[వి. భాగ్యలక్ష్మి గారు రచించిన ‘ఆక్రందన’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నిజం దాయలేను
అబద్ధం చెప్పలేను
నిప్పులాంటి నిజాన్ని –
గుండెల్లో ఎన్నాళ్ళని ఉంచను
నోరు మెదపలేను
మాట చెప్పలేను
అలాగాని ఈ బాధని భరించలేను
మీద చేయి వేస్తాడే
చిత్రవధ చేస్తాడే
తల్లి గుర్తుకు రాదు
చెల్లి గుర్తుకు రాదు
నీతి తప్పిన నీచుడు
కామంలో రగిలే కామాంధుడు
సాటి ఆడది సోదరి అన్న భావన లేదు
బోధించే బోధకుడే భయం భక్తి లేక బరితెగిస్తే
ఎవరికి చెప్పాలి నా బాధ?
తల్లికి చెప్పనా? అన్నకి చెప్పనా! నాన్నకు చెప్పనా?
బయటకి చెప్తే భయం
పరువు పోతుందని
చెప్పినా చేతులు కట్టేస్తారు
నోరు మూపిస్తారు
ఎవరికి తెలపాలినా ఆక్రందన?
బరి తెగించిన ఆ పశువుకి భయం చెప్పేది ఎవరు?
బడికి వెళ్ళాలంటే భయమేస్తుంది
ఆ బలిపశువును చూస్తే
నా కళ్ళలోంచి కారేది కన్నీరు కాదు
నా మనసు పడేది క్షోభ కాదు
మధ్యతరగతి దానినైతే మాట్లాడకూడదా?
నిలదీసి ఎదురు ప్రశ్నించకూడదా?
ఎవరికి భయపడాలి నేను?
ఈ సమాజానికా లేదా ఆ నీచుడికా?
స్వాతంత్ర్యం వచ్చి 75 వార్షికోత్సవాలు నిండినా
నాటి నుండి నేటి వరకు ఆగలేదే ఈ అరాచకాలు
ఇదేనా మనం కోరుకున్న స్వాతంత్ర్యం?
ఇదేనా మనం కలలుకన్న స్వరాజ్యం?
ఇలాంటి చీడ పురుగుల్ని చెండాడే నవసమాజం
పురుడు పోసుకోవాలని
నిస్సహాయస్థితిలో కన్నీరు కార్చే ప్రతి బాలిక యొక్క
కన్నీటి జ్వాలే నా ఈ ఆక్రందన!