[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘ఆమె నవ్వొక సంజీవని..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
వెన్నెల కిరణాలు అడవిని
అల్లుకున్నట్లుగా
కెరటాలు సూర్యాస్తమయాన్ని
ముద్దాడినట్లుగా
వీరుడు యుద్ధభూమిలో
పోరాడినట్లుగా
ఆమె నవ్వు నన్ను అలుముకుంది..!
కోటానుకోట్ల క్షణాలు
మా నుండి వడివడిగా
వెళ్లిపోయాయి
అనంతమైన నక్షత్రాలు సైతం
కనుమరుగైనాయి
విరామం లేని పనులతో
సతమతమవుతుంటే
ఆమె నవ్వే తరువై సేదతీర్చింది..!
దుఃఖాన్ని కనపడనీయదు
కళ్ళల్లోని మంచును కరగనీయదు
పెదాలపై వికసించే
నవ్వును చెరగనీయదు
ఇంకొకరి ముందెన్నడు
మనసు తెరను తొలగించనివ్వదు
అందుకేనేమో
ఆమె నవ్వు సంజీవనిలా
నాకు ఊపిరినిస్తున్నది..!