Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆచార్యదేవోభవ-25

ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు.

సాహితీ చక్రధరుడు:

ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఆంధ్ర శాఖలో పని చేసిన ఆచార్యులు ఒక్కొక్కరు ఒక్కక్క విశిష్ట లక్షణాలు గలవారు. సాహిత్య చరిత్రకారులు కొందరు, యక్షగాన పరిశోధకులొకరు, సంస్థాన పరిశోధకులొకరు, అధ్యాత్మిక భావజాల దురంధురులొకరు, రమణీయ వ్యాకరణ సూరులొకరు. అట్టి గౌరవ పరంపరంలో లకంసాని చక్రధరరావు తెలుగు వ్యుత్పత్తి కోశ నిర్మాతగా ప్రసిద్ధులు. లక్షకు పైగా తెలుగు పదాల వ్యుత్పత్తులను 8 సంపుటాలుగా రచించగా విశ్వవిద్యాలయం ప్రచురించింది. ఆపైన తెలుగులో చేరిన సంస్కృత పదాల నిఘంటు నిర్మాణ బృహత్తర కార్యక్రమం చేపట్టారు. వ్యుత్పత్తి పదకోశం ఆన్‌లైన్‌లో రూపొందించారు కూడా.

“నన్నయభట్టుగారు యజనం బొనరించిన చోట జమ్మి చె
ట్టున్నది తణ్కుతూర్పున….” అని ఒక నానుడి ప్రచారంలో వుంది.

ఆ నన్నయ యజ్ఞం చేసిన తణుకులో చక్రధరరావు యస్.యల్.సి. వరకు చదివారు. అక్కడ కేశవస్వామి ఆలయం ప్రసిద్ధం. ఆలయానికి తరచూ వెళ్తున్న ఈ విద్యార్థి వంద శార్దూల మత్తేభ వృత్తాలతో కేశవ శతకం విద్యార్థి దశలోనే రచించి భక్తి ప్రపత్తులు చాటుకొన్నాడు. సాధారణంగా కవులు తొలి రచనను శతకంతో చిరుప్రాయంలో మొదలు పెట్టడం సహజం. ఆ కేశవస్వామి ఆశీస్సులు ఈతనిపై విశేషంగా వర్షించాయి. ఆ శతక ముద్రణ 1957లో జరిగింది. అప్పటికాయన వయస్సు 18 సంవత్సరాలు.

పశ్చిమ గోదావరి జిల్లా చివటం గ్రామంలో రైతు కుటుంబంలో చక్రధరరావు 1939 జూలై 3న జన్మించారు. విద్యార్జన  సమయంలోనే ఛందస్సుపై పట్టు సాధించి అందమైన కందపద్యాలు వ్రాయడం మొదలు పెట్టారు. తణుకులో హైస్కూలు విద్య పూర్తి కాగానే భీమవరం కళాశాలలో ఇంటర్మీడియట్, రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో తెలుగు బి.ఎ. పూర్తి చేశాను. బి.ఎ.లో యూనివర్శిటీ ఫస్ట్ వచ్చి జయంతి రామయ్యపంతులు స్వర్ణపతకం సంపాదించారు. భాషపై మక్కువతో భారతీయ విద్యాభవన్ వారి సంస్కృత కోవిద పూర్తి చేశారు.

1960వ దశకానికి ముందు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగులో బి.ఏ ఆనర్స్ కోర్సు నడిచేది. 1960లో తొలిసారిగా దానిని ఎం.ఏ. కోర్సుగా మార్చారు. 1960-62 మధ్య చక్రధరరావు ఎం.ఏ తెలుగు చేసి ఫస్ట్ క్లాసు సంపాదించారు. ఎం.ఏ. కాగానే పిహెచ్.డి పరిశోధనను గంటి జోగి సోమయాజి పర్యవేక్షణలో మొదలెట్టారు. అంశం – తెలుగు సాహిత్య శాసనాల్లోని ఉర్దూ మరాఠీ పదాలు.

సోమయాజి పదవీ విరమణానంతరం పర్యవేక్షకులుగా కె.వి.రామనరసింహం ఆధ్వర్యంలో సిద్ధాంత వ్యాసం తయారు చేసి 1967లో పి.హెచ్.డి పొందారు. సీనియర్ రీసెర్చి ఫెలోగా వెంటనే యు.జి.సి పథకం కింద సంస్కృతంలో ద్రావిడ భాషా పదాలు అనే అంశంపై పరిశోధన మొదలెట్టారు. ఆర్ట్స్ విభాగంలో ఇటువంటి సీనియర్ ఫెలోషిప్ తొలుత చక్రధరరావుకే దక్కడం విశేషం.

విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో అసోసియేటెడ్ ఫ్రొఫెసర్‌గా చేరారు. చిలుకూరు సుబ్రహణ్య శాస్త్రి తర్వాత చక్రధరరావు శాఖ్యాధ్యక్షులయ్యారు (1985-88). అధ్యయన, అధ్యాపనాలలో అరితేరారు. ఒక పైవు అధ్యాపన, మరోకవైపు సాహిత్య రచన కొనసాగించారు. నన్నయ్య మొదలు కందుకూరి వీరేశలింగం పంతులు వరకు గల 50 మంది ఆంధ్ర కవుల కవితలను ఒక సంకలనంగా తయారు చేశారు. అప్పట్లో విశ్వవిద్యాలయ ప్రచురణగా 1977లో అది వెలువడింది. నూజివీడు అప్పారాయ గ్రంథమాల వారు చక్రధరరావు దండాన్వయం సమకూర్చిన పోతన భోగినీదండకాన్ని 1980లో ముద్రించారు.

తెలుగు వ్యుత్పత్తికోశం:

హైదరాబాదులోని తెలుగు అకాడమీ వారు ఇంగ్లీషు-తెలుగు నిఘంటువును చక్రధరరావు వంటి ప్రముఖుల సారధ్యంలో 1978లో పూర్తి చేశారు. ప్రపంచ నిఘంటు నిర్మాణ చరిత్రలో తొలిసారిగా తెలుగు వ్యుత్పత్తి కోశాన్ని చక్రధరరావు మొదలు పెట్టారు. వ్యుత్పత్తి లేకుండా పదం వుండదని సిద్ధాంతీకరించారు. సంస్కృతంలో యాస్కుని నిరుక్తం ప్రసిద్ధం. చక్రధరరావు తెలుగు భాషలో పదాలకు వివరణలు సప్రమాణంగా అందించారు. ఇది ఆంధ్రా యూనివర్శిటీ ప్రచురణ చరిత్రలో అగ్రస్థానం వహించింది.

తెలుగు వ్యుత్పత్తి కోశంలో అర్థవిపరిణామం పొందని తత్సమ పదాలు లేవు. అవి దాదాపు 50 వేలు. ఈ పదాలకు వ్యుత్పత్తి కోశంలో స్థానం ఈయన కల్పించారు. ఈ కృషిని ఆచార్య కె.వి.ఆర్ నరసింహం, తూమాటి దోణప్ప వంటి పెద్దలు ప్రశంసించారు. హిందీ, ఉర్దూ భాషలలో కూడా చక్రధరరావు ప్రావీణ్యం వలన అది సాధ్యపడింది. వీరి మరో రచన దేశీకవిత. దేశీకవిత లక్షణాలను విపులీకరించారు. భాషాశాస్త్ర వ్యాసములు అనే పేర 10 భాషా శాస్త్రవ్యాసాలను చక్రధరరావు 1968లో ప్రచురించారు. దానిని వైస్‌ ఛాన్స్‌లర్ డా.పిన్నమనేని నరసింహరావుకు అంకితమిచ్చారు.

నిరంతర పరిశోధనా కృషీవలుడు ఈ చక్రధారి. ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్తగా, పర్యవేక్షకులుగా ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విశిష్టస్థానం గడించారు.

కేంద్ర సమాచార ప్రసారశాఖల మంత్రి శ్రీ ప్రమోద్ మహాజన్‌తో రచయిత -1999

ఆచార్య కోలవెన్ను మలయవాసిని:

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవిని తెలుగు శాఖలో అధిష్ఠించిన తొలి మహిళ మలయావాసిని. తల్లి చింతామణి కాగా తనయ సాహితీ చింతామణి అయింది. తండ్రి ఆండ్ర శేషగిరిరావు ప్రముఖ విద్వాంసులు. ‘పండుగలు-పరమార్థములు’ గ్రంథ రచయిత. ఆ గ్రంథం తొలుత 2000లో మలయవాసిని వసంత గ్రీష్మఋతువుల వరకు ప్రచురించారు. 2001 మార్చిలో తండ్రిగారు పరమపదించిన పిమ్మట సంవత్సరమంతా వచ్చే పండుగలను చేర్చి మలయవాసిని తి.తి.దే ప్రచురణగా తొలుత 2005లో ప్రచురింపజేశారు. శేషగిరిరావు ఆనందవాణి, ఆంధ్రభూమి, ఆంధ్రకీర్తి, గృహలక్ష్మి తదితర పత్రికల సంపాదకులుగా పేరెన్నికగన్నారు. 1944 అక్టోబరులో జన్మించిన మలయవాసిని 20 ఏళ్లకే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. ఆనర్స్ చేసి, ఆ పైన ఎం.ఏ. చేశారు.

ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌లో తెలుగు శాఖ అధ్యాపకులుగా 1975లో చేరడానికి ముందు విజయవాడ మేరీ స్టెల్లా కళాశాల (1965-66), రాజమండ్రి లోని రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో (1970-71) పని చేశారు. 1986లో యూనివర్శిటీలో రీడరయ్యారు. 1990లో ఫ్రొఫెసర్ అయ్యారు. 1988-91 మధ్య శాఖాధ్యక్షులు.

‘ఆంధ్ర వాఙ్మయం – రామాయణం’ అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి పొందారు. అది ఉత్తమ పరిశోధక గ్రంథం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పని చేస్తూ 1982లో అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ లెక్చరర్‌గా పాఠాలు చెప్పారు. వివిధ విశ్వవిద్యాలయాల పరీక్షాధికారిగా, వివిధ సంస్థల సభ్యులుగా ఘనమైన కృషి చేశారు. వీరు రచించిన ‘పువ్వులు’ భారత ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి పొందింది.

రామాయణం పై వీరు సాధికారిక ప్రచురణలు వెలువరించారు. అవి:

1.ఆంధ్ర వాఙ్మయము-రామాయణము 2. ఆంధ్ర జానపద సాహిత్యము-రామాయణం 3.వివిధ భాతీయ భాషలలో రామాయణం 4.శ్రీరామ నవమి (వ్యాససంపుటి) 5.రామాయణ రహస్యాలు 6. ఓ రామా! నీ నామమేమి రుచిరా?

ఆంధ్ర కవయిత్రులు, పౌరాణిక పురంధులు, మన పుణ్యనదులు, తెలుగులో తిట్టు కవిత్వం, భారతవాణి, మలయమారుతం, శారదావిపంచి, వీరి ఇతర రచనలు. వీరిని వివిధ సంస్థలు సత్కరించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఢిల్లీ తెలుగు అకాడమీ, విశాఖ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ప్రముఖాలు. స్వర్ణోత్సవం జరపుకున్న  విశాఖ సాహితికి వీరు అధ్యక్షులుగా ఎన్నో సాహితీ కార్యక్రమాలు జరిపారు. 2019లో నేను వీరి సంస్థలో ప్రసంగించాను. తెలుగు విశ్వవిద్యాలయ పరిశోధనా ప్రతిభా పురస్కార గ్రహీత సుగ్రహీత నామధేయురాలు మలయవాసిని, నిత్యపరిశోధకురాలు.

సాహిత్య అకాడమీ పురస్కారం స్వీకరణ 2000

ఉభయభాషలలో డాక్టరేట్ వేదుల:

వేదుల సుబ్రమణ్యశాస్త్రి తెలుగు శాఖలో అధ్యాపకులుగా 1975లో చేరి రీడర్ అయి శాఖాధ్యక్షులుగా 2002లో పదవీ విరమణ చేశారు. వీరు 1942 సెప్టెంబరు 22న విజయనగరం జిల్లా దేవాడ గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్య, హైస్కూలు విద్య విశాఖపట్టణంలో పూర్తి చేసి 1963లో తెలుగులో బి.ఏ. ఆనర్స్ చదివి ఆర్ట్స్ విభాగంలో సర్వప్రథములుగా ఉత్తీర్ణులయ్యారు. 1964లో తెలుగు ఎం.ఏ.లో సర్వప్రథములు. ఫ్రైవేట్‌గా చదివి 1972లో సంస్కృతం ఎం.ఏ చేసారు. 1978లో తెలుగు పి.హెచ్.డి తదుపరి 1997లో సంస్కృత పి.హెచ్.డి సాధించారు. వీరి సంస్కృత థీసేస్ ఉత్తమ సిద్ధాంత గ్రంథం బహుమతి నందుకొంది. విశాఖపట్టణంలోని ఏ.వి.యన్. కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా 1967-75 మధ్య పని చేసి ఆ పైన విశ్వవిద్యాలయంలో 27 ఏళ్లు అధ్యయన అధ్యాపనాలు కొనసాగించారు. తెలుగు, సంస్కృతంలో పి.హెచ్.డి సంపాదించిన తెలుగు  అధ్యాపకులు మరో విశ్వవిద్యాలయంలోను లేరు. 1991-93 మధ్య తెలుగు శాఖాధ్యక్షులు.

అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో 1976లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పాఠాలు బోధించారు. వీరు సంస్కృతాంధ్రాలలో గ్రంథాలు ప్రచురించారు.

