Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆంగ్లంలోకి అనువదించుదాం!

[భట్టు వెంకటరావు గారు రచించిన ‘ఆంగ్లంలోకి అనువదించుదాం!’ అనే రచనని అందిస్తున్నాము.]


‘అనువాదం’ అంటే సాధారణంగా మన ఊహ ఇతర భాషలలోంచి తెలుగులోకి అనువాదం అన్న వైపే పోతుంది. అది అవసరమే అయినప్పటికీ, ఇప్పుడు తెలుగులోంచి ఇతర భాషలలోకి, ముఖ్యంగా ఆంగ్ల భాషలోకి అనువాదం ప్రథానమైన అవసరం. ఆ అవసరాన్ని గుర్తించి, కొండంతగా మనకు ఉన్న పూర్వపు, నవీనపు పద్యసాహిత్యంలోంచి కొంత కొంతగానైనా ఆంగ్లంలోకి అనువదించి అందించడం ఇప్పుడు విధిగా చేయాల్సిన పని. ఆ దిశగా ప్రయత్నించి, పూర్వ పద్య సాహిత్యంలో వివిధ కావ్యాలలోంచి ఎన్నుకున్న పద్యాలకు నేను ఆంగ్లంలోకి చేసిన అనువాదాలు ఈ క్రిందివి.
మొదటగా అధ్యాత్మిక, ధార్మిక భావనను బొధించే మడికి సింగన రచనయైన ‘వాశిష్ఠరామాయణం’ ప్రథమాశ్వాసంలోని కొన్ని పద్యాలతో ఆరంభిస్తాను.

గీ.
వినుమహంకార మెందాక వృద్ధిఁబొందు
నకట యందాక తృష్ణయు నతిశయిల్లు,
మేఘబృందంబు సాంద్రమై మింటఁ దోఁపఁ
బొరి విజృంభించు కుటజమంజరియుఁ బోలె.

వ్యక్తిలో అహంకారం ఎంతగా పెరిగితే అంతగా తృష్ణ (అమితమైన కోరిక) కూడా పెరుగుతుంది. అది ఎలాగంటే ఆకాశంలో నల్లని మబ్బులు ఎంతగా దట్టంగా అలుముకుని వ్యాపిస్తాయో అంతగా అడవిలో మల్లెలు పొదలలో విజృంభించి పూస్తాయి అని ఒక అసాధారణమయిన, సరసమైన పోలిక చేసి చెప్పడం ఈ పద్యంలో భావం.

As high as the self-pride makes its mount
So high the desire too maintains its ascent
Like hill-jasmines bloom in numbers very high
When groups of dark clouds appear in the sky.

ఈ భువిపై ఎవరిది ఉత్తమమైన జన్మ? అనే ప్రశ్న ఉదయిస్తే, ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్పొచ్చనిపించే పద్యం ఇది.

గీ.
పొందవలసిన యర్థంబు పొంద నేర్చి
దుష్కృతులు సేసి క్రమ్మఱ దుఃఖపడక
యచలనిర్వాణసుఖవృత్తి నందునట్టి
వారి బ్రతుకులు బ్రతుకులు వసుధ మీఁద.

Lives of those men on this earth are blessed
Who know how to earn their money required
By not doing ill deeds and repent afterwards
And gain unwavering state of divine happiness.

ఆయువు అస్థిరమైనది. ఎంత అస్థిరమైనది అంటే ఆకు చివరన వేలాడుతూ కనిపించే నీటి బిందువు అంత అస్థిరమైనది అని మంచి పోలికతో చెప్పిన పద్యం ఇది.

గీ.
ఆయువస్థిరంబు నతి పేలవము పల్ల
వాగ్ర సలిలబిందువట్ల తలఁప;
నుండి యుండి దేహమూరక పడఁద్రోచి
వేదురెత్తినట్లు విడిచిపోవు.

Life is uncertain, very weak and unstable
Like a hanging droplet from a leaf to imagine;
It fells the body down feeling it unbearable
And leaves as if got disgusted all a sudden.

