ఆకు రాలుతున్న సందర్భంలోని విషాదాన్ని తట్టుకోలేక కలవర పడుతున్న కవి. కురుస్తున్న విద్వేషపు వానలో తడిసి తడిసి ఊపిరాడని కవి. లోతుగా దిగబడిన మనువు వేళ్ళను మొదలంటా తవ్విపారేయాలని తపన పడుతున్న కవి. కురవాల్సిన వర్షం కోసం ఎదురుచూస్తూ అక్షరమై, కవిత్వమై తనను తాను దహించుకుంటున్న కవి శ్రీ వశిష్ఠ సోమేపల్లి.
కవిత్వ రహస్యం తెలిసిన కవి ఇతడు. కవికి ప్రతిభ ముఖ్యం. ఏ వస్తువునైనా కవిత్వం చేసే పరుసవేది వుంది ఇతని దగ్గర. శ్రీ వశిష్ఠ సోమేపల్లి పేరు కొత్తదేమీ కాదు కవితా రంగానికి. ఐదేళ్ళుగా తన కలానికి పదును పెడుతున్న కవి. ఇటీవలే ‘ఆకురాలిన చప్పుడు’ కవితా సంపుటి ప్రచురించారు.
మతం మత్తులో మునుగుతూ, ప్రజల్ని ముంచుతూ, దేశభక్తి మంత్రం జపిస్తూ పదవుల కోసం పాకులాడే పాలకుల వ్యవస్థలో అవసరమైన కవి. మనసులో మాట అంటూ మాటలతో మంత్రముగ్ధుల్ని చేసి ప్రశ్న వెయ్యడం నేర్పిన వారినీ, అక్షరాలు వెలిగించిన వాళ్ళను దేశద్రోహుల పేరిట చెరసాలలో బంధిస్తున్న సందర్భమిది. నానాటికీ ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వం పడగ విప్పుతున్న విషమకాలంలో ప్రజలను జాగృతం చేసే కవిత్వమిది.
స్వాతంత్ర్యం రాకముందు మనల్ని తెల్లవారు విభజించి పాలించారు. ఇప్పుడూ అదే కొనసాగుతుంది. స్వప్రయోజనాల కోసం ప్రజలు కులాలుగా, మతాలుగా విడగొట్టబడ్డారు. తల్లితండ్రులు తమ ఆశలను కోరికలను పిల్లలపై రుద్దుతున్నారు. పిల్లలూ పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులను పట్టించుకోవడంలేదు. మనుషులందరిలోనూ తడిలేనితనమే. ఇవన్నీ కవి మనసును కలవరపరిచాయి.
ఆ కలతలోంచి, కలవరం నుంచీ వచ్చినవే ఈ కవితలు. మనుషులందరూ బాగుండాలని అంతరాలుండగూడదనీ సమ సమాజం కోసం కలకంటాడు కవి. కానీ అది ‘పగుళ్ళ కల’ అవుతుంది.
“కపోతాలు రెక్కలతో గీతలు చెరుపుతూ
మట్టిని గోడ పగుళ్ళతో నాటుతాయి
ఉదయించిన సూరీడు పగుళ్ళ సందులో కాంతిని నింపుతాడు” ఇంతవరకు కవిత మామూలుగానే ఉంటుంది. ఇక్కడ కవి తన కొత్త గొంతుక వినిపిస్తాడు.
“ఆరోజు గోడ పగుళ్ళలోంచి మనిషి మొలకెత్తుతాడు
పెరిగి పెరిగి పలుగై గోడల్ని కూలుస్తాడు
జెండాలన్నీ వెలిసిపోయి
ప్రేమనే వీస్తాయి”
రాజ్యం తన స్వార్థం కోసం మనుషుల్ని కులమతాలుగా విభజిస్తుంది. వారి మధ్య అంతరాలను, ద్వేషాలను రగిలిస్తుంది. సగటు మనిషి వీటి మాయలో పడి అసలు విషయాన్ని గ్రహించడు. అయినా ఒకనాటికి వీటన్నిటినీ అర్థం చేసుకొన్న మనిషి మొలకెత్తుతాడని, అందరి మధ్య మొలచిన గోడల్ని బద్దలు కొడతాడనీ, విడిపోయిన వారు మళ్ళీ ఏకమవుతారని అంటాడు.
