Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-50

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

  1. శ్రీరాముడు లోకం కోసం త్యజించినట్లు అందరి సమక్షంలో ఉద్ఘాటించాడు.
  2. సీతాదేవి మరోసారి పరీక్షకు సిద్ధమైనది కాని పతి ఆజ్ఞను నిరాకరించలేదు. ఎన్నిసార్లు? అనలేదు.
  3. లోకం కోసం, పతిదేవుని కోసం, రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించటం కోసం ఆ సత్యవచనాన్ని పలికి ప్రాతివత్య ధర్మాన్ని నిరూపించి, ఆ ధర్మం యొక్క ఉదాత్తమైన లక్షణాన్నీ, శక్తినీ అందరి మధ్యలో ప్రకటింప జేస్తూ ఆమె అవతారాన్ని చాలించింది కానీ శ్రీరాముని వద్దకు తిరిగి రాలేదు..

దీనిని బట్టి సీతాదేవి జన్మకు మూడు ధ్యేయాలు – 1. రావణ వధ (వేదవతి తపశ్శక్తి శ్రీరాముని పరాక్రమ స్వరూపంలో ప్రకటితమైన పిదప – సీతాకళ్యాణంతో) 2. శ్రీరామునికి 11,000 సంవత్సరాల పరిపాలన, ఇక్ష్వాకు వంశం యొక్క అభివృద్ధి చేకూర్చుట 3. పాతివ్రత్య ధర్మాన్ని ఎలుగెత్తి చాటి ఆ శక్తిని అందరూ అర్థం చేసుకునే విధంగా ప్రవర్తించి ఆ మార్గంలోనే అవతారాన్ని చాలించుట – ఇది కథలో కల్పనకు అందని విడ్డూరం!

శ్రీరాముడు సోదరులతో కూడి వైకుంఠం చేరాడు. కానీ సీతాదేవి భూమిలోకే వెళ్ళింది. దీనికి కారణం ఆవిడ వేదవతి యొక్క తపశ్శక్తి స్వరూపం. కృతయుగం నుండి భూమిలో దాగి యుండి శ్రీరాముని చేరి, కార్యం నిర్వహించుకుని తిరిగి భూమి లోనికి వెళ్ళిపోయింది. రామాయణం వేదం యొక్క లిఖిత స్వరూపం (వేదములు అపౌరుషేయాలు). వేదవతి, సూర్యోపాసన, తపశ్శక్తి, పాతివ్రత్యం.. సావిత్రీ సత్యవంతులు, 24 అక్షరాల గాయత్రి మంత్రం, 24000 శ్లోకాల రామాయణం – ఇవన్నీ మన ముందర ఒక్కసారి మెరుస్తాయి.

24 గంటలలో ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమించటం కూడా తనలో నున్న వేదముల శక్తికి ప్రదక్షిణ చేస్తూ నిరంతరం సూర్యోపాసన చేయుచున్నది!

“సూర్యుని, సూర్యుని ప్రకాశాన్నీ ఎలాగైతే వేరు చేయలేరో, శ్రీరాముని, నన్ను వేరు చేయలేరు” అన్నది సీత. అదే మాటను శ్రీరాముడు కూడా స్పష్టంగా తెలిపాడు యుద్ధకాండలో.

ఈ వివరం ఉత్తరకాండ నుండే (వేదవతి, సీతాదేవి అవతార పరిసమాప్తి ప్రక్రియ ద్వారా) మనకు విదితమవుతుంది. వేదముల అధ్యయనం కోసం వాల్మీకి ఉత్తరకాండలో కుశలవులకు రామాయణం బోధించినట్లు స్పష్టం చేశాడు.

శ్లో:

స తు మేధావినౌ దృష్ట్వా వేదేషు పరినిష్ఠితౌ।

వేదోపబృంహణార్థాయ తావగ్రాహయత ప్రభుః॥

(బాలకాండ, 1. 4. 6)

అందుచేత ‘తపస్సు’తో మొదలయిన రామాయణం ఆ తపశ్శక్తినే వివరించింది. అదే వేదమని గ్రహించాలి!

రామాయణ గానం కూడా తపస్సేనని తెలుస్తున్నది.

వేదాధ్యయనం, తపస్సు, ఉపాసనకు వేసిన బాలకాండలోని పీఠికను మహర్షి ఉత్తరకాండలో పునరావృతం చేసాడని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఉత్తరకాండలోని కొన్ని భిన్నమైన (లేదా ప్రక్షిప్తమైన) సర్గల దృష్ట్యా అది పూర్తిగా అప్రామాణికం అనుకున్నప్పుడు ఈ వేదముల సారం పూర్తిగా నిస్సారమగుచున్నదన్నది సత్యం!

శ్లో:

సర్వాః ప్రముదితాః స్వర్గే రాజ్ఞా దశరథేన చ।

సమాగతా మహాభాగాః సర్వధర్మం చ లేభిరే॥

(ఉత్తరకాండ, 99. 17)

మహాత్మురాండ్రైన దశరథుని భార్యలు (పట్టమహిషులు) స్వర్గస్థులై దశరథ మహారాజుతో కూడి సంతోషముతో గడిపారు. సమస్త ధర్మఫలములను పొందారు.

శ్రీరాముడు హనుమంతుని, విభీషణుని, జాంబవంతుని భూమి మీదనే చిరంజీవులుగా ఉండమని చెప్పాడు. భరత లక్ష్మణ కుమారులను, ఆయన కుమారులైన కుశలవులను పట్టాభిషిక్తులను చేసి మహావిష్ణువు రూపం దాల్చి పరంధామమును చేరాడు. వానరులు పితృదేవతలలో లీనమైనారు. లక్ష్మణుడు సశరీరంగా వైకుంఠం చేరాడు. భరత శత్రుఘ్నులు కూడా పరంధామమును చేరారు.

శ్లో:

ఏవమేతత్ పురావృత్తమ్ ఆఖ్యానం భద్రమస్తు వః।

ప్రవ్యాహరత విస్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతామ్॥

(ఉత్తరకాండ, 111. 26)

అతి ప్రాచీనమైన ఈ రామాయణ వృత్తాంతమును ప్రగాఢభక్తితో పఠించవలసి యుంది. సకల శుభములను చేకూరును. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమునకు పాత్రులై వర్ధిల్లురు గాక!

శ్లో:

సౌందర్య సార సర్వస్వం మాధుర్య గుణ బృంహితమ్।

బ్రహ్మైకయద్వితీయం తత్ తత్త్వమేకం ద్విధాకృతమ్॥

వేదాదిశాస్త్ర సంవేద్యం సీతారామ స్వరూపమ్।

సరహస్య సతాం సేవ్యమద్భుత ప్రణమామ్యహమ్॥

శ్లో:

మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే।

చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్॥

శ్లో:

శ్రీరామచంద్రః శ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభి రామః।

సీతా ముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాత నోతు॥

సర్వం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ చరణారవిందార్పణమస్తు

శ్రీ: శ్రీ: శ్రీ: శ్రీ: శ్రీ: శ్రీ:

(సమాప్తం)

Exit mobile version