కొన్ని సమయాలలో, ఎందుకో తెలియకుండా, సందేహాలు మనసును కమ్మేసి సమాధానాలు దొరకక ఇబ్బంది పెడుతుంటాయి. అటువంటి ఒక సందర్భంలో శ్రీరాముడు తన కులగురువైన వశిష్ఠుడిని అడిగిన ప్రశ్నలలో ఒకటి పై పద్యంలోని ప్రశ్న. వెర్రెత్తి, విసుగెత్తినట్లుగా శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తాయి కొన్ని మరణసందర్భాలు. ఎందుకలా జరుగుతుంది? అనే బాధ మనసును కమ్మేయగా, కనిపించేలా బాధపడితే అది చూసి బంధువులు కలవరపడతారని, కన్నీళ్ళుపెట్టుకోవడానికి వెరుస్తున్నాను మునీంద్రా! – అని వశిష్ఠుడితో చెప్పుకోవడం క్రింది పద్యం.

కం.
పెనురాలు నీటఁ గ్రుంకిన
యనువున దుర్వ్యధలు నన్ను నారటపఱచున్
ఘనశోక మొదవి బంధులు
విని వగచెదరనుచు నేడ్వ వెఱతు మునీంద్రా!

Like large rocks sink to the bottom of pond
Dubious sorrows weigh me down to no end
Engulfed in great pain, though, I fear to weep
Lest all know my plight and fall into grief so deep!

ఇంతగా అస్థిరం అనిపించే ఈ ప్రాణాన్ని శరీరంలో పెట్టుకుని సౌఖ్యాలని అనుభవించడం ఎలా సాధ్యం? అని మరొక ప్రశ్న శ్రీరాముడిదే ఈ క్రింది పద్యం.

గీ.
పుట్టురూపంబు లెల్లను బొలయు కొఱక,
పొలియు టెల్లను గ్రమ్మఱఁ బుట్టుకొఱక,
కాని యెందును నిలకడ గాన లేని
యిట్టి సంసారమున సుఖమెద్ది? సెపుడ.

All those that are born are to die one by one,
All the dead are destined to born once again,
In this world of unending uncertainties to all
How to find comfort to one’s soul? please tell.

‘పంచతంత్రం’ ను తెలుగులోనికి అనువదించిన వారిలో భానుకవి ఒకరు. ‘భానుకవి పంచతంత్రి’ అని ఆ రచనకు ప్రసిద్ధనామం. అందులో ప్రథమాశ్వాసంలోని ఒక పద్యం ఈ క్రిందిది.

కం.
తన భీతియుఁ దననేరమి
తనధన హానియును దగిన తన మర్మంబున్
దన గృహరంథ్రం బెప్పుడు
ఘనునకు గోప్యముగ వలయుఁ గరణికలక్ష్మా!

తనకున్న భయం, తాను చేయలేని, చేయడానికి తనకు సరిపోయేంత నైపుణ్యం లేని పని, తన అజాగ్రత్తతో తాను పోగొట్టుకున్న సంపద వివరం, తనకు సంబంధించిన రహస్యం, తన గృహంలో గుప్తంగా ఉన్న లోపం.. ఈ అన్నీ కూడా పరులకు తెలియకుండా కాపాడుకోవడంలోనే సుఖం ఉంది. కాబట్టి ఎవరికీ తెలియకుండా ఈ వివరాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి.

The fear one feels in heart, the area of one’s helplessness,
The riches lost, the personal mystery one deeply cherishes,
The blemish in one’s own house that could be the nemesis,
One should never ever reveal; keep them to oneself always.

ఆంధ్ర మహాభారతంలో తిక్కన రచనయైన శాంతిపర్వం, చతుర్థాశ్వాసంలోని గొప్ప పద్యం ఈ క్రిందిది. ఆలోచనకు, ఇంద్రియాల అనుభవానికి రానంత మాత్రాన సకలచరాచరవస్తుసంచయంలో భగవత్తత్త్వం నిండి ఉందనడాన్ని కాదనగలమా? ఒక వస్తువు యొక్క ముందు భాగమే తప్ప, అదే సమయంలో ఆ వస్తువు యొక్క వెనక భాగాన్ని చూడలేడు మనిషి. అలా చూడలేనంత మాత్రాన, ఆ వస్తువుకు వెనక భాగం లేదని చెప్పడం సరైనది కాదు కదా! – అని ఈ పద్యం భావం.

