“పెళ్ళి ఆగిపోయేలా ఉంది శేషయ్య గారూ. మీ కళ్ళముందు పుట్టి పెరిగిన జానకికి ‘పీటలమీద పెళ్ళి ఆగిపోయిన పిల్ల’ అన్న ముద్ర పడిపోతుంది. (దుఃఖం)… మీరే ఏదో ఒకటి చేయండి… ప్లీజ్” అంటూ ప్రొఫెసర్ ఫల్గుణరావు ఫోనులోనే కన్నీళ్ళు కారుస్తున్నాడు.
పెళ్ళికి ఇంకా 24 గంటలు వ్యవధి ఉంది. పెళ్ళికి తాను ఎలాగూ వెళ్ళాల్సి ఉంది. ఇంతలోనే ఇలా ఎలా జరిగింది? అదే ప్రశ్న శేషయ్య అడిగారు.
“మేం కళ్యాణమంటపంలో లోపల మా గదుల్లో పనుల్లో ఉన్నాం. కాబోయే వియ్యంకుడు మంటపం ఏర్పాట్లు చూస్తానంటే మా బావమరిది సుబ్బారావుని పంపించాను. వాళ్ళిద్దరూ అటుగా వెళ్తుంటే, మా జానకి వరండాలో తన స్నేహితులతో మాట్లాడుతోంది. మా సుబ్బు ఊరుకోక, ‘వధువుని గుర్తుపట్టారా? ఎప్పుడో పెళ్ళిచూపుల్లో చూసి ఉంటారు!’ అంటూ జానకిని చూపించాడు. ఈ మాటలు విని జానకి ఆయన కేసి చూసి, నమస్కారం పెట్టింది. ఆశీర్వదిస్తున్నట్లు చేయి ఎత్తినవాడు, అంతలోనే, వెనక్కి తిరిగి విడిదికెళ్ళిపోయాడు. దారిలో మా సుబ్బుతో, ‘మీ బావ ఈ పెళ్ళి ఏరకంగా చేస్తాడో నేను చూస్తా’ అని ఆవేశంగా అన్నాట్ట. ఆయనకి అంత కోపం ఎందుకొచ్చిందో తెలియదు… ప్లీజ్, వెంటనే రండి.”
“ఫల్గుణరావు, నువ్వు ఎవరితోనూ ఈ విషయం చెప్పద్దు..”
“కాని మా సుబ్బు ఈ పాటికి ఇద్దరు ముగ్గురిదగ్గర నోరు జారే ఉంటాడు. వాడు దాచుకోలేడు..”
“సరే, అతన్ని వెంటనే పిలిచి, ఆ చెప్పేదేదో నేను చెప్పినట్లు చెప్పమను. (ఎలా చెప్పాలో చెప్పారు.) అలా ఎంతమందితో చెప్పిన ఫరవాలేదు. నేనే వెళ్ళి మీ కాబోయే వియ్యంకుడు యాజ్ఞవల్క్యుడిని విడిదిలో కలిసి వస్తాను. నువ్వు రావద్దు” అని సూటిగా చెప్పేశారు శేషయ్య.
***
శేషయ్య విడిదికి వెళ్ళేసరికి, అక్కడ పెళ్ళికొడుకు రాఘవ గదిలో అతనికీ, తండ్రికీ మధ్య వాగ్వాదం జరుగుతోంది.
“రండి శేషయ్య గారూ రండి. వీడికి చెప్పండి. పెళ్ళివారు మోసం చేశార్రా అని ఎంత మొత్తుకొంటున్నా, ఇప్పుడెలా ‘ఈ పెళ్ళి వద్దంటాను?’ అని నన్ను ప్రశ్నిస్తున్నాడు. అమెరికా చదువులు చదివించాం గదా! ఆ తెలివి వీడిది” అంటూ కొడుకుమీద కస్సుమంటున్నాడు.
“మీరు ఆవేశపడకండి. నేను మాట్లాడతా” అంటూ శేషయ్య రాఘవని పక్క గదిలోకి తీసుకెళ్ళారు.