మన ప్రస్తుత దేశ చిత్రపటాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆవిష్కరించిన కవిత ‘పైకి చెప్పకండి’. ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ‘దేశభక్తి’, ‘దేశం వెలిగిపోతున్నది’ నినాదాలు హోరెత్తిపోతున్నాయి. గుండెల్ని కోసే పదునైన వ్యంగ్యం ఈ కవితకు ప్రాణం.
“అతనికొక కత్తెరివ్వండి
అలాగే వో మూడొందల పదకొండు రబ్బరు స్టాంపులూ
నచ్చని అక్షరాల్ని, పచ్చని సిద్ధాంతాల్ని నచ్చినట్లు కోసుకుంటాడు” అంటూ కొయ్యడానికి
“తుపాకీలూ, కత్తులూ, కర్రలూ మనమివ్వక్కర్లేదు
అవతని వారసత్వ ఆస్తి
పగిలిన తలకాయలూ, చిరిగిన విద్యాలయాల గుండెలూ
షటప్!
దేశం వెలిగిపోతున్నదిప్పుడే..!” అని ప్రజల అభిప్రాయాలు పట్టించుకోని ఫాసిస్టు పాలకుల తీరును దుయ్యబడతాడు.
పితృస్వామ్య వ్యవస్థలో మూఢాచారాలు, సాంప్రదాయాలు మారవు. మనుధర్మ స్మృతులను మరువరు. ఇలాంటి పనికిమాలిన సాంప్రదాయాలను ఎదిరించాలని చెబుతాడు ‘మనవు వేర్లు’ కవితలో. చాలామంది మనుషులందరూ ఒక్కటేనని ప్రవచిస్తారు. కానీ అంతరంగంలో మాత్రం ఆ విశాలత్వం ఉండదు. ‘అసింటా’ ‘అసింటా’ అంటూ దూరం పెడతారు కొన్ని కులాలను. ఇలాంటి మనుషులను చూసి
“చెప్పుకుంటున్న అబద్ధాలు ఇక చాలు
ఓ నిప్పుని ఒప్పుకుందాం
తగలబెట్టేద్దాం
పేజీలైన చెట్టు కొమ్మల్నే కాదు
మనసు పేటికలకి తాళమేసి మరీ
దాచిన మనువేర్లను కూడా” అంటూ మనసులోని దిగిన మనువువేర్లను పెకలించి వేయమంటాడు.
మన దేశంలో ఆదివాసీలు ఏ ప్రలోభాలకీ ఆశించకుండా ప్రకృతి ఒడిలో హాయిగా సేదదీరుతారు. కానీ నీళ్ళను అమ్మి వ్యాపారం చేసేవాళ్ళు, మట్టిని అమ్ముకునే వ్యాపారులు ఈ గిరిజనులు నివసించే చోట ఖనిజాల కోసం కొండల్నే తవ్వుతున్నారు. ఆ కొండల్ని తవ్వడానికీ అక్కడి వాళ్ళనే ఉపయోగించుకుంటున్నారు. ఆదివాసుల్ని వాళ్ళ ప్రాంతాన్ని విడిచిపొమ్మంటున్నారు. దీనిని ఖండిస్తూ కవి
“అమ్మ కడుపులో ఉన్నది
మట్టి గడ్డ కాదు ఖనిజపు దిబ్బంటూ
విరిగిన కర్రలు వీపుపై పొమ్మని రాస్తుంటే
ఎక్కడికని పోతారు?
సొంత తల్లి ఒడిలోనే కంబారీలయ్యారు” అంటూ పాలకులపై తిరగబడాలని
“అడవి గుండెలో తుపాకీ విత్తుగా మొలవకముందే
కబళిస్తున్న సామ్రాజ్యవాద వూసుల్ని నరికేయాలి
అణుస్తున్న ఫాసిస్టు ఆలోచనలను నరికేయాలి” అని ప్రజల్లో విప్లవ భావాలు రేకెత్తిస్తాడు.
