[‘పద్య కళాప్రవీణ’, ‘కవి దిగ్గజ’ ఆచార్య ఫణీంద్ర రచించిన ‘విషాద యశోద’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]
వేదిక ~~~~~
శా. శ్రీ కృష్ణా! యదువంశ చంద్ర! ఇదె నీ శ్రీపాదముల్ బట్టి నే శ్రీకారంబును జుట్టుచుంటి కృతినిన్ జేయంగ, సద్భక్తితో సాకారం బొనరించి నాదు హృదిలో, సాక్షాత్ యశోదాంబనే! శ్రీ కైవల్య వర ప్రసాద గుణ! సుశ్రేయంబునే గూర్చుమా! (1)
కం. ‘ఆచార్య ఫణీంద్ర’ యనెడి ప్రాచుర్యము గల్గు నీ ప్రభాస కవీంద్రుం డా చరితార్థ కృతుల యం దే చాటునొ దాగిన వ్యథ నిటు వెలి పరచున్! (2)
ఉ. కంసుని సంహరించు ఘన కార్య నిమిత్తము కృష్ణుడేగి, యా ధ్వంస మొనర్చియున్, తిరిగి తా వ్రజ భూమికి రానిచో – మహా హింసను గుండెయం దనుభవించె యశోద యనేక రీతు,లా శంసువునై – వెలార్చెద ప్రశస్త “విషాద యశోద” సత్కృతిన్! (3)
కం. విగత సుఖంబును తలచుచు, స్వగతంబున నా యశోద – ‘పగవారికినిన్ వగ పిటు రావల’దనుచును పొగిలి పొగిలి యొలుకు దుఃఖము – నిదె రచింతున్! (4)
ఆ.వె. ఆ యశోదమ హృదయంబె మీ హృదయంబు గాగ, మీ హృదయమె గాగ నా య శోద హృదయముగ – ప్రచుర భావ జలనిధిన్ మునిగి తేలు డింక, ముందు కేగి.. (5) #
వేదన ~~~~~
కం. శ్రీకరముగ ననునిత్యము గోకులమును గాచెదవని కులదైవముగా నో కల్యాణి! నిను గొలుతు! నా కృష్ణుని జేర్చుమమ్మ నా దరి కింకన్! (1)
కం. కృష్ణా ! ప్రియ సుత ! నీకై తృష్ణ నెదురు జూతును – పలు దినములు కణచెన్ వృష్ణి కులజ! నీవు వెడలి – ఉష్ణోదక మటు యశోద యుల్లము మరిగెన్! (2)
కం. నా కర్మమేమొ! మధుర న్నా కంసుండేల బూనె యాగము సలుపన్? నా కన్నయ! యేల బిలిచె నా కొమరుడవైన నిన్ను? నా హృది కుమిలెన్! (3)
సీ. శ్రీ ‘ధనుర్యాగంబు’ సేయంగ బూని తా నాహ్వానముల బంపె నందరికిని – ‘అక్రూర’ దివ్యాత్ము డరుదెంచి మన యింట కంస భూపతి మాటగాను దెలిపె – “బాలుండవైనను పరమ వీరుడవంచు శ్రీకృష్ణ! నీ కంపె శ్రీముఖమ్ము – యుద్ధ విద్యలలో ప్రయోజకత్వము జూప నవకాశ మిదె” యంచు నతడు బలికె! తే.గీ. వలదు, వలదన్న నెవరు నా పలుకు వినక, అంద రక్రూరు డెంతొ మహాత్ము డనుచు, నతని మాట మన్నించి నిన్నంపినారు! మేనె ఇటనుండె నాకు – నా ప్రాణ మేగె! (4)
ఆ.వె. నుడివి, నీవటులె “ధనుర్యాగము” ను, మరి కాంచెద మధురా నగరము ననుచు – పిలిచె “బీరకాయ పీచు చుట్ట” మనుచు – వలదటన్న వినక, పరగినావు! (5)
(సశేషం)
డా. ఆచార్య ఫణీంద్ర తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. వృత్తిరీత్యా శాస్త్రవేత్త. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. తెలుగులో డాక్టరేట్ డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “19వ శతాబ్దంలో తెలుగు కవిత్వం” అనే విషయంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి సాధించారు. ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాస్కో స్మృతులు, వరాహ శతకం, తెలంగాణ మహోదయం వంటి పద్యకవితా గ్రంథాలను రచించి మంచి పద్యకవిగా గుర్తింపు పొందారు. తెలుగు సాహిత్యంలో “మాస్కో స్మృతులు” పేరిట ‘తొలి సమగ్ర విదేశ యాత్రా పద్య కావ్యా’న్ని రచించారు. తెలుగు వచన కవిత్వ సాహిత్యంలో “ఏక వాక్య కవితల” ప్రక్రియకు ఆద్యులు. ఆయన రచించిన తొలి ఏక వాక్య కవితల గ్రంథం “Single Sentence Delights” పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది.
