“ఏం చూస్తున్నావు” అన్న మాటకు వెను తిరిగి చూసాను.
“ఏం కనిపిస్తోంది అక్కడ” అని మళ్ళీ ప్రశ్న. అసలు ఇతగాడికి ఏమి కావాలి అనుకుంటూ అతని ఆకారం వైపు దృష్టి మళ్ళించాను. చేతిలో త్రిశూలం, ఒంటినిండా బూడిద, మెళ్ళో వరుసలుగా రుద్రాక్ష దండలు, జడలు కట్టిన జుట్టుతో ఉన్నాడు.
నిజానికి అతను మమ్మల్ని కొన్ని గంటలుగా చూస్తున్నాడు.
మళ్ళీ హిందీలో అదే ప్రశ్న, అప్పుడు చెప్పాను “హిమాలయాలు చూడాలని, కేదార్ బాబా దర్శనం చేసుకొని బదరీ వెళుతూ ఇదిగో తుంగనాథ్ని చూడటం కోసము వచ్చాను.”
“పంచ కేదారాలు అన్నీచూసావా”
“లేదు, కుదరలేదు కానీ, కేదార్నాథ్, ఇదిగో ఇప్పుడు ఈ తుంగనాథ్ మాత్రం చూసాను.”
“ఎలా అనిపించింది, కేదార్నాథ్ కి వెళ్ళినప్పుడు”
“ఆ చూసా, అద్భుతమైన దర్శనం జరిగింది.”
“ఆ పెద్ద బండ రాయి ఇక్కడ ఎందుకు ఉందో తెలుసా”
“అదే జల ప్రళయంలో వచ్చినప్పుడు, వచ్చిఆగింది ఇక్కడ, అందుకే గుడి మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకోకుండా ఉండిపోయింది. అంతా ఆ కేదారబాబా వల్లనే.”
“అవును అంతా ఆ బాబా వల్లనే” అంటూ దగ్గరగా వచ్చి “నీకు ఇక్కడ ఓ మహానుభావుడి దర్శనం అవుతుంది, అదృష్టవంతుడివి” అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
కేదార్ దర్శనం అయిపోయిన తరువాత సాయంకాలానికి గుప్త కాశీకి వచ్చేసి రాత్రికి హాయిగా పడుకొని ఉదయాన్నే బయలుదేరి ఉక్కి మట్ దాటి చోప్టా వచ్చి, నాలుగు కిలోమీటర్ల దూరాన్ని నడిచి చేరుకునే సరికి ఇంచుమించుగా మూడు గంటల పైనే పట్టింది తుంగనాథ్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఇంకా పై నున్న ఈ చంద్ర శిల దగ్గరకు వచ్చి కూర్చొని ఉన్నప్పుడు ఈ మహా ప్రకృతి ముందు మోకరిల్లి ఇసుక రేణువ కన్నా తక్కువ ప్రమాణం అనిపించే నేను అనబడే నా మనసులో ఏమీ లేదు.
అదో అద్భుతం, తన్మయత్వంతో మాట్లాడాలని లేదు, ఫోటో తీయలనిపించలేదు. కన్ను తిప్పితే అందం కనిపించదేమో అన్నట్లుగా అనిపిస్తోంది.
మనసంతా ప్రశాంతంగా, తృప్తిగా, ఒక అనిర్వచమైన అనుభూతి.
అతను వెళ్ళిపోయాక, అక్కడే ఆ బండరాళ్ల మీద కూర్చొని తదేకంగా చూస్తూ ఉండిపోయాను. ఓహ్ ఎంత అద్భుతమైన సౌందర్యం. చుట్టురా కొండలు, కొన్ని వెండి రంగులో మెరిసిపోతున్నాయి. మరికొన్ని బంగారు కాంతితో, ఇంకొన్ని ఆకు పచ్చని కొండలు. అలా చూస్తూ చాలా సేపు ఉండిపోయాను. చలి తెలియటం లేదు.
ఏదో అలౌకిక భావన. కాలంతో పాటు నడుస్తున్నాను,
అదిగో మలుపు కనిపిస్తోంది, మినుకు మినుకు మనే వెలుతురు. చేరాలి, అక్కడకి చేరాలి.
