నడక దారిలో..!!
ఒకప్పుడు గతిలేక, రవాణా సౌకర్యాలు లేక సామాన్యుడికి ఎక్కడికి పోవాలన్నా ‘నడక’ తప్పనిసరి అయ్యేది. ఇక నడకకు ప్రత్యామ్నాయం మరోటి ఉండేది కాదు. కాస్త ధనవంతులకైతే సైకిలు, రెండెడ్లబండ్లు, ఒంటెద్దు బండ్లు, స్టీమర్లు, పడవలు, వారి వారి హోదాలను బట్టి రవాణా సౌకర్యాలు అందుబాటులో వున్నాయి. ఇప్పుడు మధ్యతరగతివాడికి సైతం, పైగా ఉద్యోగస్థుడై ఉంటే, రైలు – ఓడ, విమానయానం సైతం అందుబాటులోనికి వస్తున్నది. ఎంత లేనివాడికైనా ఇంట్లో కనీసం సైకిలు వుంటున్నది. ఇక ఎగువ మధ్యతరగతి, ఆపై వర్గాలకు ఈనాడు రెండు లేదా మూడేసి కార్లు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మనిషి సుఖం మరిగిపోయి (తప్పని పరిస్థితులలో సైతం), శరీరానికి కనీస శ్రమ లేకుండా పోతున్నది.


మినీ ట్యాంక్ బండ్ పై వాకర్స్
తద్వారా ఊబకాయం, దానివల్ల రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. సుఖం కొన్ని కష్టాలకు కారణం అవుతున్నది. వ్యాయామం ఇప్పుడు తప్పనిసరి అవుతున్నది. యోగా ఇతర వ్యాయామ క్రీడలతో పాటు ‘నడక’ తప్పనిసరి అవుతున్నది. వ్యాయామం కోసం ఇప్పుడు ఎంత ధనవంతుడైనా, సైకిలు కొనుక్కోవలసి వస్తున్నది. అవసరాన్నిబట్టి ప్రతిరోజూ కొంత సమయం నడక కోసం వినియోగించవలసి వస్తున్నది. వైద్యుల ఆరోగ్య సలహాలతో ‘నడక’ అధిక ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. మనిషి జీవన శైలిలో ఇది నిత్యకృత్యమై పోయింది. ఆడ, మగ, కులం, మతం అనే తేడా లేకుండా ప్రతి మనిషి చూపు నడకపై పడుతోంది.


వ్యాయామ ప్రదేశం
ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్నాక స్వచ్ఛమైన గాలిలో నడక మంచిదని చెబుతుంటారు, అది కూడా సూర్యోదయం అవుతున్న సమయంలో నడిస్తే, సూర్యరశ్మి వల్ల సహజంగా (ఉచితంగా) లభించే ‘విటమిన్-డి’ని పొందే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వారి వారి అనుకూలతలను బట్టి కొంతమంది సాయంత్రం కాస్త చల్లబడ్డాక నడవడానికి అలవాటు పడి వుంటారు. అయినా ఉదయమే సూర్యోదయం సమయాన నడవడం వల్ల అవసరమైన వ్యాయాయం లభించడమే గాక, శరీరానికి అవసరమైన, ప్రకృతి సిద్దమైన విటమిన్- డి లభిస్తుందని వైద్యుల ఉవాచ.


వ్యాయామ కూడలి
నడవడం కోసం కొంతమంది కళాశాల/పాఠశాలల ఆటస్థలాలు వినియోగించుకుంటున్నారు. కొంతమంది రోడ్డు ఫుట్‌పాత్ లనే నడవడం కోసం వాడుకుంటున్నారు. పెద్ద పెద్ద గార్డెన్స్‌లో నడక కోసం శాస్త్రీయపరమైన ప్రత్యేక ట్రాక్‌లు నిర్మించి వాడుతున్నారు. ఇలాంటి ప్రదేశాలలో ఉన్నతాధికారులు, ఇతర సెలబ్రెటీలు నడకకు రావడం వల్ల అక్కడ అనేక ప్రత్యేక సదుపాయాలూ సమకూరుస్తున్నారు. ఈమధ్య కాలంలో ‘వాకర్స్ క్లబ్బులు’ కూడా వెలుస్తున్నాయి. దీనిని బట్టి నడక ప్రాధాన్యత, ప్రాముఖ్యత ప్రజలలో ఎంత అవగాహనకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. దీనిని గొప్ప ప్రజాచైతన్యం గానే పరిగణించాలి.