“చెట్టుకి పూసిన ఎండు మొలకల్లాంటి పిట్టగూట్లో
ఫ్రీ కానుకలు పెట్టనవసరం లేదు
కొమ్మని కొట్టకుండా ఉంటే చాలు” అని అంటాడు. సామాన్యులు ఏమి మాట్లాడినా అణిచివేసే దుర్మార్గ ప్రభుత్వాన్ని గురించి
“గుండె బండయ్యందని విసిరే చేతికి చెప్పకు
ఏ ఘనంలో ఏ గని ఉందోనని గుండెల్ని కోసి శోధిస్తారు” అని రాజ్యం క్రూర స్వభావాన్ని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిస్తాడు.
కవి సంఘజీవి. సమాజంలోని సమస్యలకు స్పందిస్తాడు. ఇటీవలే ప్రపంచాన్ని కరోనా అల్లకల్లోలం చేసింది. మనదేశంలో ఆ దెబ్బకు అందరూ కుదేలులయ్యారు. ముఖ్యంగా వలస కూలీలు వాళ్ళ ఊళ్ళు వెళ్ళడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. కాళ్ళకు చెప్పులు లేకుండా, నెత్తి మీద మూటలతో, చంకలో బిడ్డలతో మైళ్ళకు మైళ్ళు నడిచారు. దానికి స్పందించి రాసిన కవిత ‘గుండెకూ’.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు దాటాయి. అయినా అందరికీ తిండి, గుడ్డ, గూడు లేవు. ప్రగతి పథంలో నడుస్తుంది దేశం అని ఏలికలంటారు. కానీ వాస్తవంలో ఉన్నదంతా అప్రగతే. ఈ విషయాన్ని నిరూపిస్తూ
“పట్టాల గీతలకూ, విశాలదారులకూ
ఆకలి గీతాన్ని అద్దుతూ
ఎదురయ్యే ఎండమావుల్లో
ఇంటి దాహాన్ని తీర్చుకుంటోంది
ప్రగతి చక్రాల వీధులను
మురికి పాదాలతో ఊడుస్తూ
అప్రగతి ఆనవాళ్ళు బయటపెడుతోంది” అని వాస్తవాన్ని చెంప మీద ఛెళ్ళున కొట్టినట్లు చెప్తాడు.
“మనిషి గుండెల్లో
ఏ క్రిమి జొరబడిందో ఏమో
దేశం గుండెకు పుండు పడింది
సాక్ష్యంగా
దేశం కాలికీ పుండు పడింది” అంటాడు. ఇక్కడ దేశం కాలికీ అనడంలో వలస కూలీలని అర్థం. ఈ విషయాన్ని వాచ్యంగా చెప్పడు. దీన్ని రూపకం చేయడంలో కవి ప్రతిభ ద్యోతకమవుతుంది. కరోనా సమయంలో కరోనా మీద కవిత రాయని కవి లేడు. అందులోనూ వలస కూలీల వెతల మీద స్పందించని వారూలేరు. పుంఖాను పుంఖాలుగా వచ్చిన ఆ కవితల్లో మేలిమి కవిత ఇది.
మెజారిటీ ఉందని ప్రభుత్వం అధికారాన్ని చలాయిస్తుంది. ప్రజల అభిప్రాయాలకు, ఇష్టాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేస్తుంది. ఇటీవల ఏకపక్ష నిర్ణయంగా కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు అక్కడి ప్రజలు పడిన బాధలకు, ఆవేదనలకు అక్షర రూపమిస్తాడు బాణలి కవితలో.
