ భవంతిని మనకి పూర్తిగా కనబడుతుంది,” అంటూ అటు వైపు నడిచాడు పాటిక్స్.
సూర్యకాంతిలో స్నానిస్తున్న ఆ తెల్లటి నిర్మాణాన్ని చూస్తూ కూర్చున్నప్పుడు, అది చాలా బోసిగా ఉందని రాదుల్ భావించాడు. దాని చుట్టూ సంపూర్ణ నిర్లక్ష్యం ఆవరించి ఉంది. పాటిక్స్ సంభాషణ మొదలుపెడతాడేమోనని వేచి చూస్తున్నాడు రాదుల్. అందరూ దాదాపుగా మరచిపోయిన ఈ నిర్మాణం వద్దకి పాటిక్స్ తనని రప్పించడానికి ఏదో ఒక కారణం ఉంటుందని అతనికి తెలుసు.
ఆ భవంతి వైపు శ్రద్ధగా చూస్తూ, పాటిక్స్ సంభాషణ ప్రారంభించాడు, “మనం ఎన్నో జాక్‌ల క్రితం భూమి నుండి ఇక్కడికి వచ్చిన సమయాన్ని గుర్తుచేసుకోవడానికి ఇది స్మారక చిహ్నం. గత యుద్ధం తర్వాత దీనిని ఏర్పాటు చేశారు. దీనిని ‘పాయింట్’ అంటారు, కానీ వాస్తవానికి, మనం దిగిన స్థానం ఇది కాదు. నిజానికి, ఆ ఖచ్చితమైన స్థానం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు!”
రాదుల్ దానిని మళ్ళీ ఆసక్తితో చూశాడు.
“అందుకే ఇది అర్ధగోళంలా నిర్మించబడింది. ఇది మనం నివసించే ఎలోన్ (5) యొక్క సగభాగాన్ని సూచిస్తుంది,” అంటూ పాటిక్స్ కొనసాగించాడు. అయితే రాదుల్ ఆ స్మారక చిహ్నాన్ని తీక్షణంగా చూడసాగాడు.
“అది సరే, కానీ ఐదు మెట్లు ఎందుకు ఉన్నాయి?”
ఈ సమావేశానికి అసలు కారణం ఎప్పుడు వెల్లడవుతుందో అని ఆలోచిస్తూ రాదుల్ పరిసరాలను గమనించాడు.
పాటిక్స్ ఏదో ఒక లక్ష్యం కోసం పని చేస్తున్నాడు, అందులో రాదుల్ కూడా ఖచ్చితంగా ఉన్నాడు. తను కూడా ఆ ప్రణాళికలో ఒక భాగమని రాదుల్ గ్రహించాడు. పాటిక్స్ ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి అతను ఓపిక పట్టాలి.
“మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చిన అంతరిక్ష నౌక నుంచి నేల మీద దిగడానికి ఐదు మెట్లు ఉన్న నిచ్చెన ఉందని మాకు తెలుసు. మేము అంతరిక్ష నౌకలో ఇక్కడికి గైనేక్‌తో కలిసి వచ్చాము, తరువాత విస్తరించాము.” అంటూ చెప్పడం ఆపాడు.
కొంత విరామం తర్వాత, పాటిక్స్ “రాదుల్, గైనేక్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు?” అని అడిగాడు.
బూడిద రంగు గాజు కళ్ళతో స్మారక చిహ్నాన్ని చూస్తున్న పాటిక్స్ వైపు చూశాడు రాదుల్. అతని ముఖంలో కోరిక, అసహనం, ఆశయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాటిక్స్ కూడా గైనేక్ గురించి ఆలోచిస్తున్నాడని, వారి ఉనికి తనలాగే, అతన్ని కూడా ఇబ్బంది పెడుతోందని రాదుల్ గ్రహించాడు.
