(విలోక్య, సహర్షం స్వగతమ్) అయే అయ మసా వమాత్య రాక్షసః; యేన మహాత్మనా…
(విలోక్య=చూసి, సహర్షం=సంతోషంగా, స్వగతమ్=తనలో), అయే=ఆహా, అయం+అసౌ+అమాత్యరాక్షసః=ఇడిగో ఈ రాక్షసమంత్రి! యేన+మహాత్మనా=ఏ మహానుభావుడైతే… (ఎవని చేతనైతే…)
గురుభిః కల్పనాక్లేశై ర్దీర్ఘ జాగర హేతుభిః
చిర మాయాసితా సేనా వృషలస్య, మతిశ్చమే. (8)
గురుభిః+కల్పనాక్లేశైః=భారమైన వ్యూహాలను పన్నడంతో ఏర్పడిన కష్టాలతో – దీర్ఘ+జాగర+హేతుభిః=రాత్రులు చాలా సేపు నిద్రలేమికి కారణాలవుతూ, వృషలస్య+సేనా=చంద్రగుప్తుని సైన్యం, మే+మతిః+చ=నా బుద్ధి కుశలత కూడా, చిరం+ఆయాసితా=చాలాకాలం శ్రమ పెట్టబడింది (రాక్షసమంత్రి మేధాశక్తి అంతటిదని అన్వయం).
(జవనికాం కరే ణాపనీ యోపసృత్య చ) భో అమాత్య రాక్షస, విష్ణుగుప్తోఽహ మభివాదయే.
(జవనికాం=కవచాన్ని, కరేణ+అపనీయ=చేతితో తొలగించి, ఉపసృత్య+చ=దగ్గరగా సమీపించి) భో+అమాత్యరాక్షస=అయ్యా, రాక్షసమంత్రీ, అహం+విష్ణుగుప్తః=నేను విష్ణుగుప్తుణ్ణి, అభివాదయే=నమస్కరిస్తున్నాను.
(స్వగతమ్) అమాత్య ఇతి లజ్జాకర మిదానీం విశేషణమ్। (ప్రకాశమ్) విష్ణుగుప్త, న మాం చణ్డాలస్పర్శ దూషితం స్ప్రప్టు మర్హసి।
(స్వగతమ్=తనలో), ఇదానీం=ఇప్పుడు, అమాత్య+ఇతి+విశేషణమ్=’మంత్రి’ అనే ఈ సంబోధన, లజ్జాకరం=సిగ్గుచేటు. (ప్రకాశమ్=పైకి) విష్ణుగుప్త=విష్ణుగుప్తా!, చణ్డాల+స్పర్శ+దూషితం+మాం=తలవరి ముట్టుకోగా అపవిత్రమైన నన్ను, స్ప్రప్టు+న+అర్హసి=తాకడానికి తగవు (నన్ను తాకరాదు).
భో అమాత్య రాక్షస, నేమౌ చణ్డాలౌ। అయం ఖలు దృష్ట ఏవ భవతా, సిద్ధార్థకో నామ రాజపురుషః। యో ప్యసౌ ద్వితీయః, సోఽపి సమిద్ధార్థకో నామ రాజపురుష ఏవ। శకటదాసో ఽపి తపస్వీ తం తాదృశం లేఖ మజాన న్నేవ కపట లేఖం మయా లేఖిత ఇతి।
భో+అమాత్య+రాక్షస=అయ్యా, రాక్షసమంత్రీ, న+ఇమౌ+చణ్డాలౌ=తలవరులిద్దరూ చణ్డాలురు కారు. అయం+దృష్టః+ఏవ+భవతా=ఇతడు ఇది వరలో మీరు చూసినవాడే. సిద్ధార్థకః+నామ+రాజపురుషః=సిద్ధార్థకుడనే వాడు, రాజవంశీయుడు. యః+అసౌ+ద్వితీయః+అపి= ఆ రెండవ వాడు కూడా, సః+అపి=వాడున్నూ, సమిద్ధార్థకః+నామ+రాజపురుషః+ఏవ=సమిద్ధార్థకుడనే వాడూ రాజవంశీయుడే. శకటదాసః+అపి+తపస్వీ=శకటదాసు కూడా అమాయకుడు. తం+తాదృశం+అజానన్+ఏవ+లేఖం= తెలియకుండానే ఆ అటువంటి ఉత్తరాన్ని, మయా లేఖితః+ఇతి=నా చేత ‘వ్రాయింపబడిం’దని (ఎరుగనివాడే).
(స్వగతమ్) దిష్ట్యా శకటదాసం ప్రత్యపనీతో వికల్పః।
(స్వగతమ్=తనలో), దిష్ట్యా=అదృష్టవశాత్తు, వికల్పః=సందేహం, శకటదాసం=శకటదాసుని (పై), అపనీతః=తొలగింపబడింది (శకటదాసుపై అనుమానం తొలగిపోయింది).
కిం బహునా? ఏష సంక్షేపతయా కథయామి।
కిం+బహునా=ఇన్ని మాటలెందుకు? ఏషః=దీనికంతనీ, సంక్షేపతయా+కథయామి=క్లుప్తంగా చెబుతాను.
భృత్యా భద్రభటాదయః, స చ తథా
లేఖః, స సిద్ధార్థక,
స్త చ్చాలఙ్కరణ త్రయం, స భవతో
మిత్రం భదన్తః కిల.
జీర్ణోద్యానగతః స చాపి పురుషః,
క్లేశః స చ శ్రేష్ఠినః సర్వం మే
(ఇత్యర్థోక్తే లజ్జాం నాటయతి)
వృషలస్య వీర, భవతా
సంయోగమిచ్ఛోర్నయః (9)
భృత్యాః=సేవకులు, భద్రభట+ఆదయః=భద్రభటుడు మొదలైనవాళ్ళు, తథా=అలాగే, స+చ+లేఖః=ఆ ఉత్తరం కూడా, సః+సిద్ధార్థక=ఆ సిద్ధార్థకుడు, తత్+అలఙ్కరణ+త్రయం+చ=ఆ మూడు నగలున్నూ, సః+భవతః+మిత్రం=ఆ నీ స్నేహితుడైన, భదన్తః కిల=బౌద్ధ భిక్షువున్నూ, జీర్ణ+ఉద్యానగతః=పాడుపడిన తోటలో కలిసిన, సః+చ+పురుషః=ఆ మనిషిన్నీ, శ్రేష్ఠినః+స+చ+క్లేశః=చందనదాస శెట్టికి కల్పించిన ఆ కష్టమున్నూ, సర్వం=ఈ విషయాలన్నీ, మే=నా (యొక్క)… (ఇతి=అని, అర్థోక్తే=మాట సగంలో, లజ్జాం+నాటయతి=సిగ్గు ప్రదర్శిస్తాడు)… వీర=ఓ వీర రాక్షసుడా! వృషలస్య=చంద్రగుప్తునికి, భవతా+సంయోగం+ఇచ్ఛో=నీ కలయిక కోరుతూ (నడిపిన) నయః= రాజనీతి (సుమా!).
తదయం వృషల స్త్వాం ద్రష్టు మిచ్ఛతి.
తత్+అయం+వృషలః=అందువల్ల ఈ చంద్రగుప్తుడు, త్వాం+ద్రష్టుం+ఇచ్ఛతి=నిన్ను చూడాలనుకుంటున్నాడు.
శార్దూల విక్రీడితం. మ-స-జ-స-త-త-గ గణాలు.
చాణక్యుడు రాక్షసమంత్రికి – అతడిని చంద్రగుప్తుడికి మంత్రిని చెయ్యడం కోసం – తాను నడిపిన రాజకీయ వ్యూహం – ఇక్కడ విడమరిచి చెప్పేశాడు. ఇక్కడ ప్రస్తావించిన అనుష్టుప్ శ్లోకాలలో వారికి ఒకరి పట్ల ఒకరికి గల గౌరవం కూడా వ్యక్తం అవుతున్నది.
(స్వగతమ్) కా గతిః? ఏష పశ్యామి
(స్వగతమ్=తనలో), కా+గతిః=ఏది దారి? ఏషః+పశ్యామి=దీనిని చూస్తున్నాను (ఇదిగో, చూస్తున్నాను).
(తతః ప్రవిశతి రాజా, విభవతశ్చ పరివారః)
(తతః+రాజా+ప్రవిశతి=అంతలో రాజు వచ్చాడు. పరివారః+విభవతశ్చ=అతడి వెంట యథావైభవంగా పరివారం కూడా వచ్చింది.)
(స్వగతమ్) వినైవ యుద్ధా దార్యేణ జితం దుర్జయం పరబల మితి లజ్జిత ఏ వాస్మి. మమ హి…
(స్వగతమ్=తనలో), ఆర్యేణ=పూజ్య చాణక్యునిచే, యుద్ధాత్+వినా+ఏవ=యుద్ధం అవసరం లేకుండానే, దుర్జయం+పరబలం+జితం+ఇతి=జయించశక్యం గాని శత్రుసైన్యం జయింపబడింది – అని – లజ్జితః+ఏవ+అస్మి=సిగ్గు గానే ఉన్నది. మమ+హి=నాకైతే…
ఫలయోగ మవాప్య సాయకానాం
విధియోగేన విపక్షతాం గతానామ్।
న శు చేవ భవ త్యధోముఖానాం
నిజతూణీశయన వ్రతం ప్రతుష్ట్యై॥ (10)
సాయకానాం=బాణాలకు, ఫలయోగం+అవాప్య=ఫలం కలిగి కూడా, విధి+యోగేన=దైవవశాత్తు (అంటే ప్రతికూలత వల్ల), విపక్షతాం+గతానామ్=శత్రుత్వం పొందినవై, శుచ+ఇవ=దుఃఖ కారణంగానో అన్నట్టుగా, అధోముఖానాం=తలదించుకొన్నవై, నిజ+తూణీశయన+వ్రతం=తమ పొదులలో విశ్రాంతి పొందడమనే వ్రతాన్ని (మమ=నాకు), ప్రతుష్ట్యై+న+భవతి=సంతృప్తికరంగా లేదు.
బేసి పాదాలు: స – స – జ – గ గ – గణాలు. సరిపాదాలు: స భ ర ల గ గ.
పైకి నిగిడి పౌరుషంతో శత్రువులపైకి ఎగురవలసిన బాణాలు – ఆ పని అవసరం లేకుండానే ఆ ఫలం దక్కిందనే అవమానంతో వాటి పొదులలో తలలు దించుకొని ‘అవమాన విశ్రాంతి’ పొందడం – చంద్రగుప్తుడికి సంతృప్తి కలిగించలేదని భావం.
విరోధాభాస – (ఆభాసత్వేవిరోధస్య విరోధాభాస ఇష్యతే – అని కువలయానందం) – ఇక్కడ బాణాలకు యుద్ధసిద్ధి కలిగినా, అవి తల వంచుకుని పొదులలో ఉన్నాయనడం – వేరే అర్థంతో దాని ఆభాస కనిపించడం గమనించదగినది.
అథవా
విగుణీకృతకార్ముకో ఽపి జేతుం
భువి జేతవ్య మసౌ సమర్థ ఏవ
స్వపతో ఽపి మ మేవ యస్య తన్త్రే
గురవో జాగ్రతి కార్యజాగరూకాః॥ (11)
అథవా=కాకపోతే –
విగుణీకృతకార్ముక+అపి=అల్లెత్రాడు లేని ధనస్సు కలవాడైనప్పటికీ (విల్లు ఎక్కుపెట్టకపోయినా అని అర్థం), భువి=లోకంలో, జేతవ్యం+జేతుం=జయింపబడవలసిన దానిని జయించడానికి, స్వపతః+మమ+ఇవ=నిద్రిస్తున్న నాకున్నట్లుగా, యస్య+గురవః=ఎవని గురువులు, తన్త్రే=పరిపాలన విషయంలో, కార్య+జాగరూకాః=పనిపట్ల మెలకువ కలిగి, జాగ్రతి=ఏకాగ్ర దృష్టితో ఉంటారో, అసౌ=అటువంటి ఇతడు (చాణక్యుడు), సమర్థ+ఏవ=తగినవాడే కదా!
