Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సిడ్నీ వడ్స్‌వర్త్ ఉద్యోగ జీవితం – కొన్ని అనుభవాలు – ‘ఎ జడ్జ్ ఇన్ మద్రాస్’

[సిడ్నీ వడ్స్‌వర్త్ జ్ఞాపకాలతో రచించిన ‘ఎ జడ్జ్ ఇన్ మద్రాస్’ అనే పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు డా. పురుషోత్తం కాళిదాసు.]

బ్రిటీష్ ఇండియా (వలసవాదుల) పాలనలో మద్రాసు హైకోర్టు జడ్డిగా పనిచేసిన ఆంగ్లేయుడు సర్ సిడ్నీ వడ్స్‌వర్త్ ఉద్యోగ జీవితంలో అనుభవాలను ఆయన మనుమడు వెలికితీసి ‘కరొలైన్ కీన్’ ద్వారా పుస్తక రూపంలో తెచ్చారు. సిడ్నీ వడ్స్‌వర్త్ వివిధ హోదాలలో ఆంధ్రదేశంలో, మద్రాసు ప్రెసిడెన్సీ లోని వివిధ ప్రదేశాల్లో పనిచేసినపుడు జరిగిన అనేక సంఘటనలు వలస పాలకుల దృష్టి నుంచి, శ్వేత జాతీయుల దృష్టి నుంచి ఇందులో వివరంగా రాశాడు.

సిడ్నీ ఇంగ్లాండు లోని లాంగ్‌బరో అనే ప్రదేశంలో 1888లో జన్మించాడు. మొదట కొంత కాలం పేరిస్ నగరంలో గ్రామర్ స్కూల్లో చదివి, తర్వాత పేరిస్ వెళ్ళి సొరబాన్ (Sorbonne) లో విద్యాభ్యాసం చేసి, మళ్ళీ కేంబ్రిడ్జ్ జీసస్ కాలేజీలో చదివి, తమిళం నేర్చుకొని, 1913లో మద్రాసు వచ్చి బ్రిటిష్ ఇండియా పరిపాలనలో ఉద్యోగం సంపాదించాడు. 1916 కల్లా నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టరుగా నియమించబడ్డాడు. ఆ రోజుల్లో మద్రాసు ప్రెసిడెన్సీలోనే అతి పెద్ద సంస్థానాలలో ఒకటిగా పరిగణించబడిన వెంకటగిరి సంస్థానం గూడూరు డివిజన్‌లో చేరింది కనుక, ఈ పోస్టుకు చాలా ప్రాముఖ్యం ఉడేది. గూడూరులో ఉన్నపుడే మద్రాసులోని ఐసిఎస్ అధికారి కుమార్తె ఆలివ్ ఫ్లారెన్స్ క్లెగ్‌తో పెళ్ళయింది.

సిడ్నీ వడ్స్‌వర్త్  గూడూరులో ఉన్న సమయంలోనే వెంకటగిరి సంస్థానానికి సంబంధించిన అతిముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఈ విషయాలను గురించి వెంకటగిరి సంస్థానం వారు రాయించుకున్న సంస్థానం చరిత్రల్లో ఎటువంటి వివరణలు లేవు. కానీ సిడ్నీ వడ్స్‌వర్త్ ఆ సంఘటనలను గురించి గూడురు సబ్ కలెక్టర్ హోదాలో చాలా వివరంగా రాశాడు.

వెంకటగిరి సంస్థాన పాలకులలో 28వ తరం వాడైన రాజగోపాలకృష్ణ యాచేంద్ర అడవిలో వేటకు వెళ్ళిన సమయంతో తుపాకీ తూటా తగిలి ఆకస్మికంగా మరణించాడు. మహారాజు మరణాన్ని గురించి, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన చనిపోయాడని ఎక్కడా వివరంగా రికార్డు కాలేదు. వేటాడుతున్న సమయంలో ఆయన ఎండలో ఉండలేక ఒక చెట్టు నీడన కూర్చుని తాంబూలం సేవిస్తున్నట్లు, ఆ ప్రదేశం వేటగాళ్ళు మాటు వేసి కూర్చొనే ప్రవేశానికి కొంచెం అవతల ఉందని, రాజాగారి మేనల్లుడు పేల్చిన తూటా రాజావారికి తగిలి చనిపోయారని వెంకటగిరిలో ఈ రచయిత ఏభై ఏళ్ళ క్రితం విన్న కథ. రాజాగారు చనిపోయినపుడు గూడురు సబ్ కలెక్టర్‌గా ఉన్న సర్ సిడ్నీ వడ్స్‌వర్త్ ఆ సంఘటనను గురించి తన జ్ఞాపకాలలో పేర్కొన్నాడు.