ఒకప్పటి అందమైన కాశ్మీరులోని కుంకుమ వనాలు ఇప్పుడు నెత్తుటి పూల వనాలు. దాల్ సరస్సులో పడవఇళ్ళలో ప్రశాంత పయనాలు ఇప్పుడు భయం కలిగించే ప్రయాణాలు. ఇనుప బూట్ల కవాతులు, తుపాకీ పేలుళ్ళ అశాంతి క్షణాలు. భద్రత లేని ప్రజల జీవితాలు. కాశ్మీర్ లోయలోని ఉద్రిక్త పరిస్థితులను
“నెత్తుటి జ్వాలల్ని కత్తులు చీల్చలేవు
తూటాలూ ఆర్పలేవు
అవి ఆజ్యమై సూర్యుణ్ణీ కాలుస్తాయి” అని నిత్యం యుద్ధ జ్వాలల మధ్య రగిలే కాశ్మీరును “కాశ్మీరులోయ ఇప్పుడు సలసల కాగే బాణలి” అని అక్కడ యథార్థ హింసాత్మక దృశ్యాలను వర్ణిస్తాడు.
ప్రతిదానికీ మతం రంగు పూయాలనే ప్రస్తుత ప్రభుత్వ ధోరణిని నిరసిస్తూ ‘వేదన శిఖరం’గా ప్రతిస్పందిస్తాడు. లోతైన కవిత ఇది. గుంటూరులో జిన్నా టవర్ ప్రసిద్ధం. మతం మత్తులో మునిగిన అంధులు ఒకరోజు జిన్నా టవర్ పై జెండా చుడతారు. ప్రజల్లో కలహాలు సృష్టిస్తారు. దేశభక్తి మంత్రాన్ని వల్లె వేసేవారు వచ్చారని “భుజాన దేశాన్ని మోస్తున్నామంటూ/వాళ్ళెవరో వచ్చారు” అంటూ
“నెపమంతా పేరు మీద తోసి
మా ఊరి బొడ్రాయికి మతాన్ని పులిమారు
చెమట పూసే దేహపు తోటల మధ్యన
మంటపెట్టి చలి కాచుకునే దుష్ట ప్రణాళిక అది
ద్వేషమంతా దేశం పేరులో కుక్కి
దేశభక్త నిరూపణ సవాళ్ళు పొడిచి పోయారు” అంటూ “దేశం నిర్వచనం/కేవలం మూడు పదాల్లోనో/మూడు రంగుల్లోనో కుంచించేది కాదని” అని ఫాసిజం ప్రభుత్వం మీద తన వ్యతిరేకతను వ్యక్తపరుస్తాడు.
ఈ కవితా సంపుటి వర్తమాన సమాజ ప్రతిబింబం. స్వాతంత్ర్యం రాకముందు మద్యపాన నిషేధం ఒక ఉద్యమం. స్వాతంత్రం వచ్చాక దానికి పూర్తిగా విరుద్ధం. ఇప్పుడు ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరు మద్యం. బడులు, గ్రంథాలయాలు లేకపోయినా వీధి వీధికీ ఒక బారు మాత్రం రంగురంగుల దీపాలతో వెలిగిపోతుంది. ఇప్పుడు ఇంటికైనా దేనికైనా చిరునామా వివరాలు చెప్పాలంటే ఫలానా బారు దగ్గర అని చెప్పక తప్పని పరిస్థితి. తాగొచ్చి భార్యలను కొట్టడం, ఇంట్లో రూపాయి ఇవ్వకపోవడం, తాగి తాగి మరణించడం. ఇలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కుటుంబాలను పోషించేది స్త్రీలే. ఈ వాస్తవాన్నే ‘కాంతి హననం’ కవితలో కళ్ళకు కడతాడు కవి.
“దీపం ఇంటికి కాంతులద్దుతోంది
అంతలో
ఫెళ్ళున పగిలిందో సారా సీసా
పక్కనే జీవాన్ని వదులుతూ అతడు
దీపమారింది
ప్రమిదలో నూనెగా నెత్తురు!
ఇప్పుడా ఇంటికి వెలుగెవ్వరు?
నేను!
అంటూ తానే వత్తై జ్వలించింది ఆమె”. సగటు మధ్యతరగతి జీవితాన్ని కరుణ రసాత్మకంగా చిత్రించిన కవిత ఇది.