వియోగిని. సరిపాదాలతో – స – స – జ – గగ.
బేసి పాదాలతో స – భ – ర – ల – గ గ – గణాలు.
విభావన (విభావనా వినాపిస్యాత్ కారణం కార్య జన్మ చేత్ – అని కువలయానందం).
ఇక్కడ – అల్లెత్రాడు తొడగని కార్ముకమైనా జయించే శక్తి కలిగి వున్నదని చెప్పడం గమనించదగినది.
(చాణక్య ముపసృత్య) ఆర్య, చన్ద్రగుప్తః ప్రణమతి.
(చాణక్యం+ఉపసృత్య=చాణక్యుని సమీపించి) ఆర్య=అయ్యవారూ, చన్ద్రగుప్తః+ప్రణమతి=చంద్రగుప్తుడు నమస్కరిస్తున్నాడు.
సమ్పన్నాస్తే సర్వాశిషః। తదభివాదయస్వ తత్రభవన్త మమాత్యముఖ్యమ్।
తే=నీకు, సర్వ+అశిషః=అన్ని విధాల ఆశీస్సులు, సమ్పన్నాః=సమకూడి ఉన్నాయి. తత్=అందువల్ల, తత్రభవన్తం+అమాత్యముఖ్యమ్=పూజ్యులైన ప్రధానామాత్యునికి, అభివాదయస్వ=వందనమాచరించు.
(స్వగతమ్) యోజితో ఽనేన సమ్బన్ధః।
(స్వగతమ్=తనలో), అనేన+సమ్బన్ధః=ఇతడితో అనుబంధం, యోజితః=కూర్పబడింది.
(రాజాన ముపసృత్య) అయ మమాత్య రాక్షసః ప్రాప్తం। ప్రణమైనమ్।
(రాజానం+ఉపసృత్య=రాజును సమీపించి) అయం+అమాత్యరాక్షసః+ప్రాప్తం=ఇరుగో రాక్షసమంత్రి (మనకు) సమకూడారు. ఏనః+ప్రణమ=వీరికి నమస్కరించు.
(రాక్షస ముపసృత్య) ఆర్య, చన్ద్రగుప్తః ప్రణమతి.
(రాక్షసం+ఉపసృత్య=రాక్షసుణ్ణి సమీపించి) ఆర్య=అయ్యా, చన్ద్రగుప్తః+ప్రణమతి=చంద్రగుప్తుడు నమస్కరిస్తున్నాడు.
(విలోక్య స్వగతమ్) అయే చన్ద్రగుప్తః! య ఏషః…
(విలోక్య=చూసి, స్వగతమ్=తనలో) అయే=ఆహా! చన్ద్రగుప్తః=చంద్రగుప్తుడు! యః+ఏషః=ఎట్టి ఇతడు…
బాల ఏవ హి లోకేఽస్మిన్ సంభావిత మహోదయః
క్రమేణారూఢవాన్ రాజ్యం యూథైశ్వర్యమివద్విపః॥ (12)
బాల+ఏవ+హి=పిన్నవాడైనప్పటికీ, అస్మిన్+లోకే=ఈ లోకంలో, సంభావిత+మహోదయః=’ఇతడు వృద్ధిలోకి వస్తా’డని తలచబడినవాడై, క్రమేణ=కాలక్రమంలో, ద్విపః=ఏనుగు గున్న, యూథ+ఐశ్వర్యం=తన ఘటకు నాయకస్థానాన్ని, ఇవ=వలె – రాజ్యం=రాజపదవిని, ఆరూఢవాన్=అధిరోహించాడు.
అనుష్టుప్.
ఉపమ – (ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః అని – కువలయానందం). ఇక్కడ “ద్విపః యూథైశ్వర్యం ఇవ రాజ్యం ఆరూఢవాన్” అని పోలిక చెప్పడం గమనించదగినది.
(ప్రకాశమ్) రాజన్, విజయస్వ.
(ప్రకాశమ్=పైకి) రాజన్=ఓ రాజా!, విజయస్వ=విజయివి కా!
ఆర్య,
జగతః, కిం న విజితం మ యేతి ప్రవిచిన్త్యతామ్
గురౌ షాడ్గుణ్యచిన్తయా మార్యే చార్యే చ జాగ్రతి॥ (13)
జగతః=లోకంలో, షాడ్గుణ్య+చిన్తయా=పరిపాలనకు సంబంధించిన ఆరు అంగాల ఆలోచనలో (సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధం, ఆశ్రయం), గురౌ+ఆర్యే=పూజ్య గురువు (చాణక్యుడు), ఆర్యే+చ=పూజ్యులైన తమరును, జాగ్రతి (సతి)=మెలకువతో ఉండగా, – మయా=నా చేత, కిం+న+విజితం=ఏది జయం పొందకుండా ఉన్నది? ఇతి=అని – ప్రవిచిన్త్యతామ్=మిక్కిలి ఆలోచింపబడుగాక!
ఇక్కడ ‘గురౌ ఆర్యేచ’ అన్న వెంటనే ‘ఆర్యే చ’ అనడంలో చంద్రగుప్తుడు రాక్షసమంత్రిని తనకు ఆంతరంగికునిగానే సంభావించాడు. ఆ గౌరవాన్ని చాణక్యుడే రాజు చేత రాక్షసమంత్రికి ‘కల్పించాడు’ -.