“తాతగారూ, కొన్నివారాలపాటు ఆ అమ్మాయితో ఫోనులో మాట్లాడాను. ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం. నాన్న కూడా అమ్మాయిని చూసి ఒప్పుకున్నాకనే ఈ పెళ్ళి ఖాయమైంది. ఇప్పుడు వాళ్ళు మోసం చేశారంటూ ‘పెళ్ళి కాన్సిల్’ అంటున్నారు నాన్న… చిన్నప్పుడే అమ్మని కోల్పోయిన వాణ్ణని నాన్న నన్ను అమ్మ లోటు తెలియకుండా పెంచారు. ఆయన భావాలకి తగినట్లుగానే సాంప్రదాయబద్ధమైన సంబంధం ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు పెళ్ళి రద్దు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అలాగని ఆయన్ని ఎదిరించలేను.. నాకు ఆయనే గురువు, తండ్రి….” రాఘవ కళ్ళు చెమర్చాయి.
శేషయ్య అనునయంగా రాఘవ భుజం తట్టాడు. “అంతా సవ్యంగా జరుగుతుంది. ఈ విషయాన్ని ఎప్పటికీ ఎవరికీ చెప్పకు.”
“ఏమిటి మోసం యాజ్ఞవల్క్యుడు గారూ?” తనకన్నా 30 ఏళ్ళు చిన్నవాడైన వ్యక్తితో శేషయ్య నిదానంగా చిరునవ్వుతో మాట్లాడుతున్నారు.
“మోసం కాదా? ఆ అమ్మాయికి మెల్ల కన్ను. నేను అమ్మాయిని పెళ్ళి చూపుల్లో చూసినప్పుడు కంటికలక వచ్చిందని చెప్పి, కళ్ళద్దాలు పెట్టి చూపించారు. ఇప్పుడు చూస్తే అవ్వాళ మోసం చేశారని తెలిసిపోయిం ది కదా! ఏం పెద్దమనిషి ఆ ఫల్గుణరావు? కుర్రాళ్ళకి ఇలాంటి పాఠాలే నేర్పిస్తున్నాడా? వాడు..”
శేషయ్య కుడిచేతి తర్జనిని నోటి మీద పెట్టుకుని, భాష గురించి సున్నితంగా హెచ్చరించారు.
యాజ్ఞవల్క్యుడి ఆవేశం తగ్గాక, శేషయ్య గొంతు విప్పారు.
“మీరు పెళ్ళిచూపులకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి నిజంగానే కండ్లకలక వచ్చి ఉండవచ్చు. లేదా వాళ్ళు అబద్ధమూ చెప్పి ఉండవచ్చు. అబద్ధం చెప్పినా తప్పేముంది? (యాజ్ఞవల్క్యుడు ఏదో చెప్పబోయాడు.) ఆగండాగండి. మీరు వేద పండితులు. ఇతిహాసాల సారాన్ని కాచి వడపోసినవాళ్ళు. మహా భారతంలో అవతారమూర్తి వ్యాసభగవానుడు మనుషులు ఎలా జీవించాలో ధర్మరాజుకి చెబుతూ, ఈ మాట కూడా చెప్పాడు:
‘ప్రాణత్రాణేనృతం వాచ్యం ఆత్మనో వా పరస్యచ, గుర్వర్థే స్త్రీషు చైవ స్యాత్ వివాహకరణేషు చ – తన ప్రాణం కాని, ఇతరుల ప్రాణాలు కాని రక్షించాల్సి వచ్చినప్పుడూ, గురువుల, స్త్రీల ప్రయోజనాలను రక్షించాల్సివచ్చినప్పుడూ, వివాహకార్యాలలోనూ అనృతం (అసత్యం) పలకవచ్చు.’.. ఈ విషయం మీకు తెలియంది కాదు. కాని ఆవేశం మీ వివేకాన్ని కప్పేసింది. ఆ అమ్మాయి గుణవంతురాలు. మీ అబ్బాయికి నచ్చింది. ఎక్కువ ఆలోచించకండి. శాస్త్రం ఏం చెబుతోందో పదిమందికీ చెప్పాల్సిన మీరే…”
యాజ్ఞవల్క్యుడిలో పశ్చాత్తాప భావన తొంగిచూసింది. అయినా, అహం అడ్డు వస్తోంది. “కాని…కాని…” అని నసుగుతుంటే, శేషయ్య అన్నారు:
“ఈ పెళ్ళి ఏరకంగా చేస్తాడో చూస్తాను?’ – అన్నందుకేనా ! ఏం ఫరవాలేదు. ‘ఈ పెళ్ళి ఏ స్థాయిలో చేస్తాడో చూస్తాను!’ అని మాత్రమే మీరు అన్నట్లుగా నలుగురూ చెప్పుకుంటున్నారు. మీరు మొహం చాటెయ్యాల్సిన అవసరం లేదు. సరేనా!”
