Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

6. ఆమె కథ

సంచిక నిర్వహించిన 2018 దీపావళి కథల పోటీలో పాఠకుల ఎంపికలో ద్వితీయ బహుమతి పొందిన కథ. రచన: ఎనుగంటి వేణుగోపాల్

‘శారదమ్మ తాపట్టిన కుందేలుకు మూడే కాళ్ళు’ అంటుందని నన్నెరిగిన వాళ్ళంతా అంటుంటారు.

నా హద్దుల్లో నేనుంటాను, ఒక పద్ధతిగా ఉంటాను. అది కూడా తప్పు అనే వాళ్ళకంటే మూర్ఖులెవరుంటారు?

నేనన్నది నిజమో కాదో తెలియాలంటే… మరి నా గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి కదా…!

***

ఉదయం పదిన్నరవుతోంది.

టిఫిన్ కానిచ్చేసి డైనింగ్ రూమ్ నుంచి హాల్లోకి వస్తుంటే ఎదురుపడింది పక్కింటి ధనలక్ష్మి. సోఫాలో కూర్చున్నామిద్దరం.

“బయట బండి కనబడింది. అన్నయ గారీ రోజింకా ఆఫీసుకు వెళ్ళలేదా?” అడిగింది ధనలక్ష్మి.

“బ్యాంకు పని ఉందని లీవు పెట్టారు.”

“అన్నం వండుతుండగా గ్యాస్ అయిపోయిందొదినా!”

‘ఎప్పుడూ, ఈ సమయంలో ఇంటికి రాదావిడ. వేళకాని వేళ వచ్చిందిందు కన్న మాట!’ అనుకున్నాను.

“గ్యాసబ్బాయి ఫోన్ చేశా. ఓ వంద తీసుకుని అడ్జస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తే, రేపు తెస్తానన్నాడు” మళ్ళీ తనే అంది.

“ఏం చేస్తాం? తప్పదు కదా!” పొడిగా బదులిచ్చాను.

“పక్కింటి సరోజ ఆంటీని, ఎదురింటి శిల్పను కూడా అడిగా! లేదన్నారు. ఇంట్లో సిలిండరుంటే ఇవ్వొదినా, రేపిచ్చేస్తా!” ప్రాధేయపూర్వకంగా అడిగింది.

అప్పటికే నా మొహంలో రంగులు మారాయి. ఎలా తప్పించుకోవాలా అనే ఆలోచనలో పడ్డా.

వెంటనే, “నా దగ్గరుంటే ఇచ్చేదాన్ని వదినా! ఖాళీ బుడ్డే ఉంది” అన్నాను నొచ్చుకున్నట్లు ముఖం పెడుతూ.

“పర్లేదు. లేనందుకు నువ్వేం చేస్తావు? సరే, వస్తా వదినా” అంది లేస్తూ.

ధనలక్ష్మి సందేహిస్తూనే వచ్చినట్లుంది. ఉన్నా నేనిచ్చేదాన్ని కాననీ తెలుసామెకు. తెలిసీ, రావడమెందుకో మరి. మధ్యలో నన్ను చెడ్డదాన్ని చేయడం తప్ప.

ఆవిడెళ్ళి పోయాక మా శ్రీవారు గది నుండి బయటకొస్తూ “ఏంటి శారదా, అలా చేశావ్?” అన్నారు.

“నేనేమన్నానని…” అమాయకంగా ముఖం పెట్టాను.

“సిలిండరుంచుకొని ఏంటా అబద్ధం? వాళ్ళాయన ఊళ్ళో కూడా లేడు.”

“అలాంటప్పుడు ముందు జాగ్రత్త పడాలి.”

“నీవు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళని మొండిగా వాదిస్తావెందుకని? ఏ ఒక్కరికీ ఏ రకంగానూ ఎప్పుడూ ఉపయోగపడవు.” ముఖం చిట్లించుకుంటూ వెళ్ళిపోతూ ‘మూర్ఖురాలి’వంటూ ఆయన గొణుక్కోవడం నా చెవిని దాటి పోలేదు.

