Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-27

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

శ్లో.

తతో రావణనీతాయాః సీతాయాశ్శత్రుకర్శనః।

ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి॥

(సుందరకాండ, 1. 1)

ఆంజనేయుడు రావణాపహృతయైన సీత యొక్క జాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతుల వారు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళుటకు నిర్ణయించుకొనెను.

శ్లో.

ముమోచ చ శిలాశ్శైలో విశాలాస్యమనఃశిలాః।

మధ్యమేనార్చిషా జుష్టో ధూమరాజీరివానలః॥

(సుందరకాండ, 1. 16)

అగ్ని యొక్క సప్తార్చులలో ‘మధ్యమార్చి’ అనునది సులోహిత. దాని జ్వాలల నుండి పొగలు వెలువడుచున్నట్లు, ఆంజనేయునిచే అదమబడిన ఆ మహేంద్రగిరి నుండి పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా బయటకు పడసాగెను.

శ్లో.

వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్।

యథా రాఘవనిర్ముక్తః శరః శ్వసనవిక్రమః॥

గచ్ఛేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితామ్।

న హి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజామ్॥

అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయమ్।

యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యామ్యకృతశ్రమః॥

బద్ధ్వా రాక్షసరాజానమ్ ఆనయిష్యామి రావణమ్।

సర్వథా కృతకార్యోహమేష్యామి సహ సీతయా॥

(సుందరకాండ, 1. 39-42)

వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు అంగదాది వానరులతో:

వాయువేగమున సాగిపోవు రామబాణము వలె నేను మిక్కిలి వేగముగా రావణునిచే పాలింపబడుచున్న లంకకు వెళ్ళెదను. అచ్చట జానకీ మాతను కాంచజాలనిచో అదే వేగమున సురలోకమునకు పోయెదను.

అక్కడ కూడా సీతాదేవిని దర్శింపనిచో అవలీలగా రావణుని బంధించి తీసుకొని వచ్చెదను. ఏది ఎలా ఉన్నా కృతకృత్యుడనై సీతతో సహా తిరిగి వచ్చెదను.

శ్లో.

ఊరువేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయుః।

ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః॥

(సుందరకాండ, 1. 47)

సుదీర్ఘ యాత్రకు బయలుదేరిన ఆత్మీయునికి వీడ్కోలు పలుకు ప్రియబంధువులు కొంత దూరము అనుసరించునట్లు ఆ కపివరుని ఊరు వేగమునకు పైకెగిరిన వృక్షములన్నియును ఒక ముహూర్తకాలము అతనిని వెన్నంటినవి.

శ్లో.

తతాప న హి తం సూర్యః ప్లవంతం వానరోత్తమమ్।

సిషేవే చ తదా వాయూ రామకార్యార్థసిద్ధయే॥

(సుందరకాండ, 1. 84)

శ్రీరామ కార్యార్థ సిద్ధికై ఆకసమున పయనించుచున్న వానరోత్తమునకు సూర్యుడు తాపము కలిగించలేదు. ఆయన శ్రమను తొలగించుటకై వాయుదేవుడు గూడ చల్లగా వీచుచు ఆయనను సేవించెను (రామ కార్యాతురుడైన రామభక్తుడు ఎవరికైనా పూజార్హుడే!).

శ్లో.

యోజనానాం శతం శ్రీమాన్ తీర్త్వాప్యుత్తమవిక్రమః।

అనిశ్శ్వసన్ కపిస్తత్ర న గ్లానిమధిగచ్ఛతి॥

(సుందరకాండ, 2. 3)

మిక్కిలి పరాక్రమము గలవాడును, ప్రజ్ఞాశాలియైన హనుమంతుడు నూరు యోజనముల సముద్రమును లంఘించియు అలసట ఏ మాత్రమూ పొందలేదు. పైగా ఒక్క నిట్టూర్పునూ విడువలేదు.

శ్లో.

అర్థానర్థాంతరే బుద్ధిః నిశ్చితాపి న శోభతే।

ఘాతయంతి హి కార్యాణి దూతాః పండితమానినః॥

(సుందరకాండ, 2. 40)

‘ఈ కార్యమును ఇట్లు చేయవలెను, ఇట్లు చేయరాదు’ – అని నిశ్చయింపబడిన తరువాత గూడ వివేకము లేని దూతల వలన ఆ కార్యము సఫలము గాదు. ఏలనన తమకు ఏమిటో తెలియకున్నను తామెంతో తెలిసిన వారమని భావించి గర్వపడు దూతలు కార్యమును చెడగొట్టుచుందురు గదా!