తాను కోషుమ్‌లో గడిపిన రాత్రిని గుర్తు చేసుకున్నాడు రాదుల్. అతను విన్న చాలా విషయాలకు కోషుమ్ ఒక రూపుని, చిత్తరువుని ఇచ్చింది. గైనేక్ గురించి చెప్పినప్పుడల్లా, ఆ గైనేక్‌ను సారాంశంలో ప్రస్తావించారు. వారికి సంబంధించిన ఎటువంటి చిత్రాలు లేవు. అతను మొదటిసారి గైనేక్ చిత్రాన్ని చూసినప్పుడు, వారు పురుషులను పోలి ఉండటం చూసి రాదుల్ ఆశ్చర్యపోయాడు. తమలాగే, వారికి రెండు కాళ్ళు, రెండు చేతులు ఉన్నాయి, వారు కూడా నిటారుగా నడుస్తున్నారు. అతను గుర్తించగలిగిన ఏకైక తేడా ఏమిటంటే, పురుషులకు లేని విధంగా వారి ఎద భాగంలో కొంత పెరుగుదల ఉంది. చాలావరకు వారు కేశాలని పొడవుగా పెంచుకున్నారు, వారి దుస్తులు ప్రత్యేకంగా ఉండేవి. గైనేక్ మోకాళ్ల వరకు పొడవైన చొక్కాలు ధరించారు, వదులుగా ఉండే ప్యాంటు లేదా తేలియాడే దుస్తులు వేసుకున్నారు. వారి దుస్తులు, మగవారి దుస్తుల్లా కాకుండా రంగురంగులుగా, రకరకాల డిజైన్స్‌లో ఉంటాయి. కానీ గైనేక్‌కీ, పురుషులకీ మధ్య సారూప్యత ఉండడం రాదుల్‌ను ఆశ్చర్యపరిచింది. అతను మరింత లోతుకి వెళ్ళేందుకు ప్రయత్నించాడు. కానీ వారు తమ వైపు ఎలా జీవిస్తున్నారు లేదా వారు ఫెన్స్ (6) ని హద్దుగా చేసుకుని ఎందుకు వేరుగా ఉంటున్నారు అనే దాని గురించి చాలా వివరాలు అందుబాటులో లేవు. నిజానికి, వారు పురుషులకి అంత భిన్నంగా ఉన్నట్టు అనిపించలేదు.
“వాళ్ళు వేరే జాతి అని నేను ఎప్పుడూ అనుకునేవాడ్ని పాటిక్స్. కానీ వాళ్ళు మనకంటే మరీ భిన్నంగా కనిపించడం లేదని ఈమధ్యే అర్థమైంది. వాళ్ళకి కూడా మనలాంటి ఉనికి ఉన్నట్లు అనిపిస్తుంది. వాళ్ళు మనలాగే నడుస్తారు, తింటారు, నిద్రపోతారు, సూర్యుని మార్గాన్ని అనుసరిస్తారు. పాటిక్స్, భూమిపై వాళ్ళతో మనం ఎలా జీవించామో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించాను, కానీ కోషుమ్ మనం ఇక్కడికి వచ్చినప్పటి నుండే ప్రారంభమవుతుంది. మేము సాధారణ అంతరిక్ష నౌకలపై వచ్చామని నాకు తెలుసు, కానీ వెంటనే వేర్వేరు ప్రాంతాలను తీసుకున్నాము. వచ్చినప్పటి నుండి ఒకరితో ఒకరం ఘర్షణ పడుతూనే ఉన్నాము. ఫెన్స్ ఏర్పడిన తర్వాత మాత్రమే కొంత శాంతి చేకూరింది. వాళ్ళు మన గ్రహంలో సగం ఆక్రమించారని నాకు తెలుసు. మనలా కాకుండా, వారు క్రియేషన్స్ ఆమోదించి, సంతానాన్ని పొందుతున్నారని కూడా నాకు తెలుసు.”
పాటిక్స్ అతని మాటలు జాగ్రత్తగా విన్నాడు. రాదుల్ తనను తాను మెరుగుపరుచుకుంటున్నాడనేది స్పష్టమవుతోంది. అతను ఇదే మార్గంలో కొనసాగితే, ప్రస్తుత పరిస్థితుల్లో అతను యోగ్యమైన అభ్యర్థిగా మారతాడు.
“ఏమన్నావ్ రాదుల్, ‘మన’ గ్రహమా? ఎలోన్ గైనేక్‌కి కూడా చెందినది కదా?” అడిగాడు పాటిక్స్.
