ఆలోచనల్లో అవిశ్రాంతంగా నేనుండగా
చిరునవ్వుల నీ వదనం..
సమ్మోహన నీ రూపం.. గుర్తొస్తుంటే..
కొన్ని జ్ఞాపకాలను ముందేసుకుని
అమాయకంగా నిలుచుండి పోయాను!
అలల్లా కదులుతున్న ఊహలు
ప్రతిసారి పలకరిస్తూ
నిన్ను నాకు దగ్గర చేస్తుంటే..
నన్నే నేను మర్చిపోతూ నీకు
మరింత చేరువవుతుంటాను!
హృదయాన్ని కోవెలగా మలిచి
దేవతలా పూజిద్దామనుకున్నా..
అనుకున్నదే తడవుగా..
నా హృదయం అంతా నువ్వై నిండిపోగా..
నీదైన కోవెలలో నా నిన్ను
చూస్తూ సంభ్రమాశ్చర్యాలతో..
నా రారాణిగా కలల ప్రేయసిని
కళ్ళారా చూస్తూ ఆరాధిస్తుంటా..!!
కలలన్నీ నిజమయ్యే వేళ..
అర్ధాంగిగా జీవితాన్ని
సుసంపన్నం చేస్తావని..
కలగాని వాస్తవాన్ని కనుల ముందు
ఆవిష్కరిస్తావని ఆశతో జీవిస్తున్నా!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.