(స్వగతమ్) స్పృశతి మాం భృత్య భావేన కౌటిల్యశిష్యః। అథవా వినయ ఏ వైష చన్ద్రగుప్తస్య, మత్సరస్తు మే విపరీతం కల్పయతి। సర్వథా స్థానే యశస్వీ చాణక్యః। కుతః…
(స్వగతమ్=తనలో), కౌటిల్యశిష్యః=చంద్రగుప్తుడు, భృత్యభావేన=(నాకు) సేవకుడనే భావన కలిగిస్తూ, మాం+స్పృశతి=నాకు దగ్గరవుతున్నాడు. అథవా=అలాగున కాని పక్షంలో, ఏషః+చన్ద్రగుప్తస్య+వినయ+ఏవ=ఈ చంద్రగుప్తుడి వినయశీలమే కావచ్చు, మే+మత్సరః+తు=నా అసహనమైతే (వ్యతిరేకభావం), విపరీతం+కల్పయతి=వ్యతిరేకతను పుట్టిస్తుంది, సర్వథా+స్థానే=ఎటు చూసినా, యశస్వీ+చాణక్యః=చాణక్యుడు కీర్తనీయుడే! – కుతః=ఎందుకంటే…
ద్రవ్యం జిగీషు మధిగమ్య జడాత్మనో ఽపి
నేతు ర్యశస్విని పదే నియతం ప్రతిష్ఠా।
అద్రవ్య మేత్య భువి శుద్ధనయో ఽపి మన్త్రీ
శీర్ణాశ్రయః పతతి కూలజవృక్షవృత్త్యా॥ (14)
జడాత్మనః+అపి+నేతు=మందబుద్ధి అయిన నాయకుడికై సైతం (మంత్రికి), జిగీషుం+ద్రవ్యం=జయశీలం గల పాత్రను, అధిగమ్య=పొంది, యశస్విని+పదే=కీర్తిమంతుడి స్థానంలో, ప్రతిష్ఠా=పాదుకొనడం, నియతం=తప్పనిసరి. భువి=లోకంలో, అద్రవ్యం=అపాత్రతను, ఏత్యం=పొంది, – శుద్ధ+నయః+అపి=పొరపాటనేది ఎరుగని, రాజనీతి చతురుడు కూడా, మన్త్రీ=మంత్రాంగం నడిపే మంత్రి, కూలజ+వృక్ష+వృత్త్యా=నది ఒడ్డున చెట్టు లెక్కన, శీర్ణః+అశ్రయః=శిథిలమైన నెలవు కలిగి, పతతి=పడిపోతాడు.
వసంత తిలక – త- భ – జ – జ – గ గ – గణాలు.
రాక్షసమంత్రి, నాయకత్వ సామర్థ్యం విషయంలో తేడాను భంగ్యంతరంగా చెపుతున్నాడు – జయశీలుణ్ణి పాలకుడిగా పొందిన మంత్రి ఒకవేళ అసమర్థుడైనా, కీర్తిని పొందగలుతాడు. మంత్రి సమర్థుడైనా, తన పాలకుడు బలహీనుడైతే (అపాత్రుడు), అతడి పతనం – నది ఒడ్డు చెట్టు మాదిరి – కూలిపోక తప్పదట – ఈ భేదం వల్లనే చాణక్యుడు కీర్తిమంతుడయ్యాడు (చంద్రగుప్తాశ్రయం వల్ల), తాను కూలిపోయాడు (చంద్రకేత్వాశ్రయం వల్ల).
అర్థాంతర న్యాసం. (ఉక్తిరర్థాన్తర న్యాసా స్యాత్ సామాన్య విశేషయోః – అని కువలయానందం).
అమాత్య రాక్షస, ఇష్యతే చన్దనదాసస్య జీవితమ్?
అమాత్యరాక్షస=రాక్షసమంత్రీ, చన్దనదాసస్య+జీవితమ్+ఇష్యతే=చందనదాసు జీవించాలని ఉన్నదా?
భో విష్ణుగుప్త, కుతః సన్దేహః?
భో+విష్ణుగుప్త=ఓ విష్ణుగుప్తా?, సన్దేహః+కుతః=అనుమానం ఏముంది?
అమాత్య రాక్షస, అగృహీతశస్త్రేణ భవ తానుగృహ్యతే వృషల ఇ త్యతః సన్దేహః। తద్యది సత్య మేవ చన్దనదాసస్య జీవిత మిష్యతే। తతో గృహ్యతా మిదం శస్త్రమ్।
అమాత్య+రాక్షస=రాక్షసమంత్రీ, అగృహీత+శస్త్రేణ=(అధికార చిహ్నమైన) కత్తిని స్వీకరించకుండానే, వృషలః=చంద్రగుప్తుడు, భవతా=నీ చేత, అనుగృహీత+ఇతి+అతః+సన్దేహః=అనుగ్రహింపబడ్డాడా (లేదా?) అనేదే ఇక్కడ సందేహం. తత్+యది+సత్యం+ఏవ=అదే గనుక నిజమైతే, చన్దనదాసస్య+జీవితం+ఇష్యతే=చందనదాసు జీవితం, కోరడం అవుతుంది. తతః+ఇదం+శస్త్రమ్+గృహ్యతాం=అలాగైతే – ఈ కత్తి స్వీకరించబడుగాక!
భో విష్ణుగుప్త, మా మైవమ్। అయోగ్యా వయ మస్య। విశేషత స్త్వయా గృహీతస్య గ్రహణే॥
భో+విష్ణుగుప్త=ఓ విష్ణుగుప్తుడా, మా+మా+ఏవమ్=ఇలాగ వద్దు. అస్య+అయోగ్యాః+వయ=ఈ పనికి మేము తగినవారం కాము. విశేషతః=మరిన్నీ, త్వయా+గృహీతస్య+(శస్త్రస్య)+గ్రహణే=నువ్వు స్వీకరించిన కత్తిని (నేను) పట్టుకోవడం (తగనిది అని అన్వయం).
