భర్త రాక కోసం గుమ్మం దగ్గర నిలబడి ఎదురుచూస్తుంది రాణి!
సమయం అప్పుడే ఏడు గంటలు కావస్తోంది ఈయనేంటి ఇంకా రాలేదు.. మదిలో ఏదో మూల చిరు సందేహం! ఆఫీస్ నుండి అసలు బయలుదేరాడా లేదా? ప్రతిరోజు సాయంత్రం ఖచ్చితంగా ఐదు గంటలకే కాల్ చేసి వస్తున్న విషయం చెప్పే ఈయన.. ఈ రోజెందుకో కాల్ చేయలేదు కారణం ఏమై ఉంటుంది..!! పదే పదే తలచుకుంటుంది రాణి!
పిల్లలు సుజయ్, సుదీప్తి స్కూల్ ముగించుకుని ఇంటికి వచ్చి రడీ అయి ఆరున్నరకల్లా ట్యూషన్‌కి సైతం వెళ్ళారు. ఈయన వచ్చే సరికి పిల్లలు ట్యూషన్‌కి బయలుదేరుతుంటే.. త్వరగా రెడీ అయి వాళ్ళని ట్యూషన్ దగ్గర వదిలి వస్తుంటారు అప్పుడప్పుడు! భర్త ఆలస్యానికి కారణం అర్థం కాక అయోమయానికి గురవుతూ.. అసహనంగా ఇంట్లోకి బయటకు తిరుగుతుంది రాణి!
సమయం ఏడున్నర అవుతుంది..
“అమ్మా! ఈరోజు మాకు బెండకాయ వేపుడు కావాలి” ఆరో తరగతి చదువుతున్న సుజయ్, నాలుగో తరగతి చదువుతున్న సుదీప్తి చెప్పిన మాట గుర్తొచ్చి.. ఫ్రిజ్ ఓపెన్ చేసి బెండకాయల కోసం చూసింది.
అన్నం కూర వండే పనుల్లో లీనం అయింది రాణి!
సమయం ఎనిమిది అవుతుండగా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చారు.
వస్తూనే “ఆకలి..” అంటూ అల్లరి చేస్తుంటే.. టేబుల్ పై హడావుడిగా వంటకాలు పేర్చింది. వాళ్ళు భోజనాలు చేయడంలో లీనం అయ్యారు.
భర్తకు కాల్ చేసింది.. నాలుగైదు సార్లకు పైగా! ఫోన్ అయితే రింగ్ అవుతుంది కానీ.. అతడు కాల్ రిసీవ్ చేసుకోకపోవడం మరింత ఆందోళనకు గురవుతుంది తను.
“అమ్మా! డాడీ ఇంకా రాలేదా?”అడుగుతున్న సుజయ్‌తో, “అవును.. అదే డాడీ కోసం వెయిట్ చేస్తున్నా..” అంది.
పిల్లలిద్దరూ పగలు స్కూల్, సాయంత్రం ట్యూషన్.. అలసిపోయి పడుకున్న క్షణాల్లోనే నిద్రలోకి జారుకున్నారు. రాత్రి పది గంటలప్పుడు ఇంటికి వచ్చిన విజయ్ భార్యతో ముభావంగా మాట్లాడాడు.
“ఆలస్యమయిందేంటి..” ప్రశ్నిస్తున్న భార్య కళ్ళలోకి చూడలేక..
“అదీ.. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ కలిశాము.. అందుకే కాస్త లేట్ అయింది”
“ఎప్పుడూ.. మన పెళ్ళయ్యాక .. ఇంటికి ఇలా పది గంటలకు రాలేదు కదా?” కళ్ళ నిండా నిలిచిన కన్నీళ్ళను తుడుచుకుంటూ అడిగింది రాణి.
భర్త నోటి నుంచి వస్తున్న వాసన ఆమె గుండెల్లో విస్ఫోటానికి కారణమవుతుంది. చీర చెంగుతో ధారగా కారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటోంది.
“మీరు చేసిన పనేమైనా బాగుందా?” నిలదిస్తున్నట్లు ప్రశ్నించింది.
“ఏం చేసాను?”
రెట్టిస్తున్నట్లుగా అడుగుతున్న విజయ్ వైపు సీరియస్‌గా చూసింది.
అందమైన ఆమె నయనాలు ప్రశ్నిస్తున్న తీరు అతని హృదయాన్ని కలచి వేస్తుంది.
‘తప్పు చేస్తున్నానా?’ అతని మదిలో ఏదో మూల చిన్న సందేహం.
“తాగొచ్చారు కదా? మీరు చేసిన పని నాకేమి నచ్చలేదు. అసలు నాకు ఐదు గంటలప్పుడు కాల్ ఎందుకు చేయలేదు? ఇంటి దగ్గర నేనో దాన్ని ఉన్నానని మీకు అసలు గుర్తు లేదా? పిల్లల్ని సైతం మర్చిపోయినట్లున్నారు కదా!?”
“..”
“అవున్లే! మీకు నాకన్నా, పిల్లలకన్నా మీ ఫ్రెండ్స్, మీ అలవాట్లే ఎక్కువనుకుంటా..”
“అలాంటిదేమీ లేదు..” సోఫాలో కూర్చున్న వాడల్లా వేగంగా లేచాడు.
తూలి పడబోతున్న భర్త ని గబుక్కున పట్టుకుని నిలబెట్టింది.
“నాకేం కాలేదు.. జరుగు..” అన్నాడు.
“సరే.. కాళ్ళు కడుక్కుని రండి అన్నం తిందాం..”
“సారీ! నాకు ఆకలిగా లేదు .”
“మీ రాక కోసం నిరీక్షిస్తూ నేను ఇప్పటి వరకు అన్నం తినలేదు.. రండి భోజనం చేద్దాం..”
“నాకు ఆకలిగా లేదు నువ్వు తిను..” అంటూ విసురుగా బెడ్రూం లోకి దారి తీసాడు విజయ్.
ఆకలిగా అనిపించడంతో ప్లేట్లో అన్నం పెట్టుకుంది. హాల్లో నుంచి బెడ్రూం లోకి చూస్తుంది. ఆదమరిచి నిద్ర పోతున్న భర్త వైపు అసహనంగా చూస్తుంది.. అన్నం తిన బుద్ధి కావడం లేదు. చేయి కడుక్కుంది. ..వంటింట్లోకి వెళ్ళి సామాన్లు సర్దుకుని నిద్రకుపక్రమించింది. నిద్ర పట్టడం లేదు.
ఎంతో ఇష్టపడి విజయ్‌ని వివాహం చేసుకుంది. పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా.. పెళ్ళికి ముందే విజయ్ గురించి తెలుసు. అతడు పి.జి చదువుకున్నాడని తెలిసి.. ఉద్యోగంలో సైతం మంచి పొజిషన్లో వున్నడని పెళ్లికి ఒప్పుకుంది.
పెళ్ళైన ఇంతకాలం అతను బాగానే ఉన్నాడు. ఇటీవలే అతని ప్రవర్తనలో మార్పు వస్తోంది. పిల్లలిద్దరు పుట్టాక మారిన భర్త నైజాన్ని గ్రహించింది. ఆలోచిస్తుంటే విసుగ్గా అనిపిస్తుంది.
ఇదంతా కాదు.. ఏప్రిల్ 14 భర్త పుట్టిన రోజు. ఈ రోజుని ఎంతో ఘనంగా నిర్వహించాలని రెండు రోజులుగా ప్లాన్ చేస్తున్న తన ఆశలను సమూలంగా తుంచేసిన భర్త పై పట్టరాని కోపం వచ్చింది. ముప్పై ఏడో సంవత్సరం లోకి అడుగిడబోతున్న భర్త కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని కొన్న గోల్డ్ కోటెడ్ రిస్ట్ వాచ్ గుర్తొచ్చింది.
సమయం రాత్రి పదకొండు గంటలవుతుంది.
‘ధర్మేచ.. అర్థేచ.. కామేచ.. మోక్షేచ.. నాతి చరామి’ అంటూ వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, పచ్చని కళ్యాణ మండపం, పురోహితుల సాక్షిగా తాళి కట్టిన భర్త.. నేడు తనని మర్చిపోయి వ్యసనాలకు బానిసవడం రాణి మదినిండా వ్యధకు కారణమవుతోంది.
***
పొద్దుట నిద్ర లేస్తూనే..”నేను పిల్లల్ని తీసుకుని ఊరు వెళతాను” అంది.
అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న లకు భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పును తెలియజేయాలనుకుంది. అత్తమామలు, తల్లిదండ్రులు ఒకే ఊళ్ళో ఉంటారు కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకుంది.
“ఇప్పుడా.. ఊరా!?ఎందుకు?” విసుగ్గా అడుగుతున్న భర్తతో..
“అవును! మీరు వింటున్నది నిజమే. నేను ఊరు వెళతాను.”అంది రాణి.
“ఇప్పుడొద్దులే పిల్లలకు దసరా సెలవులు ఇచ్చినప్పుడు వెళ్ళవచ్చులే!”
“అవునమ్మా.. మాకు రెండ్రోజుల్లో పరీక్షలు వున్నాయి” అన్నారు పిల్లలిద్దరూ కోరస్‌గా!
“నిన్న మీ పుట్టినరోజు.. ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దామనుకున్నాను. సర్ప్రైజ్గా గిఫ్ట్ కూడా ఇద్దామని గోల్డ్ వాచ్ కొన్నాను. సర్లేండి ఇకనైనా త్వరగా ఇంటికి రండి. పిచ్చి అలవాట్లు మానుకోమని చెబుతున్నాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు. ఖర్చులు పెరుగుతాయి. వాళ్ళ రేపటి అవసరాలకి సైతం డబ్బులు దాయాల్సి ఉంటుంది. ఇవన్నీ గుర్తుంచుకుని మసలుకోండి.”
విన్నట్లుగా తలూపాడు.
“అమ్మా! మాకు స్కూల్ టైం అవుతుంది త్వరగా క్యారేజ్ ఇవ్వు..” అంటూ పిల్లలు హడావుడి చేస్తుంటే.. గబగబా క్యారేజ్ సర్ది భర్తకు, పిల్లలకు ఇచ్చింది. ముగ్గురూ కలిసి స్కూల్ వైపు కదులుతుంటే.. అప్పటి వరకు పడిన అలసటని మర్చిపోతూ నుదుటిన పట్టిన చెమటని.. చెంగుతో తుడుచుకుని తృప్తిగా ఇంట్లోకి నడిచింది రాణి.
ఓ వారం రోజుల పాటు ఇంటికి వేళకి వచ్చిన విజయ్ ఆ రోజు రాత్రి పదకొండైనా రాలేదు. రాణి మనస్సు కకావికలం అయ్యింది. ఈ మనిషి ఇలా మారిపోయాడేంటి అనుకుంటూ బాధ పడుతూ నిద్రపోకుండా భర్త రాక కోసం ఎదురు చూడసాగింది. అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు తలుపు శబ్దం అయితే తలుపు తీసింది.
మత్తెక్కిన భర్త కళ్ళ వైపు కోపంగా చూసింది. అదేమీ పట్టించుకునే స్థితిలో లేడతను. తూలి పడబోతున్న భర్తను పట్టుకుంది. జారుతున్నాడతను. బయటకి తొంగి చూసింది. బైక్ కూడా ఇంటి ఆవరణ మధ్యలో ఆపాడు.
ఎప్పుడైతే ఓ ప్రక్కగా సెంటర్ స్టాండ్ వేసి జాగ్రత్తగా నిలిపే అతడు.. నేడు తాగిన మైకంలో బండెలా నిలిపాడో తెలియని స్థితి.
“ఛీ..” అనుకుంటూ తనున్న స్థితికి తనపై తనకే కోపమొచ్చింది. భర్తను మార్చుకోలేని తన చేతగాని తనంపై తనకే విసుగొచ్చింది.
మెల్లగా అతని భుజంపై చెయ్యేసి నడిపించుకుంటూ బెడ్ రూం వైపు కదిలింది. పడినట్లుగా బెడ్‌పై వాలిన భర్తను ఆపలేక.. అందునా తను తినకపోవడంతో నీరసానికి గురై.. కింద పడింది. అయినా భర్త క్షేమంగా ఇంటికి చేరాడని సంతోషించింది.
ఉత్తముడైన భర్త ఇలా మారడం.. వ్యసనాలకు లోనై ఆర్థికంగా, మానసికంగా కుటుంబం ఇక్కట్ల పాలవడం ఆమె మనస్సును దహించివేస్తోంది.
ఉదయం నిద్రలేచాడు విజయ్. అప్పటికే పిల్లలు రెడీ అయ్యారు. కానీ వాళ్ళు స్కూల్ డ్రెస్ లలో కాకుండా.. సివిల్ డ్రెస్ లలో ఉండడం అతనికి విస్మయాన్ని కలిగించింది.
“డాడీ! అమ్మా, మేము ఊరు వెళ్తున్నాము. ఉదయం పదిగంటల ట్రైన్‌కి.” అంటున్న కొడుకు వైపు చూస్తూ..
