[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
తలవాకిట ముగ్గులు
~
చిత్రం: తూర్పు సిందూరం
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గాత్రం: ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం
పాట సాహిత్యం
పల్లవి: తల వాకిట ముగ్గులు వేకువకే అందం శృతి కుదరని పాటకి లేదు కదా అందం నడి వీధులలో వేదం ఈ జానపదం సత్యం తద్దిం తరికిట తరికిట తదిగిణతోం తల వాకిట ముగ్గులు వేకువకే అందం శృతి కుదరని పాటకి లేదు కదా అందం
చరణం: అరె గలగల మోగిన పాదం, ఆ ముచ్చట మువ్వల నాదం అది పెరుగును ఏనాడో గోపాలుని ఆటల మైకం, రేపల్లెగ మారును లోకం జగమంతా తూగాడు దేహం ఉంటే రోగం ఉంది, సౌఖ్యము చింత ఉంది పెదవిలోన నవ్వులు ఉంటే దుఖమెలా నిలబడుతుంది? వీధులలో వేదం ఈ జానపదం సత్యం తద్దిం తరికిట తరికిట తదిగిణతోం తల వాకిట ముగ్గులు వేకువకే అందం శృతి కుదరని పాటకి లేదు కదా అందం ॥2॥
చరణం: ప్రతి మనిషికి మనసుంటుంది, వేరొకరిది అయిపోతుంది అందుకోసమే పెళ్ళాడు తొలి ముచ్చట ముద్దర పడితే, ఆ జంటకు నిద్దర చెడితే, ఆ కేళికి వెయ్యేళ్ళు రాతిరుంటే ఉదయం ఉంది, కలత ఉంటే కులుకూ ఉంది, ఊసులాడు పండగ వేళ ఆశలకే బలమిస్తుంది వీధులలో వేదం ఈ జానపదం సత్యం తద్దిం తరికిట తరికిట తదిగిణతోం ॥తల వాకిట॥
♠
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ.. అని పాడుకుంటూ.. నింగిలోని చుక్కల్ని నేల మీదికి దింపినట్టు.. మనం ఉదయాన్నే తలవాకిట్లో అందమైన ముగ్గులు వేస్తూ ఉంటాం. చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, మెలికల ముగ్గులు, రంగులతో నింపే రంగవల్లులు.. ఇలా చాలా రకాల ముగ్గులు మనం చూస్తూ ఉంటాం. ఇవి శుభకరమైన, మంగళకరమైన కార్యాలకు చిహ్నాలు. అందమైన పెద్ద పెద్ద ముగ్గులు చూడగానే మనకు పండుగ వాతావరణం గుర్తుకొస్తుంది. ముగ్గుల వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. పురాణ కాలం నుండి సాగుతున్న ఈ ఆచార, సంప్రదాయాలు అనేకానేక అర్థాలు, పరమార్థాలు, విలువలతో కూడినవి. అంతేకాకుండా, ఊర్ధ్వ ముఖంగా, అధో ముఖంగా మనం కలిపి వేసి షట్కోణపు ముగ్గులో కానీ, స్వస్తిక్, నాగబంధం, అష్టదళ పద్మం, శ్రీ చక్రం వంటి ముగ్గులలో ఖగోళ శాస్త్ర రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ఇక practical point of view లో చూస్తే, క్రిమికిటకాలకు తలవాకిట్లోనే ఆహారాలన్నందించటంతో చిన్న చిన్న ప్రాణుల పట్ల కూడా భూతదయను ప్రదర్శిస్తూ, వాటిని లోనికి రానివ్వకుండా చేయడం, ఇల్లు – వాకిలి చిమ్మి, కల్లాపి చల్లి, ముగ్గు వేయడం వల్ల, ఆరోగ్యపరంగా వెన్నెముకకు బలం పెరగడం, ఆధ్యాత్మిక ప్రగతికి దారి తీసే మూలాధార చక్రం(Root Chakra/ Coccygeal plexus) activate అవ్వడం, తగిన hormones release అవ్వడం జరిగి, స్త్రీలు ఋతుసంబంధ, గర్భాశయ సంబంధ వ్యాధుల నుండి దూరంగా ఉండగలరు. అంతేకాకుండా కళాత్మకమైన ముగ్గులు తీర్చడం వల్ల, మానసిక ఉల్లాసం పెరిగి, రోజంతా ఆనందంగా ఉండగలుగుతారు.