రాక్షస, యోగ్యో ఽహం న త్వం యోగ్య ఇతి కి మనేన. పశ్య…
రాక్షస=ఓ రాక్షసుడా, యోగ్యః+అహం=నేను యోగ్యుడననీ, న+త్వం+యోగ్యః=నువ్వు కావనీ, ఇతి=అంటూ, కిం+అనేన=దీని వల్ల ఏమి లాభం? పశ్య=చూడు…
అశ్వైః సార్ధ మజస్రదత్తకవికైః
క్షామై రశూన్యాసనైః
స్నానాహారవిహారపానశయన
స్వేచ్ఛాసుఖైర్వర్జితాన్
మాహాత్మ్యాత్తవ పౌరుషస్య మతిమన్
దృప్తారిదర్పచ్ఛిదః
పశ్యైతాన్ పరికల్పనా వ్యతికర
ప్రోచ్ఛూనవంశాన్ గజాన్॥ (15)
మతిమన్= ఓ బుద్ధిశాలీ! (రాక్షసుడా!), దృప్త+అరి+దర్పచ్ఛిదః=బలిసిన శత్రువుల గర్వాన్ని అణగద్రొక్కిన, తవ=నీ (యొక్క), పౌరుషస్య+మాహాత్మ్యాత్=వీరత్వపు గొప్పతనం కారణంగా, అజస్ర+దత్త+కవికైః=ఎల్లప్పుడూ కళ్ళేలు తగిలించి వున్నవై, అశూన్య+ఆసనైః=తొలగించని జీనులతో, క్షామైః+అశ్వైః=కృశించిన గుర్రాలతో – (కలిసి), స్నాన+ఆహార+విహార+పాన+శయన+స్వేచ్ఛా+సుఖైః=(ఏనుగులకు) అత్యవసరమైన స్నానం, ఆహారం, సంచారం, పానం, పడక, స్వాతంత్ర్యం మొదలైన సౌఖ్యాల (చేత), వర్జితాన్=విడువబడినవీ; పరికల్పనా+వ్యతికర+ప్రోచ్ఛూన+వంశాన్=అలంకరణ సామాగ్రి (హోదా మొదలైనవి) తొలగించకుండా ఉంచడం వల్ల వెన్నెముక వాపు గలవీ; కలిగిన, ఏతాన్+గజాన్=ఈ ఏనుగులను… (పశ్య=చూడు).
ఉదాత్తాలంకారం (ఉదాత్తామృద్ధేశ్చరితం శ్లాఘ్యం చాన్యోపలక్షణమ్ – అని కువలయానందం). ఇక్కడ శ్లాఘనీయమైన రాక్షసమంత్రి సామర్థ్యాన్ని అన్యాపదేశంగా వర్ణించడం గమనించదగినది.
యుద్ధ సన్నద్ధంగా ఉన్న గుర్రాల వీపుల మీద నుంచి ఎన్నడూ జీనులు తీసే అవకాశం రాలేదు. ఏనుగుల వీపులపై ఉండే హోదా వంటి కూర్చునే సాధనాలు తొలగించక, వాటి వెన్నెముకలు వాచిపోయాయి – ఎందుకు? ఏ క్షణంలో శత్రుసైన్యంతో యుద్ధం అనివార్యమవుతుందోనని – చంద్రగుప్త సేనాపరివారానికి విశ్రాంతి లేకుండా చేసిన అసామాన్యుడివయ్యా! అని రాక్షసమంత్రి పట్ల ప్రశంస గమనించదగినది.
అథవా కిం బహునా? న ఖలు భవతః శస్త్రగ్రహణమన్తరేణ చన్దనదాసస్య జీవితమస్తి।
అథవా=అంతేకాదు, కిం+బహునా=వెయ్యి మాటలెందుకు? భవతః+శస్త్రగ్రహణం+అన్తరేణ=నువ్వు (ఈ) కత్తి పట్టుకుంటే తప్ప, చన్దనదాసస్య+జీవితం+నాస్తి+ఖలు=చందనదాసుకి బతుకు లేదు, ఇది తథ్యం.
(స్వగతమ్)
(స్వగతమ్=తనలో)
నన్ద స్నేహగుణాః స్పృశన్తి హృదయం,
భృత్యోస్మి తద్విద్విషాం,
యే సిక్తాః స్వయ మేవ వృద్ధి మగమం
శ్ఛిన్నాస్త ఏవ ద్రుమాః.
శస్త్రం మిత్రశరీరరక్షణకృతే,
వ్యాపారణీయం మయా
కార్యాణాం గతయో విధే రపి నయ
న్త్యాజ్ఞాకరత్వం చిరాత్ (16)
నన్ద+స్నేహగుణాః=నందవంశీయులతో ఆత్మీయతకు కారణమైన సుగుణాలు, హృదయం+స్పృశన్తి=మనస్సును తాకుతున్నాయి, తత్+విద్విషాం=అట్టివారి శత్రువులకు, భృత్యః+అస్మి=సేవకుణ్ణయ్యాను. యే=ఏవైతే, స్వయం+ఏవ= నా చేతనే, సిక్తాః=తడుపబడినవై, వృద్ధిం+అగమం=పెరిగి పెద్దవయ్యాయో, తే+ద్రుమాః+ఏవ=అవే చెట్లు, భిన్నాః=తెగగొట్టబడ్డాయి. మయా=నాచేత, శస్త్రం=ఆయుధం, మిత్రశరీర+రక్షణ+కృతే=స్నేహితుడి శరీరాన్ని కాపాడడం కోసం, వ్యాపారణీయం=వినియోగించదగి ఉంది. కార్యాణాం+గతయ=కావలసిన పనుల గమనాలు, చిరాత్=చాలా కాలానికి, విధేః+అపి=బ్రహ్మకు సైతం, ఆజ్ఞాకరత్వం+నయన్తి=సేవకత్వం దిశగా నడిపిస్తాయి.
