మన ఇంట దీపావళి కోసం తన ఒంటిని వొత్తిగా చేసి వెలిగిస్తాడు!
మన పెదవులపై నవ్వులు వెలగాలని..
తన చేతులతో మతాబులు చుట్టిస్తాడు!
దేశం దీపావళి జరుపుకుంటుంటే..
ఆ వెలుగుల్లో తన బ్రతుకు తెరువు వెతుక్కుంటాడు!
ప్రపంచానికి అతనొక శ్రామికుడు మాత్రమే…
కాని ప్రతినిత్యం మృత్యువుతో సావాసం చేసే సాహసి అతను!
మనకి ఏడాదికొక్కసారే దీపావళి…
తనకి పని దొరికిన ప్రతి రోజూ దీపావళే..
దొరకని నాడు పస్తులతోనే పండగ చేసుకుంటాడు!
తను చుట్టే తారాజువ్వ లా పైకెగరాలనుకుంటాడు
అంతలోనే బాధ్యతల బరువుకి నేలకూలిపోతుంటాడు..!
తన బ్రతుకు భూ చక్రమల్లే నేలపైనే గింగిరాలు తిరుగుతుంది..
కాకరపూవొత్తిలా తను కాలిపోతూ మనకి వెలుగులు పంచుతాడు..
తను పీల్చే గాలి కూడా మృత్యువు కౌగిట్లోకి ఆహ్వానించే వింజామరమే..
ఒంటి నిండా విషపు బూడిదను పులుముకునే పరమ శివుడు అతను.
విష్ణు చక్రానికి వెలుగులు నింపిన విష్ణు మూర్తి అతను..!
అతను పంచే వెలుగులు తప్ప అతని కన్నీళ్ళు కనపడవెవరికీ..
అతను చుట్టిన టపాసుల చప్పుళ్ళు తప్ప అతని వ్యధలు వినబడవెవరికీ..!
తన బ్రతుకుకి భీమా లేకున్నా ధీమాగా బ్రతికేస్తున్నాడతను..
ఏ ప్రభుత్వము తన గోడు వినకున్నా తన పని తను చేసుకుపోతాడతను..!
మీ పెదవులపై విరబూసే నవ్వులలోనే
తన కష్టానికి ప్రతిఫలం వెతుకుతాడతను.!
మీరు కొన్న టపాసులు పేలకుంటే తిట్టుకోకండి
అవి అతని కన్నీటి చుక్కలకి తడిసాయనుకుని జాలి పడండి..!
మీరు పండుగ చేసుకునే ఒక్క రోజైనా అతని కష్టాన్ని తలుచుకోండి..
తన బ్రతుకు కూడా ఆనందంగా సాగాలని కోరుతూ ఒక దీపాన్ని వెలిగించండి..!
38. దీపావళి కూలీ
2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత.