Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మార్పుని ఆశించే – బహుమతి కథల సంపుటి ‘ఆనందతాండవం’

[డా. కె. జి. వేణు గారి ‘ఆనందతాండవం’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

థా, నాటక రచయిత డా. కె. జి. గారి తొలి కథా సంపుటి ‘ఆనందతాండవం’. ఇందులో 20 కథలున్నాయి.

~

మొదటి కథ ‘ఆనందతాండవం’. నర్తకి అయిన శ్రావణి – రాజేష్‌ని ప్రేమిస్తుంది. తల్లిదండ్రుల కుదిర్చిన సంబంధాన్ని తప్పించుకునేందుకు రాజేష్ ఒత్తిడితో అర్ధరాత్రి ఇంట్లోంచి పారిపోతుంది. కానీ రైల్వే ప్లాట్‍ఫారమ్ మీద ఎదురైన వ్యక్తులు, జరిగిన సంఘటనలు ఆమెలో అంతర్మథనానికి కారణమవుతాయి. తన నిర్ణయాన్ని మార్చుకుని ప్రియుడికి చెప్పకుండా ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో రాజేష్‌ మోసగాడని పాఠకులకి తెలుస్తుంది. శ్రావణికి తెలిసిందా లేదా అనేది బహుశా అప్రస్తుతం. తెల్లారేలోపు, ఇంకా అమ్మానాన్నలు లేవకముందే ఇంట్లోకి వెళ్ళిపోతుంది శ్రావణి. నటరాజస్వామి విగ్రహం ముందు నాట్యం చేసి తన అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటుంది. శివుడు చేసే నృత్యానికి ఆనందతాండవం అని పేరు. ఆ పేరునే కథకి పెట్టడం సముచితంగా ఉంది.

నాన్నా నన్నిలా పెంచండి..’ చక్కని కథ. ఈ కథలో బాలుడైన యశ్వంత్ మానసిక పరిణతి అద్భుతం. తన ప్రవర్తనతో తండ్రిని మార్చుకుంటాడు. ఉద్యోగినుల సమస్యలని, పురుషాహంకారాన్ని, తెలుగు భాషపై జనాలలో ఉన్న చిన్నచూపుని ఈ కథ వెల్లడిస్తుంది. ఈ కథ చదువుతుంటే, అబ్రహం లింకన్ తన కొడుకు స్కూల్ టీచర్‌కి రాసిన ఉత్తరం గుర్తొస్తుంది.

బల్లిశాస్త్రం..’ టైటిల్‌ అంతగా నప్పని కథ. కరడుకట్టిన స్వార్థపరుడిని, మంచి మనిషిగా మార్చిన ఘటనలో బల్లి ప్రధానపాత్ర కావడం విశేషం. తోటివారి పట్ల మనుషులు చూపే ప్రేమాభిమానాల కన్నా, పశుపక్ష్యాదుల లోనే ఆ ప్రేమ ఎక్కువగా ఉంటుందని ఈ  కథ చెబుతుంది.

ఏదైనా సరుకులు తీసుకెళ్తున్న లారీ రోడ్డు మీద బోల్తా కొడితే, జనాలు ఆ సరుకుని ఎత్తుకుపోవడం గురించి మనం చాలా వార్తలు చదివాం, టీవీల్లో చూశాం. నూనె పాకెట్లు, సెల్‍ఫోన్ బాక్సులు, డీజిలు/పెట్రోలు వంటి వాటిని తీసుకెళ్తున్న వాహనాలు ప్రమాదాలకి గురైతే, ఆ చుట్టుపక్కల నివసించేవారు – వాటిని ఎత్తుకుపోవడం విదితమే. ‘చేదు చెరుకులు’ కథలో కూడ ఇతివృత్తం ఇదే. చెరుకు పంటని లారీలో తీసుకువెళ్తుండగా, అది బోల్తాపడుతుంది. జనాలు చెరుకుగడలను ఎత్తుకుపోతారు. అదే లారీలో ఉన్న ఆ చెరుకు పండించిన రైతు, ప్రమాదం నుంచి తప్పించుకున్నా, జనాల నుంచి పంటని కాపాడుకోలేక నిస్సహాయంగా ఏడుస్తాడు. కథను చెప్తున్న నెరేటర్ కూడా నాలుగైదు చెరుకుగడలను దక్కించుకుంటాడు. కానీ రైతులో జరిగిన సంభాషణ వల్ల అతనిలో సంఘర్షణ చెలరేగుతుంది. ఓ చెరుకు గడని విరిచి, తన పొట్టలో గట్టిగా గుచ్చుకుంటాడు రైతు. ఆఖరి క్షణాలలో ఉన్న తల్లిని చూడ్డానికి వెళ్తున్న నెరేటర్, తన ప్రయాణాన్ని మానుకుని, రైతుని హాస్పటల్‍లో చేర్చడానికి తీసుకువెళ్తాడు.