అర్థాంతర న్యాసం. (ఉక్తిరర్థాన్తర న్యాసా స్యాత్ సామాన్య విశేషయోః – అని కువలయానందం). ఇక్కడ, చంద్రగుప్తునికి తన తప్పనిసరి సేవకత్వ స్థితి గురించి రాక్షసమంత్రి తలపోస్తూ –
కాలగతులు బలీయాలు – బ్రహ్మకు సైతం భృత్యత్వం తప్పదని సామాన్యీకరించడం గమనార్హం.
(ప్రకాశమ్) విష్ణుగుప్త, నమః సర్వ కార్య ప్రతిపత్తి హేతవే సుహృత్స్నేహాయ। కా గతిః? ఏష ప్రహ్వో ఽస్మి।
(ప్రకాశమ్=పైకి) విష్ణుగుప్త=ఓ విష్ణుగుప్తుడా!, సర్వకార్య+ప్రతిపత్తిహేతవే=అన్ని పనుల ఎరుకకు కారణమనదగిన, సుహృత్+స్నేహాయ=మిత్రుని స్నేహానికి, నమః=నమస్కారం. కా+గతిః=(నాకు) ఏది దారి? ఏషః+ప్రహ్వః+అస్మి=ఇదిగో నేను లొంగిపోతున్నాను.
(సహర్షమ్) వృషల వృషల, అమాత్య రాక్షసే నేదానీ మనుగృహీతో ఽసి. దిష్ట్యా వర్ధతే భవాన్!
(స+హర్షమ్=సంతోషంగా) వృషల+వృషల=ఓ వృషలుడా! చంద్రగుప్తా, ఇదానీం=ఇప్పుడు, అమాత్యరాక్షసేన=రాక్షసమంత్రి చేత, అనుగృహీతః+అసి=అనుగ్రహించబడ్డావు. దిష్ట్యా=అదృష్టవశాత్తు, వర్ధతే+భవాన్=నువ్వు వృద్ధి పొందావు!
ఆర్యప్రసాద ఏష, చన్ద్రగుప్తే నానుభూయతే।
ఏషః=ఇది, ఆర్య+ప్రసాదః=అయ్యగారి అనుగ్రహం. చన్ద్రగుప్తేన+అనుభూయతే=చంద్రగుప్తుడు ఆస్వాదిస్తున్నాడు.
(ప్రవిశ్య) జేదు అజ్జో. ఏసో క్ఖు భద్దభట భాఉరాఅణ ప్పముహేహిం సంజమిదకరచలణో మలఅకేదూ పడిహారభూమిం ఉవట్ఠిదో। ఏదం సుణిఆ అజ్జోప్పమాణమ్.
(జయత్వార్యః। ఏష ఖలు భద్రభట భాగురాయణ ప్రముఖైః సంయమితకరచరణో మలయకేతుః ప్రతిహారభూమి ముపస్థితః। ఇదం శ్రుత్వా ఆర్యః ప్రమాణమ్।)
ఆర్య+జయతు=అయ్యవారికి జయమగుగాక! ఏషః+ఖలు=ఇతడే, భద్రభట+భాగురాయణ+ప్రముఖైః=భద్రభటుడు, భాగురాయణుడు మొదలైనవారి చేత, సంయమిత+కర+చరణః+మలయకేతుః=కాలు, చేతులు బంధింపబడిన మలయకేతు, ప్రతిహార+భూమిం=ద్వార ప్రదేశంలో, ఉపస్థితః=నిలిచి ఉన్నాడు. ఇదం+శ్రుత్వౌ=ఇది వినిన పిమ్మట, ఆర్యః+ప్రమాణం=(ఏమి చేయదగునో) అయ్యవారే నిర్ధారించాలి.
భద్ర, నివేద్యతా మమాత్య రాక్షసాయ, సోఽయ మిదానీం జానీతే।
భద్ర=నాయనా, అమాత్య రాక్షసాయ+నివేద్యతాం=రాక్షసమంత్రి వారికి విన్నవింతురు గాక, ఇదానీం=ఇప్పుడు, సః+అయం+జానీతే=అతడికి తెలుసు.
(స్వగతమ్) దాసీకృత్య మా మిదానీం విజ్ఞాప నాయాం ముఖరీకరోతి కౌటిల్యః। కా గతిః? (ప్రకాశమ్) రాజన్ చన్ద్రగుప్త, విదిత మేవ తే యథా వయం మలయకేతౌ కిఞ్చిత్కాల ముషితాః, తత్పరిరక్ష్యతా మస్య ప్రాణాః।
(స్వగతమ్=తనలో) ఇదానీం=ఇప్పుడు, మాం+దాసీకృత్య=నన్ను సేవకుణ్ణి చేసి, విజ్ఞాపనాయాం=విన్నపం చేయడంలో, కౌటిల్యః+ముఖరీకరోతి=(నన్ను) చులకన చేస్తున్నాడు. కా+గతిః=ఏది దారి? (ప్రకాశమ్=పైకి) రాజన్+చన్ద్రగుప్త=రాజా, చంద్రగుప్తా!
యథా+వయం+మలయకేతౌ+కిఞ్చిత్+కాలం+ఉషితాః=మేము కొంతకాలం మలయకేతువుతో ఎలా గడిపామో, తే+విదితం+ఏవ=నీకు తెలిసినదే, తత్=అందుచేత, అస్య ప్రాణాః=అతడి ప్రాణాలు, పరిరక్ష్యతాం=పరిరక్షింపబడుగాక!