ఈ సంభాషణ ముఖ్యమైనదని రాదుల్‌కు తెలుసు. కాబట్టి తగిన ప్రతిస్పందనను రూపొందించడానికి సమయం తీసుకున్నాడు. ఆ వాతావరణమే దానిని సూచించింది.
“ప్రస్తుతం మనమందరం ఎలోన్‌ను పంచుకుంటున్నాము, కానీ చివరికి అది వారిది లేదా మనది అవ్వాలి. పాటిక్స్, వాళ్ళు క్రియేషన్ ద్వారా వారి సంఖ్యను పెంచుకుంటున్నారు. మనమలా చేయడం లేదనే వాస్తవం చెప్పడం కొంచెం బాధగా ఉంది. సైనెడ్ తదుపరి సమావేశంలో క్రియేషన్స్ పై విధించిన మారటోరియం గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. మనం మారటోరియంని తొలగించి, మన సంఖ్యలను కూడా పెంచడానికి మళ్ళీ క్రియేషన్‌ని ప్రారంభించాలి”, అని జవాబిచ్చాడు రాదుల్. కొన్ని క్షణాల తరువాత, సంకోచంగా, “నేను ఎలా ప్రారంభించాలనుకుంటున్నానో ముందు మీకు చెప్పాలా?” అని అడిగాడు. క్రియేషన్ సమస్యకు పాటిక్స్ ఎలా స్పందిస్తాడో చూడాలనుకున్నాడు.
“సైనెడ్ ఏం చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు, రాదుల్? వాళ్ళు మారటోరియం తొలగిస్తారని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళు అలా చేసినా, ఈ గ్రహం మనది ఎలా అవుతుంది?”
పాటిక్స్ లక్ష్యం గురించి తనకు కాస్త గ్రహింపు వచ్చిందని రాదుల్ అనుకున్నాడు.
“ఎలా అంటే, మన దగ్గర తగినంత సంఖ్యాబలం ఉంటే, మనం వాళ్ళని ఒకే దెబ్బతో వదిలించుకోవచ్చు..” అని చెప్తూ, పాటిక్స్‌కు తదుపరి ప్రణాళిక ఉందా అని ఆశ్చర్యపోయాడు రాదుల్.
సూర్యుడు అస్తమిస్తున్నాడు, తెల్లటి ఆ స్మారక భవనంపై నారింజ రంగును ప్రసరింపజేస్తున్నాడు.
తానేం చేయాలని పాటిక్స్ అనుకుంటున్నాడో, అది తనకి చెబుతాడని రాదుల్ ఆశించాడు. నగరానికి తిరిగి వెళ్ళడానికి చాలా దూరం ప్రయాణం చేయాలి. ఇంటికి చేరుకునే సమయానికి చీకటి పడిపోతుంది. అయితే, పాటిక్స్ అసలు విషయానికి వచ్చే వరకు అతను నిశ్శబ్దంగా వేచి ఉన్నాడు.
“కానీ, అసలు పురుషులే దెబ్బతీయాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? వాళ్ళు ‘పాయింట్’ను సందర్శించడం కూడా మానేశారు. ఇది మన సగం ఉనికిని నిరంతరం గుర్తుచేసే విధంగా రూపొందించబడింది. కానీ ప్రతి ఒక్కరూ – అన్నిటినీ ఉన్నదున్నట్టుగా ఉంచేందుకు ఆమోదించారు. మనం గైనేక్ కంటే సంఖ్యలో ఎక్కువగా ఉంటే, పురుషులు చర్య తీసుకోవడానికి అంగీకరిస్తారని నువ్వు అనుకుంటున్నావా? లేదు, రాదుల్, లేదు.. ఒక నిర్దిష్ట కారణం ఉంటే తప్ప – ఈ సంధిని ముగించడానికి ఇరువైపులా ఎవరూ కోరుకోరు.”
