శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా సంచిక – సాహితీ ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన వచన కవితల పోటీ ఫలితాలు ప్రకటిస్తున్నాము.
న్యాయనిర్ణేతగా వ్యవహరించిన శ్రీ డా. ఆచార్య ఫణీంద్ర గారు కవితలను పరిశీలించి తమ అభిప్రాయాన్ని ఈ క్రింది విధంగా తెలియజేశారు.
త్వరలో సంచిక వచన కవితల పోటీ నిర్వహిచబోతోంది. ఆ పోటీలో మరింత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందని కవులందరికీ విజ్ఞప్తి.
***
“సంచిక” అంతర్జాల సాహిత్య పత్రికా సంపాదకులు
కస్తూరి మురళీకృష్ణ గారికి నమః
ఉగాది పర్వదినం సందర్భంగా మీరు నిర్వహించిన ‘వచన కవితల పోటీ’కి నన్ను న్యాయ నిర్ణేతగా నిలిపి గౌరవించినందుకు ముందుగా ధన్యవాదాలు!
మొత్తం 107 కవితలు అందాయి. అందులో అత్యుత్తమమైన కవితలు అసలే లేవు. కొంచం బాగున్నవి – 10%. ఓ మోస్తరుగా ఉన్నవి కూడ కలుపుకొంటే – 20% దాటలేదు. ఒకే కవి వ్రాసిన రెండు మూడు బాగున్న కవితలలో అన్నిటి కన్న మెరుగైన కవితను ఎంచుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా, మీరు కోరిన విధంగా, 10 మంది మంచి కవులను ఎంచుకొని ఉన్న వాటిలో వారి 10 మంచి కవితల లిస్ట్ ను మీకు పంపుతున్నాను.
చాల మంది కవులకు కవితకు ఉండవలసిన ఒక లక్ష్యం గురించే అవగాహన లేదు. ఆకర్షణీయమైన ఎత్తుబడి, వక్రోక్తితో హృదయంగమంగా సాగే నడక – చాల మంది కవుల కవితలలో కనిపించనే లేదు. చివరలో.. ఒక పంచ్ వంటి ముగింపు, లేదా ఒక సందేశంతో ముగింపు, లేదా అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించే ముగింపు – ఏ కొద్దిమంది కవితలలో కూడ కనిపించలేదనే చెప్పాలి.
చాల మంది తాము ఎంచుకొన్న ఏవో కొన్ని పదాల పోహళింపే – కవిత అన్న భావనలో ఉన్నారనిపించింది. ఒకరిద్దరు సమస్యలు ఏకరువు పెట్టారు గాని, కవిగా కనీసం ఒక పరిష్కారం గాని, సూచనను గాని చెప్పే ప్రయత్నం చేయలేదు.
ఉన్నంతలో మీరు కోరిన విధంగా 10 మంది ఉత్తమ కవుల కవితల లిస్ట్ ఇది.
- జీవితం మేడీజీ – బి. కళాగోపాల్
- ఆ ఇంటి గుట్టు – ఎరుకుల గోపీనాథరావు
- నేనెందుకు తెలుగులో మాట్లాడాలి? – మణిబాబు వజ్జ
- మళ్ళీ వసంతం – మూల వీరేశ్వరరావు
- అ(స)బల – సింగరాజు శ్రీనివాసరావు
- కొయ్య పడవలో కాగితం పడవ – పొన్నాడ సత్యప్రకాశరావు
- విశ్వావసు గాంధర్వం – రాజేశ్వరీ దివాకర్ల
- మహా విహార యాత్ర – కార్తీక రాజు
- మాటలు – ఐలేని గిరి
- దిగ్గజాలు – మామిడాల శైలజ
సాహిత్య సేవలో భాగంగా.. వచన కవితా ప్రక్రియలో భావి కవులను తీర్చిదిద్దే ప్రయత్నంగా.. మీరు నిర్వహించిన ఈ పోటీకి గాను – మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ..
భవదీయుడు
డా. ఆచార్య ఫణీంద్ర
***
ఈ పోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన డా. ఆచార్య ఫణీంద్ర గారికి బహు కృతజ్ఞతలు ధన్యవాదాలు.
బహుమతికి ఎంపికైన కవులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున పారితోషికం జీ పే/ఫోన్ పే ద్వారా పంపడమైనది.
బహుమతికి ఎంపికైన కవితలని 06 ఏప్రిల్ 2025 నాటి ఆదివారం సంచికలో ప్రచురిస్తాము.
బహుమతికి ఎంపికవని కవితలను సాధారణ ప్రచురణకు స్వీకరించి, వీలైనంత త్వరలో ప్రకటిస్తాము.
సాధారణ ప్రచురణకు పరిగణించడం ఇష్టం లేని కవులు తమ కవితని వెనక్కి తీసుకునేడట్టయితే, ఒకటి రెండు రోజుల్లో సంచిక ఎడిటర్‍కు తెలియజేయగలరు.
ఈ పోటీలలో పాల్గొని విజయవంతం చేసిన కవులందరికీ ధన్యవాదాలు. అభినందనలు. త్వరలో మరొక పోటీని ప్రకటించనున్నాము. దానిలోనూ పాల్గొనగలరని ఆశిస్తున్నాము.