“రెండు రోజులు ఆగండి. నాకు సెలవులు వస్తాయి. అప్పుడు వెళ్దాం ఊరు సరేనా!!?” అన్నాడు.
“ఏమో మాకు తెలియదు. అమ్మ ఈ రోజే వెళదాం అంది. అందుకే రెడీ అయ్యాము.”
“రాణి..”గట్టిగా అరిచినట్టుగా పిలిచాడు విజయ్.
మౌనంగా అతని ముందు నిలబడింది.
అప్పటికే సూట్ కేస్ రెడీ చేసుకుని వున్న తన వైపు కోపంగా చూశాడు.
“నన్నడగకుండా ఎందుకు చేస్తున్నావు ఇదంతా?”
“మీరు నన్నడిగే చేస్తున్నారా.. అన్ని పనులు!?”
“నేను మగాడ్ని!”
“అయితే.. అడ్డమైన విధంగా ప్రవర్తిస్తే ఒప్పుకుని పడి వుండాలా? మీ నిర్వాకం మీ అమ్మనాన్నలని తెలియజేస్తాను.”
“నేను ఆఫీస్‌లో కష్టపడి పని చేస్తాను. ఎప్పుడైనా రిలాక్స్ కోసం డ్రింక్ చేస్తున్నాను. అదేమైనా ఘోరమైన తప్పిదమా. ఈ రోజుల్లో ఎంతమంది తాగడం లేదు?”
“మీలాగా పెళ్ళాం పిల్లల్ని వదిలి రోడ్లెంబడి పడి తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో.. అలాంటి వాళ్ళతో పోల్చుకుంటున్నారు.. మీరు ఆఫీసరేంటండి? ఎవరైనా వింటే నవ్వుతారు!?”
“నా గురించి ఎవరూ ఏడవవలసిన అవసరం లేదు.. నవ్వుకున్నా నేనేమి పట్టించుకోను. ఎప్పుడైనా కాస్త డ్రింక్ చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నావు చూడు. నీలాంటి భార్య పగవాడికి కూడా ఉండకూడదు..!”
“ఏం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా!? నాలాంటిది కాబట్టే మాటలతో ఊరుకుంది.. మరొకరైతేనా..”
“ఏం ఎక్కువగా మాట్లాడుతున్నావు?”
“నేను కాదు ఎక్కువగా మాట్లాడుతున్నది మీరు.. అయినా మీతో ఇంతసేపు పోట్లాడుతున్నాను చూడండి..అదే నా తప్పు. క్షమించండి తప్పుగా మాట్లాడితే!”
“వాదించింది చాల్లే.. ఇంట్లోకి నడవండి”
“మరైతే.. నాకో మాటివ్వాలి మీరు”
“అడుగు..”
తల్లిదండ్రుల మధ్య జరుగుతున్న గొడవని పిల్లలు వింటున్నారు. వాళ్ళ మధ్య జరుగుతున్న గొడవకు కారణం సరిగ్గా అర్థమవ్వకపోయినా.. తండ్రేదో తప్పు చేస్తున్నాడని వాళ్ళకి అర్థమవుతుంది.
“ఓ సారి ఇలా రండి”
మెల్లగా ముందుకు కదిలాడు.
“దేవుడిపై ఒట్టేయండి.. ఇక ముందు డ్రింక్ చేయనని..”
“అది సాధ్యం కాదు..”
“ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి.. మీరు ఈ అలవాటు మానుకోండి.. పిల్లల్ని, నన్ను చూసైనా..” ప్రాధేయపడింది రాణి.
“దేవుడి పై ఒట్టెయ్యలేను కాని.. తప్పకుండా డ్రింక్ చేయడం తగ్గిస్తాను.. మరైతే ఊరి ప్రయాణం మానుకుంటావా?”
“సర్లే..”అనుకుని ఊరుకుంది.
భర్త మారుతాడని.. భర్త యెలాగైనా మార్చగలనన్న నమ్మకంతో మౌనంగా ఉండిపోయింది.
ఓ పదిరోజుల పాటు సమయానికి వచ్చిన అతడు.. మళ్ళీ మొదట్లోలాగా ఆలస్యంగా ఇంటికి రాసాగాడు.
భర్తను మార్చాలని ప్రయత్నించి విఫలమై.. ఓ రోజు పిల్లల్ని తీసుకుని భర్తకి లెటర్ వ్రాసిపెట్టి ఊరికి బయలుదేరింది.