“ఎవరి తిప్పలు వాళ్ళు పడతారు. మధ్యలో ఈయనకెందుకో బాధ” నేను పట్టించుకోలేదాయన మాటలని.

***

సరోజ ఆంటీ, శిల్ప, ధనలక్ష్మి, సూర్యకళ… మా వీధి మహిళామండలి సభ్యులంతా కలిసి మా ఇంటికొచ్చారు. మొదట నన్ను కూడా మహిళామండలిలోకి లాగాలని చూశారు. నాకిలాంటివి గిట్టవు. అలాగైతే ఇటువైపే రావొద్దని నిర్మొహమాటంగా చెప్పేసానెప్పుడో.

‘ఆమె ఏం చెప్పినా పట్టించుకోదు. తాపట్టిన కుందేలుకు మూడే కాళ్ళంటుంద’ని అందరూ పెద్దావిడ నిర్మల మేడమ్‌తో అంటే నా దాకా చేరిందీ వార్త.

అయినా ఇంటి పనుల్తోనే సతమతమైపోతుంటే, వీళ్ళేమో సేవా గీవా అంటూ పట్టుకువేలాడుతున్నారు. ఇప్పుడెందుకొచ్చారో మరి? నవ్వు పులుముకుంటూ లోనికి రమ్మని కూర్చోపెట్టాను.

“మేమంతా చందా కోసం బయల్దేరాం…” అంది శిల్ప.

అర్థమైంది. ఎంత మసిపూసి మారేడుకాయ చేసినా ఒక్క నయాపైసా విదిల్చేది లేదు. మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను.

“కంగారు పడకు వదినా! నిన్నేం చందా అడగడం కోసం రాలేదులే! మార్చి ఎనిమిది నాడు మహిళాదినోత్సవ కార్యక్రమాన్ని తలపెట్టాం. నిన్ను అతిథిగా పిలవడానికి వచ్చామంతే!” ప్రెసిడెంటుగా వ్యవహరిస్తున్న సూర్యకళ చెప్పింది.

మిగతా ముగ్గురు ముక్తకంఠంతో “కాదనవద్దు” అన్నారు.

‘హమ్మయ్య! వీళ్ళు వచ్చింది డబ్బు అడగడానికి కాదన్నమాట’ అనుకుని “తప్పకుండా వస్తా!” నన్నాను. మాట తీసుకుని వెళ్ళిపోయారంతా.

***

ఎనిమిది మార్చి, మహిళా దినోత్సవం!

నాతో పాటు గైనకాలజిస్ట్ డా. పద్మినీదేవి, గ్లకోమా ఐ స్పెషలిస్ట్ దా. వర్ష రామచంద్ర, మహిళా మునిసిపల్ చైర్మన్ టి. విజయలక్ష్మీ దేవేందర్, ఎమ్మార్వో భార్య కమల వేదికపై ఉన్నారు, వాళ్ళతో పరిచయం గర్వంగా అనిపించింది.

కార్యక్రమం ప్రారంభమయ్యింది.

“మహిళామండలి ద్వారా వితంతు మహిళలకు కుట్లు అల్లికల్లో శిక్షణ ఇప్పించి, కుట్టు మిషన్లు అందజేశాం. నిరాదరణకు గురైన వృద్ధులను చేరదీసి ఆశ్రయం కల్పించాం. పేద బాలికలను గుర్తించి వారి బాగోగులు చూస్తున్నాం.”

సూర్యకళ తమ కార్యకలాపాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తోంది.

“ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నా, ఈ బృహత్ కార్యం నిరాటంకంగా కొనసాగాలని ముందడుగు వేస్తున్నాం. మీ వంతు చేయూతను కూడా ఆశిస్తున్నాం.” అంటూ ముగించింది.

మునిసిపల్ చైర్మన్ శ్రీమతి టి. విజయలక్ష్మీ దేవేందర్ మైక్ ముందుకు వచ్చి తన సందేశం ఇస్తుంటే, పక్కనే కూర్చున్న సూర్యకళ నా వైపు వంగి, “నీ ఉపన్యాసంతో పాటు కొంత విరాళం ప్రకటించాలి” అంది నెమ్మదిగా.