సమాజంలోని అసమానతలూ, కులభేదాలూ, రాజకీయ నాయకుల సిగ్గులేని తనమూ, కవి మనసులో ఎన్నో ప్రశ్నలు రగిలించాయి. “పుస్తకాలు మింగి/డిగ్రీలు కప్పుకున్నా/శీలం లేని ఓ ‘నాయకుడి’/ముందు తలెందుకు దించుకోవాలో?/ఓ తల్లి కడుపున పుట్టినందుకు/ముట్టని వాడెందుకయ్యాడు/భూతల్లి చూడలేని/గీతకవతల పుట్టినందుకు/గిట్టని వాడెందుకయ్యాడు?” అని ‘ప్రతి ప్రశ్నా’ కవితలో కవి సమాజంలోని కులభేదాలను ప్రశ్నిస్తున్నాడు.
రాజ్య హింస గురించి, ప్రభుత్వ నియంతృత్వ పోకడల గురించి ఆందోళన చెందే కవి కేవలం ఆ కవితలకే పరిమితం కాలేదు. ఆకాశంలో సగమైన ఆడవాళ్ళ గురించి రాసిన ఎన్నో కవితలు స్త్రీల పట్ల కవికి కల గౌరవాన్ని తెలుపుతాయి. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ అమ్మని ప్రేమిస్తారు. కవులైతే మరీ గాఢంగా ప్రేమిస్తారు. ‘ఒక అమ్మ’లో అమ్మ గొప్పతనాన్ని “కడుపెండిన ఏ ప్రాణమైనా కనపడితే/తన కడుపు తరుక్కుపోతుంది/పొదుగులతో ఏ తల్లి ఎదురైనా/ఆ పిల్లలకు తానూ అమ్మవుతుంది” అని చెప్తాడు.
మామూలుగా ఎవరైనా మానవత్వం మరణించిందని, మనుషులుగా బతకమని చెప్తారు. కానీ ఈ కవి
“ఇప్పుడు కావాల్సింది
మనుషులుగా బతకడం కాదు
అమ్మలుగా బతికించడమని” చెప్తాడు. అమ్మంటే అంత గొప్ప భావం.
‘అతనెవరో’లో స్త్రీల అనంత దుఃఖానికి అక్షర రూపమిస్తాడు. “ఓ విచ్ఛిన్న మృతదేహం దొరికిన సమాచారం” సరిహద్దుల్లో మరణించిన ఒక సైనికుని గురించి
“నినాదాన్ని గుప్పెట్లోనింపి నింగి గుండెలో జొనిపిన చేయి
మంచుదుప్పటికి కుంకుమ బొట్టుపెట్టి కప్పుకున్న దేహం
తూటాల పూలను ఒంట్లో వెచ్చగా దాచుకున్న దృశ్యం
అతనెవరో తెలిస్తే చెప్పరాదూ
అతని వార్తని ఆమెకి తెలియజేయాలి” అంటూ ఆమె ఆనవాళ్ళు గురించి “గుండెంతా కన్నీళ్ళతోనూ/కళ్ళంతా అతనిని దాచుకున్న దోసిళ్ళతోనూ నిండి వుంటాయి/లోలోన ఏదో పురుగు కొంచెంకొంచెంగా ఆమెను తింటున్న నొప్పి” అంటూ “దేశాలంతా ఆమెలే/దేశాలన్నీ ఆమెను తింటున్న పురుగులే” మగాధిపత్య సమాజంలో స్త్రీలపై జరిగే హింసను ఆవిష్కరిస్తాడు.
ముఖపత్ర కవిత ‘ఆకురాలిన చప్పుడు’లో ఈ సమాజం సామాన్య మానవునిపై ఝలిపించే హింసను గూర్చి ఆక్రోశిస్తాడు.
“గొంతు పెగలని ఆక్రందనలూ,
పెదాలు దాటని ప్రశ్నలూ, సమాధానాలూ
పలుగై పొడుస్తుంటాయి” నగరంలో నిరంతర ఘోష ఉంటుంది కానీ మానవ సంబంధాలు ఉండవు. ఒకరినొకరు పలకరించుకునే మాటలు చప్పుడు ఉండదు. అలా మాట కోసం వెతికినప్పుడు ఆకురాలిన చప్పుడు వినిపిస్తుంది అంటాడు కవి.