రాజయ్య దేవుడయ్యాడు’ కథ కొండని తొలిచి తమ ఊరికి దారి ఏర్పర్చిన రాజయ్య కథ. బీహర్‌లో పర్వతాన్ని తొలచి దారి వేసిన దశరథ్ మాంజీ నుంచి ప్రేరణ పొంది రాసిన కథ అనిపిస్తుంది పాఠకులకి.

వ్యవస్థ లోని అవకతవకలను ఉపయోగించుకుంటూ అల్లిన హాస్య కథ ‘మిస్టర్ శంభూప్రసాద్’. శీర్షిక గంభీరంగా ఉన్నా, కథలో ఆద్యంతం వ్యంగ్యం తొణికిసాలాడుతుంది.

అవసరంలో ఉన్నవారికి తనకి తోచిన విధంగా సాయం చేసేవాడు శ్రీనివాసరావు. ఉపాధ్యాయుడిగా ఎందరో పిల్లలకి మార్గదర్శకత్వం చేస్తాడు. ఓ అర్ధరాత్రి గుండెపోటుతో ఆస్పత్రిలో మరణిస్తాడు. బ్రతికున్నప్పుడు శ్రీనివాసరావు నుంచి ఎన్నో ఉపకారాలు, దానాలు పొందిన వారంతా, ఆయన చనిపోయాకా, తమ అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తారు. శవాన్ని ఇంటికి తీసుకురావద్దని, అలా చేస్తే తమ ఇంటికి అద్దెకి ఎవరు రారని ఇంటి యజమాని, నెలలు నిండిన కూతురు పురిటికి వచ్చినందున శవాన్ని తన ఇంటికి తీసుకెళ్ళలేకపోతున్నానంటాడు ఇంకో అతను. అప్పుడు శ్రీనివాసరావు భార్య అందరికీ చెప్తుంది – ‘భయపడద్దు. ఆయన శవం మీ ఇళ్ళకు రాదు. ఆయన తన శరీరాన్ని ఎప్పుడో మెడికల్ కాలేజీకి దానమిచ్చారు’ అని. కళ్ళు చెమర్చుతాయి ‘మహాదాత’ కథ చదివాకా.

డబ్బు వెంట పరుగులు తీస్తూ, ఆత్మీయత, ప్రేమాభిమానాల్ని విస్మరిస్తూ స్వార్థపరులవుతున్న జనాలకు చెంపపెట్టు లాంటిది ‘మేనత్త తల దువ్వుతోంది’ కథ. జీవితమంటే జీవం లేకుండా బ్రతకటమా అని ప్రశ్నించిన సత్యవతి ఎందరో అనాథలకి మేనత్త అవుతుంది ఈ కథలో. చివర్లో “అత్తమ్మా, అమ్మవారిని ఏం కోరుకున్నావు?” అని ఓ పాప అడిగితే, సత్యవతి చెప్పిన జవాబు చదివాకా, యాదృచ్ఛికంగా ‘నిత్యం ఏకాంత క్షణమే అడిగా’ అనే పాటలోని కొన్ని పంక్తులు గుర్తొచ్చాయి. మానవీయ స్పర్శ విలువని చాటుతుందీ కథ.

మంచికి పోతే చెడు ఎదురవడం మనలో చాలామందికి అనుభవమే. ‘మబ్బుల్లో మందహాసం’ కథలో శంకరానికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురవుతుంది. సాధారణంగా, చేయని తప్పులకి నిందలు మోసినవారు కాలక్రమంలో తమ స్వభావాన్ని మార్చుకుని సున్నితత్వం నశించిపోయి, కరకు మనుషులైపోతారు. కానీ ఈ కథలో శంకరం అలా మారడు. మరో చోటకి వెళ్ళిపోయి, తన సహజ స్వభావాన్ని కాపాడుకుంటాడు.

ఆ బిడ్డ నాకు కావాలి’ కథ శీర్షిక ఆసక్తిగొల్పినట్టే, కథ కూడా అంతే ఆసక్తిగా సాగుతుంది. ఈ కథని పాఠకులు ఎవరికి వారు చదువుకుంటేనే బాగుంటుంది. మంచి కథ.

రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ప్రజలను ఎలా మభ్యపెడతారో, తన పగల కోసం ఎంత దారుణానికైనా ఎలా ఒడిగట్టగలరో ‘మేడిపండు రాజకీయం’ కథ చెబుతుంది.

