[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన మహేష్ విరాట్ గారి ‘50 రూపాయలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
దీపావళి పండుగ రోజున బంటి టపాసులు కొనుక్కోడానికి టపాసులు అమ్మే బజారుకు వెళ్ళాడు. వాడి ఫ్రెండ్స్ నాని, చింటు, పండు అందరు కలిసి వెళ్ళారు. అక్కడ చిచ్చుబుడ్లు, చిన్న ఆటంబాంబులు, పెద్ద ఆటంబాంబులు, భూచక్రాలు పాముతాకలు, సురు సురు బత్తీలు, వంకాయ బాంబులు. లక్ష్మిబాంబులు ఇంకా చాలా కొన్నారు. అందరి డబ్బు అయిపోయింది. బంటి దగ్గర మాత్రం కొంత డబ్బు మిగిలింది.
“ఒరే బంటీ, మా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి” అన్నాడు చింటు.
“మరేం పర్వాలేదు. నా దగ్గర ఉన్నాయి చూశారా..” అని డబ్బు చూపించాడు.
వాళ్ళల్లో ఒకడు, “నాకు ఆకలేస్తుంది. ఏమైనా తిందాం” అన్నాడు.
ఇంకొకడు “అవును, టపాసులన్నీ కొన్నాం కదా, మన డబ్బంతా అంతాపోయింది. బంటి దగ్గర మిగిలిన డబ్బుతో ఏమైనా తిందాం” అన్నాడు
ఇదంతా అక్కడ ఒక బిచ్చగాడు చూస్తున్నాడు, చిరిగిపొయన జీన్స్ పాంట్, చిరిగిన చొక్కా, విరిగిన చెప్పులు, చేతిలో చిప్ప.. ఇదీ అతని ఆకారం.
బంటి అందరినీ ఒక హోటల్‍కి తీసుకువెళ్ళాడు. అక్కడ ఎవరికి ఏం కావాలో అవి ఆర్డర్ చేసి తెప్పించుకొని తిన్నారు. తిన్నాకా, అందరూ బయటకి వచ్చారు.
ఆ హోటల్ ముందర ఐస్‍క్రీమ్ బండి కనబడింది. పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా, అందరు ఐస్‍క్రీమ్ తీసుకొని తింటూ, ముందరికి వెళ్ళిపోయారు. బిల్లు మాత్రం బంటిగాడు కట్టాలి.
“ఒరే, మీరు నడుస్తు వుండండి. నేను తర్వాత వస్తా” అన్నాడు బంటి.
ఎందుకంటే డబ్బులు సరిపోతాయో లేదో అనేది వాడి డౌట్. ఎందుకంటే ఇంతకు ముందే హోటల్ బిల్ కట్టేశాడుగా.
“ఐస్‍క్రీమ్ ఎంత?” అని అడిగాడు. మొత్తం బిల్లు 70 రూపాయలని చెప్పాడతను.
బంటి తన జేబుల్లో వెతికి చూస్తే 20 రూపాయలు మాత్రమే వున్నాయి. ‘ఇపుడేం చేయాలి?’ అని అనుకున్నాడు బంటి. అదే సమయానికి సరిగ్గా అక్కడ నిలబడి వున్న బిచ్చగాడు కుంటుకుంటూ ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వచ్చి బంటిని చూస్తు “బాబు.. ధర్మం, బాబు ధర్మం, నీకు మంచి చదువు, మంచి మారు మార్కులు వస్తాయి. ధర్మం చెయ్. మంచి ఉద్యోగం వస్తుంది” అని బొచ్చె ముందర పెట్టి అడుక్కుంటున్నాడు. ఆ బొచ్చెలో ఎవరో వేసిన 50 రూపాయలు వున్నాయి. బంటి దానినే చూస్తునాడు. వాడి జేబులో 20 మాత్రమే వున్నాయ. ఇక చేసేదేమీలేదని ఆ బొచ్చెలో వున్న 50 రూపాయలు నోటు తీసుకొని వాడి దగ్గరున్న 20 రూపాయలు కలిపి మొత్తం 70 రూపాయలు ఐస్ క్రీమ్ వాడికిచ్చి అక్కడ నుండి పారిపోయాడు.
ఆ బిచ్చగాడు, “బాబూ.. ఆగు” అంటూ తను కూడ బంటి వెనకాలే పరిగెత్తసాగాడు. ఇద్దరు పరిగెడుతున్నారు.
అలా పరిగెత్తుకుంటూ వచ్చి బంటి తన ఇంట్లో ఒక రూం లోకి వెళ్ళి దాక్కున్నాడు, తలుపులు మూసుకున్నాడు. ఇదంతా వాళ్ళ నాన్న శంకర్రావ్ చూస్తున్నాడు.
