Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆధ్యాత్మ రామాయణంలో పాత్రలు

[2025 ఏప్రిల్ 6 న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ గోనుగుంట మురళీకృష్ణ అందిస్తున్న వ్యాసం.]

“రామచంద్ర చరితా కథామృతం,
లక్ష్మణాగ్రజ గుణానుకీర్తనమ్
రాఘవేశ తవ పాదసేవనం,
సంభవంతు మమ జన్మజన్మని”

(రామచంద్రుని యొక్క చరిత్ర అనే అమృతము, లక్ష్మణుడి అన్నగారి గుణాలను కీర్తించుట, రాఘవేశుని పాదసేవ నాకు ప్రతి జన్మలోనూ సంభవించుగాక!)

***

రామాయణం రచించింది ఎవరు అని ఏ చిన్నపిల్లాడిని అడిగినా ‘వాల్మీకి’ అని టక్కున చెబుతాడు. కానీ వ్యాసమహర్షి కూడా రామకథను రాశాడు. ఒకసారి కాదు, మూడుసార్లు. మహాభారతంలో, భాగవతంలో, బ్రహ్మాండ పురాణంలో. మహాభారతం-వనపర్వంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒకసారి మార్కండేయ మహర్షి వస్తాడు. ధర్మరాజు ఆయనకి అతిధి సత్కారాలు చేసిన తర్వాత “మహర్షీ! మాకు లాగా అరణ్యాలలో కష్టాలు పడిన, మా వంటి దురదృష్టవంతులు పూర్వరాజులలో ఇంకెవరైనా ఉన్నారా!” అని అడుగుతాడు. “రాజా! శ్రీరాముడు కూడా వనవాసం, భార్యావియోగం అనే కష్టాలు అనుభవించాడు” అంటూ ధర్మరాజు కోరికపై రామకథను వినిపిస్తాడు మార్కండేయ మహర్షి.

శ్రీమద్భాగవతంలో భగవంతుని యొక్క అవతార లీలావిలాసాలను వర్ణిస్తాడు వ్యాసుడు. మత్స్యావతారము దాల్చి వేదాలను రక్షించటం, క్షీరసాగర మధనం కథ ద్వారా కూర్మావతారము, బలి చక్రవర్తి చరిత్ర ద్వారా వామనావతారం, ప్రహ్లాద చరిత్ర ద్వారా నరసింహావతారం, దశమస్కంధంలో శ్రీకృష్ణ లీలలను ఇలా దశావతారములను వర్ణిస్తాడు. ఆ క్రమంలో రామకథ ద్వారా రామావతారమును కూడా సంక్షిప్తంగా వివరిస్తాడు.

అష్టాదశ పురాణాలలో ఒకటైన బ్రహ్మాండ పురాణంలో శివపార్వతుల సంవాద రూపంలో రామకథను వివరిస్తాడు వ్యాసుడు. అయితే ఇవి మూడూ చాలా క్లుప్తంగా వివరిస్తాడు వ్యాసమహర్షి. శ్రీరాముడి యొక్క సంపూర్ణ జీవిత చరిత్రను ఆవిష్కరించేది మాత్రం శ్రీమద్రామాయణ కావ్యంలోనే! కాబట్టి వాల్మీకి రామాయణం ఆదికావ్యంగానూ, వాల్మీకి మహర్షి ఆదికవి గానూ పేరుపొందారు. ఇంకా అనేకమంది – తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’, గోనబుద్ధారెడ్డి ‘రంగనాథ రామాయణం’, హుళక్కి భాస్కరుడు ‘భాస్కర రామాయణం’, ఆతుకూరి మొల్ల ‘మొల్ల రామాయణం’, కంకంటి పాపరాజు ‘ఉత్తర రామాయణం’ ఇలా అనేక రామాయణాలు వచ్చాయి. వాటన్నిటికీ మూలం వాల్మీకి రామాయణం మాత్రమే! కనుక విజ్ఞులు వాల్మీకి రామాయణమునే ప్రామాణికంగా తీసుకుంటారు.

