Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆమె పని

[మాయా ఏంజిలో రచించిన ‘Woman Work’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(ప్రపంచవ్యాప్తంగా ఇంటా బయటా ఆడవాళ్ళ శ్రమకి అంతు లేకుండా పోతుంది. ఎంత చేసినా తరగని, గుర్తింపు లేని గృహకృత్యాల జాబితా చాంతాడంత పెరుగుతునే ఉంటుంది. అనునిత్యం స్త్రీలు చేస్తున్న అనంతమైన ఇంటి పనులను దృశ్యమానం చేసిన కవిత ఇది!!)

~

“ఈ పిల్లల పనులన్నీ సవరించాలి
గంపెడు బట్టలు ఉతికి ఆరెయ్యాలి
ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి
సంతకెళ్ళి కూరగాయలు సరుకులు తెచ్చుకోవాలి
వండిన కూరలు తయారుగా ఉంచాలి
ఏడుస్తున్న పిల్లాడిని సముదాయించాలి
ఇంటిల్లిపాది భోజనాల పర్వం పూర్తి చెయ్యాలి
చంటిబిడ్డ దుస్తులు మార్చాలి
మొక్కల్నో సారి చూసి కలుపు ఏరెయ్యాలి
పెరిగిపోయిన చెరుకు గెడలను నరుక్కు రావాలి
పత్తీ పరిగె ఏరుకు తేవాలి
చలువ చేయాల్సిన బట్టలు
నను నిలదీస్తుంటాయి
మంచాన ఉన్న పెద్దావిడకు
చేయూత నేనవ్వాలి
…………………………
ఆరంభమే కాని అంతమంటూ
లేని ఇంటిపని..
అనంతం.. అనంతం.. అనంతం

ఓ సూర్యరశ్మీ
నాపై వెచ్చగా ప్రసరించు
ఓ వర్షధారా..
మృదువుగా.. చుక్కలు చుక్కలుగా
సుతిమెత్తగా నను స్పృశించు
వేడెక్కిన నా నుదుటిని చల్లబరుచు

ఓ తుఫాను ఉధృతమా
నీ బలమైన గాలులతో
నన్నిక్కడి నుంచి ఎగరేసుకు పో
విశ్రాంతిగా వినీలాకాశం పై
నన్నలా.. అలా తేలిపోనీ..

హిమశకలాల్లారా..
మీ తెల్లని చల్లని
మంచు ముద్దులతో
నా ఒంటిని నింపెయ్యండి
ఈ రాత్రి నాకు ఒకింత విశ్రాంతినివ్వండి

సూర్యుడు, వర్షము
వంపులు తిరిగే ఆకాశం
కొండలు, సముద్రాలు
ఆకులు, శిలలు
నక్షత్రాల మెరుపు
చంద్రుని ప్రకాశం
నావనుకొని.. నావే అనుకొని..
ప్రకృతిలోని ప్రశాంతి
మాత్రమే నను సేదదీర్చగలదని
మిమ్మల్నడుగుతున్నా..
నాక్కొంత విశ్రాంతినిమ్మని..!!”.

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ

Exit mobile version