[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]


కాలం చేసే గారడీలు
మధ్యాహ్నం పూట ఏమీ తోచక తీరికగా కూర్చున్న సమయంలో – ఒక కోయవాడు పరిచయస్థుడిలాగా గేటు తీసుకుని లోపలికి వచ్చాడు. ఎంతో ఆప్యాయంగా “బావుండావా” అని పలకరించాడు. “ఇష్ణుమూర్తి లాగ ఉండారు. మీ మాట రాజుగారి శాసనం. తిరుగు లేదు. కొండదేవర ఆన. అంబ పలుకుతుండాది. తిరుగులేదు. మీరు కూసున్న కుర్సీ కన్నా పెద్ద కురీసులో కూకోవాల. సిన్న కోరిక దొరగారి మడసులో కొట్టుకుంటోంది. కోరిక తీరే సమయం వచ్చింది. రెండు నెలల్లో మీ కోరిక తీరుతాది. అప్పుడు నాకు పట్టుబట్టలు పెట్టాల. దొరది దొడ్డ మడసు, కోరిక తీరుతాదిలే. కుడి చేతి మీద పుట్టు మచ్చ ఉండాది. తిరుగులేదు” అంటున్నాడు.
వాడి మాట నమ్మటం కోస గవర్నర్లు, మంత్రులతో కల్సి ఉన్నట్లు తీసుకున్న ఫోటోలు చూపించాడు. “అంత గొప్పవాళ్లు కూడా నీ మాట నమ్ముతారా?” అని అడిగితే “భోజనం పెట్టి పట్టు వస్త్రాలు ఇచ్చిన్రు” అని చెప్పాడు. మేడ కడతాననీ, పెద్ద పదవిలోకి వస్తాననీ నమ్మకంగా “అమ్మ సెబుతుండాది” అంటూ కనిపించని అంబని సాక్ష్యంగా పెట్టాడు.
ఏదో కొద్దిగా డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు. మనిషికి తీరని కోరికలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఆ కోరికలు నెరవేరాలని దేవుళ్లకు మొక్కుకుంటూ ఉండటమూ సహజమే. ఈ మానసిక బలహీనతను అడ్డం పెట్టుకుని పొగడ్తలతో, కష్టాల అగడ్తలు దాటించేవారూ ఉంటారు.
జోస్యాలూ, జాతకాలూ చెప్పేవాళ్లు గమ్మత్తుగా మాట్లాడుతారు. స్పష్టంగా ఏదీ వాళ్లకీ తెలియదు. తెల్సినట్లు మాట్లాడతారు. అసలు విషయం మన నుంచే రాబడతారు. కష్టాలు గట్టెక్కటానికి రెండు నెలలో, రెండేళ్ల గడువు పెడతారు. మనసును ఊరడింప చేస్తారు. ఇది అవుతుందా, కాదా అని డోలాయమానంగా ఉన్న మనసుకు తృప్తి కలిగేలా, మంచి సమయం వస్తుందనీ, కొరికలన్నీ తీరిపోతాయనీ అంటారు. ఇంకా నమ్మకం కలగటం కోసం, తాయెత్తు కట్టుకోమనీ, లేదా ఫలానా పూజలు పునస్కారాలూ చేయమని చెబుతారు. మనిషి ఆశాజీవి గదా. ఆశే గదా శ్వాస. ఊగిసలాటలు, అశ నిరాశలూ, దోబూచులాటలకు ఉండనే ఉన్నయి – పరిహారాలు, దైవ దర్శనాలు, సాష్టాంగ దండ ప్రమాణాలూ, శ్రీవారి సేవలూ, కళ్యాణాలూ.. తప్పవు మరి.
కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు. చిత్రవిచిత్రాలు చేస్తుంది. ప్రాణ స్నేహితుల మధ్య, ప్రేయసీ ప్రియుల మధ్య, ఆలు మగల మధ్య, తండ్రీ కొడుకుల మధ్య కలతలు రేషి, కలహాలు సృష్టిస్తుంది. ప్రాణాధికంగా ప్రేమించేవారిని బద్ధ శత్రువులను చేస్తుంది. బద్ధ శత్రువులను సన్నిహితులను చేస్తుంది. కాళ్ళ ముందు వెన్నెల పరచిన కాలం గురిచూసి గుండెల్లో కత్తులు విసురుతుంది. ఎండ కాసిన ఇంటి ముందు చీకటి ముసురుతుంది. వెన్నెల కాసిన చోటనే వడగళ్ల వాన కురుస్తుంది. వానే నిలువనప్పుడు, వానతో వచ్చే వడగళ్లు నిలుస్తాయా? ఆకులు రాలటం, చిగుళ్లు వేయటం, మొగ్గలు తొడగడం, పూలు పూయటం, కాయలు కాయటం క్రమంగా జరిగిపోతూనే ఉంటాయి. నిండుగా నవ్విన ముఖ మండలం మీదనే విచారం, క్రోధం, విస్మయం, చిరుదరహాసం.. ఇదంతా కాలం చేస్తున్న గారడీయే.
కాలం ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తూనే ఉంటుంది. ఫలానా సమయంలో ఫలానా నదిలో మునిగితే, పాపాలన్నీ పటాపంచలై పోతాయని అంటారు. కోటానుకోట్ల మంది ఆ నదిలో మునిగి తేలుతారు. ప్రతి పనికీ మంచి రోజు, మంచి ముహుర్తం నిర్ణయిస్తారు. ఆ ముహుర్తంలో పెళ్లి చేయటం కోసం ఫంక్షన్ హాలు బుక్ చేసుకుని దీపాల తోరణాలతో అందంగా అలంకరించి బ్రహ్మాండంగా డెకరేషన్ చేయిస్తారు. రాత్రి పదింటికి పెళ్లి. మగపెళ్లివారు వచ్చి విడిదిలో దిగారు. అంతా సందడిగా, ఆనంద కోలాహలంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి నాలుగు వైపుల నుంచీ కారుమబ్బులు కమ్ముకొచ్చి కుంభవృష్టి కురిసింది. ఈ ఆకాల వర్షంతో వీధులన్నీ వాన నీటితో వరద కాలువలైనయి. అప్పుడు అనుకోకుండానే ఎవరో ఒకరు ఆనేస్తారు “ఏం ముహుర్తం పెట్టారురా బాబూ, ఈ వాన ఏమిటి, ఈ బురద ఏమిటి??” అని ముహూర్తం పెట్టిన వారిని నిందిస్తారు. కానీ వాన వెలిసి, కరెంటు వచ్చేస్తే అందరి ముఖాల్లో సంతోషం వెల్లి విరుస్తుంది. “లేవండి, లేవండి. ముహుర్తం వేళ అవుతోంది” అంటూ అంతా వందే భారత్ స్పీడ్లో పనులు చకచకా కానిస్తారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, పరిస్థితులను బట్టి మన ఆలోచనలూ, ఆవేశాలూ కూడా క్షణం క్షణం మారిపోతుంటాయి.
జాతకాలూ, జన్మ నక్షత్రాలూ ఎన్ని చూసి, ఎంత మంచి ముహుర్తంలో పెళ్లి జరిపించినా, అంతా సజావుగా సాగిపోతే, ఆది మా గొప్పదనం అంటారు. కర్మ కాలి, కొత్త దంపతుల మధ్య ఏవైనా అభిప్రాయ బేధాలొచ్చి, విడిపోతే మాత్రం, ఆ ముహుర్తం పెట్టిన వాడినే గాక, ఆ సంబంధం కుదిర్చిన వాడిని తిట్టిపోస్తారు. ఇవన్నీ మనసు ఆడుకునే ఆటలు. క్రీడల నీడలు.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.