వెంటనే నా ముఖం వివర్ణమైంది. అసలు విషయం ఇదన్న మాటా. ఈ ప్రమాదం నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూండిపోయాను, బదులివ్వకుండా.

నా మనసు చదివినట్టే “నువ్వొక్క రూపాయి ఇవ్వాల్సిన పన్లేదు. మాట సహాయం అంతే. నీ స్ఫూర్తితోనైనా కొందరనా సహకారమందిస్తారిమోనని ఆశ” అంది లో గొంతుకతోనే.

అప్పటిగ్గాని నా గుండె దడ తగ్గలేదు. మాట సాయమేగా! తలూపాను.

సూర్యకళ ఆలోచన నిజమైంది. శారదలాంటావిడే చందా ఇస్తోందనుకుంటూ చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

***

మరుసటి రోజు జిల్లా ఎడిషన్స్‌లో కార్యక్రమం తాలూకు న్యూస్ ఫోటోలతో సహా వచ్చాయి.

పేపర్లో నా ఫోటో చూసుకొని మురిసిపోయాను. బంధువర్గం, మిత్రబృందం ఫోన్ల ద్వారా అభినందించి నన్ను అటకెక్కించారు.

సభకు వచ్చినవారై ఉంటారు, బయట నేను తారసపడినపుడు, గుర్తుపట్టి “నమస్కారమండీ, బాగున్నారా??” అంటూ ఆప్యాయంగా పలకరించారు.

నేను నిజంగానే వేదికపై చందాను ప్రకటించిన మహిళామణినని అపోహ పడి ఉంటారు. పిచ్చోళ్ళు! నవ్వుకున్నాను.

***

మరోసారి మహిళామండలి వాళ్ళు స్వాతంత్ర్య దినోత్సవం రోజున అనాథ బాలబాలికలకు, వృద్ధులకు నాతో తీపి పంపకం చేయించారు. అయితే నాకిలా పెద్దరికాన్ని అంటగడుతుండడంలో ఆంతర్యమేంటో నెమ్మదిగా బోధపడుతోంది. కనీసం సభ్యత్వం తీసుకోవడం కాదు కదా, ఒక్క పైసా రాల్చను. ఈసారి మళ్ళీమనసులో దృఢంగా నిశ్చయించుకున్నాను.

ఆటల పోటీలలో గెలుపొందిన పిల్లలకు జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మగారితో పాటు, నా చేత కూడా బహుమతులు అందచేయించారు.

పైగా ఆ బహుమతుల దాతగా సూర్యకళ సభాముఖంగా నా పేరు ప్రకటిస్తుంటే మొదటిసారి సిగ్గనిపించింది. విజేతలైన పిల్లలు ప్రైజెస్ అందుకుంటూ పాదాభివందనం చేసి నా వైపు చూసిన ఆ చూపుల ఆత్మీయత నా హృదయపు పొరల్ని కమ్మేసింది. నా జీవితంలో తొలిసారి గుండె చెమ్మగిల్లింది.

“వెల్‌డన్! శారదగారూ. రియల్లీ ఐయామ్ అప్రీషియేటింగ్ యువర్ ఎకనామికల్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఇన్ దీస్ సోషల్ ఆక్టివిటీస్!” నాలో లేని గొప్పతదాన్ని మంచితన్నాన్ని సింధుశర్మ గారు అభినందిస్తున్నప్పుడు నిజంగా నా గుండె తడబడింది.

ఊపిరి సైతం ఉక్కిరి బిక్కిరయింది.

