Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరోగ్యాన్నిచ్చే రథసప్తమి

[04 ఫిబ్రవరి 2025 రథసప్తమి సందర్భంగా ‘ఆరోగ్యాన్నిచ్చే రథసప్తమి’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]

“సప్తాశ్వరథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం”

లోకమున సూర్యుడు ప్రతి దినము ఏడుగుర్రముల రథమును అధిరోహించి తూర్పు దిక్కున ఉదయిస్తాడు. బ్రహ్మ సృష్టిని ప్రారంభించినది తూర్పుదిక్కుననే. భగవంతుని రూపాలన్ని మనకు విగ్రహాలలోనే దర్శనం ఇస్తాయి. కానీ సూర్య భగవానుడు మనకు కళ్ళకు కనిపించే ప్రత్యక్ష దైవము. ప్రాచీదిశన సూర్యోదయంతో మనకు తెల్లవారుతుంది. ఈ సమస్త జగత్తు చైతన్యవంతమై దినచర్యను ప్రారంభిస్తుంది.

“ఆదిత్యో నమస్కారప్రియ” అంటారు. మనం ఉదయము నిదుర లేచి తూర్పు దిక్కుకు తిరిగి సూర్య స్మరణ చేస్తూ “ఓం ఆదిత్యాయనమః” అని ఒక్క నమస్కారాన్ని చేస్తే చాలు ఆ రోజు దివ్యంగా ఉంటుంది.

“ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్” అంటారు. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. ఏడు గుర్రముల రథంపై తన ప్రయాణాన్ని సాగిస్తాడు. సప్తమి ఆయనకు ప్రియమైనది. అందుకే మాఘశుద్ధ సప్తమి నాడు సూర్య జయంతిని చేసి ఆరాధిస్తాము.

ఆ రోజున ప్రాతఃకాలన్నే లేచి సూర్యునికి ఇష్టమైన జిల్లేడు పత్రాలను రేగుపండ్లను తలపై, రెండు భుజాలపై పెట్టుకుని

“యద్యత్ జన్మకృతం పాపం
మయా జన్మ జన్మసు సప్తస్తు
తన్మే రోగంచ శోకంచ
మా కరీహం తు సప్తమీ”

అనే మంత్రాన్ని పఠిస్తూ స్నానంచేస్తే ఏడు జన్మల పాపాలు హరించి పోతాయని ఒక నమ్మకం. ప్రతి నెలలో వచ్చే సప్తమి తిథి కన్నా మాఘ మాసంలో వచ్చే శుద్ధ సప్తమి అత్యంత విశిష్టమైనది. రథసప్తమికి ముందువచ్చే షష్ఠి నాడు ఉపవసించి మరునాడు స్నానా నంతరం సప్తమీ వ్రతా న్ని ఆచరిస్తే ఏడుజన్మలపాపం నశిస్తుందని ధర్మసింధువులో చెప్పబడింది.

“సప్తానాం పూరణీ సప్తమీ” అంటే ఒకటి నుండి ఏడు వరకు గల స్థానాలు పూరించేది. మనకు రోజులు ఏడు, వారాలు ఏడు, రంగులూ ఏడు. అందుకని సప్తమికి అంతటి ప్రాముఖ్యత ఉన్నది. ఆదిత్యుడు త్రిమూర్తి స్వరూపుడు.

“బ్రహ్మ స్వరూప ఉదయే
మధ్యాహ్నే మహేశ్వరః
అస్తకాలే స్వయం విష్ణుః
త్రయీమూర్తి ర్దివాకరః!!”

అని సూర్యుని ప్రార్థిస్తారు

ఈ రథసప్తమి రోజున తులసి కోట ముందు పిండితో అష్టదళ పద్మాన్ని వేసి దానిని ఎర్రచందనం కుంకుమలతో అలంకరించాలి. సూర్యుడు అరుణ వర్ణంలో ఉంటాడు. కనుక ఎర్రని పూలతో పూజించాలి. జిల్లేడు, రేగు, చిక్కుడులలో సౌర శక్తి అధికముగా ఉంటుంది. గోమయము కూడా వేడిని కలుగజేస్తుంది.