ఊపిరి తీసుకునేందుకా అన్నట్లు, కొన్ని క్షణాలు ఆపాడు పాటిక్స్. కానీ వాస్తవానికి, అతను రాదుల్ ప్రతిచర్యను అంచనా వేయాలనుకున్నాడు. అతను నిర్ణయాత్మకంగా ఇలా అన్నాడు, “నువ్వు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటే నేను నీకు ఒక కారణం చెప్పగలను” అంటూ ఎర వేశాడు. ఇప్పుడు, ఇదంతా రాదుల్ మీద ఆధారపడి ఉంది. అతను ఎలా స్పందించాడనేది అతను సరైన ఎంపికనా లేదా పాటిక్స్ వేరొకరి కోసం వెతకాల్సి వస్తుందా అని నిర్ణయిస్తుంది; ఈ మొత్తం ఆపరేషన్‌కు ముఖంగా మారే వ్యక్తి, వేదికపై ఉండే వ్యక్తి అయితే, అన్ని తీగలను కదుపుతున్న వ్యక్తి పాటిక్స్, నేపథ్యంలో సురక్షితంగా దాగి ఉంటాడు.
రాదుల్ నారింజ రంగులో మసకబారిన ఆ నిర్జనమైన తెల్లని భవంతిని చూశాడు. వీటన్నిటిలో చిక్కుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడా? ఆ అర్ధగోళం సంపూర్ణ గోళంగా మారాలని అతను కోరుకుంటున్నాడా? పాటిక్స్ తనకు అందిస్తున్న అవకాశాన్ని స్వీకరించడానికి తను సిద్ధంగా ఉన్నాడా? కోషుమ్‌లోకి ప్రవేశించే ముందు ఇమే తన వీపును తనకు వ్యతిరేకంగా ఉంచి కూర్చున్నట్లు, తన ఇరుకైన సమూహ గృహంలోకి ప్రవేశించే ముందు తన వణుకును రాదుల్ గుర్తు చేసుకున్నాడు – ఇది ప్రతిదాన్నీ మార్చగలదు. పాటిక్స్ అడుగుతున్న దానిలో అవకాశాల సముద్రమే ఉంది.
“ఈ గ్రహం మనదే, అంటే పురుషులదే పాటిక్స్. మనం ఈ అర్ధ గోళాన్ని సంపూర్ణ గోళంగా మార్చాలి,” అంటూ రాదుల్ ఆ స్మారక చిహ్నం వైపు సైగ చేశాడు. “గైనేక్ మనకంటే ఎక్కువ సంఖ్యలో ఉండవచ్చు, కానీ మనం వారిని అధిగమించగలం. పురుషులు మళ్ళీ ఎందుకు పోరాడుతారు, పాటిక్స్? చెప్పు, పురుషులను సమీకరించడం నా బాధ్యత. నేను దానిని చేయగలను, నాకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే ఎలోన్ ఎదగాలని, విస్తరించాలని నేను నమ్ముతున్నాను” చెప్పాడు రాదుల్.
నిర్జన ప్రాంతంలో, రాదుల్ చేసిన ఈ దృఢమైన ప్రకటన అశుభకరమైన రీతిలో ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపించింది. పాటిక్స్ రాదుల్‌ను గమనించాడు. అతని నీలి కళ్ళు మెరుస్తున్నాయి. అతను ఆసక్తిగా, అప్రమత్తంగా కనిపించాడు. అతనిపై ఒక అవకాశం తీసుకోవడంలో నష్టం లేదని పాటిక్స్ గ్రహించాడు.
“మన నెపో (7) నిల్వలు తగ్గిపోతున్నాయి, రాదుల్. మన మనుగడ కొనసాగాలంటే, వారి వైపు ఉన్న నెపో నిల్వలు మనకి అవసరం. ఇదే పెద్ద కారణం. కానీ తక్షణ కారణం కూడా ఉంది. వారి వైపు ఒక నెక్స్ (8) సంభవించింది, విష్ (9) ద్వారా ఆ నెక్స్‌కి మనం కారణమయ్యామని వాళ్ళు చెబుతున్నారు. వారి వైపు ఏదో జరుగుతోందని నాకు తెలుసు. ఇది యుద్ధానికి పిలుపులా ఉంది.” చెప్పాడు పాటిక్స్.
రాదుల్ ఆ సమాచారాన్ని అంతా జీర్ణించుకున్నాడు. అతను దీన్ని ఊహించలేదు. నెపో గురించి, తరిగిపోతున్న దాని నిల్వల గురించి పాటిక్స్ చెప్పిన విషయాలు అతని వెన్నులో వణుకు పుట్టించాయి. అతను ఆందోళన చెందాడు. నెపో వారి ఉనికికి ఆధారం.