నాలో నేను ను చూసుకునే వరకు ఇలా ప్రవహిస్తూనే ఉంటాను..
ఇంతలో..
‘రా నిన్ను నాతో పాటు తీసుకొనివెళతాను’ అన్న మాటలకి నా ఏకాగ్రతచెదిరింది. యథాస్థితికి చేరుకోవడానికి కొంత సమయం పట్టింది. నా వెనకాల ఒక సాధువు నించొని ఉన్నాడు.
అంతవరకూ నన్నే చూస్తున్నాడు.
ఇక వెళదామా అన్నాడు, ఆ కళ్లలో ఏదో ఆకర్షణ నేను ఎక్కడకి అని అడగలేదు అతను చెప్పనూ లేదు, ముందు అతను, వెనకాలే మంత్రబద్ధుడిలా నేను.
అప్పుడు దారిలో అతనే చెప్పాడు “ఇక్కడ ఇక గొప్ప యోగి ఉన్నారు, అతను నిన్ను తీసుకు రమ్మని చెప్పారు.”
ఒకింత ఆశ్చర్యంగా “నేను ఎలా తెలుసు”
“అది నీకు చెప్పాలిసిన అవసరం లేదు, నన్ను అనుసరించు చాలు” అన్నాడు శాంతంగా.
వెంటనే స్ఫురించింది. ఇందాక ఆ సాధువు చెప్పాడు కదా! అయితే విన్నవన్నీ నిజమేనా? ఈ హిమాలయాలలో ఇలాంటి అద్భుతాలు ఉన్నాయా?
కొంత దూరం అడవి లోంచి నడిచి అక్కడ నుంచి కొండ ప్రాంతానికి చేరుకున్నాము. అక్కడ ఉన్న ఒక గుహలోకి వెళ్ళాము. అక్కడ పద్మాసనం వేసుకొని, జడలు కట్టిన జుట్టుతో ఉన్న వ్యక్తిని చూసాను. ఆయన చెంతకు వెళ్ళగానే ఏదో హాయి, మనసంతా ప్రశాంతంగా, మరో లోకంలోకి ప్రవేశించినట్లు, నాకు నేను ప్రత్యక్షమైనట్లు, చీకటి నిండిన కళ్ళలో వెలుగు రేఖలు చిమ్ముతున్నట్లు అనిపించింది.
కొద్ది క్షణాలకు ఆయన కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళలో అమోఘమైన తేజో శక్తి, వెంటనే చేతులు జోడిస్తూ నిలుచున్నాను.
అప్పుడు ఆయన హిందీలో “నువ్వు ఇంత దూరం జిజ్ఞాసతో ఏదో తెలుసుకోవాలని సత్యాన్వేషివై వచ్చావు కదా! నిజానికి దేవుడితో మనకున్న బాంధవ్యం మర్చిపోతున్నాము. అదే నీ లోపల అశాంతికి, దుఃఖానికి కారణం, మరో మాటలో చెప్పాలంటే మాయ. అసలు భగవంతుడు నీలోనే ఉన్నాడు అది తెలుసుకో, ఒక్కటే గుర్తుంచుకో. బాహ్యానికి విలువ ఇవ్వకుండా నీ లో ఉండే నేను ని తెలుసుకో చాలు’’ అన్నాడు.
ఆయన చెప్పడం మరు క్షణం నేను ఆయన పాదాల చెంత ఉన్నాను. నాకు తెలియకుండానే జరిగిన చర్య నా తల మీద చేయి పెట్టి దీవించాడు. నా లోపల జరిగే సంఘర్షణను ఇట్టే పట్టి చెప్పడంతో నాకు నోట మాట రాలేదు.
ఇది సంభవమా, అంటే నాకేగా జరిగింది. నమ్మి తీరాలి.
ఈ సంగతి వెంటనే వాడికి చెప్పాలి, వాడేమో ఒక యోగి దగ్గరకు వెళుతూ రమ్మని అడిగితే నేను వెళ్ళలేదు.
