పద్మావతీ విద్యానిధి:
తిరుపతిలో పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం 1983లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పడింది. తొలి రోజుల్లో ప్రముఖ విద్యావేత్త శ్రీమతి వనజా అయ్యంగార్ దిశానిర్దేశం చేశారు. శ్రీనివాసుని దేవేరి అయిన పద్మావతి పేర మహిళా విద్యాభ్యున్నతికి నందమూరి తారకరామారావు ఈ విశ్వవిద్యాలయ స్థాపనకు సంకల్పించారు. ఇందులో 16 శాఖలు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు, 14 యం.ఫిల్, పి.హెచ్.డి కోర్సులు నడుస్తూ దాదాపు మూడు వేల మంది విద్యార్థినులకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇక్కడి యం.బి.ఏ. కోర్సుకు బాగా డిమాండ్ వుంది. 138 ఎకరాల సువిశాల ప్రాంగణంలో తిరుమలేశుని పద సన్నిధిలో ఇది విరాజిల్లుతోంది. విదేశీ విద్యా సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకొని మహిళాభ్యున్నతి దిశగా నడుస్తోంది. ప్రస్తుత వైస్-ఛాన్సలర్ (2020) ఆచార్య దువ్వూరి జమున. ఈ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్యులు పి.కుసుమ కుమారి శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయ్యారు. ఇక్కడి జర్నలిజం విభాగ విద్యార్థిని ఆచార్య వి.దుర్గభవాని అదే విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ కావడం విశేషం.
భువన విజయం నాటకంలో రచయిత
గతమెంతో ఘనకీర్తి:
పద్మవతీ విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో అధ్యాపకులుగా పని చేసినవారు – ఆచార్య పి.కుసుమకుమారి, ఆచార్య ఇందిర, ఆచార్య యం.విజయలక్ష్మి, ఆచార్య డి.కృష్ణకుమారి, డా.శరావతి ప్రభృతులు. ప్రస్తుత శాఖాధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి.
ప్రతిభామూర్తి కుసుమకుమారి (1950):
35 సంవత్సరాల బోధనానుభవం గల పి. కుసుమకుమారి 1973లో అనంతపురంలోని సత్యసాయి ఉన్నత విద్యా సంస్థలో అధ్యాపకులుగా చేరారు. 1984లో తిరుపతిలో పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో ప్రవేశించి 1992లో ఆచార్య పదవి నధిష్ఠించారు. ఆమె బి.యస్.సి, ఎం.ఏ., బి.ఇడి పూర్తి చేశారు. తిరుపతి విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పొందారు. పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ బోర్డు ఆఫ్ స్టడీస్ అధ్యక్షులుగా 12 ఏళ్లు ఉన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌గా, తాత్కాలిక రిజిష్ట్రార్‌గా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా వివిధ పదవులు లభించాయి.
ఆమె పర్యవేక్షణలో 18 మంది పి.హెచ్.డిలు, నలుగురు యం.ఫిల్ పొందారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. అమెరికా, చైనా, ఈజిప్టు, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ సందర్శించారు. అనేక విద్యా సంబంధ విశ్వవిద్యాలయాలతో అనుబంధం వుంది. 1992లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపిక బహుమతి, 2001లో కవిత్రయ జయంతి సన్మానము లభించాయి.
అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా 2008 ఆగస్టు నుండి 2010 ఆగస్టు వరకు వ్యవహరించారు. భూమన్ (బి.యస్.రెడ్డి) కుసుమకుమారి దంపతులు ఆంధ్రదేశంలో సుప్రతిష్ఠితులు.
శ్రీమతి కుసుమకుమారి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో డా. కేతు విశ్వనాధరెడ్డి పర్యవేక్షణలో ‘రాయలసీమలోని బ్రిటీషు రికార్డుల ఆధారంగా తెలుగులో హిందూస్థానీ ఆదాన పదాలు’ అనే అంశంపై పరిశోధన జరిపి 1982లో పి.హెచ్.డి పొందారు. గ్రంథం ముద్రితం. కుసుమకుమారి పర్యవేక్షణలో జరిగిన పరిశోధనలో అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, అడవి బాపిరాజు, మధురాంతకం రాజారాం, కుప్పిలి పద్మ, కొమ్మనాపల్లి గణపతిరావు తదితర రచయితల కథలు పరిశీలన జరిగాయి.
ప్రొఫెసర్ పి. కుసుమకుమారి, డా. గంగిశెట్టి లక్ష్మీనారాయణ, అరుణ కుమారి గారు
వైయాకరణి:
పద్మావతీ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్యులుగా, పరిశోధనా తపస్విని దావులూరి కృష్ణకుమారి ప్రసిద్ధురాలు. ఇంటూరులో (గుంటూరు జిల్లా) 1951 జూన్‌లో జన్మించిన కృష్ణకుమారి పొన్నూరు భావనారాయణ కళాశాలలో భాషాప్రవీణ (1968-72) చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. (1978), ఎం.ఫిల్ (వ్యాకరణం) 1982లో పూర్తి చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయం నుండి 1988లో పి.హెచ్.డి సంపాదించారు. సాహిత్య గురువుల వద్ద సంప్రదాయ పద్ధతిలో పంచకావ్యాలతో బాటు వ్యాకరణము అధ్యయనం చేశారు. కొండవీటి వెంకటకవి, శ్రీ కృష్ణగవాన్ వంటి పండితుల శిష్యరికం లభించింది.