మహారాజు రాజగోపాలకృష్ణ యాచేంద్ర

1916లో సిడ్నీ వడ్స్‌వర్త్ తొలి పర్యాయం సబ్ కలెక్టర్ హోదాలో వెంకటగిరి సంస్ధానం సందర్శించినప్పుడు “వృద్ధ రాజాగారు బాగా ఉన్నారు. రాజాగారిది స్ఫురద్రూపం. ఆకట్టుకునే విగ్రహం. వయసు పైబడిన వీరుడి లాగా అనిపించారు. ఏ పటాటోపాలు లేకుండా చూడగానే గౌరవభావం ఏర్పడే రూపం. ఆయనకు ఇంగ్లీషు రాదు. ఆయన పదవిని బట్టి, కొంచెం ‘వక్కముక్కల’ ఇంగ్లీషులో సంభాషించవలసి వస్తుంది. ఆయన చాలా సంప్రదాయవాది, మోటారు కారు వాడుకను అంగీకరించలేదు” అని ఆ జ్ఞాపకాన్ని పేర్కొన్నాడు.

1916 జూన్ 23వ తారీకున రాజగోపాలకృష్ణ యాచేంద్ర ఆకస్మికంగా మరణించారు. ఆ మరణవార్త సిడ్నీ వడ్స్‌వర్త్‌కు రాజాగారి అంతిమ సంస్కారాలు జరిగిన తర్వాతనే తెలియజేశారు.

రాజుగారు చనిపోయినప్పుడు వెంకటగిరికి 14 మైళ్ళ దూరంలో సిడ్నీ వడ్స్‌వర్త్ ఉద్యోగ ధర్మంలో కేంపులో ఉన్నాడు. ఈ మహారాజు గురించి సిడ్నీ రాసిన కొన్ని విషయాలు చూద్దాం.

‘మహారాజు మరణం చుట్టూ ఏదో రహస్యం దాగుంది. తాను వెంకటగిరికి 14 మైళ్ళ దూరంలో మాత్రమే ఉన్నా, inquest (శవ పంచాయతీ), అంత్యక్రియల తర్వాతనే వార్త తనకి తెలియజేసారు. ఆ మహారాజు రకరకాల తుపాకులు వాడడంలో నేర్పరులు.

Inquest రిపోర్డులో రికార్డు చేసిన విషయం ఇది.

మహారాజాగారు వెంకటగిరి అడవుల్లో ఒక లేడిని కాల్చారు. ఆయనతో ఉన్న షికారి ఆ జంతువును తీసుకొని రావడానికి దాని వద్దకు పరుగెత్తాడు, దాన్ని తీసుకొని వచ్చే సమయానికి రాజాగారు చనిపోయి ఉన్నట్లు గుర్తించాడు. రాజాగారి తల లోకి తూటా కాల్చబడి వుంది. ప్రమాదవశాత్తు తన తుపాకీతో తానే కాల్చుకొన్నట్లు inquest లో గుర్తించబడింది.’

ఇన్క్వెస్టు రిపోర్టు చూచి సిడ్నీ వడ్స్‌వర్త్ బుర్రలో అనేక సందేహాలు.. ఆ రోజుల్లో వెంకటగిరి పేలెస్‌లో రెండు గ్రూపులన్న విషయం అందరికీ తెలిసినదే అంటాడు. అందులో ఒక వర్గం మహారాజు పట్ల శత్రుత్వం వహించిన దంటాడు.