ముందుగా ఆవు పేడతో చేసిన పిడకలపైన ఆవుపాలు పొంగించి క్షీరాన్నం వండాలి. ఆ తరువాత చిక్కుడుకాయలతో రథాన్ని తయారుచేసి 12 చిక్కుడు ఆకులలో ఈ పొంగలి నుంచి పూజించి నైవేద్యం పెట్టాలి. పంచభూతాలకు నివేదన పెట్టి ఆ ఐదు ఆకులను పొంగలితో సహా అగ్నిలో వేయాలి. ఈ రోజు నుంచి సూర్యుడు తన గమనాన్ని మళ్లించుకుంటాడని ప్రతీతి. ఆ రోజునుంచి ఎండలో వేడి కొద్దికొద్దిగా పెరుగుతుంది. అంతేకాక శివ కేశవులకు ఇద్దరికీ ప్రీతిని కలిగించే మాసము మాఘమాసము.

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఈరోజు నుండి ఉత్తరాయణం అంటే దేవయానం ప్రారంభమయ్యే రోజు. ఈ రథసప్తమి రోజున ఆదిత్య హృదయ స్తోత్రము, నవగ్రహ స్తోత్రము, సూర్య శతకము పఠనం చేయటం శ్రేయస్కరం. రావణ వధకు పూర్వము సాక్షాత్తు నారాయణాంశ సంభూతుడైన శ్రీరాముడు అగస్త్యుని ద్వారా ఆదిత్యహృదయ మంత్రాన్ని ఉపదేశం పొంది తరువాత యుద్ధంలో విజయం పొందాడు. అరణ్యవాస సమయాన అందరి ఆకలి తీర్చడానికి ధర్మరాజు సూర్యుని ఉపాసించి అక్షయపాత్రను వరముగా పొందాడు. సూర్యోపాసన వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము సంతానం కలగటమే కాక శత్రు పీడ సమస్తము నశిస్తుంది.

ఈనాటి ఆధునిక విజ్ఞాన శాస్త్రము కూడా సూర్యోదయ సమయాన ఆ కిరణాలలో డి విటమిన్ ఉన్నదని చెబుతోంది. అందుకని సూర్యోదయం తర్వాత ఒక 30 నిమిషాల సమయం ఎండలో నిలబడితే ఆరోగ్యం చేకూరుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాక సూర్య నమస్కారాలు చేస్తే ఏ విధమైనటువంటి వ్యాధులు దరి చేరవని అనాది నుండి యోగ పండితులు చెబుతున్నారు. ప్రతి శుద్ధ సప్తమి నాడు సూర్యుని ఆరాధించవచ్చు. సూర్యుడు ద్వాదశ ఆదిత్యుల రూపంలో 12 నెలలు 12 రూపాలలో ఉంటాడు. ఈ మాఘ మాసంలో అర్కుడు అను పేరు ఉంటాడు. ఈ సమయాన సూర్యోపాసన చేస్తే జనులు సర్వ శుభాలను పొంది అంత్యంత ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యము వేరు లేదు కదా! అందువలన ఈ సప్తమినాడు అందరూ ఆదిత్యుని ఆరాధించి ఆయురారోగ్యాలను పొందాలని ఆకాంక్షిస్తున్నాను.

రథసప్తమి అంటే ఒక పర్వదినం మాత్రమే కాదు. సమస్త లోకాలకు కర్మసాక్షి అయిన సూర్యభగవానుడి జన్మదినంగా చెబుతారు. అనంత కాలగమనంలో జరిగే ఖగోళ మార్పులకు సంకేతమైన ఈ రథసప్తమి రోజున సూర్యుని పూజించి గ్రహబాధలనుండి విముక్తులమవుదాం. పంచభూతాత్మకమయాన మానవజీవితం ప్రకృతి అధీనం. అలాంటి ప్రకృతిని రక్షిస్తూ ప్రకృతితో మమేకమయి జీవించాలన్నదే రథసప్తమి మానవులకిచ్చే ఉపదేశం.

Exit mobile version