“పాటిక్స్, నిల్వలు త్వరలో తరిగిపోతాయా?” అడిగాడు.
“లేదు, రాదుల్. కానీ, అవి తగ్గిపోతున్నాయి, కొన్నేళ్ళకి పూర్తిగా క్షీణిస్తాయి. అదలా ఉంటే, గైనేక్ వారి వైపున భారీ నిల్వలు ఉన్నాయి. వాళ్ళకి అవి అవసరం లేదు. వారు అవయవాల భర్తీకి ప్రత్యామ్నాయాల కోసం రెన్యూవబుల్ మెటీరియల్‍ని ఉపయోగిస్తున్నారు. ఆ నెక్స్‌కి మనం కారణమని నిందించడం ద్వారా వారు మన మీద యుద్ధం శంఖారావం పూరించారని నేను నమ్ముతున్నాను.” చెప్పాడు పాటిక్స్.
ఎవరో చనిపోయారా? అసలు నెక్స్ గురించి ఎప్పుడూ వినలేదు. అసలు ఇలాంటిది ఎలా జరిగి ఉంటుందో రాదుల్‍కి అంతుబట్టలేదు. పాటిక్స్ చెప్పిన ప్రతిదాని గురించి అతను ఆలోచించాడు. సమస్య నెపోకు సంబంధించినది అయితే, పురుషులను ఉత్తేజపరచవచ్చు. ఈ కారణం సంభావ్యతతో నిండి ఉంది. అయినప్పటికీ, అతను ఇంకా నెక్స్ గురించి అనిశ్చితంగా ఉన్నాడు. ఇది అంతరించిపోయిన ఆలోచనకు తిరిగి జీవం పోసినట్లుగా ఉంది, వారి ఉనికి యొక్క వాస్తవికతకు చాలా దూరంగా ఉంది.
“ఆ నెక్స్‌కి మనమే కారణమయ్యామా?” అడిగాడు రాదుల్.
పాటిక్స్ లేచి రాదుల్‍ని తన వెంట రమ్మని సైగ చేసాడు. వాళ్ళు ఎగ్జిట్ వైపు నడవసాగారు. ఆ నిర్జన ప్రదేశంలో ఆ అర్ధగోళపు సాగిన నీడ పొడవుగా ఉండటంతో పాటిక్స్ దానిఇ వైపు చివరిసారిగా ఒకసారి చూశాడు. చివరికి, ఫెన్స్ దాటి తమ పరిధిని విస్తరించాలనే అతని ప్రణాళిక నిర్ణయాత్మక దశలోకి వెళుతోంది. అతని పక్కన నడుస్తున్న వ్యక్తి ఈ పరివర్తనలో కీలక పాత్ర పోషిస్తాడు. పాటిక్స్ అతన్ని సముచితంగా ఉపయోగించుకునేలా చూసుకోవాలి.
“ఆ కొత్త సంఘర్షణకు మనమే కారణమా లేదా అనేది తెలుసుకోడం అంత ముఖ్యం కాదు! మన రెండు జాతులు ఫెన్స్‌కి అటూ ఇటూ నివసిస్తున్నప్పుడు, ఆ ఘటనకి కారణమెవరు అన్నది ముఖ్యం కాదు, కారణం ఎవరని ‘అనుకుంటున్నారో’ అనేదే ముఖ్యం.” చెప్పాడు పాటిక్స్.
—-
ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:
(1) Lex, లెక్స్ = సమాచార పరికరం
(2) Creation, క్రియేషన్ = సృష్టి, సంతానం
(3) Zacs, జాక్స్ = సంవత్సరాలు
(4) Gynake, గైనేక్ = ఎలోన్ గ్రహంలో స్త్రీలను సూచించేందుకు పురుషులు వాడే పదం
(5) Elone, ఎలోన్ = ఒక గ్రహం
(6) Fence ఫెన్స్= సరిహద్దు
(7) Nepo, నెపో = అవయవాల భర్తీకి ఉపకరించే ఒక ఖనిజం
(8) Nex, నెక్స్ = మరణం, చావు
(9) Vish, విష్ = విషమయమైన పదార్థం
(మళ్ళీ కలుద్దాం)
రచయిత్రి పరిచయం:
https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.