యాజ్ఞవల్క్యుడి ముఖం వికసించింది.
పెళ్ళి ఘనంగా జరుగుతున్నప్పుడు ఫల్గుణరావు చెమర్చిన కళ్ళతో శేషయ్యకి నమస్కారం పెడుతూ అన్నాడు:
“మీరు ఏం చెప్పారో కాని, నాకు మళ్ళీ సమస్య రాలేదు. ఏం చెప్పారు?”
శేషయ్య నవ్వేశారు. “ఒకరు చెప్పటమేమిటయ్యా, ఆయనే పండితుడు.”
ఫల్గుణరావుకి ఇప్పటికీ అర్థం కాలేదు శేషయ్య ఏం చెప్పిఉంటారో.
తెలుగు రాష్ట్రాలకి ప్రధానమైన వాణిజ్య కేంద్రమైన ఆ నగర రైల్వే స్టేషనులో ఆ ఉదయం ఢిల్లీ నుంచి వచ్చే ట్రైనులో రాము, భీము, సోము, శ్యాము అనీ నలుగురు యువకులు భుజాన బ్యాగులతో దిగారు.
ప్లాట్ఫారం చివర్లో దిగటంతో స్టేషన్ అంతా కలయచూసుకుంటూ, ప్రవేశద్వారం దగ్గరకొచ్చారు.
ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అందరికీ ‘అర్జంటే’!
నలుగురూ కలిసి స్టేషన్ మాష్టర్ గదిలోకి దూరారు.
“నమస్కారం సర్.”
రైళ్ళ రాకపోకల తాలూకు ఫోన్ల పనిలో ఉన్న స్టేషన్ మాష్టర్ శంభులింగం తలెత్తి, “యస్. చెప్పండి ఏం కావాలో” అన్నాడు.
“సర్, మేం ఢిల్లీ నుంచి వస్తున్నాం. మేం ఉప రాష్ట్రపతి గారి ….”
శంభులింగం ఠపీమని లేచి నిలబడి ఆ నలుగురినీ కూర్చోమన్నాడు.
“ఆ, చెప్పండి. చెప్పండి” అన్నాడు గౌరవంగా.
“మీ స్టేషన్ అద్భుతంగా నిర్వహిస్తున్నారు సర్. మీ విజిటర్ల పుస్తకంలో మా భావాలు రాయాలని…” అంటున్నాడు రాము. అంతలో భీం శంభులింగం కేసి చూసి, “మీ టాయిలెట్ వాడుకోవచ్చా సర్?” అని అడిగాడు.
“తప్పకుండా. అడగాలా దానికి!” వినయం తొంగి చూసింది శంభులింగంలో.
భీం పరుగెత్తాడు.
శంభులింగం విజిటర్ల పుస్తకం కోసం వెతికాడు. “మీరు ఉపరాష్ట్రపతి గారి ప్రస్తావన తెచ్చారు కదా! విఐపి విజిటర్లపుస్తకం తెప్పిస్తా” అంటూ ఒక పోర్టర్‌ని కేకేశాడు.
ఇప్పుడు సోం అందుకున్నాడు:
“మీ స్టేషన్లో ఆ బోగన్ విల్లియా పూల మొక్కలు ఎంత అందంగా ఉన్నాయండి. ఎన్ని రంగుల మొక్కలు!
వాటిని ఎలా పెంచుతున్నారు? ఎలా కట్టింగ్ చేస్తున్నారూ ?”
మొక్కలు పెంచటంలో ఉన్న కష్టం, నైపుణ్యం గురించి శంభులింగం చెబుతున్నాడు.
భీం బయటకొచ్చాడు.
“సర్, నేను వాడుకోవచ్చా మీ టాయ్‌లెట్?” అన్నట్లుగా రాం చూశాడు.