***

నాకు డెంగ్యూ జ్వరమని తెలిసి ఇద్దరన్నయ్యలు, ఇద్దరు చెల్లెమ్మలు కంటితుడుపు చర్యగా ఫోన్లో యోగక్షేమాలడిగి చేతులు దులుపుకున్నారు. విశేషమేంటంటే అందరూ పక్క పక్క ఊళ్ళల్లోనే ఉంటారు. పైగా స్వయంగా వచ్చి కలవకపోవడానికి లక్షా తొంబై తొమ్మిది కారణాలు ఫోన్లోనే ఏకరువు పెట్టి తమ వంతు పనైపోయిందనిపించారు! ఎవరు వచ్చి ఏం చేయలేకపోయినా నా వాళ్ళు నాకు అండగా ఉన్నారనే నిశ్చింత మనసుకు సాంత్వన కలుగజేస్తుంది. కష్టకాలంలోనే కదా ఎవరికైనా కావల్సింది వెన్నుతట్టి ధైర్యం చెప్పే ఓదార్పు! అది నా అనుకున్నవాళ్ళు అందించలేకపోయారు.

కానీ నేనేనాడు వీసమెత్తు సహాయం అందించకపోయినా పరుగుపరుగున వచ్చిన మా వీధిలో వాళ్ళంతా ‘భయపడాల్సిన పన్లేదు, మేమున్నా’మంటూ చెప్పిన ధైర్యం నాకు ఊరట కలిగించింది.

మరో విషయమేమిటంటే ఇరవై మంది వృద్ధాశ్రమ వాసులంతా ప్రయాసపడి హాస్పిటల్ దాకా పరుగెత్తుకు వచ్చి, “నీకేం కాదు బిడ్డా! జల్ది నయమైతది” అంటూ దీవించడం… అప్ర్రయత్నంగా నా కళ్ళు చెమర్చాయి. నేనేం చేశాను వీళ్ళ కోసం? ఏదో సహాయం చేసినట్టు నటించాను అంతే! పాపం, మలినం లేని మణిదీపాల్లా నా యోగక్షేమం కోసం తరలివచ్చారు. అనాథ చిన్నారులు కూడా “మీకేం కాదాంటీ! మల్లోసారి మాకు ప్రైజులిత్తరు” అంటూ ఆ పసి  మనసుల్తో నా అంతరంగంలోని బాధను తోడివేసారు.

నేనెవ్వరి కన్నీరు తుడవలేదే? మరెందుకీ ఆరాటం? నా తోడబుట్టిన వాళ్ళ పిల్లల పురుడ్లు, పుట్టు వెంట్రుకల వేడుకల్ని నా బాధ్యతగా మోసి చేశానే? ఏదీ ఒక్కరూ రాలేదే? బాధ పంచుకోలేదే? తోడుగా ఉండలేదే? మరి వాళ్ళకు లేని బంధుప్రీతి నాకెందుకింత?

అంతరంగాన సుడులు తిరుగుతున్న భావోద్వేగాల మేఘపు తునక రాల్చిన విషాదపు నీటి చుక్క అణువణువునూ తడుపుతోంది. మెల్లమెల్ల్గా గుండె అట్టడుగు పొరల్ని తుడుముతోంది.

***

బ్లడ్‌లో ప్లేట్‌లెట్స్ నలభై వేలకు పడిపోయాయి.

నేను చూడ్డం లేదనుకుని మా వారు అటు తిరిగి కన్నీటిని తుడుచుకోవడం నా కంటపడింది. ప్రతి నిమిషం మొండిగా వాదించి నా మాటే నెగ్గాలని, ‘నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళ’న్నట్టుగా మూర్ఖంగా ప్రవర్తించేదాన్ని. అవన్నీ గుర్తుకొస్తుంటే నా అంత పిచ్చిది లేదనిపిస్తోంది.

నా కనుకొనల్లోంచి… చిన్నారి కనుపాపల రోదనలకి గుర్తుగా జారుతున్న అశ్రుకణాలు దిండును తడుపుతున్నాయి. చప్పున ఆయన చల్లని చేతి స్పర్శ వెచ్చటి నా నుదుటిని తాకింది… నన్ను నిలువెల్లా కరిగించడానికి!

ప్లేట్‌లెట్స్ అప్పుడే పెరుగుతున్నాయి. అప్పుడే తగ్గుతున్నాయి, అర్థం కావడం లేదు, అంతు చిక్కడం లేదు… నాలాంటి వారి అంతరంగంలా…!