అయినా మనసొప్పక రైల్వే స్టేషన్‌కి వెళ్ళాక.. భర్తకు ఫోన్ చేసింది. హడావుడిగా రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాడు. భార్యని నిలువరించే ప్రయత్నం చేసి విఫలమై.. మరుసటి రోజు ఆఫీస్‌లో రెండు రోజులు సెలవు పెట్టి తమ ఊరికి ప్రయాణమయ్యాడు.
“అమ్మాయి! మేము మా వాడికి సర్ది చెబుతాము లే! దయ చేసి ఇక ముందు భార్యాభర్తలు సవ్యంగా వుందండి..” అత్తయ్య చెబుతున్న మాటలు రాణికి విస్మయాన్ని కలిగించాయి.
తప్పు చేస్తుంది తన కొడుకని తెలిసినా.. ఇద్దరిని దోషులుగా చూస్తున్న అత్తయ్యకి తన సమస్యను ఎలా వివరంగా చెప్పలో అర్థం కాలేదు రాణికి!
అదేమంటే.. తను భర్త పై అలుగుతున్నానని ఆవిడగారి కంప్లెంట్. అంతే కాని తనెందుకు విజయ్‌పై అలుగుతుందో ఆమెకు తెలియదా!? ఇంత కాలం సవ్యంగా జరిగిన తమ కాపురం నేడు ఇలా బజారున పడటానికి కారణం.. ఎవరు!? తనా.. తన భర్తా !? ఆలోచిస్తుంది రాణి.
మామయ్య ఏమైనా మాట్లాడతాడేమో ఎదురు చూస్తుంది రాణి. తన సమస్యను తీర్చగలిగే పెద్దాయన ఆయన మాత్రమే నని రాణి నమ్మకం. తన భర్త విజయ్‌కి తండ్రంటే భయం వున్న మాట వాస్తవం. కాని అలవాటు పడిన వ్యసనం తండ్రి మాటని సైతం ధిక్కరించే స్థితికి మార్చింది. అది తెలిసే నేమో ఆయన మౌనంగా ఉన్నాడు అనుకుంది రాణి.
తన అత్తగారు కొడుకుకి హిత బోధ చేస్తున్న పాఠాలకంటే.. తన్నే ఎక్కువగా విమర్శించడం రాణి మనో వేదనను కలిగించింది.
జీవితం ఓ సాగరం!
ఈ సంసార సాగరం ఈదటం అంటే సామాన్య విషయం కాదు. ఎన్నో హేళకలు, అవమానాలు ఎదుర్కోవాలి.. ఎక్కడైనా ఓ చిన్న సానుకూల అంశం తోడై నిలిచి తన జీవిత పయనాన్ని స్ఫూర్తివంతంగా జరిగేలా చేయకపోతుందా.. నేడు తన ని నడిపిస్తున్న ధైర్యం అదే!
రాణి భర్త వైపు చూసింది. భార్య కళ్ళలోకి సూటిగా చూడలేక తలొంచుకుని నిలబడ్డాడు విజయ్. అక్కడ చేరిన బంధువులు.. కాలమే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తుంది అనుకుంటూ.. ఒక్కొక్కరుగా అక్కడి నుంచి కదిలారు.
“విజయ్! తన వాళ్లందర్నీ వదులుకుని నీతో కలిసి జీవితాన్ని పంచుకుంటున్న భార్య మనస్సు కష్టపెట్టవద్దు. తన అన్నదేమీ లేకుండా అన్నీ నువ్వే అంటూ భావిస్తూ నీతో ఇష్టమైనా.. కష్టమైనా.. అనుభవిస్తున్న ఇల్లాలి మనసెరిగి ప్రవర్తించు.. సరేనా!? మరోసారి నాతో ఇలా చెప్పించుకునే అవసరం రాకుండా.. మా గౌరవాన్ని కాపాడతావని చెబుతున్నాను. ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను. పిల్లల పసి మోములు చూసైనా మారాలి నువ్వు !” అంటూ కుర్చీలో నుంచి లేచారు కృష్ణమూర్తి.
కృష్ణమూర్తి రైల్వే డిపార్ట్మెంట్లో పని చేసి రిటైర్మెంట్ అయి సంవత్సరమవుతుంది. ఉద్యోగం చేసి నన్నాళ్ళు ఊళ్ళు మారుతూ.. రిటైర్మెంట్కి ఓ ఐదేళ్ళు ఉందనగా స్వంత ఊరిలో ఇల్లు కట్టుకుని ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. కానీ కొడుకు ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పు ఆయన హృదయాన్ని సైతం కలిచి వేస్తుంది.
