Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆకుపచ్చని ఆకాశం

[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘ఆకుపచ్చని ఆకాశం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

వేసవి తాపంతో
చిక్కి శల్యమై.. నీటిధార సన్నమై
అలసటతో చిన్నగా
ఆగి ఆగి కిందికి దూకుతోన్న జలపాతం

సన్నని హోరుతో.. పక్కనే పారుతూ
గలగలల సవ్వడితో చిన్నగా పలుకరిస్తూ
మడమలమంటి లోతులో
మెరుస్తూ మెల్లగా సాగిపోతోన్న యేరు

నిలబడి యేటి ఇరుగట్లపై
నిటారుగా నింగికై తలలెత్తి
కొమ్మల చేతులతో
రెమ్మల పచ్చదనాన్ని పట్టుకుని పైకెత్తి
ఆకాశాన్ని అగుపించనీకుండా
ఆకుల గొడుగు పడుతున్న చెట్లు

వేల కిరణాల కళ్ళతో
చెట్ల ఆకుల సన్నని సందుల్లోంచి
వద్దువద్దంటున్నా వినకుండా
పట్టుదలగా తొంగిచూస్తున్న సూరీడు

గిలిగింతల కౌగిలిలో బిగించి
గిరికీలు కొడుతూ
చుట్టుముట్టిన చల్లచల్లని గాలి

ఎండిన యేటి కడుపులోని
పరుపులాంటి ఓ బండరాయిపై
చెట్ల నీడల కౌగిలిలో
విశ్రాంతిగా పడుకున్న నేను

మూసుకున్న కళ్ళవెనుక
మనసును మెత్తగా జోకొడుతూ
ఒంటి అలసటను దూరం చేస్తూ
అదో ధ్యానం లాంటి నిద్ర

కళ్ళు తెరిచి చూస్తే
నీలాన్ని నిశ్చింతగా మింగేసిన
అడవి ఆకుల ఆకుపచ్చని ఆకాశం

అవునూ..?
ఆకాశం నీలంగానే ఉంటుందనేది
నిజంగా సత్యమేనా..?

Exit mobile version