తలవాకిట ముగ్గులు వేకువకే అందం.. అని సిరివెన్నెల గారు ఈ పాటను మొదలుపెట్టారు కాబట్టి, ముగ్గులకు సంబంధించిన కొంత సమాచారాన్ని ఉపోద్ఘాతంగా వ్రాయాలనిపించింది. తలవాకిట ముగ్గులు ఇంటికే అందం.. అంటే మామూలు రచయిత అవుతారు, కానీ వేకువకే అందమంటే.. ఖచ్చితంగా అది సీతారామశాస్త్రిగారే అవుతారు! ఈ చిత్రంలో కథానాయకుడు గోపాలం, వీధుల్లో పండుగలకీ పెళ్లిళ్లకీ ఆటాపాటలు కడుతూ వీధిభాగోతమే వృత్తిగా ఉంటాడు. అతను పాడే ఈ పాటతో – చిత్రం మొదలవుతుంది.
పల్లవి: తల వాకిట ముగ్గులు వేకువకే అందం శృతి కుదరని పాటకి లేదు కదా అందం నడి వీధులలో వేదం ఈ జానపదం సత్యం తద్దిం తరికిట తరికిట తదిగిణతోం తల వాకిట ముగ్గులు వేకువకే అందం శృతి కుదరని పాటకి లేదు కదా అందం..
అరుణోదయ వేళలలో.. అందమైన పూబాలలు ప్రకృతికి ఎలా శోభను కలిగిస్తాయో, తలవాకిట నిలిచి మెరిసిపోయే ముగ్గులు కూడా మనకు అలా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. శృతి కుదరని పాట ఎంత కర్ణ కఠోరంగా ఉంటుందో, శుభ్రపరచి, ముగ్గు తీర్చని ఇల్లు కూడా అంతే అందవిహీనంగా ఉంటుందని సిరివెన్నెల గారు మన సంప్రదాయపు ఔన్నత్యాన్ని మనకు మరోసారి గుర్తు చేస్తున్నారు. మధురమైన పాటకు శృతి పక్వత ఎంత ముఖ్యమో, ఇంటి ముందు తీర్చిన ముగ్గు కూడా ఇంటికి అంతే అందం.