“ఓకె, ఓకె” అన్నట్లుగా శంభులింగం తలూపాడు.
ఇప్పుడు శ్యాం చెబుతున్నాడు:
“ప్లాట్ ఫారం మీద బెంచీలు ఎంత నీట్‌గా ఉంచుతున్నారు సర్? ముఖ్యంగా ఎక్కడా మాకు ప్లాట్ఫారం మీద అడుక్కునేవాళ్ళు కనబడలేదు సుమాండీ!”
శంభులింగం సిగ్గుపడ్డాడు.
“నాకు పనిలో దైవం కనుపిస్తాడు బాబూ. అందుకే అలా అన్నీ పట్టించుకుంటుంటాను… అంతెందుకూ, నీళ్ళు చూడండి. అన్ని కొళాయిల్లో నీళ్ళు వస్తాయి. ఇంకా….”
అంతలో రాం బయటకొచ్చాడు.
శ్యాం లేచి, “మీరేమీ అనుకోకపోతే…” అన్నట్లుగా చూశాడు శంభులింగం వంక.
శంభులింగం చిరునవ్వుతోనే ‘ఓకే’ చెప్పేశాడు. శ్యాం లోపలికి జంప్ చేశాడు.
“మీ ప్లాట్ఫారం మీద డిజిటల్ గడియారం ఎంత బాగుంది సర్!. ముఖ్యంగా స్టేషనులో కరెంటు పోయినప్పుడు కూడా టైం కనిపించేలా ప్రతి ప్లాట్ఫారం మీద డిజిటల్ గడియారాలు పెట్టి మంచి ఏర్పాట్లు చేశారు సర్…” అంటూ శంభులింగం లోని అభిరుచిని వెలికి తీసే ప్రయత్నం చేశాడు సోం.
“అది చాలా చిన్న విషయం బాబూ. అసలు పరిశుభ్రతకోసం ఎంత శ్రద్ధ వహిస్తానంటే ఎక్కడా మీకు కాగితం ముక్క కనబడదు. చూడండి…” శంభులింగం ఉత్సాహంతో చెబుతున్నాడు.
శ్యాం బయటకు వచ్చేశాడు ‘అమ్మయ్య ‘అనుకుంటూ.
శ్యాం రాగానే సోం నిస్సంకోచంగా టాయిలెట్‌కి పరుగెత్తాడు.
అప్పుడే విఐపిల విజిటర్ల పుస్తకాన్ని పోర్టర్ తెచ్చాడు.
“మీరు ఢిల్లీ నుంచి వచ్చిన విఐపిలు కదా! అందుకని మీ భావాల్ని ఇందులో రాయండి. ఇప్పటిదాకా ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే రాస్తున్నారు. నా శ్రమనంతా వాళ్ళు బాగా గుర్తించారు. దేశం బాగుండటం అంటే నా దృష్టిలో రైల్వే స్టేషన్లు బాగుండటం. రోజుకి ఎన్నో లక్షలమంది ప్రయాణిస్తూంటారు కదా!…”
శంభులింగం ప్రవాహం సాగుతోంది.
రాం ఒక ప్రశ్న వేశాడు:
“మేం ఢిల్లీ నుంచి వచ్చాం కదా! మా కోచిల్లో టాయిలెట్లు చాలా శుభ్రంగా ఉన్నాయండి. ఎందువల్లనంటారు?” శంభులింగం లోని దేశభక్తుడు పైకి లేచాడు.
“భలే వాడివయ్యా. ఆ ట్రైన్ ఇక్కడనుంచి ఢిల్లీకి మనమే నడుపుతున్నాం. మనం శ్రద్ధ వహిస్తుండబట్టే అలా ఉన్నాయి. బెర్తులు గానీ, లోపల పరిశుభ్రతగానీ… అసలు ఉత్తర భారత రైల్వేల్లోకన్నా మన రైల్వేలో స్టేషన్లు, ట్రైన్లు బెస్ట్ కదా!”
సోం కూడా బయటకు వచ్చేశాడు ధైర్యంగా శ్వాస పీలుస్తూ.
“అరేయ్, అందరూ విజిటర్ల పుస్తకంలో మన అభిప్రాయాల్ని ఘనంగా రాయాలిరా” అన్నాడు రాం.