వాకర్స్ కోసం బీచ్ రోడ్.. విశాఖపట్నం
నడక విషయంలో విశాఖపట్నం బీచ్ రోడ్ ఒక ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పాలి. అదేమిటంటే ఉదయం బీచ్ రోడ్ ఇరువైపులా కొన్నిగంటలు ట్రాఫిక్ ఆపేస్తారు. ఎవరో మహానుభావుడు, అక్కడి ఉన్నతాధికారికి వచ్చిన గొప్ప ఆలోచన ఇది. స్వచ్ఛందంగా ఆ సమయాలలో ఎలాంటి వాహనాలు ఆ రోడ్డు మీదుగా పోవు. వందలు, వేల సంఖ్యలో వివిధ స్థాయిల్లో ప్రజలు నడక కోసం అక్కడికి వస్తారు. పక్కనున్న సముద్రపు అలల హోరులో, చల్లని గాలిని ఆస్వాదిస్తూ జనం ఆనందంగా నడుస్తారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ప్రభుత్వపరంగా, చిన్న చిన్న పార్కులను కూడా అక్కడి స్థానిక ప్రజలు నడక కోసం ఉపయోగిస్తున్నప్పటికీ పార్కుల నిర్వాహణ సరిగా జరగకపోవడం కొంత ఇబ్బందులకు, నిరుత్సాహానికి గురిచేస్తున్నాయని చెప్పక తప్పదు. అధికారులు వాటి వైపు కన్నెత్తి కూడా చూడక పోవడమే దీనికి ప్రధాన కారణం.


పరిశుభ్రతకు నోచుకోని నడక మార్గం
అవసరమైన నిధులు ఎప్పటికకప్పుడు సమకూర్చలేకపోవడం, ప్రభుత్వ ప్రాధాన్యతలలో అవి లేకపోవడం కూడా కారణం అని చెప్పవచ్చు. అయితే అన్ని పార్కులో ఇలా నిరాదరణకు గురి అవుతున్నాయని కూడా చెప్పలేము. అది అంతా ఆయా పార్కుల నిర్వాహణాధికారుల అభిరుచి, సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. దీనికి తోడు ఆయా నియోజకవర్గాల మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల ప్రత్యేక శ్రద్ధ మీద కూడా ఆయా ప్రాంతాల, ముఖ్యంగా పార్కుల అభివృద్ధి ఆధారపడి వుంటుంది. ప్రజలు కూడా తమకు ఏమి కావాలో అడిగి చేయించుకునే అర్హతను తమ ఓటును అమ్ముకుని పోగొట్టుకుంటున్నారు. ఇలా ఎంతో అభివృద్ధిని మన తెలుగు రాష్ట్రాలు కోల్పోతున్నాయి. ఇది దురదృష్టకరం.


యోగా చేస్తున్న జనం
నేను, మహబూబాబాద్‌లో పని చేస్తున్నప్పుడు, నడిచే సరైన ప్రదేశాలు లేక, రైలు పట్టాలు వెంబడి ప్రశాంతంగా నడిచేవాడిని. హన్మకొండలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాక (1994) నాకు దగ్గరలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ కలిసి వచ్చింది. విశాలమైన ఆకళాశాల ఆటస్థలంలో నడవడం చాలా గొప్పగా ఉండేది.


పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలతో బండ్ ప్రక్కభాగం
సంవత్సరకాలంగా సికింద్రాబాద్‌లో ఉండడం వల్ల (సఫిల్ గూడ) నడక కోసం దగ్గర ప్రదేశం చూసుకోక తప్పలేదు. కొంతమంది దగ్గరలోని సఫిల్ గూడా రైల్వే స్టేషన్, రామకృష్ణాపురం స్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌ల మీద నడుస్తారుగాని, రైళ్ల రాకపోకల రణగొణ ధ్వనిలో ప్రశాంతంగా నడిచే అవకాశం ఉండదు. అదృష్టవశాత్తు నాకు సఫిల్ గూడ రైల్వే స్టేషన్‌కు దగ్గరలోనే ఒక పార్కు కంటబడింది. వందల సంఖ్యలో నడవడానికి, ఉదయం సాయంత్రం కూడా అక్కడికి వస్తారు. ఆదివారం ఆ పార్కు,నడిచే జనంతో, పిల్లలతో కిటకిటలాడుతూ, కళకళలాడుతుంది.