ఇప్పుడు నేను కూడా వెళ్ళి ఒక యోగిని కలిసాను అని చెపితే తప్పకుండా దెప్పుతాడు. కాని వాడికి నా అనుభవాన్ని, అనుభూతిని చెప్పి తీరాలి.
అన్నట్లు నా పరిచయం చేసుకోలేదు కదా, నా పేరు కృష్ణ చైతన్య, వాడు అనబడే నా స్నేహితుడు రమేశ్ చంద్ర. ఇద్దరం ఒక పెద్ద కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పదవుల్లో ఉన్నాము. లక్షల్లో జీతం, పెద్ద విల్లాలు కట్టుకున్నాము. వీక్ ఎండ్ పార్టీలు, ఫామిలీస్తో గెట్ టు గెదర్లతో కాలం గడిచి పోతోంది. ఆఫీస్‌లో ఎప్పుడు చూడు ప్రాజెక్ట్స్, టార్గెట్స్, మీటింగ్స్, ఒక్కో ప్రాజెక్ట్‌కి టీమ్స్, మళ్ళీ అందులో రకరకాల ఇబ్బందులు ఇలా వారంలో ఐదు రోజులు ఆఫీస్ కోసము, మిగిలిన రెండు రోజులలో ఫ్యామిలీతో గడపటం. అందులో ఎక్కువ శాతము భార్య పిల్లల తోనే సరిపోతోంది.
అయితే వచ్చిన చిక్కల్లా అందరికి నచ్చినట్లుగా గడపాలి. నా కోసం అనేది ఒక్క క్షణం కూడా మిగలటం లేదు.
“ఇలా జీవితమంతా ఒకళ్ళ కోసం గడిపితే ఇక మనకంటూ ఏం మిగిలిందిరా” అని ఓ శనివారం వాడింట్లో మందు తాగుతూ వాపోయాడు.
ఆ రోజు ఒక్కటే కాదు వాడు తరచు ఈ మాట అనడంతో నేను అన్నాను “పోనీ రమేశ్ మన ఇద్దరం హ్యాపీగా హిమాలయాలు చూసి వద్దాం” అన్నాను.
దానికి వాడు “అవును రా అక్కడ యోగులు ఉంటారు కదా, ఈ స్ట్రెస్ టెన్షన్స్ పోవడానికి ఏదైనా మూలికలో, మంత్రమో ఏదో ఒకటి అడిగి తెలుసుకుందాము” అన్నాడు.
“ఉంటారు గాని, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి రా, ఏదైనా తేడా వస్తే మొదలుకే మోసము వచ్చి బెడిసి కొడుతుందేమో.”
“అబ్బ నీకు అన్ని అర్థం లేని భయాలు ముందు కొన్ని రోజులు వెళ్లి వద్దాము పద” అన్నాడు.
ఈ సంగతి ఇళ్ళలో తెలిసికా నా భార్య, వాడి భార్య కూడా అంత దూరం వెళుతున్నారు. మొదట అన్ని రోజులా అని అన్నారు,కానీ వాళ్ళకి మా పరిస్థతి వివరించే సరికి సరే అన్నారు.
ఆఫీస్‌లో సెలవు ఇవ్వడానికి మటుకు చాల తతంగమే నడిచింది. మొత్తానికి సరే అనిపించుకొని సెలవులు పెట్టాము. ఇద్దర్ది వేరే వేరే ప్రాజెక్ట్ అసలు ఒకదానికొకటి సంబంధం లేనిది కాబట్టి ఎటువంటి వంటి ఇబ్బంది రాలేదు.
అనుకున్నట్లుగా ఇద్దరం బయలుదేరాము. డెహ్రాడూన్ వరకు ఫ్లైట్‌లో వెళ్ళిపోయి అక్కడ్ నుంచి ట్రావెల్స్ ద్వారా కేదార్ వెళ్లి అక్కడ రెండు రోజులు గడిపి తరువాత బద్రికి రావాలని ఆ విధంగానే కార్ బుక్ చేసుకొని వెళ్ళాము.