“బాబూ, ఆ మధ్య ఉపరాష్ట్రపతి గారి కార్యదర్శి వచ్చి రాసిన పుటలో ఖాళీ ఉందయ్యా. మీరు కూడా అందులో రాస్తే బాగుంటుంది…” అంటూ శంభులింగం ఆ పుస్తకాన్ని వాళ్ళముందుకు తోశాడు.
వరుసగా రాం, భీం, సోం, శ్యాంలు ఆ పుస్తకంలో ‘విలువ కట్టలేని’ తమ అమూల్య అభిప్రాయాల్ని అందంగా లిఖించారు. బాగా రిలాక్స్ అయ్యారు. లేచారు.
“శెలవు ఇప్పిస్తారా సర్!” అంటూ శంభులింగం ఆ పుస్తకం తెరిచే లోపలే ఆ నలుగురూ స్టేషన్ దాటేశారు.
శంభులింగం ఆ పుస్తకంలో వాళ్ళ అమూల్య భావాల్లోకి తొంగి చూశాడు.
“అయ్యా, మీరు ఎంత గొప్పవారు! (అంటూ తలా రెండు లైన్లు రాసి, చివర్లో అందరిదీ ఒకే మాటగా ఇలా రాశారు) పనిలో దైవాన్ని చూసే మీరు ఎంతో గొప్పవారు. దేశభక్తులు… అందుకే గదా ‘పైసల శౌచాలయం’ ద్వారా రైల్వేకి ఆదాయం పెరిగేలా, ప్లాట్ఫారం మీద ఉన్న సామాన్య ప్రయాణీకుల ఉచిత శౌచాలయాన్ని పరమ నీచంగా, నికృష్టంగా, కుళ్ళు కంపు కొట్టేలా ఉంచుతున్నారు… – ఇట్లు, ఉపరాష్ట్రపతి కార్యాలయానికి దగ్గర్లోని కళాశాల విద్యార్ధులు!”
అంతే!
శంభులింగం కళ్ళు తిరిగి పడిపోయాడు.
వల్లీశ్వర్ సుప్రసిద్ధ రచయిత, పాత్రికేయులు. ‘ఆంధ్రప్రదేశ్’ మాసపత్రిక (2005-15) కు ప్రధాన సంపాదకులు. ‘జుగల్బందీ ‘ (అద్వానీ-వాజపేయిల బంధం), ‘నిప్పులాంటి నిజం’ (రాజీవ్ గాంధీ హత్య, దర్యాప్తు), ‘నరసింహుడు’ (పి.వి. నరసింహారావు సమగ్ర జీవిత కథ), ‘రిజర్వు బ్యాంకు రాతిగోడల వెనకాల…’ (ప్రజా జీవితాలపై ఆర్.బి.ఐ ప్రభావం) వీరి అనువాద రచనలు. శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్, IAS, గారి – ‘నాహం కర్తా, హరిః కర్తా’; ‘తిరుమల లీలామృతం’, ‘తిరుమల చరితామృతం’, ‘అసలేం జరిగిందంటే …!’ – పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు. ‘ఇదీ యదార్థ మహాభారతం’ (బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి 18 రోజుల ప్రవచనాలకు) లిఖితరూపం ఇచ్చారు. ‘అయినా నేను ఓడిపోలేదు ‘ (జ్యోతిరెడ్డి ఆత్మకథ), ‘వైఎస్సార్ ఛాయలో … (సి.ఎం మీడియా సలహాదారుగా స్వీయ అనుభవాలు), ‘వాల్మీకి రామాయణం ‘ (పిల్లల కోసం 108 తైల వర్ణ చిత్రాలతో ఎమెస్కో ప్రచురణ) వీరి ఇతర రచనలు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అలనాటి అపురూపాలు-48
ముద్రారాక్షసమ్ – తృతీయాఙ్కః – 9
అసూయ
మంటోను ఒక వ్యక్తిగా, సృజనాత్మక రచయితగా పాఠకుడికి దగ్గర చేసిన ‘సియా హషీయే’
జీవన రమణీయం-108
వ్యథ
అందమైన కానుక
ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 51 – ఆద్మి
మీరొస్తున్నరా
శ్మశాన నిశ్శబ్దం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®