జబ్బు తగ్గుముఖం పట్టడం లేదని తెలిసి మళ్ళీ వచ్చిన వృద్ధాశ్రమవాసులు “అమ్మా! వారం తిరగకుండా మంచిగైతవు సూడు మల్ల…” అంటూ నా పట్ల అభిమానాన్ని వెలిబుచ్చారు.

మరోసారి అనాథ పిల్లలు సైతం చూట్టానికి వచ్చి పేపర్ పొట్లంలోంచి కాసింత కుంకుమ తీసి నా నుదుటిన దిద్దారు. “గీ రోజు ఒక పొద్దున్నం, మేడమ్! మీకు జల్ది మంచిగైతది. పోచమ్మ గుడిలో మీ పేర్న అర్చన చేయించి గీ కుంకుమ తెచ్చినం…” పిల్లలు చెబుతుంటే ఆలయ గోపురమే ప్రేమగా వంగి నన్ను ఆశీర్వదిస్తున్నంత ఉద్వేగానికి లోనయ్యాను.

నా కన్నబిడ్డలు నేను త్వరగా కోలుకోవాలని పరితపిస్తున్నారేమో గానీ ఇంతలా దేవుడిని మాత్రం ప్రార్థించి ఉండరు. ఇదంతా మహిళామండలి ప్రోద్బలమని తెలుస్తూనే ఉంది. వాళ్ళందరి వాక్కు నిజమైంది.

ఆరోజు జరిపిన టెస్ట్‌లో ప్లేట్‌లెట్స్ ఎనభైవేలకు పెరిగాయి. తిరిగి మర్నాడు ఎప్పటిలానే తగ్గుముఖం పడతాయని తెలుసు. గత కొద్ది రోజులుగా ఇదే తంతు. కానీ ఇప్పుడలా జరగలేదు. ఇక ప్లేట్‌లెట్స్ పెరుగుదల ఆగనూ లేదు. ఎలాగైతేనేం డెంగ్యూ నుండి గట్టెక్కాను.

***

ఆఫీసుకి రెడీ అయిన శ్రీవారు “ఏమోయ్! మీ చిన్న చెల్లె కూతురు శారీ ఫంక్షన్ దగ్గరపడుతోంది. మీ పెద్ద చెల్లె కూతురికిచ్చినట్టు అర తులం చెయిన్ కొనుక్కొస్తా…” చెబుతుంటే యథాలాపంగా తలూపాను.

వంటింటి పనులు ముగించుకుని రిలాక్సవుతుంటే ఆలోచనలు చుట్టుముట్టాయి. చిన్నప్పుడు చదువుకున్న ‘శక్తి నిత్యత్వ నియమం’ గుర్తుకొచ్చింది. అదేంటంటే ‘శక్తిని సృష్టించలేం. నాశనం చేయలేం. అది ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది’. నిజమే! నిష్కల్మషంగా పరులకందించిన సహకారం మరొక విధంగా మనకు ఎదురవుతుంది! మేలవుతుంది! ఈ సత్యం బోధపడడానికి ఇన్నేళ్ళు పట్టింది నాకు!

మనసులో ఏ మూలో ఏదో అలజడి పుట్టి తనువునెల్లా కుదుపుతుంటే చప్పున శ్రీవారికి కాల్ చేశాను. “మా చెల్లెవాళ్ళకి కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది. గిఫ్ట్ అక్కర్లేదుగానీ ఆ ఎమౌంట్ మహిళామండలికి చందాగా రాసేద్దాం. నిస్సహాయులెందరికో మనలాంటి వాళ్ళు అందించాల్సిన సహకారమెంతో ఉందండీ!” నా నుండి ఇలాంటి మాటొస్తుందని ఊహించని శ్రీవారు షాక్ తిని ఉంటారు.

“సరే”నంటూ ఫోన్ పెట్టేశారాయన. నా మనసెంతో తేలికపడినట్టయ్యింది.

***

నేనూ మనిషినే! నాకంటూ ఒక మనసుంది!!

నే పట్టిన కుందేలుకు నాలుగు కాళ్ళని స్పష్టమైంది ఇన్నాళ్ళకు!!!

Exit mobile version