[శ్రీ ఎరుకలపూడి గోపీనాధరావు రచించిన ‘ఆమె’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
సంగీత స్వర ఝరులకు సరిజోడుగా ఆమె నర్తిస్తున్నా
మంటల సెగ సోకి అంగాంగం చంచలిస్తున్నట్లున్నది
మనస్సూ,మానమూ, ఇష్టమూ, కష్టమూ
ఆ తన్వి తనువుకూ ఉంటాయనే
ఆలోచన కూడా లేని నిర్దయ ప్రేక్షకుల
మూర్ఖ భావనల ముండ్ల మధ్య
కందిన లేత గులాబీలా ఆ లేమ కనిపిస్తున్నది!
ఇహలోక స్వర్గ సుఖాలను ఇంపుగా
భోగించే వారి హర్షాతిరేకాల మధ్య
ఆ అభాగ్యురాలి నరక యాతనల
మూలుగులణగుతున్నవి!
రంగు రంగు దీపాల వీధి రంగ స్థలాలపై
పండుగ సంబరాల వేదికలపై
దేవుని ఊరేగింపుల వేడుకలలో, రాస్తాలపై, ట్రాక్టర్లపై
కర్ణ కఠోర వాయిద్యాల హోరుల నడుమ
ఆమె చేసే లాసం విషాద జీవన విన్యాసం!
నృత్యమెంత అసభ్యంగా ఉంటే అంత ఆదరణ పొందుతూ
ఎంత ఆదరణ దక్కితే అంత పోషణ అందుతూ సాగే
ఆ కళాకారిణి జీవనం
తుచ్ఛపు భావనల గంజాయి మొక్కలను సాకే
తుంటరుల మధ్యన తులసివనం!
బ్రతుకును జీవింప జేసుకునేందుకు
తోలు బొమ్మై ఆడుతూ కాలం గడిపే ఆ కలికి
కాలం చెల్లిన దేవదాసీల అవశేషాల నుండి
బలవంతంగా సృష్టింపబడిన బాధల రాశిలా ఉన్నది
ఊర్థ్వ లోకాల నుండి ఉర్వికి త్రోయబడిన ఊర్వశిలా ఉన్నది
పీడకుల చూపుల జలగల పీల్పులనూ
కాపురుషుల కర్కశ స్పర్శల కాటులనూ, కాల్పులనూ
భారంగా భరిస్తూ సాగే బాధల కెరటాల వారాశిలా ఉన్నది!
కమలాసనుడో, కన్నవారో చేసిన తప్పుకు
కఠిన శిక్ష ననుభవిస్తున్న నిర్దోషిలా ఉన్నది!