ఒక మహానుభావుడు అన్నట్లు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏంతో మంది ఈ హిమాలయ యాత్ర చేస్తూ వస్తున్నారు. వాళ్ళకి హిమాలయాల పట్ల ఒక నిర్బంధ వ్యామోహానికి కలుగుతూ ఉంటుంది. ఈ వ్యామోహం ఆది నుంచీ ఉంది. ఇది సాహసం చేయడం కోసం కావచ్చు. అద్భుతమయిన ప్రకృతితో మాట్లాడుకోవడం కోసం కావచ్చు.. ఏంటో మంది పర్వతారోహకులు, అన్వేషకులు, భక్తులు, సాధువులు, సంచార జాతుల వాళ్ళు, యోగులు – అందరూ కూడా ఆకాశాన్నంటే ఈ దేవభూమి యొక్క అనుభూతిని పొందాలనే బలమైన కోరిక కూడా కావచ్చు..
ముందుగా కేదార్ దర్శనం అయిన తరువాత తుంగనాథ్ దర్శనానికి వచ్చాము. తుంగనాథ్ ప్రదేశం చంద్రశిల శిఖరంపై సముద్ర మట్టానికి చాల ఎత్తులో ఉంటుంది ఈ గుడిలో ఆది గురు శంకరాచార్య విగ్రహం శివలింగంతో పాటు వుంటుంది. అక్కడ నుంచి కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి శిఖరాలు కనిపిస్తూ ఉంటాయి.
ఇది చూసుకొని బదరీ వెళ్ళాలని అనుకున్నాము. అక్కడ కొంచెం దూరంలో కొంత మంది సాధువులు కూర్చొని ఉన్నారు. వీడు వెళ్లి వాళ్లతో మాటలు కలిపాడు. బోలెడు విషయాలు చెప్పసాగారు.
వాళ్ళలో కాళ్లు చేతుల గోళ్ళ పెరిగిన యోగులు, శరీరంలో తపస్సు చేస్తుండగా ఎముకలే మిగిలిన యోగులు, నిరాహార యోగులు, దివ్య దృష్టిగలిగిన యోగులు, ఆకాశంలో ప్రయాణించే యోగులు, సంపూర్ణ ఆరోగ్యానికి చిట్కాలు, రహస్యాలు చెప్పే యోగులు, వారి శరీరంను జంతువులుగా పక్షులుగా మార్చే యోగులు, మూలికలతో మొండి రోగాలు తొలగించే సాధువులు, ఎవరికి కనిపించకుండా మాయమయ్యే యోగులు, గుహలలో ఎన్నో రోజులు సమాధిలో ఉండే యోగులు, పరకాయ ప్రవేశం చేసే యోగులు, క్రియాయోగం, తపస్సు, ధ్యానం, ఆత్మసాక్షాత్కారం, బ్రహ్మజ్ఞానం, ఇలా ఎన్నెన్నో విషయాలు.
అందులో ఒక సాధువు ఏదో చెప్పాడు, వీడు సరే అన్నాడు. నా దగ్గరకు వచ్చి “వెళదాము, వస్తావా ఇక్కడకి దగ్గరలో ఒక యోగి ఉన్నారంట” అన్నాడు.
“లేదు లేరా, నేను కాసేపు ఇక్కడే ఉంటాను” అని అన్నాను,నిజానికి నాకు అక్కడ నుంచి కదలని లేదు.
“సరే అయితే నువ్వు ప్రశాంతంగా కూర్చొని ప్రకృతి దర్శనం చేసుకో, నేను అతగాడు అద్బుత శక్తులు చూస్తా, వీలయితే నేర్చుకొని వస్తా” అని కన్ను గీటి వెళ్ళాడు.
***
యోగులకి, సాదువులకి మనుష్యలని కంట్రోల్ చేసే పవర్ ఉంటుందని నమ్మాలేమో. ఎందుకంటే నాకు కలిగిన అనుభవం అలాంటిది.
అందుకే వాడు ఎప్పుడెప్పుడువస్తాడా అని ఎదురు చూస్తున్న నాకు, టైం నత్త నడక నడుస్తోంది.