సరే! ఆధ్యాత్మ రామాయణం విషయాన్ని తీసుకుంటే ఇందులో పాత్రలను వైవిధ్య భరితంగా తీర్చిదిద్దారు వ్యాసమహర్షి. రాముడిని శ్రీమహావిష్ణువు అవతారమనీ, సీతాపహరణం దైవలీల అనీ, కైకేయి మంథరలు దైవప్రేరితం చేత ఆ విధంగా ప్రవర్తించారనీ, రావణుడు వైరభక్తిని ప్రదర్శించాడనీ చెబుతాడు. ఎందుకంటే ముక్తిని కోరుకునే ముముక్షువులు ఆధ్యాత్మికతనే అనుసరిస్తారు. ముక్తిమార్గం అనుసరించేవారికి పారాయణ గ్రంథం ఆధ్యాత్మ రామాయణం. ఆధ్యాత్మ రామాయణంలోని ఆయా పాత్రల గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం.

చిత్రకారిణి శ్రీమతి గోనుగుంట సరళ

***

శ్రీరాముడు

వాల్మీకి రామాయణంలో శ్రీరాముడిని ఒక ఉదాత్త మానవుడిగా తీర్చిదిద్దాడు వాల్మీకి మహర్షి. లోకంలో మానవులు ఎలా ప్రవర్తించాలి అని వివరించేటట్లుగా ఆయన రచన సాగింది. అందుచేతనే రాముడు మానవులకు ఆదర్శ పురుషుడు అయినాడు. కానీ ఆధ్యాత్మ రామాయణంలో శ్రీరాముడు భగవంతుడి అవతారం అని అడుగడుగునా చెబుతాడు వ్యాసమహర్షి. మొదటగా సీత హనుమంతుడికి శ్రీరామ తత్త్వాన్ని వివరిస్తుంది పట్టాభిషేకం అయిన తర్వాత! శ్రీరాముడు సర్వవ్యాపకుడు. ఆయనలో శోకం లేదు, కోరికలు లేవు. మాయాగుణాల కారకుడే గానీ, వాటిచేత బాధింపబడేవాడు కాదు. రావణుడు నన్ను అపహరించటం, నా వియోగంతో రాముడు శోకించటం, సేతుబంధనం, లంకను ముట్టడించటం, రావణ సంహారం ఇవన్నీ ప్రకృతి స్వరూపిణి అయిన నా వలననే జరిగాయి. వీటిని అఖిలాత్ముడైన శ్రీరాముడి మీద ఆరోపిస్తున్నారు. వాస్తవానికి రాముడు నిర్వికారుడు అంటూ చెబుతుంది.

శిలా రూపంలో ఉన్న అహల్యకు శాపవిమోచనం అయిన తర్వాత రాముడిని స్తుతిస్తుంది. “పరమాత్మా! నీ చరణాల నుంచీ రాలిన ధూళి నన్ను తాకడంతో ధన్యురాలి నయ్యాను. నిన్ను గురించిన విషయాలు అన్నీ అద్భుతాలే! నీవు విశ్వమంతటా వ్యాపించి ఉంటావు. నీ మాయాశక్తి మోహంలో చిక్కుకున్న వారికి నీవే పరమేశ్వరుడవని తెలియదు. ఆకాశం లాగా బాహ్యం లోనూ, అంతర్గతం లోనూ వ్యాపించి ఉంటావు. నువ్వే సకల ప్రాణుల అంతరాత్మ. నిర్వికారుడవు, నిర్మలుడవు, అవ్యయుడవు. చైతన్య స్వరూపుడవు. నీకు నమస్కరిస్తున్నాను” అంటూ ప్రార్ధిస్తుంది.

శబరి శ్రీరాముడితో “పరమాత్మా! నేను హీనజాతి స్త్రీని. నిన్ను స్తోత్రం చేయటానికి కూడా సమర్థురాలను గాను. నన్ను అనుగ్రహించు” అని చెబితే రాముడు ఇలా చెబుతాడు “శబరీ! నన్ను పూజించటానికి లింగ భేదాలు లేవు. జాతి భేదాలు లేవు. భక్తి మాత్రమే చాలు. నా భక్తి సాధనాలలో మొదటిది సాధుజన సాంగత్యం. రెండవది నా పుణ్యకథలను వినటం. ఇంకా ఆచార్యులలో గురువులలో నన్ను చూడటం, నా నామాన్ని ధ్యానం చేయటం, నా భక్తులను సేవించటం ఇవన్నీ నన్ను చేరుకునే మార్గాలే!” అని చెబుతాడు.