శ్లో.

మనో హి హేతుస్సర్వేషామ్ ఇంద్రియాణాం ప్రవర్తనే।

శుభాశుభాస్వవస్థాసు తచ్చ మే సువ్యవస్థితమ్॥

(సుందరకాండ, 11. 42)

శుభ విషయములయందును, అశుభ విషయముల యందును సమస్తమైన ఇంద్రియముల తీరుతెన్నులకు మనస్సే కారణము. కాని నా మనస్సు (ఈ పరిస్థితులలో గూడ) ఎట్టి వికారములకు లోను గాక సన్మార్గమున నిశ్చలముగా నున్నది.

శ్లో.

అనిర్వేదశ్శ్రియో మూలమ్ అనిర్వేదః పరం సుఖమ్।

భూయస్తత్ర విచేష్యామి న యత్ర విచయః కృతః॥

అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః।

కరోతి సఫలం జంతోః కర్మ యత్ తత్ కరోతి సః॥

(సుందరకాండ, 12. 10, 11)

దిగులు పడకుండా ఉత్సాహముతో మాటాడుట వలన కార్యసిద్ధియు, పరమ సుఖము కలుగును. కనుక నేను ఇంతవరకును వెదకని ప్రదేశముల నన్నింటిని గట్టిగా గాలింతును.

ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి యుండుటయే శ్రేయస్కరము. అదియే మానవుల కార్యములను సఫలమొనర్చును.

(ఇది వేదవాక్కు – శ్రీసూక్తం సారాంశం!)

శ్రీలక్ష్మి – సీతను అన్వేషించునప్పుడు అసలు సిసలైన సూక్తాన్ని తనలో తాను ఆవిష్కరించుకున్నాడు ఆంజనేయుడు!

శ్లో.

వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి।

తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః॥

వసూన్ రుద్రాంస్తథాదిత్యాన్ అశ్వినౌ మరుతోపి చ।

నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధనః॥

నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై।

నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః॥

సంక్షిప్తోయం మయాత్మా చ రామార్థే రావణస్య చ।

సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాః సర్షిగణాస్త్విహ॥

బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే।

సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్॥

వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ।

అశ్వినౌ చ మహాత్మానౌ మరుతశ్శర్వ ఏవ చ॥

సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః।

దాస్యంతి మమ యే చాన్యే హ్యదృష్టాః పథి గోచరాః॥

(సుందరకాండ, 13. 46, 56, 59, 64, 65, 66, 67)

మరణించుట వలన పెక్కు ప్రమాదములు సంభవింపవచ్చును. బ్రతికియుండిన సుఖముల బడయువచ్చు. బ్రతికియున్నవారు ఎన్నడైనను మరల కలుసుకొనుట నిశ్చయము. అందువలన నేను ప్రాణములను నిలుపుకొందును.

అష్టవసువులకును, ఏకాదశ రుద్రులకును, ద్వాదశాదిత్యులకును, అశ్వినీ దేవతలకును, మరుత్తులకును నమస్కరించి, రాక్షసులకు శోకవర్ధనుడనైన నేను ఈ అశోకవనము నందు అడుగుపెడతాను.

శ్రీరామునకు నమస్కారము. జనకసుతయైన సీతామాతకు ప్రణతి, లక్ష్మణునకు నమస్కారము. రుద్రునకు, ఇంద్రునకు, యమునికి, వాయుదేవునకు నమస్కారములు. సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు.

రావణుని కంటబడకుండా రామకార్యసిద్ధికై నేను సూక్ష్మరూపమును ధరించితిని. దేవతలును, మహర్షులును ఇక్కడ నాకు కార్యసాఫల్యమును సమకూర్చెదరు గాక.

స్వయంభువు అయిన బ్రహ్మదేవుడు, ఇతర దేవతలును, అగ్నియు, వాయుదేవుడు, వ్రజాయుధుడైన ఇంద్రుడు, పాశహస్తుడైన వరుణుడును, అట్లే సూర్యచంద్రులును, మహాత్ములైన అశ్వినీదేవతలును, మరుత్తులును, శివుడును నాకు కార్యసిద్ధి ప్రసాదింతురు గాక.

సమస్త భూతములును, సమస్త జీవకోటికి అధిపతియైన శ్రీమహావిష్ణువు, అదృశ్య మార్గమున చరించు ఇతర దేవతలు నాకు కార్యసిద్ధిని కలిగించెదరు గాక.

(ఇంకా ఉంది)

Exit mobile version