Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘ఆదర్శపథం’ పుస్తకానికి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య పీఠిక

ఆచార్య వెలుదండ నిత్యానందరావు సమగ్రసాహిత్యం ఏడవ సంపుటం ఆదర్శపథం (భారతీయ జ్వలిత చేతన బంకించంద్ర, రాజనీతిజ్ఞుడు బూర్గుల రామకృష్ణారావు)కు – ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు రాసిన పీఠిక.

ఆమోదం

డాక్టర్ వెలుదండ నిత్యానందరావు దాదాపు విద్యార్థిగానే నాకు పరిచయం. నవ్వుతూ, ప్రతి విషయాన్నీ సులభమైనదానిగా స్వీకరిస్తూ, చమత్కరిస్తూ కనిపించే అతని వ్యక్తిత్వం పైపైన వ్యాపించింది. దానికి అడుగున అతి తీవ్రమైన ఆకాంక్ష, స్వప్నదర్శనం, ఒక్కడైనా చిక్కులున్నా సాగిపోయే నిశ్చయబుద్దీ, కార్యప్రణాళికను తన ఆకాంక్షకు అనుగుణంగా తీర్చుకోగల నేర్పూ ఇవన్నీ అతని మూల స్వత్వంలో ఇమిడి ఉన్నాయి.

అప్పుడు పూర్తి చేసిన తెలుగు పరిశోధనల సమీకరణం, తెలుగులో గ్రంథసమీక్షల స్వరూపస్వభావాలను నిర్ణయించగల సమీక్షావ్యాస సంకలనం కోసం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం అతనిలోని ప్రాణమూలదఘ్నంగా ఉన్న ‘తీవ్రసాధకత’ను నిరూపిస్తున్నవి.

పేరడీ పద్యాలు వ్రాసినా, చంద్రరేఖా విలాపాన్ని పరిశోధనకు స్వీకరించినా, ‘హాస విలాసం’ వంటి వ్యాససంకలనాలు ప్రకటించినా పైపైన కనిపించే వ్యక్తిత్వపార్శ్వం ప్రేరణతో ‘లోపలిదీక్షాదక్షత’ రూపుగొన్న విశిష్టాంశాలే.

‘భారతీయ జ్వలిత చేతన బంకించంద్ర’ ఇప్పుడు వెలుగులోకి వస్తున్న పుస్తకం. బంకించంద్రుడు తెలుగు పాఠకులకు శతాబ్దం పైగానే ఎరిగివున్న విశిష్ట రచయిత. ఆనందమఠం కాకుండా కృష్ణకాంతుని వీలునామా, దుర్దేశనందిని, కపాలకుండల ఇవన్నీ రెండు మూడు తరాల క్రింద తెలుగు పాఠకులను మైమరపించిన రచనలే. రవీంద్రుని కన్న ముందే బంకించంద్రుని రచనలు తెలుగు సాహిత్య రసికతకు పదును పెట్టినాయి.

బంకించంద్రుని నవలలు, ద్విజేంద్రలాల్ రాయ్ వంటివారి నాటకాలు తెలుగు సాహిత్యంలో 1910 ప్రాంతాలనుంచి భావ భూమిక మీద జాతీయతేజస్సును ఉజ్జ్వలంగా ప్రకాశింపజేసిన రచనలు. తొలితరం తెలుగు నవలారచయితలు, నాటకకర్తలు జాతీయోద్యమస్ఫూర్తిని చరిత్ర స్ఫటిక సంపుటాలలో బహువర్ణ శబలితేంద్రధనువులా ప్రకాశింపజేసేట్లు చేశారు. ఓ.వై. దొరస్వామయ్య, చిల్లరిగె శ్రీనివాసరావు, తల్లాప్రగడ సూర్యనారాయణ, చాగంటి శేషయ్య, చిలకమర్తి లక్ష్మీనరసింహం, ధరణిప్రగడ వెంకటశివరావు, భోగరాజు నారాయణమూర్తి, చిలుకూరి వీరభద్రరావు, దుగ్గిరాల రాఘవచంద్రయ్య సచ్ఛాస్తి మొదలైన రచయితలను ఎందరినో పేర్కొనవచ్చు. తరువాతి తరంలో అడవి బాపిరాజు, విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహశాస్త్రి ఈ చారిత్రక నవలా సాహిత్యాన్ని బహుముఖంగా విస్తరించేట్లు చేశారు. జాతీయోద్యమస్ఫూర్తి ఒక అర్ధశతాబ్దం పాటు తెలుగు సాహిత్యాన్ని ఉజ్జ్వలితం చేసింది. ప్రతాపరుద్రీయం వంటి నాటకాలు ఈ దారిని ఆవిష్కరించాయి.