ఇంకా పరశురాముడు, జటాయువు, వాలి, స్వయంప్రభ, విభీషణుడు, మండోదరి పాత్రల ద్వారా శ్రీరాముడు దైవస్వరూపుడు అని చెబుతారు ఆధ్యాత్మ రామాయణంలో.

సీత

రావణుడు చేయబోయే కార్యాలను శ్రీరాముడు ముందే గ్రహిస్తాడు. సీతతో “జానకీ! ఇప్పుడు నేనొక లీలను ప్రదర్శింపబోతున్నాను. రావణుడు తాపసి వేషంలో భిక్షకై రానున్నాడు. నీ నీడతో ఒక ప్రతిబింబాన్ని నిర్మించుకుని, నీ నిజరూపాన్ని అగ్నిలో దాచుకో! ఒక సంవత్సరం పాటు అదృశ్యం గానే ఉండాలి. నీ ఛాయారూపాన్ని నిజమైన సీతగా నమ్మి రావణుడు లంకకు తీసుకుని వెళతాడు. ఆ వంకతో అతడిని వధించి లోకాలను కాపాడతాను. రావణ సంహారం తర్వాత నువ్వు నన్ను చేరుకుంటావు” అని చెబుతాడు.

శ్రీరాముడి ఆనతి ప్రకారం సీత తన ఛాయా రూపాన్ని అక్కడ నిలిపి తాను అగ్నిలో ప్రవేశిస్తుంది. రావణ సంహారం తర్వాత రాముడు మాయాసీతను అనేక మాటలతో నిందిస్తాడు. ఆమె తన పాతివ్రత్యం నిరూపించుకోవడానికి అగ్నిప్రవేశం చేస్తుంది. అగ్నిదేవుడు ప్రత్యక్షమై “ దేవా! పూర్వం దండకారణ్యంలో నాలో నిలిపిన నిజసీతను నీకు అప్పగిస్తున్నాను. పరమ పవిత్రురాలైన ఆమె స్పర్శతో నేను పునీతుడనైనాను. ఈమెను స్వీకరించు. మాయాసీతను నాలో లీనం చేసుకుంటున్నాను” అని చెబుతాడు. శ్రీరాముడు సీతను స్వీకరించి అగ్నిదేవుడికి ప్రతిపూజ చేస్తాడు.

రావణుడు

ఒకసారి ఏకాంతంలో ఉన్నప్పుడు రావణుడు ఇలా తలపోస్తాడు. “ఈపాటికి శ్రీమహావిష్ణువు నా సంహారం కోసం రామావతారం ఎత్తి ఉండాలి. తన భక్తుల మీద భగవంతుడికి ఎప్పుడూ ఆగ్రహం కలగదు. వారికి మోక్షం దూరంగా ఉంటుంది. భక్తి చేత మోక్షం పొందటం కష్టం. రాముడికి ఆగ్రహం తెప్పించి ఆయన చేతిలో మరణించి ముక్తి పొందటం సులభమైన మార్గం. మారీచుడిని బంగారు లేడి రూపంలో రాముడిని దూరంగా పంపించి వేయటానికి నియోగిస్తాను. సీతను అపహరిస్తాను. ఆ నెపంతో రాముడితో విరోధం తెచ్చుకుని, ఆయనతో యుద్ధం చేసి మరణిస్తాను. ఆయన చేతిలో మరణం నాకు ముక్తిని ఇస్తుంది” అనుకుంటాడు. ఆ విధంగా ఆధ్యాత్మ రామాయణంలో రావణుడు వైరభక్తినే ప్రదర్శిస్తాడు.

సీతాపహరణం తర్వాత “నేను సీతను అపహరించి ఇంతకాలమైనా రాముడు ఇంకా రాలేదేం? నాకు చావు ఎప్పుడు లభ్యమౌతుందో తెలియటం లేదు.” అని రావణుడు మథనపడుతూ ఉంటాడు. ఎప్పుడూ అదే విషయం ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి ఒక కల వస్తుంది. రాముడి దూత ఒకడు వానర రూపంలో సీతకోసం లంకలో వెతుకుతూ ఉన్నట్లు కలగంటాడు. ఈ కల నిజమని నమ్ముతాడు రావణుడు. “నా దూషణ వాక్యాలతో సీత మనసు నొప్పిస్తాను. ఆమె శోకంలో మునుగుతుంది. ఆ దృశ్యాన్ని చూసిన వానరుడు ఈ విషయాన్ని రాముడికి వివరిస్తాడు. అప్పుడు రాముడి రాక నిశ్చయమవుతుంది” అని అనుకుంటాడు.

