[22 ఏప్రిల్ 2025 న ధరిత్రీ దినోత్సవం సందర్భంగా శ్రీమతి దివాకర్ల రాజేశ్వరి రచించిన ‘ధరిత్రి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


ఈ క్షోణి
వసుధైక కుటుంబిని
సర్వం సహా ధరణి
క్షమయా ధరిత్రి,
నా నీడలకు అడుగులను నేర్పిన
సుమనో సంపాదనా వసుమతి
ఈ విశ్వంభర
జలధి వేలా వలయ వసుంధర
గిరి గహ్వర కానన పర్వత శిఖర
కుటజ సరోవర, నదీ నద సంపుట
సూర్య చంద్ర సంభ్రమిత
కాంతి రేఖా సమన్విత పుడమి.
ఈ ఉర్వి
దిటమైన పరిసర ప్రేమల వసుధ
భృంగ నాద కుసుమ పరిమళాల శృంగార వాటిక.
శ్వాస నిశ్వాసల బ్రతుకు చైతన్యాల ధారా వాహిక
సర్వ ప్రాణి సంక్షేమ సంపాదనా ధన వితరణల అవని.
ఈ భూమి
సంజీవని, మహిమాన్విత, ఫల దాయిని, మాతృశక్తి.
మేడలన్నింటికి ఆధారం నేలమట్టి ఋణం.
పేద ధనిక భేదం లేని
ప్రజాసామ్య ధనం మేదిని
ఈ ఇల
లాటిన్లో టెర్రా,
గ్రీక్లో గియా,
రోమన్లో భూదేవి టెల్లస్,
ఎల్లలు దాటిన లోకంలో
అఖండ జీవాతువు జగతి.
చల్లని గాలుల సంవాహనకు
పిడికెడు మట్టిని దోసిట పట్టాలి
పులకరించిన విత్తనం మొలక
తరువై చాచిన శాఖల పల్లవాలలో
మలయానిలాల వీవెనకు
కర సేవలను చేయాలి.
కనులు తెరచిన మెలకువలో
స్థావర జంగమ దాసోహానికి
విపుల భువన సంరక్షణల ప్రతినలు పూనాలి.
చేతులార చేసిన తప్పిదాలకు
మనిషి చేయాలి వినతి మహికి
భావితరాలకు ధాత్రీ సౌందర్యాల
పర్యావరణ స్వచ్ఛతల ప్రగతిని అందించాలి.
