Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది కవిసమ్మేళనం – వార్త

పాలమూరు జిల్లా కవుల నిలయం – ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు జిల్లాలో అనేకమంది కవులు ఉండడం నిజంగా పాలమూరు జిల్లా చేసుకున్న అదృష్టమని మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక సమస్యలను చిత్రికపట్టడంతో పాటు వర్తమాన అంశాల్ని ఒడిసిపట్టుకుని కవిత్వం రాయడమే కవి యొక్క పని అని అన్నారు.

లుంబిని పాఠశాల, మా ఆకృతి హైస్కూల్, పాలమూరు సాహితి సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 28 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లుంబిని పాఠశాలలో నిర్వహించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది కవిసమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా, పుస్తకావిష్కర్తగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాలమూరు కవులు ఉధృతంగా కవితలు, పాటలు రాశారన్నారు. తెలంగాణ ఉద్యమానికి పాలమూరు పాత్ర తక్కువేమి కాదన్నారు. ఉగాది కవిసమ్మేళనాన్ని లుంబిని పాఠశాల ప్రతి సంవత్సరం నిర్వహించడం గొప్ప విషయమన్నారు.

రచయిత పొర్ల లింగప్ప రచించిన ‘పరమాత్మ దర్శనం’, నాగం గోపాల్ రెడ్డి రచించిన ‘యువ శతకం’ పుస్తకాలను ఆవిష్కరించారు.

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, గిన్నిస్ రికార్డు హోల్డర్ డా. వంగీపురం శ్రీనాథాచారి ‘పరమాత్మ దర్శనం’ పుస్తకాన్ని సమీక్షిస్తూ పరమాత్మ దర్శనం ఆధ్యాత్మిక ఆణిముత్యమని, ఇందులో చాలా విషయాలు రచయిత చెప్పారన్నారు.

‘యువ శతకం’ పుస్తకాన్ని డా. వెల్దండ వేంకటేశ్వరరావు సమీక్షించారు. సభకు అధ్యక్షత వహించిన కె. లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా లుంబిని పాఠశాలలో ఉగాది కవి సమ్మేళనాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా ఎంతోమంది యువకవులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

విశిష్ట అతిథి, ప్రముఖ న్యాయవాది వి. మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది కవిసమ్మేళనం అంటేనే లుంబిని పాఠశాల గుర్తుకు వచ్చేటట్లు కవులు కూడా కవిత్వాన్ని చక్కగా ఆవిష్కరిస్తున్నారన్నారు. కవిత్వం రాయడం ఆషామాషీ విషయం కాదని అది ఎంతో కష్టమని తెలిపారు.

అలాగే శ్రీ విశ్వావసు సంవత్సర ఉగాది పురస్కారాలను ప్రముఖ కవులు మహ్మద్ ఖాజామైనోద్దీన్, డా. చిక్కా హరీష్ కుమార్ లకు ఎమ్మెల్యే అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులు పాఠశాల కోఆర్డినేటర్ జి.రఘు, పుస్తక రచయితలు పొర్ల లింగప్ప, నాగం గోపాల్ రెడ్డి, కార్యక్రమ సంయోజకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు.

ఈ కవిసమ్మేళనంలో ఉమ్మడి జిల్లా నుంచి అరవైమందికి పైగా కవులు కవితాగానం చేశారు. పాల్గొన్న ప్రతి అందరికీ మెమెంటోలతో సన్మానం చేశారు.

Exit mobile version