ఉన్న ఊళ్లోనే ఉంటున్న కూతురు, అల్లుడు సంతోషంగా వుంటున్నా.. కొడుకు వలన అవమానాలకు గురవుతుంటే.. బంధువుల్లో తన పెంపకం సరిగాలేదని అనుకుంటుంటే చులకనగా అనిపిస్తుంది. కన్న కొడుకు తనకు కీర్తిప్రతిష్ఠలు తేకపోయినా పర్లేదు..
ఇంతకాలం తను సర్వీసులో వున్నంతకాలం మంచివాడని.. చక్కని వ్యక్తిత్వం గలవాడని..తోటి ఉద్యోగుల్లో, సన్నిహితుల్లో, బంధువుల్లో అనిపించుకున్నా.. నేడది పాడవడం.. బాధగా అనిపిస్తుంది కృష్ణమూర్తికి!
తన భార్య కమల వైపు చూసారు కృష్ణమూర్తి. తన వదనం ప్రశాంతంగా ఉండడం ఆయనకి విస్మయాన్ని కలిగించింది.
“సరే నాన్నా!”అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు విజయ్. పిల్లలు నానమ్మ, తాతయ్య లతో కలిసి కబుర్లలో పడ్డారు.
రాత్రి వెన్నెల్లో డాబాపై పడుకున్నారు అంతా. వేసవి కాలం కావడంతో.. డాబా పైనే నిద్ర పోతామని పిల్లలు అంటుంటే.. సరే అంటూ కృష్ణమూర్తి గారు అందుకు ఏర్పాట్లు చేశారు.
తాతయ్య, నానమ్మ చెప్పిన కాశీమజిలీ కథలు, అల్లావుద్దీన్ అద్భుత కథలు, పంచతంత్ర కథలు, మర్యాద రామన్న కథలు వింటూ హాయిగా నాలుగు రోజులు ఉండి.. ఊరికి బయలుదేరారు.
నాలుగు నెలలపాటు సరిగ్గా సమయానికి వస్తున్న భర్త మారినట్లుగా భావించింది రాణి. మందు తాగడమైతే పూర్తిగా మానక పోయినా సమయానికి ఇంటికి వస్తున్నాడు.
ఓ రోజు.. సరిగ్గా ఏడున్నరకి రాణికి వచ్చిన ఫోన్ కాల్ ఆమె గుండెల్లో సన్నని కంపనానికి కారణమయ్యింది.
పరుగుపరుగున బయటకు వచ్చి దొరికిన ఆటో ఎక్కి.. ‘ప్రజా వైద్యశాల’కి చేరింది.
తాగి తూలుతూ బైక్ నడుపుతూ.. ఎదురుగా వచ్చిన లారీకి డ్యాషిచ్చి నేలపై పడిన విజయ్.. తలకు తీవ్ర గాయం కావడం.. ఆ వెంటనే దగ్గరలో వున్న వాళ్ళు 108కి కాల్ చేయడం.. వాళ్ళు ఆగమేఘాలపై రావడం.. ప్రజా వైద్యశాల కి చేర్చడం.. అతని సెల్ ఫోన్లో ఉన్న నెంబర్ ఆధారంగా.. రాణికి ఫోన్ రావడం జరిగింది.
వెక్కి వెక్కి ఏడుస్తూ హాస్పిటల్ మెట్లెక్కింది. నిస్సహాయ స్థితిలో ఉన్న భర్తను కాపాడే ప్రయత్నంలో తన మెళ్ళో వున్న చైన్ మార్వాడి షాప్‌లో తాకట్టు పెట్టి యాభై వేలతో.. హాస్పిటల్ కి అడ్వాన్స్ కట్టి.. తను వ్రాసిచ్చిన అనుమతి పత్రంతో ఆపరేషన్‌కి సిద్దమవుతున్న డాక్టర్స్‌కి రెండు చేతులెత్తి నమస్కరించింది.
ఓ రెండు గంటల తరువాత డాక్టర్స్ బయటకు వచ్చి పెద్దగా ప్రమాదమేమీ లేదని.. ఓ నాలుగు గంటల తర్వాత అతడిని పలకరించ వచ్చని.. అప్పుటి వరకు ఐ.సి.యు. బయట వెయిట్ చేయమన్నారు.
ప్రస్తుతం విజయ్ మత్తులో ఉండడంతో అతడిని పలకరించడానికి.. కనీసం చూడడానికి సైతం కుదరదన్నారు.