ఆ మర్నాడు సీత దగ్గరకు వెళ్లి లేని ప్రేమను ఒలకబోస్తాడు. సీత మాటలకు కోపం తెచ్చుకున్నట్లు నటించి ఆమెను చంపటానికి కత్తి ఎత్తుతాడు. మండోదరి వారిస్తుంది. “నీకు రెండు నెలలు గడువు ఇస్తున్నాను. ఈలోగా నాకు వశం కాకపోతే నా పరిచారకులు నిన్ను చంపి నా ప్రాతఃకాల భోజనంగా సిద్ధం చేస్తారు” అని హెచ్చరించి వెళ్ళిపోతాడు. వాల్మీకి రామాయణంలో సీతకు గడువు ఇచ్చి, హెచ్చరించటం తప్ప ఇవేమీ లేవు. సీతను పొందటానికి తహతహలాడే దుష్టుడి లాగా రావణుడిని చిత్రీకరిస్తాడు వాల్మీకి.

అలాగే యుద్ధసమయంలో రాముడు రావణుడి పదితలలు ఖండించినా అవి తిరిగి పుడుతూనే ఉంటాయి. అప్పుడు విభీషణుడు తన అన్న బ్రహ్మ వరప్రసాది అనీ, అతడి నాభిలో అమృతభాండం ఉందనీ, దాన్ని పగలగొడితే గానీ అతడి బలం తరగదనీ చెబుతాడు. కుక్షికి గురిపెట్టటం ధర్మం కాదని రాముడు అంగీకరించడు. లోకకల్యాణం కోసం రామబాణాన్ని దారి మళ్ళించాల్సిందిగా హనుమంతుడు తన తండ్రి వాయుదేవుడిని ప్రార్థిస్తాడు. వాయుదేవుడు రామబాణం రావణుడి కుక్షికి తగిలేటట్లుగా దారి చేస్తాడు. రావణుడు మరణిస్తాడు. వాల్మీకి రామాయణంలో మాత్రం రావణుడు బ్రహ్మాస్త్రం వలన మరణించినట్లుగా చెబుతారు.

లక్ష్మణ భరత శత్రుఘ్నులు

వాల్మీకి రామాయణంలో దశరథుడు యజ్ఞం చేసినప్పుడు ప్రాజాపాద్య పురుషుడు (యజ్ఞ పురుషుడు) ప్రత్యక్షమై పాయసపాత్రని ఇస్తాడు. ఆ పాయసాన్ని రెండు భాగాలు చేసి ఒక భాగం కౌసల్యకు, రెండోభాగం లో సగం సుమిత్రకు ఇస్తాడు. మిగిలిన భాగాన్ని మళ్ళీ రెండుసగాలు చేసి, ఒక సగం సుమిత్రకు, రెండో సగం కైకేయికి ఇస్తాడు. కైకేయి ఎంత ముద్దుల భార్య అయినా ఆమెకి దక్కింది ఎనిమిదో వంతు మాత్రమే!

ఆధ్యాత్మ రామాయణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసాన్ని ఇస్తాడు. దాన్ని రెండు సగాలు చేసి కౌసల్యకి, కైకేయికు ఇస్తాడు దశరథుడు. దీనంగా చూసిన సుమిత్రని చూసి ఇద్దరూ వారి భాగాలలో నుంచీ సగంసగం సుమిత్రకి ఇస్తారు. కౌసల్యా కైకేయిల పాయస భాగాల నుంచీ సగ భాగాలను సుమిత్ర సేవించటం చేత ఆమె పుత్రులలో ఒకడైన లక్ష్మణుడు శ్రీరాముడితోను, మరొకడైన శత్రుఘ్నుడు భరతుడితోనూ స్నేహపూర్వకంగా తిరుగుతూ ఉంటారు. అంతేకాక వారికి నామకరణం చేసేటప్పుడు వారికి ఆయా పేర్లు ఎందుకు పెట్టవలసివచ్చిందో కూడా చెబుతాడు వశిష్టుడు.