వాకర్స్
అదే ‘మినీ ట్యాంక్‌బండ్ పార్కు’. ఇక్కడ నడిచేవారు, యోగా చేసేవారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకునేవారు, ఇతర వ్యాయామాలు చేసుకునేవారు, ప్రేమికుల జంటలు, ఇంటిలో కుదరక వచ్చి అదే పనిగా ఫోన్ చేసుకునేవాళ్ళు, ఇంట్లోవాళ్ల బాధ పడలేక గార్డెన్‌కు వచ్చి నడవకుండా ఒకచోట కూలబడి, కాసేపు గడిపి వెళ్ళేవాళ్ళు, కేవలం అందమైన అమ్మాయిలను చూడడానికి వచ్చి, వాళ్ళ వెనుక బాడీ గార్డుల్లా నడిచేవాళ్ళు,ఇలా రకరకాల వ్యక్తులు అక్కడ తారసపడుతుంటారు.


గుర్రపు డెక్కతో అల్లుకుపొయిన మురికినీటి సరస్సు
అన్నింటికీ అనువైన ప్రదేశం ఈ మినీ ట్యాంక్ బండ్. లోపలికి ప్రవేశించ గానే, కుడివైపు రోడ్డుకు ఎత్తుగా ఉండడం వల్ల, ట్రాఫిక్ ఇబందులు వుండవు. ఎడమవైపు చిన్న మురికినీరుతో నిండి వున్న సరస్సు (ఒకప్పుడు మంచినీళ్ళ కోసం, బట్టలు ఉతుక్కోవడం కోసం ఉపయోగపడేదట! ఇప్పుడు పలుచోట్లనుండి వచ్చే మురికి నీరు ఇందులో నిల్వ ఉంటుంది). ఈ సరస్సు నీళ్లు కన్పడనంతగా గుర్రపు డెక్క అల్లుకుని పచ్చని చాప అందంగా పరిచినట్లు ఉంటుంది. ఇక్కడ మామూలు దోమలు కాదు, ‘హైబ్రిడ్ -దోమలు’ ఉత్పత్తి అవుతాయి. ఇవి అనేక చోట్లకు వలస కూడా పోతుంటాయి. దీనికి శాశ్వత పరిష్కారం, సంబంధిత మున్సిపాలిటీ పట్టించుకోకపోవడం బాధాకరం. ఈ దోమల బెడద, వాటి ప్రభావం నడిచేవారికి, సాయంత్రం నాలుగు గంటల తర్వాత బాగా కనిపిస్తుంది. ఎక్కువ మంది జనం ఉపయోగించుకునే ఈ స్థలాన్ని అలా నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబబు?


గుర్రపు డెక్క తో సరస్సు
దీనికి తోడు, బండ్ ఎడమ వైపు భాగం పిచ్చిచెట్లు పెద్దపెద్దగా పెరిగి డొంకలు, పొదలు గామారి, రకరకాల పాములకు ఆశ్రయం ఇస్తున్నాయి. మంచి పూలమొక్కలు, లాన్ వంటివి పెంచవలసిన చోట, ఇలా ముళ్లపొదలు పిచ్చి డొంకలు ప్రత్యక్షమవుతున్నాయి. కరోనా కాలం దాటిన తర్వాత, ఒకరోజు ఈ వ్యాస రచయిత ముందునుంచే ఒక పొడవాటి గోధుమరంగు త్రాచు పాము సరసరా ప్రాకివెళ్ళిపోవడం భయంకర అనుభవం. తరువాత రోజువారీ పరిశుభ్రత లోపించిన వైనం అక్కడికి వెళ్ళేవారికందరికీ అనుభవమే!


