Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆమె కోసం

[కొమురవెల్లి అంజయ్య గారు రచించిన ‘ఆమె కోసం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

మె మనుషుల్ని నమ్మింది
మనిషిగా పట్టించుకోలేదు, పట్టించుకోవడం లేదెవరు
పిచ్చిది, ఎడ్డిది, వెర్రి బాగుల్ది ఏ పేరైనా పెట్టండి
ఎందరెందరినో నమ్మి పెయిమీద సోయి కోల్పోయింది
ఏది పడితే అది తింటది నాలుక మొద్దు బారిందేమో
నడుస్తూ నడుస్తూనే లొడలొడ వాగుతుంది
ఎవరిని తిడ్తుందో, ఎవరిని ప్రశ్నిస్తుందో, ఎందుకో తెలీదు
మనిషి బండ బారింది
రాత్రి పగలు రోడ్ల పక్కనే మగ్గిపోతున్న జీవితం

బాల్యాన్ని చెత్త కుప్ప చేశారా?
యవ్వనాన్ని పిచ్చికుక్కలా కరిచారా?
అయిన వాళ్లు వదిలించుకున్నారా? ఎవరికీ తెలియదు
ఊరు పేరు లేని ఆమె అందరికీ తెలుసు
కనికరమెవరు చూపుతారో, కన్నీరెవరు పెట్టిస్తారో
ఏమీ పట్టించుకోని సర్వసంగ పరిత్యాగి
కొయ్య బొమ్మ కాదు
ఆకలి దూసేసి పండ్లు కోసేయగా మిగిలిన చెట్టు

ఆమెనెవరు పలకరించరు, ఆమె ఎవరిని పట్టించుకోదు
పిసరంత మానవత్వం ఆమె జీవనానికి రక్ష
రోగాల్ని పట్టించుకోదు, వైద్యాన్ని దేహీ అనదు
ఎండా వాన చలి అన్నీ ఆమెతో కసిగా ఆటాడుకునేవే

ఆమె ఎన్నడూ చనిపోయింది
ఇప్పుడు శవంగా సచ్చిపోయింది
రోడ్ల పక్కన చెట్లకు కనికరం లేదేమో నాలుగు పూలైనా రాల్చలే
వాసన లేని కాగితం పూలైనా చల్లలేదెవరు
పాడె లేదు, మోసే వారి అవసరమూ లేదు
అందరూ చూశారు ఎవరూ పట్టించుకోలేదు
చెత్త బండిలో చేరిన శవం
ఆమె గొయ్యిని మనుషులు తవ్వలే, మనుషులు పూడ్చలే
ఆమె గురించి నా అక్షరాలను పట్టించుకుంటారా ఎవరైనా
ఆమె లాంటి వారిపై దయ కురుస్తుందా పాలకుల కైనా
కాగితంపై చేరిన జ్ఞాపకం కలవరపరుస్తుందా ఎవరినైనా
కన్నీరు నిండిన కళ్ళకు కనిపించడం లేదేదీ

Exit mobile version