ఐ.సి.యు. బయట కూర్చుంది రాణి. పక్కింటి వాళ్ళు పిల్లల్ని అప్పటికే అక్కడికి తీసుకు వచ్చారు. పిల్లలకు జరిగింది ఎలా చెప్పాలో తెలియక.. వాళ్ళని పట్టుకుని ఏడ్చింది రాణి. తండ్రికి యాక్స్ డెంట్ జరిగిందని వాళ్ళకి అర్థమయింది. యాక్సిడెంట్ ఎలా జరిగిందో వాళ్లకి తెలియలేదు. తల్లేమైనా చెబుతుందేమో అని వాళ్ళు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
“అమ్మా! ఇప్పుడు నాన్నని మనం పలకరించ లేమా?” అడుగుతున్న కొడుకు వైపు చూస్తూ.. గుండె నిబ్బరం చేసుకొని..
“ఓ మూడు గంటలైన తరువాత అనుమతిస్తారట. నేను రాత్రికి ఇక్కడే ఉంటాను. మీరు పక్కింటి తాతయ్య, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కలిసి పడుకోండి. ఇప్పుడు సమయం పదకొండవుతుంది. సరేనా?” అంది.
“లేదు అమ్మా! మేము నీతో పాటే ఇక్కడే వుంటాము. ప్లీజ్ అమ్మా!” అంటున్న కూతురు మాట కాదనలేక పోయింది రాణి.
పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు విజయ్‌ని చూసి వెళ్ళాక పిల్లల్ని దగ్గర చేర్చుకుని ఐ.సి.యు. బయట కూర్చుంది. తల్లి ఒళ్ళోనే నిద్రపోయారు వాళ్ళు. కంటిపై కునుకు లేదు. ఉదయం నిద్ర వస్తున్నట్లుగా అనిపించినా.. మెలుకువ గానే కూర్చుంది.. భర్త కళ్ళు తెరిస్తే లోపలికి వెళ్ళి మాట్లాడాలని!
ఉదయం పది గంటలప్పుడు కళ్ళు తెరిచి మగతగా చూస్తున్న భర్త వైపు సంబరంగా చూసింది రాణి.
కళ్ల నిండా నిలిచిన కన్నీళ్ళని చేతులతో ఒత్తుకుని తుడుచుకుంటూ.. అతని వైపు చూసింది.
“రాణీ..” పిలుస్తున్న భర్తతో.. “మీకేమీ కాదండీ..” అంది. పక్కకి తిరిగి భోరున ఏడ్చింది.
కొద్ది క్షణాల్లో సర్థుకుని మామూలుగా అయిపోతూ.. “ఆకలేస్తుందా..?” అడిగింది. లేదన్నట్లుగా అడ్డంగా తలూపాడతను.
ఓ గంట తర్వాత వచ్చిన తల్లిదండ్రుల వైపు, అత్తమామల వైపు చూసాడు విజయ్. వాళ్ళు ఏదో మాట్లాడబోతుంటే.. పేషంట్ని మాట్లాడించ వద్దని సైగ చేసింది.. దూరం నుండే నర్స్!
రాణి చేసిన సేవ కావచ్చు, డాక్టర్స్ ఇచ్చిన మందుల ప్రభావమే కావచ్చు.. త్వరగానే కోలుకున్నాడు విజయ్. అర్థికంగా కష్టాల్లో చిక్కుకున్న కొడుకు కుటుంబానికి కృష్ణమూర్తి గారు బాగానే ఆర్థిక సాయం చేశారు.
డ్యూటీకి వెళ్ళలేదు విజయ్.
నెల రోజుల తర్వాత.. డ్యూటీకి వెళ్ళడం ప్రారంభించాడు విజయ్. ఎప్పుడైనా కొద్ది కొద్దిగా డ్రింక్ చేయసాగాడు.
“ప్రయత్నిస్తే మీరు డ్రింక్ చేయడం మానుకోగలరు. ప్లీజ్ ఒక్కసారి ప్రయత్నించండి. ఎంతో మంది తాగుడును మానుకో గలిగారు. ఈ వ్యసనాన్ని త్యగించగలిగారు. ప్లీజ్!” ప్రాధేయ పూర్వకంగా అడిగింది. బతిమిలాడింది. బుజ్జగించడానికి కూడా ప్రయత్నించింది. బెదిరించడం వల్ల కాక మానుకుని.. భర్త ఈ పాడు వ్యసనం నుండి బయట పడాలని ఇష్టదైవమైన శ్రీ వేంకటేశ్వరుని ప్రార్థించింది.