భారతదేశంలో పునరుజ్జీవనోద్యమంలో పాశ్చాత్య ప్రభావం పలుచబడి భారతీయ జీవనమూల్యాలు పరిష్కృతం కావటం ప్రధానాంశమే. ఈ పునాదిపైనే ఆధునిక సాహిత్యోద్యమం రూపుకట్టింది. బంకిం రచనలలో పురాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఇతిహాసపురాణగాథలు అన్నీ నూతన హేతువాదదీప్తితో వ్యాఖ్యానింపబడ్డాయి. రామమోహనరాయ్, శ్రీరామకృష్ణులు, దయానంద సరస్వతి ఈ ముగ్గురూ మూడుదారుల్లో ఈ పరిషృతి కార్యాన్ని నిర్వహించి మనకు పురాపినవ్యమైన కొత్త సంస్కృతిని ప్రసాదించారు. తరువాత ఈ సంస్కృతికి పతాకనెత్తిన వివేకానందులూ, రాజకీయోద్యమంగా మలచిన తిలక్, గాంధీలు, ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక స్తరాలలో విలక్షణమైన సమన్వయాన్ని సాధించిన శ్రీ అరవిందులు, రమణులు కళారంగంలో కావ్యగ్రోతస్సు ద్వారా సౌందర్య తాత్త్యికతలకు సమన్వయం కూర్చిన రవీంద్రులు అనంతర కాలాన్ని సుసంపన్నం చేశారు.

ఇదంతా నాటి ఆంగ్లేయుల సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి విరోధించిన జాతీయభావపు సముల్బణం.

బంకించంద్రుని జీవనాన్ని అధ్యయనం చేస్తే భారత పునరుజ్జీవనోద్యమపు వికాస క్రమం అవగతమవుతుంది.

శ్రీరామకృష్ణులు, కేశవచంద్రసేన్, రమేశ్ చంద్రదత్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రవీంద్రనాథ్ టాగూరు, పండిత శశిధర తర్కచూడామణి ఇలా ఎందరో సమకాలికులు ఆయన వెనకాముందూ సాగిపోయిన వాళ్ళు. అయినా బంకించంద్రుడు తన విశిష్టత చేత వంగసాహిత్యంలోనే కాక భారతీయ సాహిత్యంలోనే అతి ప్రముఖ ప్రభావశీలమైన సృజనాత్మకతతో మార్గదర్శకత్వం వహించాడు.

డాక్టర్ వెలుదండ నిత్యానందరావు బంకించంద్రుని చరిత్రను, సాహిత్యాన్ని వివరిస్తూ పోయినా – చివరలో వందేమాతరం గీతావిర్భావం జరిగిన సన్నివేశాన్ని వర్ణించే సందర్భంలో ఆయనలో దాగివున్న కవిత్వాంశ మామిడి చివురుల గుబురుల్లోంచి వెతికి వచ్చిన కోకిలలాగా కనిపిస్తున్నది. ఆవేశం పొంగిపొర్లింది.

ఒక ఋషికి అనాహతంలో ధ్వనించిన మంత్రం వలె, ఋక్కువలె ‘వందేమాతర’ గీతం ఆవిర్భవించింది. ఈ తల్లిని భావిస్తూపోతే భౌతికచేతన, ఆత్మిక రూపాలు క్రమక్రమంగా ఉన్మీలితమయ్యాయి. సప్తశతిలోని మూడుచరిత్రలూ కదలివచ్చాయి. శ్రీ అరవిందులు అన్నట్లు ‘మాతృభూమి ఒక మట్టిగడ్డ కాదు. మనస్సు చేసుకున్న కల్పన కూడా కాదు. అనేక కోట్ల శక్తుల సమాహారమైన మహాశక్తి’. ఈ భావనతో పాశ్చాత్య దేశాల జాతీయోద్యమాల సంకుచిత పరిమితులు పటాపంచలయినాయి. సమస్త సృష్టికీ అంతర్బహిస్సులలో ఆవరించిన మహాశక్తి ఒకానొక భౌగోళిక పరిమితులకు ఎట్లా సీమితమవుతుంది?