‘నడి వీధులలో వేదం ఈ జానపదం సత్యం’, అనే వాక్యాన్ని ఎంతో లోతుగా అర్థం చేసుకోవలసి ఉంది. జనపదం అంటే పల్లెటూరు. జనపదాల్లో నివసించే ప్రజలే జానపదులు. మానవుని అనుభూతులకు, ఆనందోత్సాహాలకు, మానసిక చైతన్యానికీ, కల్పనాశక్తికి, ఊహలకు ప్రతీకలు జానపద కళలు. ఇవి ప్రజలలో పుట్టి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రజా జీవితాలకు చాలా సన్నిహితంగా ఉంటాయి. ప్రజల అలవాట్లకు, ఆచార వ్యవహారాలకు, ఉత్సాహ ఉద్రేకాలకు, సుఖదుఃఖాలకు జానపద కళలు అద్దం పడతాయని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అనుకరణ నృత్యాలు, బొమ్మలాటలు, వీధి నాటకాలు, యక్షగానాలు, వీధి భాగవతాలు, పగటి వేషాలు, కలాపాలు, భజనలు, కులగాథా గానాలు, సుద్దులు, జాతర వేషాలు, కోలాటం, అశ్వ నృత్యం, తప్పెటగుళ్ళు, గొబ్బి పాటలు, తోలుబొమ్మలాట, బుర్ర కథ, ఉత్ప్రేక్షతో కూడిన కబుర్లను వసపిట్టలా చెప్పే పిట్టలదొర, ప్రజలకు శుభం పలికే బుడబుక్కలు, చిరుతల భాగవతం, జక్కి కళాకారులు.. మొదలైన కళలు జానపద రీతుల్లో ఉంటాయి. ఈ జానపద కళల్ని ప్రదర్శించేవారు జానపదులు. వీరి భాష సహజంగా, సౌందర్యవంతంగా ఉంటుంది. వీరి ఉచ్చారణా రీతి ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కువమంది కళాకారులు విద్యలేనివారే. అయినా వారికి ఎన్నో గేయాలు, పద్యాలు, కథలు కంఠస్థాలై ఉంటాయి. నిజానికిఈ జానపదులు ‘మౌఖిక సాహిత్య సంరక్షకులు’! జానపద కళాకారులైన వీరందరూ తమ తమ శైలిలో పురాణేతిహాసాలను ప్రజల మధ్యకు తీసుకువస్తారు.
మరి ముఖ్యంగా బైరాగులు.. ‘దేహమంతా చూడరా! దేవుడెందున్నాడురా? ఆత్మలింగా.. పరలింగపరుడై ఆత్మలో తానాయరా!’ వంటి తత్వాలు పాడుతూ, సులభమైన రీతిలో వేదాంత రహస్యాలను, మానవ జీవిత పరమార్ధాన్ని అందరికీ తెలియజేస్తూ ఉంటారు.
ఏ హిమాలయాల్లోనో, ఏ అడవుల్లోనో, గురుకులాల్లోనో కాకుండా నడివీధిలోకి, అంటే జన సామాన్యంలోకి ఆత్మజ్ఞానాన్ని వీరు తీసుకువస్తారని సిరివెన్నెల ఎంతో సున్నితంగా సూచిస్తున్నారు.
కాబట్టి ఇంటిని తీర్చిదిద్దే ముగ్గులు, జీవిత పరమార్థాన్ని చెప్పే వేదాంతులు, బ్రతుకుల్ని శృతి చేసే రాగాలుగా ఆయన అభివర్ణిస్తున్నారు. ఒకరకంగా ఆ కథానాయకుడి పాత్రకు ఆయన కితాబునిస్తున్నారు.
నల్లనయ్య మువ్వల పాదం, జగానికంతా ఆనందం కలిగించింది, ఆ మువ్వల మోత, ఆ మురళీ గానం, లోకాలను మైమరిపించింది. ఆ ఆనందం అంతకంతకూ పెరుగుతూపోయి, లోకమే వ్రేపల్లెగా మారి, ఆ మత్తులో తూగి పోయిందట. బాల్యం నుండి మానవుడు యవ్వన స్థితికి మారినట్టే, జీవితం కూడా అన్ని మలుపులనూ కలిగి ఉంటుంది. మానవదేహాన్ని ధరించిన వారికి సౌఖ్యము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, అనారోగ్యమూ ఉంటుంది.. అంటే మనము దేనికి అతీతులము కాము, అంటున్నారు సిరివెన్నెల. కానీ, మనసు దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు, మువ్వగోపాలుని ముద్దు చేష్టల వంటి ఆనంద క్షణాలను నెమరు వేసుకొని, పెదవుల మీదికి చిరునవ్వులు తెప్పించుకుంటే.. ఆ దుఃఖం, ఆమడ దూరం పారిపోతుందట!
