అడుగులు నీకై అన్వేషిస్తూ తడబడుతూ సాగుతున్నాయి!
పెదవులు నీపేరే పలవరిస్తూ పాఠంలా పఠిస్తున్నాయి!
చేతులు రెండూ చాచాను.. గుండెలకేసి హత్తుకోవాలనుకుంటూ ..
నయనాలు రెండూ రెప్పవాల్చక నిరీక్షిస్తున్నాను..
కళ్ళనిండా నీ రూపాన్ని నింపుకోవాలనుకుంటూ..
మబ్బుల మాటున దాగిన జాబిలమ్మలా
తొంగిచూస్తూ వెండివెన్నెలలు పంచుతున్నావే
కాని సంపూర్ణంగా కానరావు!
కొమ్మల చాటున కదులుతూ కోయిలమ్మలా
కమ్మని రాగాలెన్నో ఆలపిస్తూ పరవశింపజేస్తుంటావే
కాని కనిపించవు!
ఏ సుదూరతీరాలలో వున్నావో కాని..
అగుపించినట్లే అనిపిస్తూ అదృశ్యమవుతుంటావు!
చిరుగాలికి తాకిడికే సయ్యటలాడే గులబిలా
సమ్మోహనంగా చిరునవ్వులు చిదిస్తూ
గుండెల్లో వుండిపోతావా..!?
చెలిలా చెంతచేరి
చింతలన్నీ తీర్చుతావని
..చిన్ని ఆశతో హృదయలోగిలి
వాకిళ్ళు తెరిచి ఆరాధిస్తున్నాను..!!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.