ఈనాడు వైదికమంత్రం దర్శనం కావటం, శ్రుతమవటం సాధ్యమా అనే ప్రశ్న కలుగుతుంది. ‘అనంతావై వేదా!’ అన్న వేదాలలో మనకు లభ్యమైనభాగం స్వల్పమయిందే. ఇటీవలికాలందాకా జీవించి ఉన్న దేవరాతులు (కావ్యకంఠగణపతి ముని శిష్యులు) అనేక ఋక్కులను దర్శించటం, వాటిని గణపతిముని గ్రంథస్థం చేయటం మనం ఎరిగిన సత్యమే.

వైదిక వాజ్మయంలో భూమిని తల్లిగా వర్ణించిన సందర్భాలు ఉన్నమాట నిజమే కాని అక్కడ భారతభూమి అన్న నిర్దేశం ఉన్నట్లు లేదు. భారత మాతృభావన ఎప్పుడు ఆరంభమయింది అన్న ప్రశ్న. ఈ గ్రంథంలో ఉదాహరింపబడిన డెరీజియో (1809- 1831) కవితలో ఈ భావం స్పష్టంగా ప్రకటితమయినట్లు కానవస్తున్నది. భారత మాతృభావన తత్పూర్వం ఎక్కడైనా సూచితమైందేమో పరిశోధించవలసి ఉన్నది. డెరీజియో భావనలో వర్తమాన దుఃస్థితి స్పష్టంగా వర్ణించబడింది. బంకించంద్రుని ‘వందేమాతరం’ ఆ పునాది మీదనుంచి ఉద్గమించి ఊర్ధ్వ లోకాలన్నింటి చివర అంచుదాకా సాగిపోయింది. మన జాతీయోద్యమపు అన్ని పార్శ్వాలకు వందేమాతరం గీతం ప్రాణధాతువును పంచింది.

బంకించంద్రుని జీవితాన్ని సారస్వతాన్ని సమదృష్టితో అంచనా వేసిన విలక్షణమైన ప్రయత్నం ఈ పుస్తకం. ఇంతకుపూర్వం వెలువడ్డ సాహిత్య అకాడమీవారి ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ పరంపరలోని గ్రంథం ఇంత విస్తృతమైంది కాదు. బంకించంద్రుడు ఆనాళ్ళలో మేజిస్ట్రేట్ వంటి ఉన్నతోద్యోగాలలో కొనసాగినా అతని బ్రతుకు పూలపాన్పేమీ కాదు. చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం ఆయనకు ఎన్నో చిక్కులు తెచ్చి పెట్టాయి. అయితే ఆయన రచయితగా వంగసాహిత్యజగత్తుకే ప్రకాశం కలిగించాడు.

రవీంద్రునికి తొలిసారి బంకించంద్రుని దర్శించినప్పుడు కలిగిన అనుభవం – ఆయన వ్యక్తిత్వాన్ని విశదంగా చిత్రిస్తున్నది. అందరికంటే విశిష్టంగా ఆయన వ్యక్తిత్వం కానవచ్చేదంటే – ఆయన ఫాలభాగంలోని దీప్తిలో ఒక రాజకుమారుని ఠీవి స్ఫురించేది.

నాటి సమాజ నిర్మాతల్లో ఉండే విచిత్రమైన మనో లక్షణాన్ని, ద్విధావైఖరిని ఈ రచనలు స్పష్టం చేస్తాయి. ‘మహర్షులు కనుక, భారతీయులు కనుక సంస్కృతంలో చెప్పారు కనుక ప్రతివాక్యం ఆమోదయోగ్యం అనడాన్ని, అలాగే పాలకులు కనుక, అభివృద్ధి చెందినవారు కనుక శిరోధార్యం అనేదానికి మేం విశ్వసించం’ అని బంకించంద్రుడు మాత్రం స్పష్టంగా సత్యాన్ని పరీక్షించి నిగ్గు తేల్చుకోవటానికే నిశ్చయించాడు.

ఇంగ్లీషులో రచన చేయగలిగి ఉండి ఆయన వంగభాషలో రచన చేసి దేశీయభాషా వికాసానికి దారిచూపాడు. ప్రముఖ ఆర్థికశాస్త్రవేత్త రమేశచంద్రదత్తును బెంగాలీలో రచన చేసేందుకు ప్రోత్సహించి కృతకృత్యుడయ్యాడు.