కం.
డెందంబున కింద్రియములకు
నొందఁగ రాకున్న లేకయున్నే తత్త్వం[*]
బెందు? నపరభాగంబునఁ
బొందవు చూడ్కులది లేకపోవునె? సుమతీ!

Since one cannot experience either with his senses or with intellect
Would it be right to say there is no Godly-quality in things that exist?
While looking at things, human eye cannot see at the same moment
The backside of the thing; can it then be said, it doesn’t at all exist?

[*తత్త్వం – The Godly-quality and the Vedantic truth that is beyond the comprehension of common man. It says, each and every particle of the universe, either live or not, is filled with a miniscule part of the Supreme Being (పరమాత్మ) and because of the existence of this Godly quality in everything, nothing in the universe is inferior to any.]

దంతులూరి బాపకవి రచించిన ‘మూర్తిత్రయోపాఖ్యానం’ చతుర్థాశ్వాసంలోని పద్యం ఈ క్రిందిది. తన బాధలకు ఇతరులను నిందించడం తెలివిలేనివాడు చేసే పని అని ఈ పద్యంలోని భావం.

తే.
మేలు కీడును నిజకర్మమే యొసంగ
నొరునిచే వచ్చు నంచుఁ బామరుఁడు వల్కు
నెవ్వరికి నెద్ది ప్రాప్తవ్య మెంచి చూడ
దానిఁ దప్పింప వశమౌనె ధాత కైన.

Either good or bad, happenings result from one’s own deeds
A person of lower acumen, thinks they result from others’ deeds
What is destined to happen to whom, how anyone can gather?
What has already happened, even the creator Brahma can’t alter!

శంకరమంత్రి రచనయైన ‘హరిశ్చంద్రోపాఖ్యానము’ ప్రథమాశ్వాసంలోని పద్యం ఈ క్రిందిది. తన తెలివితేటలను, తన గొప్పదనాన్ని గురించి తానే నలుగురిలో అతిగా చెప్పుకోవడం, తననుతాను పొగుడుకోవడం తగిన పని కాదని పెద్దలు చెబుతారు. ఈ క్రింది పద్యం కూడా అదే చెప్పింది.

కం.
మతిఁ బరికింపఁగ నాత్మ
స్తుతియును బరనిందయును విశుద్ధాత్ములు దా
మతికలుష మండ్రు, తగ ద
ద్భుత మొదవఁగ నన్ను నేన పొగడుకొనంగన్.

Considered thoughtfully, indulging in self-praise
And abusing the fellow men are the weaknesses
Of an unwise mind – say the pious-hearted elders;
It doesn’t behove of me to boast and praise myself. [*]

[*] Those were the words spoken by the sage VasishTha in the audience of Devendra, during the heated exchange of words between him and the Sage Viswamitra.

‘నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని’ ఒక సామెత ఉంది మనకు. ఆ సామెతలోని అర్ధాన్ని అలతి మాటలలో చెప్పిన మంచి పద్యం సంకుసాల నృశింహకవి రచనయైన ‘కవికర్ణరసాయనము’ ద్వితీయ ఆశ్వాసంలోనిది ఈ క్రింది పద్యం.

క.
కాకేమి తన్ను తిట్టెనె?
కోకిల తనకేమి ధనము కోకొమ్మనెనే?
లోకము పగయగుఁ బరుసని
వాకునఁ జుట్టమగు మధుర వాక్యము వలనన్.

Has any crow thrown expletives at anyone?
Did any koel offered to anyone riches ever?
When talked to harshly world becomes foe;
A sweet tongue makes one loved and dear.

🙏

Exit mobile version