“ఒరే బంటి ఏంట్రా, అలా దాక్కున్నావ్? ఏమైంది” అని బయట నుండే అడిగాడు. బంటి రూం లోంచే జరిగిందంతా చెప్పాడు.
“వార్ని దుంపదెగా, అదా సంగతి పర్లేదు. రా బయటకి” అన్నాడు శంకర్రావ్. బంటి గది నుండి బయటకి వచ్చాడు
కాసేపయ్యక ఆ బిచ్చగాడు – ఆ బాబు వచ్చిన ఇల్లు ఇదేనని కనిపెట్టి ఆ కాంపౌండ్ లోకి వచ్చాడు
అక్కడ వరండాలో శంకర్రావ్ కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూన్నాడు.
తనని చూసి, “బాబుగారు మీ అబ్బాయి నా 50 రూపాయలు ఎత్తుకొచ్చాడయ్యా” అన్నాడు.
“తెల్సు బాబూ, అక్కడ కూర్చో” అని డబ్బులు తేవడానికి లోపలికి వెళ్ళాడు శంకర్రావ్. బంటి అక్కడికి వచ్చి ఒక పక్కగా కూర్చున్నాడు.
“ఇదేంటి బాబు, నేనే ఒకరి దగ్గర అడుక్కుంటే, నీవేమో నా డబ్బులు ఎత్తుకొచ్చావ్?” అన్నాడు బిచ్చగాడు. బంటి ఏమనలేదు.
ఆ బిచ్చగాడు – శంకర్రావ్ చదివి కింద పెట్టిన పేపర్ తీసుకొని చదవసాగాడు.
ఇలోగా శంకర్రావ్ బయటకు వచ్చి బిచ్చగాడికి 50 రూపాయలు ఇస్తూ..
“ఏంటోయ్, నీకు చదువు వచ్చా? ఫేపర్ చూస్తునావ్?” అని అడిగాడు.
“వచ్చు బాబు. నేను బాగా చదువుకున్న వాణ్ణి” అన్నాడు బిచ్చగాడు.
“ఐతే ఇదేం పని? వేరే ఏదైనా పని చేసుకొని బ్రతకొచ్చుగా?” అన్నాడు శంకర్రావ్.
“ఒకప్పుడు నేను బాగా బ్రతికినవాణ్ణి సార్. నాకో లవర్ వుండేది. నాతో ఉన్నప్పుడు నా దగ్గర వున్నవన్నీ దోచేసి ఇంకొకరిని ప్రేమించి నా డబ్బు తోనే వాడికి కట్నం ఇచ్చి నన్ను మోసం చేసి వాడిని పెళ్ళి చేసుకుంది. వాడు ఎవరో ఇంత వరకూ తెలీదు బాబు. నేను బతికి చెడ్డవాడిని” అన్నాడు.
“ఏంటోయ్ నీక్కూడా లవ్ స్టోరి వుంది! నీ లవర్ ఎంత మోసం చేసింది కదా! ఆమెకు అస్సలు బుద్ధి లేదు” అన్నాడు ఆవేశంతో శంకర్రావ్.
“అవునండి. మంచికి రోజులు లేవు బాబు. దర్జాగా వున్న నన్ను ఒక బిచ్చగాడ్ని చేసేసింది. పోనీలే బాబు, నా కథ మీక్కూడా కోపం తెప్పిస్తుంది. ఏదైనా పాత లుంగీ గాని అంగీ గాని వుంటే ఇప్పించండి” అన్నాడు బిచ్చగాడు.
ఇంట్లో లోపన వున్న తన భార్యతో “ఏమోయ్, ఇంట్లో నా పాత లుంగీ వుంది తీసుకురా” అన్నాడు శంకర్రావ్.
శంకర్రావ్ భార్య పాత లుంగీ తీసుకొని బిచ్చగానికి ఇద్దామని బయటికి వచ్చింది. అపుడు బిచ్చగాడు ఆమెను చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఒకప్పుడు వాణ్ణి ప్రేమించి, వాణ్ణి బిచ్చగాడిని చేసింది ఈమెనే. ఆవిడ కూడా అలానే చూస్తూ నిలబడింది.
అపుడు బిచ్చగాడు, “మీ లుంగీ వద్దు, ఏమీ వద్దు. ఇదిగో మీ 50 రూపాయలు కూడ నాకొద్దు” అని అక్కడనుండి ఎలా పరిగెత్తుకుంటూ వచ్చాడో అంతకంటే వేగంగా పరిగెత్తుకుంటూ పోయాడు.
అతను ఎందుకలా పారిపోయాడో శంకర్రావ్‌కు అర్థం కాలేదు. లుంగీ పట్టుకుని అలాగే నిలబడ్డాడు. మీకేమైనా అర్థమయిందా?