అలవాటైన వ్యసనం మానుకోవడం తన వల్ల కాదని తేల్చేశాడు విజయ్.
ఓ రోజు అతనికి వచ్చిన కల అతడికి కనువిప్పు కలిగించింది.
అతడు మరణించినట్లుగా.. పిల్లలు, భార్య ఆర్థికంగా కష్టాలు పడడం.. పిల్లలు చదువుల్లేక ఏదో కూలి పనులు చేసుకుంటూ.. రాణి ఒంటరిగా కుమిలిపోతూ ఏడుస్తూ బ్రతుకీడుస్తుండడం.. కళ్ళముందు రీళ్ళలా కనిపిస్తున్న దృశ్యాలు.. అతను ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు!
“ఏమయ్యిందండి..” అడుగుతున్న భార్య తాళి వైపు చూసాడు.
“ఏంటి అలా వున్నారు!?”అడుగుతున్న భార్యకు సమాధానం చెప్పలేదు.
పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సమయం అర్ధరాత్రి ఒంటిగంట అన్నట్లుగా బెడ్ లాంప్ వెలుగులో గోడగడియారం చూపిస్తుంది.
కళ్ళలో నిలిచిన కన్నీటిని భార్యకు కనిపించకుండా తుడుచుకున్నాడు.
“ఏం లేదులే పడుకుందాం..” అన్నాడు.
‘ఇకనైనా మారాలి.. నా భార్య పిల్లలకి మంచి జీవితాన్ని అందించాలి. కష్టపడి పని చేస్తూ.. మంచి సంపాదనతో వీళ్లకి ఉన్నతమైన ఉత్తమమైన జీవితాన్ని అందించాలి.’ దృఢంగా సంకల్పించాడు.
ఆ చిరు సంకల్పమే అతని జీవిత విధానాన్నే మార్చింది. నాడు అతను తీసుకున్న సత్ సంకల్పమే.. అతని జీవితాన్ని మాత్రమే కాకుండా వాళ్ళ అందరి జీవితాలు ప్రగతి పథంలో సాగేలా కారణమయ్యింది.
పిల్లాడు ఇంజనీర్‌గా, కూతురు టీచర్‌గా ఎదిగి జీవితంలో ఉన్నతంగా స్థిరపడేలా చేసింది. సుజయ్, సుదీప్తిలు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని పిల్లాపాపలతో సంతోషంగా జీవిస్తుంటే.. ఆనందిస్తున్నారు నేడు రాణి, విజయ్ దంపతులు!
కష్టాల అగాధాలని దాటలేక రాణి ఒక దశలో ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనుకుంది. కానీ జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు సహజం వాటిని దాటడమే నిజమైన దమ్మున్న వాళ్ల లక్షణం అని మనస్సుకు సర్ది చెప్పుకుని కష్టాలకు ఎదురు నిలిచింది కాబట్టే నేడు తను, భర్త మాత్రమే కాకుండా తన పిల్లలు.. వాళ్ళ సంతానం సైతం సంతోషంగా జీవించగలుగుతున్నారు.
(ఏ సమస్యకు పరిష్కారం మరణం కాదు. ఎదురై నిలిచిన మరణాన్ని సైతం ఓడించి.. గెలుపు జయ శంఖానాదాన్ని మ్రోగించి సంతోషమే జీవిత పరమార్థం అన్నట్లుగా బ్రతుకుతూ దైవాన్ని స్తుతిస్తూ ప్రయోజకులుగా సమాజానికి ఉపయోగపడడమే నిజమైన మనిషి చేయవలసింది. – రచయిత)
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు. ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు. ‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కావ్య పరిమళం-8
కవయిత్రి, కథా రచయిత్రి శ్రీమతి వారణాసి నాగలక్ష్మి ప్రత్యేక ఇంటర్వ్యూ
The Life is..
‘కులం కథ’ పుస్తకం – ‘మంచితనానికి కులమేమిటి?’ – కథా విశ్లేషణ-2
మా బాల కథలు-16
ఎంత చేరువో అంత దూరము-29
వెంకన్న స్వామి ఆవేదనకు అక్షర రూపం ‘సప్తగిరీశా’ కవిత
జ్ఞాపకాల పందిరి-166
డాక్టర్ అన్నా బి.యస్.యస్.-5
శ్రవ్య కావ్యేతివృత్తము
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®