ఆధ్యాత్మిక సమావేశాలు
నిజానికి ఈ మినీ ట్యాంక్‌బండ్ దాని చుట్టుప్రక్కల ప్రజలు నడకకు ఉపయోగించుకోవడానికి అనువైన ప్రదేశం. ఇలాంటి పార్కుకు మరిన్ని సదుపాయాలు కల్పించి జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం వుంది. పరిశుభ్రతకు, పూలవనానికి ప్రాధాన్యతనిచ్చి అవసరమైతే సాధారణం రుసుము వాకర్స్ నుండి వసూలు చేయడంలో తప్పులేదేమో! నా మటుకు నేను నడక కోసం ప్రతిరోజూ ఉదయం ఒక గంట గడుపుతాను.


వాకర్స్ వెహికిల్ పార్కింగ్
ఇక్కడ నడవడంలో ఒక రకమైన తృప్తి మిగులుతుంది. ఇలా ప్రతి రోజూ నాలా ఎందరో. అధికారులు మరింత శ్రద్ధ తీసుకుంటే, సరస్సును గుర్రపుడెక్కనుండి విముక్తి చేసి,మంచినీటితో నింపి, ఉద్యానవనంలా బండ్‌ను అభివృద్ధి చేస్తే మరింతమంది సురక్షితంగా ఈ మినీ ట్యాంక్ బండ్‌ను వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. ఆ సమయం కోసం ఎదురుచూడవలసిందే! నడిచేవారి సంఖ్య పెరగాలిసిందే!!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
24 Comments
Sagar
నడకకు కారణం వ్యాయామాన్ని మనిషి నిర్లక్ష్యం చేయడమే కదా సర్? కనీస వ్యాయామాన్ని మనిషి మరవడమే దీనికి కారణం మరియు మీరు చెప్పినట్లు కొన్ని రోగాలకు కూడా. ఇక పార్కులను అభివృద్ధి చేయాలనే తలంపు పాలకుల మదిలో మెదలితే అది చాలా సులభంగా అయ్యే ప్రక్రియ. కానీ వారి ప్రాధాన్యతలు వేరే. మీరన్నట్లు వేచి చూడవలసిందే. చూద్దాం మంచి రోజుకోసం. మీకు ధన్యవాదములు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
నీ స్పందనకు ధన్యవాదాలు.
sunianu6688@gmail.com
చాలా మంచి విషయాలు చెప్పారు రచయత Dr KLV ప్రసాద్ గారు. ప్రతీ రోజు నడక వ్యాయామము చాలా మంచిది. నిజమే! మీరు చెప్పినట్లు ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. అలాంటి పరిసరాలను పరిశుభ్రంగా వుంచి, ఎంతో కొంత రుసుము వసూలు చేసి ఐనా ప్రజలకి ఉపయోగకరంగా ఉంచాలి. దీని మీద అవగాహన ప్రతి ఒక్కరికీ కలగాలి. చాలా చక్కగా విశదీకరించి వ్రాసిన రచయిత గారికి ధన్యవాదాలు