మా తల్లి బంగారం’ చక్కని కథ. తనని మానసికంగా హింసించి, వేదనలకు గురిచేసిన భర్త నుంచి విడాకులు పొందుతుంది సునంద. ఆ తర్వాత లెక్చరర్‍గా ఉద్యోగం సంపాదించి, తన జీవితానికో ఆధారం కల్పించుకుంటుంది. తర్వాత, తన తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా ఓ పని చేస్తుంది. వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోతుంది. ఇద్దరు అనాథలను పెంచుకుంటుంది. తన కొత్తింట్లో పాలు పొంగించే కార్యక్రమానికి రమ్మని అమ్మానాన్నలని ఆహ్వానిస్తుంది. వాళ్ళు మొదట్లో రామని అన్నా, మనసు మార్చుకుని వెళ్తారు. సునంద పెంచుకుంటున్న అనాథలను చూసి ఆశ్చర్యపోతారు.

ఆ క్యాలండర్‍లో తేదీలు లేవు’ తోబుట్టువుల స్వార్థంలో కరిగినీరైనపోయిన భైరవమూర్తి కథ. అప్పులు జేసి వాళ్ళ జీవితాలకో దారి చూపించాకా, వాళ్ళు కొత్తదారుల్లో వెళ్ళిపోతారు. “బ్రతుకు క్యాలండర్‍లో ఆశల తేదీలు ఒక్కొక్కటిగా రాలిపోయాయి” అని రచయిత రాసిన ఓ వాక్యం భైరవమూర్తి స్థితికి అద్దం పడుతుంది. రోజులు నెలలవుతాయి, నెలలు ఏళ్ళవుతాయి. ఇల్లు శిధిలమవుతుంది. భైరవమూర్తి మనసుకైన గాయాలు మాత్రం నయం కావు. ఓ రోజు కురిసిన భారీ వర్షానికి, ఈదురుగాలలు ఇంట్లోని పాత క్యాలెండర్ ఎగిరిపోతుంది, ఇంటి బయట వేపచెట్టు నేలకొరుగుతుంది. అదే సమయంలో మంచం మీద ఉన్న భైరవమూర్తి ప్రాణం పోతుంది. గాల్లో ఎగిరి, వానలో తడిసిన క్యాలండర్ తేదీలను కోల్పోయి ఆయన శరీరంపై పడుతుంది.

ఆధునిక కాలమైనా, పురాతన కాలమైనా, యుద్ధం వినాశనకారి అని చెప్తుంది జానపద కథ ‘అనగనగా ఒక రాజ్యం’. యుద్ధం కలిగించే దుష్పరిణామాలను వెల్లడిస్తుంది.

ఓ అపార్టుమెంట్ లోని ప్లాట్‍లో ఉంటున్న సూర్యకాంతమ్మతో, ఆ అపార్ట్‌మెంట్ వాసులు ఇబ్బందులు ఎదుర్కుంటారు. కొన్నాళ్ళు సర్దుకుపోయినా, ఒక రోజు మీటింగు పెట్టుకుని ఆమెను సంజాయిషీ అడుగుతారు. తర్వాత ఏమైందో తెలుసుకోడం ఆసక్తిగా ఉంటుంది ‘అవును నేను గయ్యాళినే’ కథలో.

డైరీ చివరి పేజీలో..’ ఓ మాజీ సంస్థానాధీశుడి కథ. తన ఆస్తులను చేజిక్కించుకోడానికి కుట్ర పన్నిన నలుగురు ఆంతరంగికులను ప్రణాళికలను ఎలా భగ్నం చేశాడో చెబుతుంది.

అనుమానం పెను భూతం అనే సామెత మనకి తెలిసిందే. మనసులో ఒకసారి అనుమానం అనే బీజం పడితే, అది మొక్కై, చెట్టై, బుర్రని తొలిచేస్తుంది. ఆ క్రమంలో అనుమానమనే భూతం ఆవహించిన మనిషి విచక్షణని కోల్పోతాడు. ఏం చేస్తున్నాడో గ్రహించలేని స్థితిలో ఉన్మాదానికి లోనై చెయ్యకూడని పనులు చేస్తాడు. అలాంటి ఓ రఘురాం కథే ‘పాపను చంపిన భూతం’.

~

ఈ పుస్తకంలోని ఇరవై కథల్లో చాలా కథలు బహుమతి పొందినవే. అందరి మంచి కోసం – వ్యక్తిలోనూ, సమాజంలోనూ మార్పుని ఆశించే కథలివి. పాఠకులకు చక్కని పఠనానుభవాన్ని కలిగిస్తుందీ పుస్తకం.

***

ఆనందతాండవం (కథలు)
రచన: డా. కె. జి. వేణు
ప్రచురణ: నవమల్లెతీగ ముద్రణలు
పేజీలు: 180
వెల: ₹ 200/-
ప్రతులకు:
నవమల్లెతీగ
26-16-4, TF-1,
శుభశ్రీ టవర్స్,
ఉయ్యూరు జమీందారు వీధి, గాంధీనగర్,
విజయవాడ 520003. ఫోన్: 9246415150
~
డా. కె. జి. వేణు 9848070084.

~
డా. కె. జి. వేణు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-kg-venu/

Exit mobile version