సంస్కృతం: వరుధునీ ప్రవరం, కల్యాణం, తత్వమసి, శ్రీమద్రామాయణ పురషార్ధ వివేకః

తెలుగు: అష్టదిగ్గజాలు, భాగవతసుధ, భాగవత రహస్యం, తెలుగులో పంచతంత్ర చేర్పులు, ఆధ్యాత్మిక రామాయణంలో అపూర్వకల్పనలు, రామాయణంలో పురషార్థాలు.

వ్యాఖ్యానాలు: శివానందలహరి, సౌందర్యలహరి, శ్రీశివమహిమ్నాస్తోత్రం.

వీరి ప్రతిభను గుర్తించి కంచికామకోటి సంస్థానం, శంకరమఠం విశాఖవారు స్వర్ణ సింహా తలాటం బహుకరించారు. గణపతి సచ్చిదానందస్వామి స్వర్ణ కంకణం ప్రదానం చేశారు. కందుకూరు శివానందమూర్తి, భీమ్లీ అవార్డు ఇచ్చారు. వీరి సతీమణి రామలక్ష్మి ఎం.ఏ. చేసి  పలు గ్రంథాలు ఒరియాలోకి అనువదించారు. ఆదర్శ దాంపత్యం.

సుబ్రమణ్య శాస్త్రి తరువాత కాలంలో ఆచార్య పి.ఆపదరావు 1993-96లో తెలుగు శాఖాధ్యక్ష బాధ్యతలు నిర్వహించి అకాల మరణం చెందారు. అధ్యాపకుడిగా ఆయనకు మంచి పేరు.

ఎందరో మహానుభావులు:

చరిత్రకు అద్దం ఓరుగంటి:

ఓరుగంటి రామచంద్రయ్య (1912-1994) నెల్లూరు జిల్లా కావలికి చెందినవారు. తండ్రి వెంకట సుబ్బయ్య స్వాతంత్ర్య సమర యోధులు. రామచంద్రయ్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ ఆనర్స్ (చరిత్ర) చేశారు. చరిత్ర విభాగంలో తొలి పి.హెచ్.డి వారిదే. కాకినాడ బాంబు కేసులో 1933లో వీరితో బాటు ఏడుగురిపై బ్రిటీషు ప్రభుత్వం నేరం మోపింది. రామచంద్రయ్య 1957-72 మధ్య చరిత్ర – పురావస్తు శాఖలో పని చేసి పదవీ విరమణానంతరం రమణాశ్రమంలో 82వ ఏట పరమపదించారు.

అంతర్జాతీయ ఖ్యాతి ‘భగవంతం’ (1909-1989):

భౌతిక శాస్త్రవేత్తగా, పరిపాలనాదక్షుడిగా ఆచార్యుడిగా సూరి భగవంతం అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో జన్మించిన వీరు మదరాసు విశ్వవిద్యాలయంలో యం.యస్.సి. చేశారు. రామన్ ఎఫెక్ట్స్ పై విశేష పరిశోదన చేశారు. 1932లో రాధాకృష్ణన్ ఉపకులపతిగా వుండగా భగవంతం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరి 1940 వరకు విశేష కృషి చేశారు. 1948-49లో లండన్ లోని భారత దౌత్య కార్యలయంలో శాస్త్ర విబాగాధికారిగా పని చేశారు. 1952లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి అయ్యారు. 1957లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరక్టరు. 1961లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు. పుట్టపర్తి సాయిబాబాకు సన్నిహితులయ్యారు. డి.ఆర్.డి.ఓ. ద్వారా 18 ప్రయోగశాలల స్థాపనకు కృషిచేశారు.

సంస్కృత విద్యాపీఠం, ఢిల్లీ వారి సభ 2004

ఆర్దిక శాస్త్రరాజు భావరాజు (1915 నవంబరు 22 – 2011 ఫిబ్రవరి 23):

భావరాజు సర్వేశ్వరరావు ఆర్థిక సామాజిక శాస్త్రవేత్త. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించి విశాఖపట్టణంలో ఉన్నత విద్య నభ్యసించారు. అధ్యాపకుడిగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరి నాలుగు దశాబ్దాలు దిశానిర్దేశం చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి 1953లో డాక్టరేట్ పొందారు. థాయిలాండ్, నైజీరియాలలో ఎకానమిస్ట్‌గా ఉన్నారు. 1975లో రిటైరయ్యారు. 1979-81 మద్యకాలంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికాసంఘం సభ్యులు. ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలు వీరికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. 1982లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ సంస్థ అద్యక్షుడిగా ఎంపికయ్యారు.

ఈ విధంగా ఆంద్ర విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు వివిధ విభాగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.

Exit mobile version