‘ఆకురాలిన చప్పుడు’ పేరు లోనే నూతనత్వం. చెట్టు మీద నుంచి ఆకు రాలితే ఏమాత్రం సవ్వడి వినపడదు. మనం ఎంతో నిశ్శబ్దంగా ఉంటే గాని ఆకురాలిన మృదు మథుర శబ్దం మన చెవుల్లో పడదు. ఈ శీర్షికలోనే ఒక విషాద భారం
“ఎంత హింస
మౌనం చేసే గాయాలకు లేపనాలుండవు
నిశ్శబ్దాన్ని, దూరాల్నీ ప్రేమించినా
మౌనాన్నీ, దూరమవుతున్న దగ్గర్ల్నీ భరించలేము” అని నగర జీవితంలోని అంతులేని యాంత్రికతను, పొడిబారినతనాన్ని వ్యాఖ్యానిస్తాడు.
కొన్ని కవితలు తాత్వికతా పరిమళాలు వెదజల్లుతాయి. మరణం గొప్పవాళ్ళనైనా, బీదవాళ్ళనైనా ఒకలాగే పలకరిస్తుంది. ఈ భావాన్నే ‘అనల్పం’ లో
“అల్పమేదీ లేదు
మరణమంతా ఒక్కటే
కుక్కపిల్లదైనా
చలిచీమదైనా
పసిపిల్లదైనా” అని అందరి చావూ ఒకటేనని తీర్పునిస్తాడు.
ఇప్పుడు ఆధునిక మానవుడు సెల్ఫోన్ కు బానిస. నడుస్తున్నా, తింటున్నా, పడుకున్నా, ప్రయాణాల్లో, బస్సులో, రైలులో, ఎప్పుడైనా అతని చేతిలో సెల్ఫోన్ ఉండాల్సిందే. అమ్మా,నాన్న ఎవరూ కనిపించరు ఆ ప్రపంచంలో మునిగినప్పుడు. ఈ వాస్తవాన్ని చెప్తూ “హోమ్ వుంది.. వాల్స్ ఉన్నాయి../విశ్వమే ఉంది/కానీ…అమ్మెక్కడ?!/అప్పుడర్థమైంది/తన ప్రపంచంలో అమ్మ లేదని” నగర జీవుల జీవితాలలో అమ్మలకు చోటు లేని ఆధునిక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాడు. ఇంత ఆధునికతలోనూ అమ్మని ప్రేమించే కొన్ని సమయాలు ఉంటాయి “స్క్రీన్ మీద/Calling../Amma/సంతృప్తిగా చూస్తూ/ఆ ముద్దకి ముద్దు పెట్టి తిన్నాడు/అమ్మ ముద్ద కదా!” అని సెల్ ఫోన్ ను కూడా జయించిన అమ్మ ప్రేమను అక్షరీకరిస్తాడు.
కవిత్వమెప్పుడూ సమకాలీన సమాజాన్ని ప్రతిఫలించాలి. అన్యాయాలను ఎదిరించాలి. అక్రమాలను ప్రతిఘటించాలి. ప్రజల పక్షాన గొంతెత్తి పాలకులను నిలదీయాలి.
సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించిన ఈ కవితా సంపుటిలోని కవితలన్నిటికీ వ్యంగ్యం ప్రాణం. ‘ఆకులందున అణిగిమణిగి కవిత కోయిల పలకవలనోయ్’ అన్నట్లు ఎక్కడా వాచ్యమై వచించడు. తొలి సంపుటిలో ఎవరైనా ప్రకృతినో, ప్రణయాన్నో ఆరాధిస్తారు. కానీ ఈ కవి మొదటి సంపుటిలోనే ఆలోచనలు రేకెత్తించే విభిన్న వస్తువులను తీసుకుని కవిత్వీకరించాడు. ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ప్రతిబింబించిన ఈ సంపుటిలోని కవితల్లోని వస్తు శిల్పాలు అధునాతమైనవి. అప్పుడే పుట్టిన పసిపిల్లల్లాటి పదాలు, కొత్త ఊహలు, కల్పనలు పాఠకుల్ని పరవశింపచేస్తాయి. ఎక్కడా పడికట్టు పదాలు, మూసపోసిన వాక్యాలు లేవు. ఈ పుస్తకమంతా చదివాక తాజాగాలులు వీచే కవనవనంలో విహరించినట్లుంటుంది. కవికి ఇది తొలి సంపుటైనా అలా అనిపించదు.