డా కె.ఎల్.వి.ప్రసాద్
కృతజ్ఞతలు దేవి గారూ.
Neelima
డాక్టర్ గారు.
నమస్కారములు..
నడక అవసరం చాలా ఉంది ఈరోజుల్లో..
వ్యాయామం చేయలేని వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం..
అదే విధంగా పార్కుల కోసం బాగా చెప్పారు..
ఇక హైదరాబాద్ ట్యాంకుబండ్ కోసం నాకు పెద్దగా తెలియదు కాని వివరంగా చెప్పారు.
ఇంకా పార్కులని బాగా అభివృద్ధి చేయాలన్నది మాత్రం నిజం..
అన్నీ విపులంగా వివరించారు.
ధన్యవాదాలు
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
కృత జ్ఞత లు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
శరీర ఆరోగ్యానికి అత్యంతఆవశ్యకమైన నడకగురించినడకప్రదేశాలగురించీడాక్టరుగారు ఒక prescription వలె చెప్పిన్రు.
పూర్వంనడక జిశితంలో ఒక భాగమైంది.ఇప్పుడు డాకాటర్ గారిచ్చే మందు కాని మందు ఐంది.ఊర్లలో నడకు తిప్పలు లేకపోవచ్చుగాని పట్టణాలల్లోమాత్రంతిప్పలే రోడ్డుమీద నడవటం ఆపద కొని తెచ్టుకోవటమే. పార్కుల నిర్వహణ చెప్పనే చెప్పిన్రు.
పార్కుల అభివృద్ధి కాంట్రాక్టర్ల కు అవసరమైతే జరుగుతది .
ఏమైనా డాక్టరు గారుమంచి పరిశోధనే చేసిన్రు నడక దాని సంబంధిత విషయాలపై
—-రామశాస్త్రి
డా కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారూ ధన్య వాదాలాండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
పూర్వం నడక జీవన విధానంలో ఒక భాగము. ఇప్పుడు తెచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది. కొనుక్కోవాల్సి వస్తుంది.
జలగ లాగ పట్టుకుంటాడు. జిడ్డుగాడు. ఇలా కొన్ని సామెతలు ఉన్నాయి. ఎవడైనా ఒక పట్టాన వదలకపోతే అలా అంటాము.
దీనికి మనమిప్పుడు కొత్తది కల్పుకోవచ్చు.
” గుఱ్ఱపు డెక్కల ఆకులాంటివాడు ” అని
ఆచార్య తంగెడ జనార్దనరావు
డా కె.ఎల్.వి.ప్రసాద్
కృత జ్ఞత లు సర్ మీకు
డా కె.ఎల్.వి.ప్రసాద్
నడక ని జ్ఞాపకాలు పందిరిగా అల్లిన మీ కథన చాతుర్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్.
—ఆచార్య భక్తవత్సల రెడ్డి
తిరుపతి.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
నడక పై మంచి అవగాహన
వ్యాసం బాగుంది
—-డా.తాడి నరహరి
ముంబై…
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు మీకు.
Rajendra Prasad
The city has less number of such public places among which some are not maintained well. Even public is also not conscious of utilizing the available public parks and walks
డా కె.ఎల్.వి.ప్రసాద్
Yes..sir
What you said is true.
Thank you.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Wonderful article, and you have covered all most all the plus points and minus points, suggestions and advice to the present day person sir. You have got Wonderful “shyli”. Hearty Congratulations, and keep it up sir.
—-Dr.Giridhar singh
Hyderabad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you somuch sir
Bhujanga rao
నడకపై వ్యాసం చక్కగా వివరించారు. ప్రతి రోజు నడక, తగిన వ్యాయామములు చేయటం మంచిదే.ప్రభుత్వం కూడా ఈ మధ్య వ్యయామము మరియు యోగాసనాలు వాటిపై మొక్కుబడిగా దృష్టి సారిస్తున్నారు.అందరికి అవసరమైన వనరులను కల్పించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలి, అపుడే అందరికి ఉపయోగకరంగా ఉంటాయి.ఆరోగ్యానికి నడక ప్రాముఖ్యతను చక్కగా వివరించిన మీకు ధన్యవాదములు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
Sam sundar
మీరు ఏ రచన చేసిన అందులో ప్రజా సంక్షేమం దాగి ఉంటుంది…విజ్ఞానం పెరిగే కొద్ది ఆటలు చరవాని లోకి వచ్చాయి…బయట ఆడుకునే పిల్లలు తక్కువ అయిపోయారు…అందరూ అంటే అన్ని వయసుల వారు వ్యాయాయం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది ..అదే విధంగా తగిన సదుపాయాలు ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత….చక్కని వ్యాసం ..మీరు ఇలా ఇంకా ఎన్నో మంచి రచనలు చేయాలని మ ఆకాంక్ష….
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు బాబూ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
జ్ఞాపకాల పందిరి 152 లో నడక ప్రాధాన్యత గురించి తెలిపారు. మీరు చెప్పినట్టుగా హైదరాబాద్ లో చాలా చెరువులు మురికి నీటితోను మరియు గుర్రపు డెక్క తో నిండి ఉన్నాయి. చక్కటి కథనం. అభినందనలు.
—-జి.శ్రీనివాసాచారి
కాజీపేట
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు చారిగారూ.