చరణం: ప్రతి మనిషికి మనసుంటుంది, వేరొకరిది అయిపోతుంది, అందుకోసమే పెళ్ళాడు! తొలి ముచ్చట ముద్దర పడితే, ఆ జంటకు నిద్దర చెడితే, ఆ కేళికి వెయ్యేళ్ళు! రాతిరుంటే ఉదయం ఉంది, కలత ఉంటే కులుకూ ఉంది, ఊసులాడు పండగ వేళ ఆశలకే బలమిస్తుంది వీధులలో వేదం ఈ జానపదం సత్యం తద్దిం తరికిట తరికిట తదిగిణతోం ॥తల వాకిట॥
ఇక రెండవ చరణంలో, రెండు మనసులను ముడివేసే పెళ్లి ముచ్చట్లు చెప్తున్నారు సిరివెన్నెల.
ప్రతి మనిషికి ఒక మనసు, ఆ మనసులో ఒకరిపై పుట్టే ప్రేమ ఉంటాయి. అలా ఒకరిని ఇష్టపడినప్పుడు, ఆ మనసు వేరొకరి సొంతమవుతుంది. ఆ బంధం కలకాలం నిలవాలంటే, ఆ ఇద్దరు మనుషులు వివాహ బంధంతో ఒకటవ్వాలి. అలా వివాహ బంధం ద్వారా ఒకటైన వారు, శారీరకంగా కూడా ఒకటి అవుతే, ఆ జంట జీవితం నూరేళ్ల పంట అవుతుంది అంటున్నారు. అయినా బ్రతుకులో వెలుగు – చీకటి, సంతోషం – దుఃఖం, ఉల్లాసం- చింత.. ఇలాంటి ద్వంద్వాలు తప్పించుకోలేనివట! అయితే, ఏదైనా ఒక పండగ వచ్చినప్పుడు, ప్రతివారికి మనసులో ఏమనిపిస్తుంది? ఈ పండుగ తర్వాత, ఈ పూజ తరువాత, నా జీవితంలో ఏదో గొప్ప మార్పు వస్తుంది, అన్న ఆశ మళ్ళీ చిగురిస్తుంది. అది మరింత బలాన్ని కూర్చుకొని, మన సంకల్ప బలాన్ని పెంచి జీవితాన్ని ప్రగతి బాటలో నడిపిస్తుంది, అన్నది సిరివెన్నెల సందేశం.
ఏది ఏమైనా, ముగ్గుతో వాక్యం మొదలుపెట్టి, ‘సిరివెన్నెల సాహిత్య రసాస్వాదన’ అనే ముగ్గులోకి మనల్నందర్నీ దింపేశారు, సిరివెన్నెల. ఒక దుష్టశక్తినైనా, దైవశక్తినైనా ఆహ్వానించి, ఆకర్షించే శక్తి ముగ్గులకు ఉంది. ఆ ముగ్గులోకి ఆహ్వానించబడిన తర్వాత, ఆ శక్తి అక్కడ అష్టదిగ్బంధనం అయిపోయినట్టే! సిరివెన్నెల సాహిత్యపు ముగ్గులో మనం కూడా అష్టదిగ్బంధనమై, ఆనందపు సాగరంలో.. మైమరచి, కాలాన్ని కరిగిద్దాం!
శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.
You must be logged in to post a comment.
సరిగ పదమని-22
కథా రచయిత, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ శ్రీ వేమూరి సత్యనారాయణ ప్రత్యేక ఇంటర్వ్యూ
అమ్మణ్ని కథలు!-12
జీవన రమణీయం-180
శిశిరానికి చిగురులనిచ్చే ‘గీత్ వసంత్’ మహాకవి నీరజ్
అనువాద మధు బిందువులు-12
పూచే పూల లోన-65
ఒక చినుకు
తెలుగు సాహిత్యానికి తక్షణ అవసరం – కథాపరిమళాలు పుస్తకం ముందుమాట.
సాహితీవేత్త శ్రీ వేంపల్లి రెడ్డి నాగరాజుగారికి నివాళి
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®