[బోరి మురళీధర్ గారు రచించిన ‘ఆకుపచ్చని హరి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
రోజూ – దినకరుడితోపాటే అతడూ
తన హరిత క్షేత్రంలో ఆకుపచ్చగా ఉదయిస్తాడు.
తెల్లని తలపాగా – నల్లతుమ్మలాంటి మేను,
నీరెండ కొలిమిలో నిత్యం మండుతూ
కరిగిన బంగారు ముద్దల్లా కనిపిస్తాయి!
అతడు – వేలేత పసిడి కిరణాలను కట్టలు కట్టలుగా కోసి,
నాగేటి చాళ్ళల్లో కలియ దున్నేస్తాడు!
అయితేనే కదా! – ఆ మట్టిలో బంగారం పండేది!
అతని మేని మీద పొటమరించిన చెమట ముత్యాలు
విత్తనాలై వరుసలు వరుసలుగా రాలిపడి,
మోసులు వేస్తూ మొక్కలై మొలిచి నవ్వుతాయి!
అతను కంచెలా పగలూ, రాత్రీ, గట్టు మీద పాతుకుంటాడు.
తనను చూసి తలలూపుతున్న పాలకంకుల్ని
ప్రేమగా నిమిరి, పేరుపేరునా కుశలమడుగుతాడు.
చిక్కని చీకటిలో నుండి పొడుచుకు వచ్చిన
అంకురం – ఆరునూరై అలరారుతుంది!
మనందరికోసం అతడు కళ్ళం నిండా
అక్షయపాత్రల్ని పరిచి వుంచుతాడు!
ప్రాంతాని కొకటీ దేశాని కొకటీ – ఆ మాటకొస్తే,
సకల మానవాళికీ – ఎంతో దయతో ఉదారంగా
వాటిని పంచుతూనే వుంటాడు!
ప్రపంచంలోని అన్నార్తులకతడు – హరిత ఆలయంలో
ఆకుపచ్చని హరిగా గోచరిస్తాడు.
అతనికి ఈ సమస్త లోకాల తరపున
సాష్టాంగ దండప్రణామాలు అర్పిస్తున్నాను!