అరగంట తరువాత వచ్చిన వాడి ధోరణి చూసి భయమేసింది. పిచ్చి చూపులు చూస్తున్నాడు భయంతో ముడుచుకుపోయి ఉన్నాడు. నిజం చెప్పాలంటే అదో అపస్మారక స్థితి. నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు.
ఇంతలో దేవుడిలా వాణ్ని తీసుకెళ్ళిన సాధువు అక్కడికి వచ్చాడు. “ఇంకా అలాగే ఉన్నాడా?” అని అడిగాడు.
“అవును. అసలు ఏమయింది”
“పద ముందు మీ బసకు తీసుకు వెళదాము” ఆ గొంతు కఠినంగా ఉంది. మారు మాట్లాడకుండా వాడిని తీసుకొని ఉక్కీ మట్లో మేము దిగిన హోటల్‌కి వెళ్ళాము. వాడిని పడుకోపెట్టి బయటకు వచ్చాను. విపరీతంగా చలి వేస్తోంది. అంతవరకూ ఆ సాధువు నాతోనే ఉన్నాడు. “ఏమైంది ఇలా అయిపోయాడు ఇక్కడ డాక్టర్ని పిలవనా” అని అంటుంటే
“ఏమీ అవదు. ఈ విభూతి నుదిటిపై పెట్టు. కొంచెము నీళ్ళలో కలిపి తాగించు” అన్నాడు.
అతను చెప్పిన విధంగా చేసి వచ్చి కూర్చొని “అసలు ఏమి జరిగిందో చెప్పండి. మా వాడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడా?” అని భయంతో కూడిన అనుమానము వ్యక్తం చేశాను.
దానికి అతడు “రేపు తెల్లారేసరికి లేచి కూర్చుంటాడు. కాకపోతే అతని అతి జిజ్ఞాసే ఇలా అవడానికి కారణం” అంటూ చెప్పసాగాడు ఆ సాధువు.
“నీ స్నేహితుడిని ఒక యోగి దగ్గరకు తీసుకొని వెళ్ళాను. దారిలోనే చెప్పాను. నువ్వు అతనితో జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే అతని కోపానికి గురి అవుతావు అని. అలాగే అన్నాడు కాని అక్కడకు వెళ్ళాక అతని బుద్ధికి ఏమయిందో ఒక తుచ్చమైన కోరిక కోరాడు అది ఏమిటంటే స్త్రీలు అతని కళ్ళకి నగ్నంగా కనిపించాలని, దాంతో ఆ యోగి ఏమి మాట్లడకుండా ఒక కాటుక లాంటిది ఇచ్చాడు అది ఇంటికి వెళ్ళాకా కళ్ళకి పెట్టుకోమన్నాడు.
కానీ నీ స్నేహితుడు తొందర స్వభావుడు. వస్తుంటే దారిలోనే పెట్టుకున్నాడు. యాత్రకు వస్తున్న స్త్రీమూర్తులను చూసే చెడు ఉద్దేశంతో. అందుకు అది వికటించింది. వెంటనే పరిగెత్తి మళ్ళా ఆ యోగి దగ్గరకు వెళ్లి చెప్పాను. అప్పుడు అతను మంత్రించిన ఈ విభూతి ఇచ్చాడు” అని ముగించాడు ఆ సాదువు.
“అది సరే. వాడికి ఏమైంది అసలు అంటే చూపుపోయిందా, నాకు అర్థము కాలేదు” అన్నాను.
“అతని కళ్ళకి అన్ని నగ్నంగా ఉన్న మనుషులుతో పాటు రక్తమాంసాలు లేని అస్తిపంజరాలు కనిపించసాగాయి. అందుకు అతను భయపడి పోయి అలా అయిపోయాడు. ఇదంతా అతను కోరిన భౌతికమైన కోరికలు కోసం అడిగిన అద్భుతాలు. దేవుని మీద కన్నా ఐహిక సుఖాలు కోసం వెంపర్లాడితే ఇలానే జరగుతుంది. అయినా తెలియక చేసాడులే అని గ్రహించి నేను వెళ్లి ఆ యోగిని బతిమలాడి విరుగుడు తెచ్చాను. నీ మిత్రుడికి చెప్పు ఇంకెప్పుడు యోగులతో ఆటలాడు కోవద్దని. ఈ జిజ్ఞాసని అసలయిన రీతిలో ఉపయోగించుకోమను” అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ సాదువు.