ఫాసిస్టు ప్రభుత్వ క్రూర స్వభావంపై ఎక్కుపెట్టిన బాణాలు ఈ కవితలు. అందరికీ అన్నం బెట్టే అన్నదాతలు తాము తినడానికి అన్నంలేక ఉరితాళ్ళను ఆశ్రయించడం గురించి, బానిసలకే బానిసైన స్త్రీల జీవితాలలోని హింస గురించి, వేయి పడగల మతం సామాన్యుని జీవితంలో అణువణువునా విస్తరించడం గురించి కలవరపడి, రాయకుండా వుండలేక రాసిన కవితలివి. గాయపడిన ప్రజలు, అణిచివేతకు గురైన వారు ప్రశ్నలై మొలకత్తాలనే కవి ఆక్రోశం ‘ఆకురాలిన చప్పుడు’ అక్షరమక్షరంలో ప్రత్యక్షమవుతుంది.
‘అతనూ సందర్భమూ’, ‘అప్పుడప్పుడు’, ‘అడ్డాలో’, ‘ఏమని ప్రకటించుకుందాం?’, ‘కురవాల్సిన వర్షం’, ‘విద్వేషపు వాన’, ‘వెతుక్కోవడం’, ‘ఇంకొంచెం తవ్వండి’ కవితలు చదివినప్పుడు మనసు కలవరపడుతుంది. ‘మీసం ముద్దు’ కేవలం మగ కవి మాత్రమే రాసే కవిత.
నూతన భావచిత్రాలు, రూపకాలు వశిష్ఠ కవిత్వంలో కొల్లలుగా కనిపిస్తాయి. ఏవీ కృత్రిమంగా ఉండవు. ‘నదుల దేహాలు’, ‘తూటాల పూలు’, ‘జైలు జీర’, ‘కంటి తలుపులు’, ‘మనిషి తోటలు’, ‘జ్ఞాపకాల మెతుకులు’, ‘సామ్యవాద పల్లకి’, ‘నాన్న చెట్టు పాదాలు’ వంటి రూపకాలు ‘ఆహా’ అనిపిస్తాయి. కవితలన్నీ ఆలోచింపచేస్తాయి.
ప్రతిభావంతుడైన ఈ కవి తాను మొదట్లో చెప్పుకున్నట్లు శిలగా కాకుండా శిల్పమై పరిణమించాలని, తెలుగు కవితా ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలని, మరెన్నో కొత్త సంపుటులు ప్రచురించాలని ఆశిస్తూ అభినందిస్తున్నాను.
***
ఆకురాలిన చప్పుడు (కవితా సంపుటి) రచయిత : శ్రీ వశిష్ఠ సోమేపల్లి ప్రచురణ కర్త: ఛాయా రిసోర్సెస్ సెంటర్ పేజీలు: 128 వెల: రూ. 120/- ప్రముఖ పుస్తక కేంద్రాల్లో, అమెజాన్ లోనూ దొరుకుతుంది. https://www.amazon.in/dp/B0BLSV55S1? ఛాయా పబ్లిషర్స్ : 9848023384
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
బ్రాహ్మీభూషణ రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారి స్మారక ఉపన్యాస కార్యక్రమం ప్రెస్ నోట్
తరంగాలు
ఆకాశవాణి పరిమళాలు-28
కుటుంబం – విలువలు
కష్టసుఖాలు
తల్లివి నీవే తండ్రివి నీవే!-24
పేదవాడు
జ్ఞాపకాల పందిరి-141
జ్ఞాపకాలు – వ్యాపకాలు – 21
ఒకే పానవట్టము మీద ఉన్న రెండు శివలింగములు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®