ఆయన అనేక అవార్డులు, గౌరవాలను ప్రభుత్వం, ఇతర సాంస్కృతిక సంస్థల నుండి పొందారు. ప్రధానంగా – ‘వానమామలై వరదాచార్య’ స్మారక పురస్కారం, ‘దివాకర్ల వేంకటావధాని’ స్మారక పురస్కారం, ‘పైడిపాటి సుబ్బరామశాస్త్రి’ స్మారక పురస్కారం, ‘ఆచార్య తిరుమల’ స్మారక పురస్కారం, ‘బోయినపల్లి వేంకట రామారావు’ స్మారక పురస్కారం, “రంజని – విశ్వనాథ” పురస్కారం, ‘సిలికానాంధ్ర’ గేయ కవితా పురస్కారం, మూడు సార్లు విజయవాడ ‘ఎక్స్ రే’ పురస్కారాలు, ‘కమలాకర ఛారిటబుల్ ట్రస్ట్’ నుండి “వైజ్ఞానిక రత్న” పురస్కారం, పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ ‘ఉగాది’ సత్కారాలు పేర్కొనదగినవి. ఆయన 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, 2014 లో అమెరికాలో, అట్లాంటాలో జరిగిన “నాటా” తెలుగు సభలలోనూ గౌరవింపబడ్డారు. ఆయన హైదరాబాదులో వి.ఎల్.ఎస్. లిటెరరీ అండ్ సైంటిఫిక్ ఫౌండేషన్ నుండి “పద్య కళా ప్రవీణ” బిరుదుని పొందారు. తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు లోని నవ్య సాహిత్య మండలి నుండి “కవి దిగ్గజ” బిరుదుని పొందారు. హైదరాబాదులోని నవ్య సాహితీ సమితి నుండి “ఏకవాక్య కవితా పితామహ” పురస్కారాన్ని పొందారు. ఆయన ప్రస్తుతం “యువభారతి” సాహిత్య సంస్థకు అధ్యక్షులుగా, “నవ్య సాహితీ సమితి”కి అధ్యక్షులుగానూ, “నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం” కు ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. ఆయన ఆంధ్ర పద్య కవితా సదస్సు యొక్క పత్రిక “సాహితీ కౌముది” కి పదేళ్ళపాటు సహసంపాదకులుగా వ్యవహరించారు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘పద్య కవిత్వం’లో “కీర్తి పురస్కారం” ప్రదానం చేసారు. 2017 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “ప్రపంచ తెలుగు మహాసభల”లో డా. ఆచార్య ఫణీంద్ర “పద్య కవి సమ్మేళన” అధ్యక్షులుగా వ్యవహరించి సత్కరించబడ్డారు.
విషాద యశోదలో పద్యాలు బాగున్నాయి. సులభ శైలిలో అందరికీ అర్థమయ్యేటట్లు ఉన్నాయి.
You must be logged in to post a comment.
కాళీ – తెలుగుభాష
ఫలితం ఒక్కటేగా!
భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్నగర్ జిల్లా – 15: కొల్లాపూర్
ఏది కవిత్వం?
వినిపించని స్వరాలను వినిపించిన పుస్తకం ‘ఊళ్లు. నీళ్ళు.. కన్నీళ్ళు..’
అంతరాలు
కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 1
ప్రత్తిపాటి సుభాషిణి శ్రీపదాలు 1
అమెరికా ముచ్చట్లు-6
ఏమవుతుందో… ఎటుపోతుందో… ఏమో! -8
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®