(రాజా చాణక్యముఖమవలోకయతి)
(రాజా=రాజు, చాణక్య+ముఖం+అవలోకయతి=చాణక్యుడి ముఖంలోకి చూశాడు)
ప్రతిమానయితవ్యో ఽమాత్య రాక్షసస్య ప్రథమః ప్రణయః. (పురుషం ప్రతి) భద్ర, అస్మద్వచనా దుచ్యన్తాం భద్రభట ప్రముఖాః. యథా ‘అమాత్యరాక్షసేన విజ్ఞాపితో దేవ శ్చన్ద్రగుప్తః ప్రయచ్ఛతి మలయకేతవే పిత్ర్యమేవ విషయమ్. అతో గచ్ఛన్తు భవన్తః సహానేన. ప్రతిష్ఠితే చాస్మిన్ పున రాగన్తవ్యమ్.‘ ఇతి.
అమాత్య రాక్షసస్య=రాక్షసమంత్రి (యొక్క), ప్రథమః+ప్రణయః=మొదటి ఇష్టాన్ని (ఇష్టం), ప్రతిమానయితవ్యః=గౌరవించదగినది. (పురుషం+ప్రతి=పురుషునితో…) భద్ర=నాయనా, అస్మత్+వచనాత్=నా మాటగా, భద్రభట+ప్రముఖాః=భద్రభటుడు మొదలైనవారు, ఉచ్యన్తాం=చెప్పబడుదురు గాక. యథా=ఏమనంటే – ‘అమాత్యరాక్షసేన=రాక్షసమంత్రి చేత, విజ్ఞాపితః+దేవః+చన్ద్రగుప్తః=విన్నవింపబడిన చంద్రగుప్త ప్రభువు, మలయకేతవే=మలయకేతువు కొరకు, పిత్ర్యం+ఏవం+విషయమ్=ఈ తండ్రిగారి దేశాన్ని (రాజ్యాన్ని), ప్రయచ్ఛతి=ఇచ్చివేస్తున్నాడు. అతః=అందుచేత, అనేన+సహ=వానితో, భవ్తనః+గచ్ఛన్తు=మీరు వెళ్ళుదురు గాక! అస్మిన్+ప్రతిష్ఠితే+చ=అతడిని (ఆ రాజ్యంలో) నిలిపిన పిమ్మట, పునః+ఆగన్తవ్యమ్=తిరిగి రావాలి.’ ఇతి=అని.
జం అజ్జో ఆణవేదిత్తి. (యదార్య ఆజ్ఞాపయతి)
(పరిక్రామతి)
యత్+ఆర్య+ఆజ్ఞాపయతి=అయ్యవారు ఆదేశించినట్టే (చేస్తాను).
(పరిక్రామతి=ముందుకు నడిచాడు)
భద్ర, తిష్ఠ తిష్ఠ. అపరం చ. వక్తవ్యో దుర్గపాలః ‘అమాత్య రాక్షసలాభేన సుప్రీత శ్చన్ద్రగుప్త సమాజ్ఞాపయతి – ‘య ఏష శ్రేష్ఠీ చన్దనదాసః, స పృథివ్యాం సర్వనగర శ్రేష్ఠి పదమారోప్యతా‘ మితి। అపిచ. వినా వాహన హస్తిభ్యః క్రియతాం సర్వమోక్షః ఇతి। అథవా అమాత్యే నేతరి కి మస్మాకం ప్రయోజన మిదానీమ్।
భద్ర=నాయనా, తిష్ఠ+తిష్ఠ=నిలు, నిలు. అపరం+చ=మరొక విషయం కూడా. వక్తవ్యః+దుర్గపాలః=దుర్గపాలుడికి ఇలా చెప్పాలి (చెప్పబడాలి) – ‘అమాత్య రాక్షసలాభేన=రాక్షసమంత్రి సమకూడి ఉన్నందున, సుప్రీతః+చన్ద్రగుప్త=మిక్కిలి సంతోషించిన చంద్రగుప్తుడు, సమాజ్ఞాపయతి =ఇలా ఆదేశిస్తున్నాడు – ‘యః+ఏష+శ్రేష్ఠీ+ చన్దనదాసః=ఈ శ్రేష్ఠి చందనదాసు ఎవడైతే ఉన్నాడో, సః=అతడు, పృథివ్యాం=లోకంలో, సర్వనగర+శ్రేష్ఠి+పదం=అన్ని నగరాలకు ముఖ్య శ్రేష్ఠి పదవిని, ఆరోప్యతాం=అధిరోహించబడుగాక’ ఇతి=అని. అపి+చ=ఇంకా, వినా+వాహన+హస్తిభ్యః=వాహనాలు, ఏనుగులు తప్ప, సర్వమోక్షః+క్రియతాం=పూర్తిగా ఎల్లవారి విడుదల చేయబడుగాక – ఇతి=అని. అథవా=అలాగా కాదు గాక!, అమాత్యే+నేతరి (సతి)=రాక్షసమంత్రి తంత్రం నడిపే వ్యక్తి కాగా, ఇదానీం=ఇప్పుడు, అస్మాకం+ప్రయోజనం+కిం=మా (నా) ప్రయోజనం ఇంకేం ఉంది?
వినా వాహనహస్తిభ్యో ముచ్యతాం సర్వబన్ధనమ్
పూర్ణ ప్రతిజ్ఞేన మయా కేవలం బధ్యతే శిఖా (17)
వాహన+హస్తిభ్యః+వినా=వాహనాలు, ఏనుగులు తప్ప, సర్వ+బన్ధనమ్=ఎల్లవారి బంధాలను (కట్లను) (సంకెళ్ళను), ముచ్యతాం=విడువబడుగాక! పూర్ణ (తీర్ణ)+ప్రతిజ్ఞేన=ప్రతిజ్ఞను నెరవేర్చుకున్న, మయా=నా చేత, కేవలం+శిఖా=కేవలము నా శిగ మాత్రం, బధ్యతే=ముడివేయబడుతుంది.