చనిపోయిన మహారాజు తుపాకి వేటలో మంచి నేర్పరి అని, తుపాకులను మెలకువతో వాడుకొనే వ్యక్తి అని కూడా అభిప్రాయపడ్డాడు. ఈ మొత్తం కథనం ఒక పెద్దమనిషి సాక్ష్యం మీద, వైద్యుడిచ్చిన రిపోర్ట్సు మీద ఆధారపడిందని, ఆ డాక్టర్ రిపోర్టులో నిజానిజాలు సమీక్షించడానికి – భౌతికకాయానికి అంత్యక్రియలు కూడా జరిపారు కాబట్టి అవేవి సాధ్యం కావు.

“రాజాగారికున్న పేరు ప్రఖ్యాతులను బట్టి, సబ్ కలెక్టరైన తనకు ఇంత ముఖ్యమైన విషయం తెలియకపోవడంలో ఈ వ్యవహారంలో ఏదో సందేహించనగిన విషయం ఉంది” అని సిడ్నీ వడ్స్‌వర్త్‌కు అనిపించింది. “నిశ్చయంగా ఇది ఆందోళనకరమైన విషయమే” అని సిడ్నీ వడ్స్‌వర్త్‌కు అనిపించింది.  “నిజానిజాలు తెలుసుకోడానికి అవకాశం లేకుండా చేశారు.” అని అతను తన జ్ఞాపకాలలో పేర్కొన్నాడు.

పసివయసు, అనుభవరాహిత్యం, అందుకు తగినట్లు జిల్లా కలెక్టరు పదవిలో ఒక ‘బ్రాహ్మణుడు’ ఇన్‌ఛార్జ్‌గా ఉండడం – ఆ ఇన్‍ఛార్జ్‌కి బ్రహ్మచెముడు, వెంకటగిరి రాజకీయాలు పరిచయం లేని వ్యక్తి కావడం – సిడ్నీ ఉత్సాహాన్ని నీరుగార్చినట్లు అతని రచన వల్ల స్ఫురిస్తుంది. పైపెచ్చు కొత్తగా వెంకటగిరి జమీందారు పదవి చేపట్టిన వ్యక్తి నుంచి అసమ్మతిని ఎదుర్కొనవలసి ఉంటుందని ఆలోచించి further enquiry చేయకుండా ఆ విషయాన్ని అంతటితో విడిచిపెట్టాడు. అయినా, ఎన్నో ఏళ్ళు గతించిన తర్వాత రాజాగారి మరణం విషయంలో తనలో ఏదో పశ్చాత్తాపం మిగిలిపోయిన ధోరణిలో “నేను నా మనశాంతిని కోల్పోలేదు.. But I still wonder who fired the shot” అని రాసుకున్నాడు.

రాజగోపాలకృష్ణ యాచేంద్ర మరణం తర్వాత కాన్ని వారాలలో జరిగిన గోవింద కృష్ణ యాచేంద్ర పట్టాభిషేకం ఉత్సవాలలో, విందులు వినోదాల్లో సిడ్నీ వడ్స్‌వర్త్‌ దంపతులు అధికార హోదాలో పాల్గొనవలసి వచ్చింది. ఈ విశేషాలన్నీ వర్ణిస్తూ రాజగోపాలకష్ణ యాచేంద్రకు ఆయన కుమారుడు గోవిందకృష్ణ యాచేంద్రకు ఎన్నో ఏళ్ళుగా మాటలు లేవంటాడు.

ఆనాటి మన సమాజాన్ని గురించి సిడ్నీ వడ్స్‌వర్త్‌ సందర్భానుసారంగా ఎన్నో విశేషాలు పేర్కొన్నాడు.

ఆసక్తిగా చదివించే పుస్తకం ఇది.

***

A Judge in Madras: Sir Sidney Wadsworth and the Indian Civil Service, 1913-1947
Author:  Caroline Keen
Publishers: Harper Collins Publishers
Pages: 308
Price: ₹ 699.00
For Copies:
https://harpercollins.co.in/product/a-judge-in-madras/

Exit mobile version