వృత్తి – ప్రవృత్తి:
మహారాజా మహిళా కళాశాల, విజయనగరంలో సీనియర్ ఉపన్యాసకులుగా 12 సంవత్సరాలు (1981-93) బోధనలు కొనసాగించారు. పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో 1993లో లెక్చరర్‌గా చేరి, రీడరు (1997), ప్రొఫెసర్ (2005) పదవుల లంకరించారు. 2011లో పదవీవిరమణ చేసినా పరిశోధనా రంగాన్ని వీడలేదు. శాఖాధ్యక్షులుగా 2004-2007 మధ్య వ్యవహరించారు.
డా. దావులూరి కృష్ణకుమారి
గ్రంథ వికాసం:
సాహిత్య వారసత్వం గల కుటుంబం నుండి రాకపోయినా ఒక సగటు వ్యక్తి ఆచార్య పదవి నధిష్ఠించడం విశేషం. వీరి తొలి గ్రంథం – బాలవ్యాకరణ సంజ్ఞాచంద్రిక (1974). స్త్రీల కోశ గ్రంథాలలో తొలి రాణి రుద్రమదేవి (1985) ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందింది. కవిజనాంజన పరిశీలనం (1982) ఎం.ఫిల్ సిద్ధాంత గ్రంథం. ఆంధ్ర శబ్దచింతామణి – తద్వాఖ్యానాలు (1988) పి.హెచ్.డి సిద్ధాంత గ్రంథం. పలువురు పండితుల ప్రశంసలందుకొన్న విదుషీమణి. వివిధ విశ్వవిద్యాలయాల పాఠ్యాంశ రచనలు చేశారు. 2007లో 16వ తానా సభల్లో పత్రసమర్పణ చేశారు. వివిధ జాతీయ సదస్సులు నిర్వహించారు. వీరి వద్ద నలుగురు పి.హెచ్.డి; ముగ్గురు ఎం.ఫిల్ చేశారు. వీరి భర్త సాంబశివరావు విజయనగరం ప్రభుత్వ మహారాజా కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పని చేసేవారు. వీరిది సంస్కార వివాహం.
వివిధ విశ్వవిద్యాలయ ఆవిర్భవ చట్టాలు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్):
- ఆంధ్రా యూనివర్శిటీ చట్టం, 1925, విశాఖపట్టణం
- శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ చట్టం, 1954, తిరుపతి
- ఉస్మానియా యూనివర్శిటీ చట్టం, 1959(1918), హైదరాబాదు
- శ్రీ నాగార్జున యూనివర్శిటీ చట్టం, 1976, గుంటూరు
- కాకతీయ విశ్వవిద్యాలయం చట్టం, 1976, వరంగల్
- శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ చట్టం, 1981, అనంతపురం
- శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, 1983, తిరుపతి
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చట్టం, 1985, హైదరాబాదు
- ద్రవిడ విశ్వవిద్యాలయం, 1997, కుప్పం
- యోగి వేమన విశ్వవిద్యాలయం, 2006, కడప
- శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, 2006, తిరుపతి
- బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, 2008, శ్రీకాకుళం, ఎచ్చెర్ల
- కృష్ణా విశ్వవిద్యాలయం, 2008, మచిలీపట్టణం
- రాయలసీమ విశ్వవిద్యాలయం, 2008, కర్నూలు
- విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, 2008, నెల్లూరు
కేంద్రీయ విశ్వవిద్యాలయాలు:
- సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2018, అనంతపురం
- సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2019, విజయనగరం
- జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, 1961(1987), తిరుపతి
- కేంధ్రీయ విశ్వవిద్యాలయం, 1974, హైదరాబాదు
తెలంగాణా:
- బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, 1982, హైదరాబాదు
- శాతవాహన విశ్వవిద్యాలయం, 2006, కరీంనగర్
- తెలంగాణా విశ్వవిద్యాలయం, 2006, నిజామాబాదు
- మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, 2007, నల్గొండ
- పాలమూరు విశ్వవిద్యాలయం, 2008, మహబూబ్ నగర్
ఇవి గాక ఉర్దూ, సాంకేతిక, వైద్య, న్యాయ, పశువైద్య, ఉద్యానవన, వ్యవసాయ తదితర పలు విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్నాయి. డీమ్డ్ యూనివర్శిటీలు, అటనామస్ యూనివర్శిటీలు వేరు.
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 76 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 18 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు.
అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు.
సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.