అందమైన పూలతీగను కాను….
అల్లుకున్న పందిరినౌతాను.
బంగారుపూలతో పూజించలేను….
మల్లెలమాలగా నీ ఎదపై ఆభరణమవుతాను.
వెండివెన్నెలను నేలపై దించలేనుగాని….
పచ్చిక పైరునై నీ పాదాలను తాకి పులకించుతాను.
హిమగిరి శిఖరమును చేరలేను…..
ఆలయన జేగంటనవుతాను.
వాన కురిసిననాడు హరివిల్లు కాలెను…..
నేలపై జారిన చినుకునవుతాను.
పాలసంద్రము చిలుకు పేరాశ లేదు….
సెలయేటి కెరటమునై తేలిపోతాను.
కొండలలో దూకే జలపాతమును కాను….
నీటిమడుగునై ఒదిగిపోతాను.
నల్లా మబ్బుల మెరయు మెరుపుతీగను కాను …..
మెరుపు వెలుగులోని కాంతినవుతాను.
పారిజాతపూల పరిమళము కాలేను…..
ముడుచుకున్న కురులవుతాను .
పసిపాప బోసినవ్వు కాలేను….
నిదురపుచ్చు జోలపాటనవుతాను.
మందార మకరంద మాధుర్యమును కాను ….
మకరందమును గ్రోలు మధుపమ్మునవుతాను.
అరుణకిరణాలను అందుకోలేను ….
తెలిమంచు బిందువై నిలిచిపోతాను.
నీటికొలనులో విరియు నీరజమును….
వెన్నెలరాజుకై వేచివున్నాను.
ఆకాశంలోమబ్బును కాను….
సాయంసంధ్యలో వర్ణాలు అవుతాను.
కలహంసల నడకలు నడువలెను….
నీటిలో జలకములాడు మీనమవుతాను.
అందాల నెలరాజా….. నిన్నుఅందుకోలేను
……కలలోనే బందీనిచేస్తాను.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.