ప్రాణావసాన సమయంలో ‘మీరెందుకు ఔషధాలు తీసుకోవటంలేద’ని ఎవరో ప్రశ్నిస్తే – ఆయన తన దగ్గర ఉన్న భగవద్గీతను చూపించి అదే తన ఔషధమని చెప్పాడట.

చిత్తశుద్ధితోడి జీవితము, తేజోవంతమైన వ్యక్తిత్వము, లక్ష్యపరిపుష్టమైన సాహిత్యము బంకించంద్రునికి సాహిత్య రంగంలో అగ్రస్థానం పొందడానికి హేతువయ్యాయి. అయితే ఆయనలో ఉద్దిష్టమైన వందేమాతర గీతం వేల సంవత్సరాలుగా గర్భితమై ఉన్న భారతదేశ సంస్కృతీ సంభావనలలోనుంచి ఒక అపూర్వ మనోమాతృదర్శనానికి, ఆర్షస్పూర్తి పునరాగమనానికి కారణమైంది. జాతి యింకా తన స్వత్వాన్ని కోల్పోలేదనీ, పునరుజ్జీవింపగలదనీ నిరూపించింది. మహర్షుల చైతన్యం మరల జాగృతి పొందింది.

బంకించంద్రుని జీవితాన్ని ఇంత సమగ్రంగా – ఆయన సాహిత్యాన్ని గురించి యింత విపులంగా గ్రంథాన్ని రచించిన డాక్టర్ నిత్యానందరావును అభినందించడం మన కర్తవ్యం.

మన పునరుజ్జీవన చేతనను మళ్ళీ మనం ఆత్మలలోకి ఆవిష్కరించుకునే సమయం ఆసన్నమయింది. స్వపరిపాలన వచ్చిన తరువాత మన జీవితం, చేతన, భావన భయంతో, సంకుచితత్వంతో, పిరికితనంతో కుంచించుకు పోయాయి. 1947లో జరిగిన దేశవిభజన, అంతటితో ఆగకుండా ఇంకా అనేక ఖండఖండాలు విభక్తమవుతున్నట్లుగా గోచరిస్తున్నది. హిందూత్వభావన ఉపరితలంలో తిరస్కరింపబడుతున్నది. మతాంతరీకరణలు, మనం పరాయితనం పొందడం క్రమంగా ఎక్కువవుతున్నది. సమాజం ముక్కలు ముక్కలుగా చీల్చబడుతున్నది. ఆదర్శంలేని జీవితం, దిశానిర్దేశం చేయలేని నాయకత్వం, సుఖవ్యామోహంలో పడ్డ వ్యక్తి సమూహం, అట్టడుగున నైతికాధారం లేని భావదరిద్రమైన విద్యావంతుల వర్గమూ ఆవరించి ఉన్నది. ఈనాడు మళ్లీ పునరుజ్జీవన సూర్యోదయం కావాలి.

ఈ ప్రయత్నంలో డాక్టర్ నిత్యానందరావు చేసిన ప్రయత్నం ఎంతో కొంతైనా తోడ్పడగలదనీ, సంశయసందేహసంహారం చేయగలదనీ విశ్వాసం కలుగుతున్నది.

ఈ గ్రంథాన్ని శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామివారికి సమర్పించటం పరమౌచిత్య సన్నివేశం. శ్రీ స్వామివారు పూర్వాశ్రమంలో సాంస్కృతిక మహాయోద్ధ. ఇప్పుడు జాతి చైతన్యాన్ని తమ తపోదీప్తిచేత జాగృతపరుస్తున్న పరివ్రాజకులు.

లక్ష్యసిద్ధిదాకా డాక్టర్ నిత్యానందరావు ప్రయాణం కొనసాగవలెనని, దానికి తగిన శక్తి సామర్థ్యాలు, ఆయురారోగ్యాలు కలుగవలెనని ఆశిస్తున్నాను.

***

ఆదర్శపథం (భారతీయ జ్వలిత చేతన బంకించంద్ర, రాజనీతిజ్ఞుడు బూర్గుల రామకృష్ణారావు)
(ఆచార్య వెలుదండ నిత్యానందరావు సమగ్రసాహిత్యం ఏడవ సంపుటం)
రచన: వెలుదండ నిత్యానందరావు
పుటలు: 340
వెల: 500/-
ప్రతులకు
రచయిత ఫోన్ నెంబర్ 9441666881కు గూగుల్ పే చేసి తెప్పించుకోవచ్చు.

Exit mobile version