అందరినీ రమింపజేస్తాడు (ఆనందింప జేస్తాడు) కాబట్టి ‘రాముడు’ అని, రాజ్యపాలనలో దక్షుడిగా ఉండాలని ‘భరతుడు’ అని, సకల లక్షణాలతో ప్రకాశించే వాడు కాబట్టి ‘లక్ష్మణుడు’ అని, శత్రువుల గుండెల్లో బల్లెంగా ఉంటాడు కాబట్టి ‘శత్రుఘ్నుడు’ అనీ శిశువులకు నామకరణం చేస్తాడు కులగురువు వశిష్ఠుడు.

కౌసల్య

కౌసల్యకు పుత్రుడు జన్మించగానే పట్టుపీతాంబరాలతో, చతుర్భుజాలతో శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఆ అలౌకిక దివ్య స్వరూపాన్ని చూసిన కౌసల్య ఆశ్చర్యంతో “పరమాత్మా! ఈ బ్రహ్మాండ భాండం నీ కడుపులో ఒక పరమాణువు వంటిది. లోకరీతుల కోసం నా కుమారుడుగా జన్మించావు. నీ అలౌకిక రూపం నా మదిలో ముద్రించబడినది.” అంటూ పరిపరి విధాల స్తోత్రం చేస్తుంది. అప్పుడు విష్ణువు “అమ్మా! రావణాదుల వధ కోసం నన్ను భూలోకంలో జన్మించమని బ్రహ్మ కోరాడు. పూర్వం నువ్వు, దశరథుడు నన్ను మీ పుత్రుడిగా బడయాలని తపస్సు చేశారు. అందుకే నీకు పుత్రుడిగా జన్మించాను. ఆ తపోఫలితంగానే నా రూపాన్ని చూడగలిగావు” అని చెప్పి, తన రూపాన్ని ఉపసంహరించుకుని, శిశువు రూపం దాల్చి అప్పుడే పుట్టిన బిడ్డలా ఏడుస్తాడు. ఈ సంఘటన వాల్మీకంలో లేదు.

కైకేయి, మంథరలు

దశరథుడు రామపట్టాభిషేకం తలపెట్టినప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి నమస్కరిస్తారు. “పద్మసంభవా! రాముడు రాజై అయోధ్యను పరిపాలిస్తుంటే రావణ కుంభకర్ణాది రాక్షసుల సంహారం జరిగేదెలా? మా కష్టాలు తీరే మార్గమే లేదా?” అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మ సరస్వతి వంక చూసి “వాగ్దేవీ! నువ్వు తొలుత అయోధ్యకు చేరి మంథర హృదయాన్ని ఆక్రమించి ఆమె జిహ్వలో ప్రవేశించు. ఆమె ద్వారా కైకేయికి దుర్బోధ కావించు. పిదప కైకేయి మనసుని ఆవహించి రాముడి రాజ్యాభిషేకానికి అంతరాయం కలిగించాలి. నేను తలపెట్టిన అభిషేక అంతరాయ కార్యాన్ని సఫలం చేసి, తిరిగి సత్యలోకానికి రా!” అని ఆజ్ఞాపించాడు. ఆవిధంగా సరస్వతీ దేవి ప్రభావం వలన మంథర దుర్భోధలు చేయటం, కైకేయి రెండు వరాలను కోరటం జరుగుతుంది.

భరతుడు రాముడిని ఒప్పించి తిరిగి అయోధ్యకు తీసుకురావటం కోసం చిత్రకూటానికి తల్లులు, పరివారంతో వెళతారు. అప్పటికి కైకేయిని విడిచి వెళ్ళిపోతుంది సరస్వతీదేవి. కైకేయి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ “రామా! ఏదో మాయ నన్నావహించింది. దాని ఫలితంగానే నేను మూఢురాలినై నీ రాజ్యాభిషేకానికి భంగం కలిగించాను. నన్ను క్షమించు. క్షమాగుణమే మహాత్ముల లక్షణం కదా! నువ్వే సాక్షాత్తూ మహావిష్ణువువు” అని అంటుంది. అప్పుడు రాముడు “నువ్వు పలికినవన్నీ యథార్థాలే! నా ప్రేరేపణ చేతనే వాణి నిన్నావహించింది. కాబట్టి నువ్వు దోషివి కావు. అన్ని వేళలా నన్ను స్మరిస్తూ నీ దైనందిన కార్యాలలో పాల్గొను. అప్పుడు నీకు కర్మఫలాల పైన ఆసక్తి తొలగి మోక్షాన్ని పొందుతావు” అని చెబుతాడు.

కాలనేమి

లక్షణుడు మూర్చపోయిన తర్వాత హనుమంతుడు సంజీవిని ఔషధం కోసం బయలుదేరతాడు. రావణుడు కాలనేమి ఆశ్రమానికి వెళ్లి, “లక్ష్మణుడు మరణించాడు. అతడిని బ్రతికించటానికి హనుమంతుడు సంజీవిని కోసం బయలుదేరాడు. నువ్వు అతడిని ఎలాగైనా మోసం చేసి, వధించాలి” అని చెబుతాడు. కాలనేమి రాముడు సామాన్యుడు కాదనీ, ఈ ప్రయత్నం విరమించమనీ, సీతను అప్పగించి శరణు కోరమనీ హితబోధ చేస్తాడు. రావణుడు వినక పోయేసరికి సరేనని, ఒక ఆశ్రమం సృష్టించి, తాను ముని వేషంలో ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు. హనుమంతుడు ఆ దారిలో వస్తూ “ఇంతక్రితం ఈ ఆశ్రమం ఇక్కడ చూడలేదే! ఏ మహానుభావుడిదో!” అనుకుంటూ కిందికి దిగివచ్చి కాలనేమికి నమస్కరించి, “నేను చాలా బడలి పోయాను. దప్పిక తీర్చుకోవటానికి సమీపంలో ఏదైనా కొలను ఉంటే చెప్పండి” అని అడుగుతాడు.

కాలనేమి శిష్యుడిని తోడిచ్చి కొలను దగ్గరకు పంపిస్తాడు. హనుమంతుడు దోసిలితో దాహం తీర్చుకుంటూ ఉండగా, భయంకరమైన ఒక మొసలి అతడిని పట్టుకుంది. హనుమంతుడు దాన్ని చీల్చి చంపివేస్తాడు. వెంటనే దానిలో నుంచీ ధాన్యమాలి అనే అప్సరస వెలువడి తను శాపవశాత్తూ మొసలి రూపం పొందానని చెపుతుంది. తర్వాత కాలనేమి మహర్షి కాదనీ, మాయారూపుడైన రాక్షసుడనీ చెప్పి. అతడిని వధించి నీ కార్యాన్ని సాధించుకో! నీ స్పర్శ చేత నా పాపాలు నశించాయి అని చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతుంది. మారుతి ఆశ్రమానికి తిరిగి వచ్చిన తర్వాత కాలనేమి, “నీ ఆలస్యానికి కారణం ఏమిటి? నాకు గురుదక్షిణ ఇవ్వు” అంటాడు. “ఇదిగో గురుదక్షిణ” అని ఆ మాయావి నెత్తిన ఒక గుద్దు గుద్ది, తల పగలగొట్టి వెళ్ళిపోతాడు మారుతి. వాల్మీకంలో కాలనేమి ప్రస్థావన లేదు.

ఈ విధంగా వాల్మీకి రామాయణంలో లేని అనేక మార్పులు ఆధ్యాత్మ రామాయణంలో కనిపిస్తాయి. వాల్మీకి రామాయణం 24 వేల శ్లోకాలతో రచిస్తే ఆధ్యాత్మ రామాయణం కేవలం 3,653 శ్లోకాలతో మాత్రమే ఉన్నది. శ్రీరాముడి మకుటాభిషేకం తర్వాత పరమేశ్వరుడు పార్వతీ సహితుడై సర్వదేవ గణాలు వెంబడిస్తుంటే కైలాసం నుంచీ అయోధ్యకు వచ్చి శ్రీరాముడిని స్తోత్రం చేయటంతో ఆధ్యాత్మ రామాయణం ముగుస్తుంది (ఉత్తర కాండ లేదు).

రామావతార తత్త్వ రహస్యాలను తేటతెల్లపరచే ఆధ్యాత్మ విషయాలను వివరంగా తెలుసుకోవటం కోసమే వ్యాసమహర్షి దీనిని రచించాడు. ప్రజాహితం కోసం ఉపదేశింపబడిన ఈ ఉమామహేశ్వర సంవాదం లోకంలో ఆధ్యాత్మ రామాయణంగా వెలసి రామభక్తుల పూజలందుకుంటూ ఉంది.

“రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకా భీష్టదాయ మహితమంగళం
విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామితాయ శుభ్రమంగళం!”

Exit mobile version