నందవంశ నిర్మూలనం, చంద్రగుప్తునికి రాక్షసుణ్ణి మంత్రిని చేయడం అనే ప్రతిజ్ఞలు నెరవేరినందువల్ల అంతవరకు, ముడి వీడి ఉన్న తన శిఖను ఇక ముడుచుకోవచ్చుననే సంతృప్తిని చాణక్యుడిక్కడ ప్రకటిస్తున్నాడు.
(నిష్క్రాన్తః)
(నిష్క్రాన్తః= వెళ్ళిపోయాడు)
భో రాజన్ చన్ద్రగుప్త, కిం తే భూయః ప్రియముపకరోమి?
భో+రాజన్+చన్ద్రగుప్త=ఓ రాజా చంద్రగుప్త!, భూయః=ఇంకా, తే+కిం+ప్రియం+ఉపకరోమి=నీకు ఇష్టమైనదింకా ఏమి చేయను (ఇంకా ఏ విధంగా ఉపయోగపడగలను?)
కి మతః పర మపి ప్రియ మస్తి?
అతః+పరం+అపి+ప్రియం=ఇంతకు మించి ఇష్టమైనది, కిం+అస్తి=ఏమి ఉంటుంది?
రాక్షసేన సమం మైత్రీ, రాజ్యే చారోపితా వయమ్.
నన్దాశ్చోన్మూలితాః సర్వే, కింకర్తవ్య మతః ప్రియమ్? (18)
రాక్షసేనసమం+మైత్రీ=రాక్షసమంత్రితో స్నేహం (ఏర్పడింది), రాజ్యే+వయమ్+ ఆరోపితా+చ=రాజ్యపాలనలో మేము స్థిరపడ్డాం. సర్వే+నన్దాః+ఉన్మూలితాః+చ=నందరాజులంతా అంతమయ్యారు, అతః+ప్రియమ్+కిం+కర్తవ్యం=అంతకు మించి చేయదగినదేముంటుంది?
తథా పీద మస్తు…
తథాపి=అయినప్పటికీ – ఇదం+అస్తు=ఇది కలుగు గాక! –
వారాహీ మాత్మ యోనే స్తను మవనవిధా
వాస్థిత స్యానురూపాం
యస్య ప్రాగ్దన్తకోటిం ప్రలయ పరిగతా
శిశ్రియే భూతధాత్రీ
మ్లేచ్ఛై రుద్విజ్యమానా భుజయుగమధునా
సంశ్రితా రాజమూర్తేః
స శ్రీమద్బన్ధుభృత్య శ్చిర మవతు మహీం
పార్థివ శ్చన్ద్రగుప్తః (19)
భూతధాత్రీ=ప్రాణులన్నింటినీ ధరించే భూమి, ప్రాక్=పూర్వం, ప్రలయ+పరిగతా=ప్రలయం పాలై, అవన+విధౌ=రక్షించే పనిలో, అనురూపా=తగు విధమైన, తనుం+ఆస్తిత్వశ్య=శరీరాన్ని పొందిన, ఆత్మయోనేః=స్వయంభువు అయిన, యస్య=ఎవని యొక్క (మహా విష్ణువు యొక్క), దన్తకోటిం+శిశ్రియే=దంతాల వరుసను ఆశ్రయించినదో (ఆ భూమి), అధునా=ప్రస్తుతం, మ్లేచ్ఛైః+ఉద్విజమానా=మ్లేచ్ఛుల వల్ల ఉద్రేకింపబడుతూ, రాజమూర్తేః+యస్య+భుజయుగం=రాజస్వరూపం దాల్చిన ఎవని యొక్క భుజద్వయాన్ని, సంశ్రితా=ఆశ్రయించుకొన్నదో, సః+పార్థివః+చన్ద్రగుప్తః=ఆ చంద్రగుప్త ప్రభువు, శ్రీమత్+బంధు+భృత్యః=సంపద సహితంగా బంధువులు, పరివారం కలవాడై, మహీం+చిరం+అవతు=ఈ భూమిని చాలాకాలం రక్షించుగాక!
స్రగ్ధర – మ – ర – భ – న – య – య – య – గణాలు.
ఒకప్పుడు ప్రళయం పాలైన భూమిని శ్రీమహావిష్ణువు ‘తగిన శరీరం’ దాల్చి ఉద్ధరించినట్టు – అదే శ్రీమహావిష్ణువు ‘చంద్రగుప్త’ రూపం దాల్చి – మ్లేచ్ఛ బాధితమైన భూమిని చిరకాలం రక్షించాలనే భరతవాక్యంతో నాటకాన్ని ‘స్రగ్ధరా’ వృత్తంతో కవి ముగిస్తున్నాడు.
(ఇతి నిష్క్రాన్తాః సర్వే)
(ఇతి=అని, సర్వే= అందరూ, నిష్క్రాన్తాః= వెళ్ళారు).
ముద్రా రాక్షస నాటకే నిర్వహణో నామ సప్తమాఙ్కః
ముద్రారాక్షసమనే నాటకంలో, ‘నిర్వహణ’ అనే పేరుగల – ఏడవ అంకం ముగిసినది.
ఇతి విశాఖదత్త విరచితం ముద్రారాక్షసం నాటకం సమాప్తమ్
(స్వస్తి)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
జ్ఞాపకాల పందిరి-34
సానుకూల ప్రభావపు కథలు – ‘నేను మంచిదాన్నేనా..’
పండిత విమర్శకుడు ఆచార్య కె. గోపాలకృష్ణారావు
నేను.. కస్తూర్ని -1
సమకాలీనం-6
శ్రీ డబ్బీ చెల్లయ్య గారి స్మారకోపన్యాస సభ ప్రెస్ నోట్
అలనాటి అపురూపాలు-125
పంద్రాగస్టు
ఆమని-5
మానసిక ఆరోగ్యం ప్రాధాన్యంపై వెలుగు ప్రసరించే నవల ‘మార్పు మన(సు)తోనే మొదలు’
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®