మరునాడు పొద్దున్నకి కాస్త మాములుగా అయ్యాడు. కానీ ఈ అనుభవంతో వాడిలో అనూహ్యంగా మార్పు వచ్చింది. గంభీరంగా ఉంటున్నాడు. నేను కూడా ఎక్కువగా వాడిని ఏమీ అడగలేదు. అయితే నాకు జరిగిన అనుభవాన్ని మటుకు వాడితో పంచుకున్నాను.
వాడిలో ఓ అనూహ్యమైన మార్పు నేను అనుకున్నట్లుగా దెప్పిపొడవలేదు. అసలు వాడు మాట్లాడలేదు కాని ఆ కళ్ళలో సంభ్రమాశ్చర్యాలు మటుకు కనిపించాయి.
ఆ మరునాడు అక్కడ నుంచి బదరి వెళ్లి చక్కటి దర్శనం చేసుకొని హిమాలయ అందాలూ, గంగ యొక్క అన్ని రకాల రూపాలు అలకనందగా, మందాకినిగా, భాగిరధిగా ప్రవహిస్తున్న ఆమె ప్రయాణాన్ని హృషికేశ్ వరకు చూస్తూ వచ్చాము. అక్కడ నుంచి డెహరాడూన్లో తిరుగు ఫ్లైట్ ఎక్కాము.
సీట్ బెల్ట్ పెట్టుకుంటూ విండో లోంచి కనిపిస్తున్న నీలి ఆకాశాన్ని, దూదిపింజెలుగా సాగిపోతున్న తెల్లటి మబ్బులని చూస్తూ “కృష్ణా, నీకు కలిగిన అనుభవం చాలా గొప్పది, విలువైనది. అది విన్న నాకు ఒక అస్పష్టతలోంచి నిజంలోకి ప్రయాణం అవుతున్నట్లు నాలోని నేను ను చూసుకునే అవకాశం లభించినట్లు అనిపిస్తోంది” అన్నాడు
“అవును నాకు కూడా అంతే. కాదు ఇంకోటి కూడా నాకు బాగా స్పష్టంగా అర్థమయింది. మన శక్తి, మన సంపాదన ఇతరుల కోసం కూడా ఉపయోగించినప్పుడు ఈ ఆనందం శాశ్వత మవుతుంది” అన్నాను.
నిజం అన్నట్లుగా నా చేయి నొక్కాడు రమేశ్.
మణి వడ్లమాని 2010లో కథారచన మొదలెట్టి, అనతి కాలంలోనే పాఠకుల ఆదరాభిమానాలను పొందారు. అనేక చక్కని కథలు వ్రాసి వంగూరి ఫౌండేషన్ అమెరికా, తెలంగాణ అసోసియేషన్, గో తెలుగు.కామ్ వంటి సంస్థలు నిర్వహించిన కథారచన పోటీలలో ప్రతిష్ఠాత్మకమైన బహుమతులూ, పురస్కారాలూ పొందారు. మణి వడ్లమాని తొలి నవల ‘జీవితం ఓ ప్రవాహం’ చతుర మాసపత్రికలో ప్రచురితమైంది. “వాత్సల్య గోదావరి” అనే కథాసంపుటిని వెలువరించారు. ‘కాశీపట్నం చూడర బాబు’, ‘ప్రయాణం’ వీరి ఇతర నవలలు.
భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 13: వజ్రాలయ్య కేతవరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి
ఉత్తమ ఆలోచన
కలగంటినే చెలీ-9
ఎదురుదాడి తప్ప మరో దారి లేదు!!!
కశ్మీర రాజతరంగిణి-22
పొట్టు పీచులతో బొమ్మలు
వారాల ఆనంద్ చిన్న కవితలు 8
గొంతు విప్పిన గువ్వ – 14
మలబారు ఆహార విశేషాలు
‘రచైత’ రాంపండు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®